- వరవరరావు

ఎంత మార్పు!
’సద్దాం చచ్చిపోతాడా?’
’చచ్చే పోయాడంటున్నారు కదా’
‘ఆ స్వరం ఎప్పుడో రికార్డు
చేసిందంటున్నారు కదా’
’బాగ్దాద్ నగరం నిప్పుల వర్షంలో
దగ్ధమైపోతున్నది కదా’
’అలెండీ వలె సద్దాంను కూడా
చంపేస్తారా?

సంభ్రమానికి గురయ్యాను.
సాల్వడార్ అలెండీతో
సద్దాం పోలిక!?

సామ్యవాద ప్రజాస్వామిక ఆచరణకు,
వెల్లివిరిసిన కవిత్వానికీ, కళలకూ
ప్రపంచ ప్రగతి వాదుల మిత్రుడు,
1970ల హీరో అలెండీతో సద్దాం పోలిక ?
ముప్పైయ్యేళ్ళలో ఎంత మార్పు.

ఇవ్వాళేమిటి –
1991లోనే కవిమిత్రుడు హెచ్చార్కె అన్నాడు
‘జమీందారు మీద కసితో పల్లెటూరి పిల్ల
బందిపోటుతో లేచిపోయింది’, అని
ఉమ్రావ్ జాన్ – నిజమే కదూ
ఈ పన్నెండేళ్ళుగా ఎన్నిచోట్ల చెప్తున్నానో – ఈ మాట

‘తానా’ మిత్రులారా వినండి. ‘రచ్చబండ’లో చర్చించండి.

అమెరికా ప్రజాస్వామ్యం కన్న నాకు అరబ్ దేశాల మూర్ఖత్వం ఇష్టమైంది.
ఏడాదిన్నర కింద
అరవై ఏళ్ళ అమెరికా దురాక్రమణ చరిత్రను
బోనులో నిలబెట్టి విచారిస్తానంటే
నన్ను మీరు బిన్ లాడెన్‌ను సమర్థిస్తున్నానన్నారు.
నేను ఇంటర్నేషనల్ మానిటరీ ఫండమెంటలిజాన్ని ద్వేషిస్తున్నానంటే
కాదు
ఇస్లాం ఫండమెంటలిజంను బలపరుస్తున్నానన్నారు
ఇవ్వాళ మళ్ళీ అంటున్నాను అవును సద్దాం మాటల్లో –
ఆ నేరస్తుడు బుష్, ఆ నేరస్తుని కొడుకు జార్జ్ డబ్ల్యు బుష్
మానవ చరిత్రలో మట్టి కరుస్తారు.

నియంత సద్దాం నుంచి
ఇరాక్ ప్రజల విముక్తి కోసమేనా ఈ దాడి
మన భుజాల మీదనే తుపాకీ పెట్టి మనమీద దాడి
మన కంట్లోనే మన వేలు – రెండు కళ్ళలో,
ఇటు కువాయిట్ నుంచి, అటు టర్కీ నుంచి
బాగ్దాద్ బాంబుల వర్షంలో దగ్ధమైపోతున్నది

బాల్య స్మృతులేవో కాలిపోతున్న కమురువాసన
చిన్ననాటి చేతులకందని ఆకాశంలోని చంద్రవంక
ఇవ్వాళ నా కళ్ళముందే విరిగి సముద్రంలో ఒరిగిపోతున్నది

అరవై ఏళ్ళ కింద జెరూసలెం ఇంకా ప్రవాసంలో బందీ
నిన్న కాబూల్ –
ఇప్పటికింకా కాబూలీవాలా కోసం ఎదురుచూస్తున్న టాగోరు పసిపిల్లను నేను
బొంబై సినిమాల్లోకి ‘ఇప్టా’ని తెచ్చిన బాల్‌రాజ్‌సాహ్నీ –
ఏవీ నిరుడు కురిసిన ప్రగతిభావాలు
ఇవ్వాళ బాగ్దాద్ దగ్ధం…
కాదు. కాకూడదు

జీరో గురించే కాదు అంకెల గురించీ నేర్పి
సున్నా పక్కన అంకె చేర్చి
ప్రాచీన యుగపు జ్ఞానంలోకి తీసుకపోయిన ప్రాచీదిశ
మనతో పాటే వేల ఏళ్ళుగా పంచుకున్న సంస్కృతి
నా బాల్యమంత మధురమైన
మహెంజొ దారో, హరప్పల పక్కన
చైనా, ఈజిప్టు, మెసపటోమియా
ఎడారి మీంచి వీచే ఖర్జూర మధుర పరిమళాలు
మరి అమెరికా గురించి ఎప్పుడు చదువుకున్నాం
దారి తప్పిన కొలంబస్ సందర్భంలో చదువుకున్నాం
నక్సల్బరీతో పాటు వియత్నాంలో
మన ఉమ్మడి శత్రువులు ఖంగుతిన్నప్పుడు చదువుకున్నాం

‘బరీ మై హార్ట్ ఎట్ ఊండెడ్ నీ’,
ఉద్విగ్న హృదయంతో
వేయిరాత్రుల ఒంటరి నిర్బంధంలో చదువుకున్నా

అమెరికా సామ్రాజ్యవాదాని ద్వేషించకుండా
ఆకాశాన్నీ, నేలనూ ప్రేమించలేనని తెలుసుకున్నా.
మార్కెట్ రక్త పింజెరను మట్టుపెట్టకుండా
మల్లెపూలవంటి పసిపిల్లల చిరునవ్వుల్ని
మాసిపోకుండా కాపాడుకోలేమని తెలుసుకున్నా

కేవలం ఐదువందల ఏళ్ళ చరిత్ర.,
అది కూడ దురాక్రమణతో మొదలైన చరిత్ర.
ఎర్ర ఇండియన్లను, అపాచీలు మొదలైన ఆదివాసీలను అంతం చేసి
ఆఫ్రికా నుంచి నల్లవాళ్ళను బానిసలుగా తెచ్చుకున్న వలసవాద చరిత్ర
రెండు వందల సంవత్సరాల దురాక్రమణల చరిత్ర
లిబర్టీ స్టాచ్యూ – సాక్ష్యంగా అరవై ఏళ్ళ నయావలస వాద చరిత్ర
పన్నెండేళ్ళ ప్రపంచ ఏకచ్ఛత్రాధిపత్య చరిత్ర
పసిపాపల్ని శత్రువులుగా భావించి పుట్టుకతోనే చంపే చరిత్ర

అబ్రహం లింకన్ యుద్ధ నౌక కదులుతున్నది
ఆయనేనా? ప్రజల కొరకు, ప్రజలవలన, ప్రజలచేత
ప్రజాస్వామ్యం అన్నాడు
ఇతడు అతని దేశంలోని అధ్యక్షుడేనా?
అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయి –
నెల్లాళ్ళు దింపుడు కళ్ళెంలో నీల్గి –
గెలిచినట్లు ప్రకటించుకున్న
ప్రపంచంలో కల్లా గొప్ప ప్రజాస్వామ్య ప్రభుత్వాధినేత
ఇవ్వాళ ప్రజలెవ్వరు చెప్పినా వినడం లేదు
ప్రపంచం నలుమూలలనుంచే కాదు –
తన దేశంలోని ప్రజలు చెప్పినా

‘వాడంతేనయ్యా వరవరరాయడా – నీకు తెల్వదా,
మన తెలంగాణా పెత్తందార్ల పద్ధతి వానిది’ అంటడు దాశరథి (రంగాచార్య)
అమెరికా అంటే చాలు
అరికాలిమంట అరగంట ఫోన్‌లో నెత్తికెక్కాల్సిందే
నలభైలనాటి నాజీల దౌర్జన్యాలలోకి వెళ్ళిపోతాడు

ఆయన తరం కమ్యూనిస్టులు అదృష్టవంతులు –
తెలంగాణలో వాళ్ళు నాజీ హిట్లరుతో పోరాడారు
స్టాలిన్ నాయకత్వంలో.
ఇటు నాజీ నిజాంతో పోరాడారు –
ఆంధ్రమహాసభ నాయకత్వంలో.
ఇవ్వాళ స్టాలినే ఉంటే – బోల్షివిక్ పార్టీయే ఉంటే
ఈ ప్రశ్న వచ్చేదా

సద్దాం గెలుస్తాడని కాదు –
గెలుస్తాడన్న ఆశ ఎంత ఆశావాదికీ లేదనుకుంటాను
ఎక్కడో ప్రవాసంలోకి వెళ్ళిపోతాడు
మరి ఏమవుతుంది అఫ్ఘనిస్తాన్‌లో వలె ఒక కర్జాయి ప్రభుత్వం ఏర్పడుతుందా?
అంటే ఒక విభీషణ ప్రభుత్వం ఏర్పడుతుందా?

సద్దాం మీద ప్రేమ ఎందుకు? అతనొక నియంతే కదా
(ఇటీవలె రెండు అమెరికా దాడుల మధ్య రెండుసార్లు
నూటికి తొంభైతొమ్మిది శాతం ఓట్లతో ఎన్నికయిన సైన్యాధ్యక్షుడు!)
ఖుర్దిష్ విప్లవకారులను వేల సంఖ్యలో చంపిన వాడే కదా
అమెరికా ఇచ్చిన జీవ రసాయన ఆయుధాలు
ఎనిమిదేళ్ళపాటు ఇరాన్ మీద వేసినవాడే కదా
బద్ద కమ్యూనిస్టు వ్యతిరేకి కదా

అయ్యో పాపం, అమెరికా మీద వేయడానికి
ఇవ్వాళ ఇంక జీవరసాయన్స్ ఆయుధాలు ఏమీ మిగలలేదా
ఐక్యరాజ్య సమితిని బ్లాక్ మెయిల్ చేసి
సద్దాంను నిరాయుధుణ్ణి చేసి
ఇవ్వాళ అతనిపై, అమెరికా, బ్రిటన్ల బాంబుల వర్షమా

జాగ్రత్త సుమా - ఇరాక్ ప్రజలారా - ఇటుపై ప్రపంచ ప్రజలారా -
ఈగిల్ దాడి నుంచి మీ పసికూనల్ని కాపాడుకోవడానికి
గోర్లయినా పెట్టుకొని బతకండి
రెక్కలయినా పెట్టుకొని బతకండి
చేతులు నరికేసిన మొండి ఖాందహార (గాంధార) శిల్పాలుగా మిగిలితే
నోర్లయినా పెట్టుకొని బతకండి
నేలమీదికి ఉసిళ్ళపుట్టలా –
అమృత వృక్షం ఇచ్చిన ఆపిల్ పళ్ళు తిని పుట్టుకొచ్చిన మానవ సంతానమా
అమెరికా దుష్ట కూటమి ఆకాశంనుంచి కురుస్తున్న బాంబులు
నేలమీద పడడానికి చోటు లేకుండా
ఒక కవచంగా నిలబడగలమో చూద్దామా
విషచినుకుల మధ్య నకులసహదేవుల వలె
గుర్రాలను కాయగలమేమో ప్రయత్నిద్దాం రండి

భూమి మీద యుద్ధంలో వాడు గెలవగలగడం కష్టమేనంటున్నారు
అందుకే మానసాకాశంపై ఆకాశంనుండి చికాకుపరచే సైకలాజికల్ వార్ చేస్తూ
వాడు భీభత్సం సృష్టించాలని చూస్తున్నాడు
ప్రపంచ మార్కెటుకు లొంగిపోయిన సరుకుల వ్యామోహపరుల ముందు
ఇరాకీ సైనికులు లొంగిపోయారని చెప్తున్నాడు
ఈ అసమ యుద్ధానికి – ‘ఏకపక్ష దాడికి’ ‘ఇరాక్ యుద్ధం’ అని పేరు పెట్టి
యుద్ధం తర్వాత పునరావాసం గురించి మట్లాడుతున్నాడు
బాంబులతో పాటు రొట్టెలు విసరడం వాడికి అలవాటే కదా

ఇరాక్ ప్రజలారా, మీ మీద, మీ ఆవాసాల మీద
మీ ప్రాచీన సంస్కృతి, జీవనవిధానం మీద బాంబులు వేస్తాను
కానీ –
మీ చమురు బావులు జాగ్రత్త సుమా అని చెప్తున్నాడు
ఇరాక్‌లో సామ్రాజ్యవాద మార్లెట్ విస్తరణ హామీ ఇస్తున్నాడు
ఎంత కౄరమైన దయ!

ఎంత విషాద వైరుధ్యం
శత్రువు జొరబడడం చూసి గుడిసెల్లోని తమ ఉట్లమీది
చల్లముంతల్లో తామే విషం కలుపుకున్నట్లు,
చీడ కోసం తెచ్చిన పురుగుమందు తామే తిన్నట్లు,
తమ గర్భకోశాలు తామే తొలగించుకున్నట్లు
పై నుంచి వచ్చే విధ్వంసమే కాదు
తమ వనర్లు, తమ భవిష్యత్తు – తమ చేజేతుల
పూడ్చుకోవాల్సిందేనా –

‘కండ కావరమెక్కి నీవీ దుండగం తలపెట్టినప్పుడు
ఉండదా ఒక న్యాయమంటూ, ఉండి ఊర్కొనునా-‘

ఎడారిలో ఒక చెలిమ
ఒంటె కడుపులో దాచుకున్న నీళ్ళు
ఉరికంబంపై ఇన్‌ఖిలాబ్ చిరునవ్వు
ఇవ్వాళ పద్మవ్యూహంలో ఇరాక్

(మార్చ్ 23, భగత్‌సింగ్, రాజగురు, సుఖదేవ్‌ల అమరత్వం - సామ్రాజ్యవాద వ్యతిరేక దినం)

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)