Mumia

ప్రఖ్యాత జర్నలిస్ట్ అయిన ముమియా అబు-జమాల్ (Mumia Abu Jamal) 1954, ఏప్రిల్ 24న ఫిలడెల్ఫియాలో జన్మించాడు. ఫిలడెల్ఫియాలో డేవిడ్ ఫాల్క్‌నర్ (David Faulkner) అనే పోలీస్ అధికారిని కాల్చి చంపాడన్న నేరారోపణపై ఆయన 1981 నుండి జైలులో, 1983 నుండి డెత్-రో పై (Death Row అంటే మరణ శిక్ష విధించబడి అది అమలయేందుకు ఎదిరి చూస్తూ జైలులో గడపడం) ఉన్నాడు. ఫిలడెల్ఫియాలోనే కాక ప్రపంచవ్యాప్తంగా నల్లవాళ్లపై జరుగుతున్న పోలీస్ దౌర్జన్యం గురించి, సాంఘిక, జాత్యహంకార వివక్ష గురించి ఆయన రాసిన పత్రికా నివేదికలకు ఆయనకు అవార్డులు లభించాయి.

అరెస్ట్ చేయబడిన సమయంలో ముమియా బ్లాక్ జర్నలిస్టుల సంఘానికి అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నాడు. 14, 15 ఏళ్ల వయసులోనే ఆయన బ్లాక్ పాంథర్ పార్టీ ఫిలడెల్ఫియా విభాగానికి వ్యవస్థాపక సభ్యునిగా ఉన్నాడు. తర్వాత కాలంలో NPR వంటి రేడియో స్టేషన్‌లలో రిపోర్టర్‌గా, ఫిలడెల్ఫియా స్టేషన్ WHAT కి న్యూస్ డైరెక్టర్‌గా పని చేసాడు. అప్పట్లో MOVE అనే విప్లవ సంస్థపై తన కళ్లముందే రోజూ జరుగుతున్న అన్యాయాలపై, దౌర్జన్యాలపై జర్నలిస్ట్‌గా దృష్టి సారించాడు.

ముమియాకి మద్దత్తు పలుకుతూ అంతర్జాతీయంగా ఒక విస్తృతమైన ఉద్యమం ఏర్పడింది. ముమియా కి జరిగిన అన్యాయాన్ని గుర్తిస్తూ కనీసం ఒక కొత్త విచారణన్నా మొదలు పెట్టాలని డిమాండ్ చేసిన వాళ్లలో నెల్సన్ మండేలా (Nelson Mandela), డానియెల్ మిట్టరండ్ (Danielle Mitterand, former first lady of France), ఫిడెల్ కాస్ట్రో (Fidel Castro), డానీ గ్లోవర్ (Danny Glover), సూసన్ సరాండన్ (Susan Sarandon), 22 మంది బ్రిటిష్ పార్లమెంట్ సభ్యులు, ఇంకా అనేక మంది యురోపియన్ పార్లమెంట్ సభ్యులు ఉన్నారు.

అక్టోబర్ 2003లో, పారిస్ నగరం ముమియా అబు- జమాల్‌ను గౌరవ పౌరసత్వ (Honorary citizen) హోదాతో సన్మానించింది. 2006 లో అబూ-జమాల్ గౌరవార్థం పారిస్ పక్కనే ఉన్న సేంట్-డెనిస్ (Saint-Denis) అనే నగరంలోని ఒక వీధికి ఆయన పేరు పెట్టారు.

జైలులో ఇప్పటివరకు ఆయన అయిదు పుస్తకాలు రచించాడు, ఆయన వారం వారం రాసే ఎన్నో వ్యాసాలు ప్రపంచవ్యాప్తంగా అనేక పత్రికలలో ప్రచురించబడుతాయి. డెత్-రో పై ఉన్న ముమియా ఇప్పటికీ అణిచివేయబడ్డవాళ్ల కోసం ప్రిజన్ రేడియో (Prison Radio) ద్వారా తన గొంతుని వినిపిస్తూనే ఉన్నాడు. ప్రిజన్ రేడియో ద్వారానే 2004, ఏప్రిల్ 16న ప్రముఖ జర్నలిస్ట్, డెమాక్రసీ నౌ (Democracy Now) హోస్ట్ అయిన ఏమీ గుడ్‌మన్‌ (Amy Goodman)తో ముమియా ఇంటర్‌వ్యూని తెలుగులోకి అనువదించి బ్లాక్ హిస్టరీ మాసం సందర్భంగా ప్రచురిస్తున్నాం.

* * *

ఏమీ గుడ్‌మన్: ముమియా అబు-జమాల్ మరణ శిక్ష విధించబడి 20 సంవత్సరాలుగా డెత్ -రో పై జైలులో ఉన్నాడు. నిన్న 3.00 గంటలకు ఆయన ప్రిజన్ రేడియో ప్రాజెక్ట్ (Prison Radio Project) కి ఫోను చేసాడు. మేము ఆయనతో కేవలం 15 నిమిషాలు మాట్లాడాక ఫోను కట్ చేయబడింది.

ఏమీ గుడ్‌మన్: హలో?

కంప్యూటర్ గొంతు: గ్రీన్ స్టేట్ దిద్దుబాటు కేంద్రం (అమెరికాలో జైళ్ళని దిద్దుబాటు కేంద్రాలని పిలుస్తారు) (Greene State Correctional Institution) లో ఖైదీ అయిన ముమియా జమాల్ నుండి మీకు కలెక్ట్ కాల్ (కలెక్ట్ కాల్ అంటే ఫోన్ కాల్ తీసుకునే వారు డబ్బులు చెల్లించే పద్దతి) వస్తోంది. ఈ ఫోన్ కాల్ ఒక దిద్దుబాటు కేంద్రం నుండి వస్తోంది, ఈ ఫోన్ కాల్ ని పర్యవేక్షించడం, రికార్డ్ చేయడం జరగవచ్చు. ఈ ఫోన్ కాల్ లో కస్టం కాలింగ్ (custom calling) సౌకర్యాలు అనుమతించబడవు. ఈ కాల్ కి మీకు, మొదటి నిమిషానికి $4.35, అదనపు ప్రతి నిమిషానికి 59 సెంట్లు పడుతుంది. ఈ కాల్ స్వీకరించదలుచుకోకపోతే వెంటనే ఫోన్ పెట్టెయ్యగలరు. కాల్ ను స్వీకరించడానికి ‘సున్న’ నొక్కండి. వెరైజన్ సెలెక్ట్ సర్వీసెస్ ఇన్‌కార్పోరేటెడ్ (Verizon Select Services Incorporated) ని ఎంచుకున్నందుకు ధన్యవాదాలు. మీరు ఇక ఫోన్ మాట్లాడుకోవచ్చు.

ఏమీ గుడ్‌మన్: హలో, ముమియా?

ముమియా అబు-జమాల్: హలో.

ఏమీ గుడ్‌మన్: హాయ్! నేను ఏమీ గుడ్‌మన్ ని మాట్లాడుతున్నాను.

ముమియా అబు-జమాల్: హలో, ఏమీ, ఎలా ఉన్నావు?

ఏమీ గుడ్‌మన్: బాగున్నాను. డెమాక్రసీ నౌ కి స్వాగతం.

ముమియా అబు-జమాల్: సరే! నరకానికి స్వాగతం.

mumia2

ఏమీ గుడ్‌మన్: రెండు సంవత్సరాల క్రితం ఫెడరల్ జడ్జ్ యోన్ (Yohn) మీ కేసుపై 180 రోజులలో తిరిగి తీర్పు చెప్పి శిక్ష తిరగరాయాలని నిర్ణయించినా మీపై విధించిన మరణశిక్ష అలాగే ఉంది. ఆయన మీపై ఉన్న మరణశిక్ష ని కొట్టివేసి, యావజ్జీవ కారాగార శిక్షని విధించినా, ఇంకా డెత్-రో పై ఎందుకు ఉన్నారు?

ముమియా అబు-జమాల్: సరే ! ఆపరేషన్ ఆఫ్ లా (Operation of Law) అనేది ఒకటి ఉంది, దాని ప్రకారం కామన్‌వెల్త్ వెంటనే అపీల్ చేసింది. దానితో జడ్జ్ యోన్ ఇచ్చిన తీర్పు మీద స్టే వచ్చింది. జడ్జ్ యోన్ మరణశిక్షని తిరగరాస్తూ తీర్పు ఇవ్వడం జరిగినా అట్లాంటిదేమీ ఎప్పుడూ జరగనట్టే లెక్క.

ముమియా అబు-జమాల్: నా ఉద్దేశంలో ఒక్కో పుస్తకం రాసిన అనుభవం దేనికి అదే ప్రత్యేకం. మొదటి పుస్తకం “Life on Death Row” సుమారు మొత్తం చేతివ్రాతలో రాసిందే. నిజం చెప్పాలంటే అది ఒక వ్యాస సంకలనం. ఎవరో నన్ను నాకు నచ్చిన విషయాల గురించి రాస్తుండమని అడిగారు, అట్లా నేను ఒక వ్యాసాల పరంపర రాయడం మొదలుపెట్టాను. నోయెల్ హన్‌రాహన్ (Noelle Hanrahan) అవన్నీ కలిపి ప్రచురిస్తే ఒక గొప్ప పుస్తకం అవుతుందని సూచించింది. నేను దాన్ని నవ్వులాటగా కొట్టిపారేసాను. కాని తను ఇది చాలా మంచి ఆలోచన అంటూ నన్ను వదిలిపెట్టలేదు. ఆమె అన్నది నిజమని రుజువయింది. అది అంత మంచి ఆలోచన అని నేను ఎప్పుడూ అనుకోలేదు ఎందుకంటే అది అంత గొప్ప విషయం అని నేను అనుకోలేదు. నేను మామూలు మనుషుల గురించి రాస్తున్నాను, అదేమంత అసామాన్యమైనదిగా అనిపించదు. ప్రతీ పుస్తకం దేనికదే తనదైన పద్ధతిలో రూపుదిద్దుకుంది. ఈరోజు నేను టైప్‌రైటర్ ఉపయోగిస్తుండవచ్చు కాని ఇది ఒక ఒంటరి ప్రయత్నం, ఒక ఏకాంతమైన, గంభీరమైన అవస్థలో ఈ ప్రయత్నం చేస్తున్నాను. నేను కేవలం నా కళ్లను, చెవులని తెరిచి ఉంచి వెలుగులోకి రాని ఆ కథల గురించి అలోచించడానికి ప్రయత్నిస్తాను. నా చివరి రెండు పుస్తకాలు, ఒకటి నువ్వు ఇంతకముందు చెప్పింది, దానికన్నా ముందు Faith of our Fathers అనే పుస్తకం, రెండూ వర్తమానం గురించి గాక గతం గురించి మాట్లాడిన నేను రాసిన మొదటి చరిత్ర పుస్తకాలు. Faith of our Fathers అమెరికాలలో గత 500 సంవత్సరాలలో ఆఫ్రికన్‌ల, ఆఫ్రికన్ అమెరికన్‌ల ఆధ్యాత్మిక జీవితాన్ని చూపిస్తుంది. We Want Freedom సుమారు 30 సంవత్సరాల క్రితం బ్లాక్ పాంథర్ పార్టీ అవతరణ గురించి, బలపడటం గురించి మాట్లాడుతుంది. ఆ రెండు పుస్తకాలు గతంలోకీ, చరిత్రలోకీ నా ప్రయాణాలు.

ఏమీ గుడ్‌మన్: బ్లాక్ పాంథర్ పార్టీ లో మీ జీవితం గురించి మాట్లాడండి. అప్పుడు మీ వయసెంత? ఇప్పుడు జైలు నుండి బ్లాక్ పాంథర్ పార్టీ గురించి ఏ కోణాన్ని తెలియజేయాలనుకుంటున్నారు?

ముమియా అబు-జమాల్: నేను పార్టీలో చేరినప్పుడు నాకు 14, 15 సంవత్సరాలు ఉండి ఉండవచ్చు. ఫిలడెల్ఫియాలోనే కాకుండా న్యూ యార్క్‌లోని బ్రాంక్స్‌లో, బర్క్‌లీలోని జాతీయ కార్యాలయంలో, కాలిఫోర్నియాలోని ఓక్‌ల్యాండ్ దగ్గర పనిచేసే అదృష్టం నాకు కలిగింది. కొందరు అద్భుతమైన మనుషుల్ని కలిసాను. నేను చదివిన అన్ని పుస్తకాల్లో, చాలామటుకు చదివాను, అన్నీ అయితే కాదు, కాని చాలా మటుకు…

కంప్యూటర్ గొంతు: ఈ ఫోన్ కాల్ ఒక దిద్దుబాటు కేంద్రం నుండి వస్తుంది, ఈ ఫోన్ కాల్ ని పర్యవేక్షించడం, రికార్డ్ చేయడం జరగవచ్చు.

ముమియా అబు-జమాల్: ఆహా! రికార్డ్ చేస్తున్నట్టు మనకు తెలియదు, కదూ? బ్లాక్ పాంథర్ పార్టీ గురించి నేను చాలా పుస్తకాలు చదివాను, ఎన్నో చెప్పదగిన గొప్ప కథలు చెప్పబడలేదని నాకు అనిపించింది. ముఖ్యంగా పార్టీ లో పని చేసిన స్త్రీల గురించి. పార్టీ లో తమ స్వంత అనుభవాల గురించి రాసుకున్న స్త్రీలు ఉన్నారు. కాని పార్టీకి వెన్నెముకలా, పార్టీకి ఆత్మై , జీవమై పని చేసిన మామూలు, అనామక స్త్రీల గురించి ఎవరూ రాయలేదు. అందరికీ హ్యూ (Huey) గురించి, ఎల్‌డ్రిడ్జ్ (Eldridge) గురించి తెలుసు, కాథ్‌లీన్ (Kathleen) గురించి, ఎలేన్ బ్రౌన్ (Elaine Brown) గురించి అందరూ మాట్లాడుతారు. కాని మామూలు, రోజువారీ సాధారణ స్త్రీలు ఆ సంస్థకి పట్టుకొమ్మలై నిలిచారు. పార్టీ కార్యక్రమాలను ప్రజలు ఎంతో ఉత్తేజపూరితంగా తమ వాడల్లోకి తీసుకుపోయారు. సోఫీ బుకారి (Sophie Bucari) లాంటి వాళ్లు, అనామకంగా మిగిలిపోయిన వందల వేల ఇతర స్త్రీలు - వాళ్లే ఆ కథ చెప్పడానికి నాకు ప్రేరణ అనుకుంటాను, బహుశా ఆ పని నేను సరిగ్గా చేశాననే అనుకుంటున్నాను.

ఏమీ గుడ్‌మన్: ముమియా అబూ-జమాల్, ప్రస్తుతం 9-11 తర్వాత స్వదేశీయ గూఢచార యంత్రాంగం (Domestic Spy Agency) ఉండాలా వద్దా అనే దాని గురించి చర్చ జరుగుతుంది. మీ పుస్తకంలో ఆరవ అధ్యాయంలో COINTELPRO గురించి, దాడి చేస్తున్న సామ్రాజ్యం గురించి రాసారు. దాని ప్రభావం గురించి మాట్లాడండి.

ముమియా అబు-జమాల్: ఇప్పుడు మనం ఎదురుకుంటున్నదానికి నిజంగా పునాది వేసింది COINTELPRO అని చెప్పాలి. FBI భాషలో “బ్లాక్ బాగ్ జాబ్స్” (Black bag jobs) అనబడే ఉత్తరాలు దొంగిలించడాలు, చట్టవిరుద్ధంగా ఇళ్లల్లోకి చొరబడి తనిఖీలు చేయడాలు, అన్నీ 30 ఏళ్ల క్రితం చట్టవ్యతిరేకం. ఇన్‌ఫార్మర్లను, ఏజెన్సీ ప్రొవకేటర్ (agency provocateur)లను రాజ్యాంగం “మొదటి సవరణ (First Amendment) అభయమిచ్చిన ప్రాథమిక హక్కుల” కొరకు పోరాడుతున్న ప్రజా సంఘాలను ధ్వంసం చేయడానికి ఉపయోగించడం, ఇవన్నీ అప్పట్లో చట్టవ్యతిరేకం. ప్రభుత్వం తరఫున అట్లాంటి పనులు చేసేవాళ్లని వాళ్ల పై అధికారులు, “నీవు దొరికితే, జైలుకి వెళ్లవలసి వస్తుంది”, అని హెచ్చరించేవాళ్లు. అయినా FBI ఏజెంట్లు ప్రజల ఇళ్లల్లోకి చొరబడి, వాళ్ల ఇళ్లని సోదా చేసి, వాళ్ల వస్తువుల్ని ఫోటోలు తీసుకొని, వాళ్లని కేసుల్లో ఇరికించేవాళ్లు. కాకపోతే అట్లాంటి పనులు అప్పుడు చట్టవ్యతిరేకం. ఇప్పుడు ఏర్పడిన చట్టాల ప్రకారం, దేశభక్త చట్టం (Patriot Act) ప్రకారం, ఈ పనులన్నీ ఇప్పుడు చట్టప్రకారం చేయవచ్చు. ఇప్పుడు వాళ్లు ఎవరి ఇళ్లలోకైనా చొరబడవచ్చు. ప్రజల ఫోన్‌లను టాప్ చేయవచ్చు. కంప్యూటర్‌లను తెరిచి చూడవచ్చు. గ్రంథాలయాలలోని రికార్డులను వెతకవచ్చు, వ్యక్తిగత సమాచారాలను ఫైల్‌లలో భద్రపరచవచ్చు, ప్రజాసంఘాలలోకి ఇన్‌ఫార్మర్లుగా చొరబడవచ్చు. ఇవన్నీ ఇప్పుడు చట్టం అనబడేదాని రక్షణలో చేయవచ్చు. ఇది చాలా ఘోరమైన పరిణామం. భయంతో మనుషులు ఎలాంటి పనులు చేయడానికైనా సిద్ధమవుతారనడానికి ఇది ఒక నిదర్శనం. దేశభక్త చట్టం పాస్ అయిన కొన్ని రోజుల తర్వాత, BET చానల్ (channel) చూస్తుంటే, మంచి పేరున్న, నల్ల జాతీయుడైన ఒక పార్లమెంటు సభ్యుడు టీ.వి లో ఇలా అన్నాడు, “నేను ఆ చట్టాన్ని అంగీకరిస్తూ సంతకం చేసాను. సభలో చాలా మందిమి సంతకం చేసాం, కానీ నేను ఆ బిల్లుని చదవలేదు.” నేను అది ఎప్పుడూ మర్చిపోలేను. నేను వింటున్నది నేను నమ్మలేకపోయాను. ఆయన, “మమ్మల్ని ఈ పని ఇప్పుడే చేయాలని అన్నారు, మేము వెంటనే చేయాల్సివచ్చింది”, అని అన్నాడు. ఆంత్రాక్స్ (Anthrax) లాంటి వాటి గురించి భయాలు గుప్పుమంటున్న రోజులవి. బార్బరా లీ (Barbara Lee) తప్ప మిగిలినవాళ్లు అందరూ ‘లేదు’ అనడానికి ఎంత భయపడ్డారంటే ఎన్నో హక్కులని సాధించుకున్న రాజ్యాంగ నాలగవ సవరణ (Fourth Amendment) ని ఖచ్చితంగా, మొదటి సవరణని కొన్ని రకాలుగా, ఆరవ సవరణని కొన్ని రకాలుగా కాలరాసే చట్టాన్ని సమర్థిస్తూ సంతకం చేసారు. ఒకవైపు తన న్యాయవాదితో ఎవరి సంభాషణనైనా కూడా వినగలిగిన ప్రభుత్వం ఉంటే మరో వైపు ఎలాంటి ప్రాతినిధ్యం లేని ప్రజలు. ఇది చాలా ఘోరమైన పరిస్థితి. పూర్వం COINTELPRO రోజుల్లో లాగానే, ఇంకా వెనక్కి వెళ్తే పామర్ రేడ్ (Palmer Raid), ఎమ్మా గోల్డ్‌మన్ (Emma Goldman), అలెక్సాండర్ బర్క్‌మన్ (Alexander Berkman) రోజుల్లో లాగానే మళ్లీ ప్రభుత్వానికి భయం అనేది పరిపాలనలో ఒక ప్రధాన మూలసూత్రం ఎలా అవుతుందో మనకి అర్థమవుతుంది. భయం రాజ్యమేలుతున్నపుడు, హక్కులన్నీ మురుగుకాలువలో పడి కొట్టుకుపోతాయి.

ఏమీ గుడ్‌మన్: మనం మాట్లాడుకోడానికి ఇంకా కొన్ని నిమిషాలు ఉన్నాయి, All Things Censored అనే పుస్తకంలో పూర్వం డెమాక్రసీ నౌ తో మీరు మాట్లాడుతుండగా జైలు అధికారులు ఫోన్‌ని గోడ నుండి లాగిపారేసిన ఉదంతం గురించి రాసారు. జైలు నుండి మీ గొంతుని బయటి ప్రపంచానికి వినిపించడంలో ఉన్న అనుభూతి గురించి చెప్పండి.

ముమియా అబు-జమాల్: ఎన్నో రకాలుగా, నేను…

కంప్యూటర్ గొంతు : ఈ ఫోన్ కాల్ ఒక దిద్దుబాటు కేంద్రం నుండి వస్తోంది, ఈ ఫోన్ కాల్ ని పర్యవేక్షించడం, రికార్డ్ చేయడం జరగవచ్చు.

ముమియా అబు-జమాల్: ఎన్నో రకాలైన అనుభూతులని పొందాను, ప్రత్యేకించి, ఒక మంచి వ్యాఖ్యానం చేసాననో లేదా ఒక మంచి కథ రాసాననో అనిపించినపుడు అది ఒక స్వేచ్ఛానుభూతిని ఇస్తుంది. ఎందుకంటే నువ్వు చాలా ముఖ్యం అని పరిగణించే ఒక విషయాన్ని ప్రజలతో పంచుకుంటున్నప్పుడు అది వాళ్లకు ఒక స్వేచ్ఛానుభూతిని, ఒక జ్ఞానోదయం లాంటి అనుభూతిని కలిగించవచ్చు. మీరు ఇంతకముందు గుర్తుచేసిన సంఘటన గురించి నేను ఎప్పుడూ మర్చిపోలేను, ఆరోజు నేను మీ ప్రొడక్షన్ లో పని చేసేవాళ్లలో కొంత మందితో మాట్లాడాను, మీరు నన్ను ఒక్క నిమిషం ఫోన్ పై హోల్డ్ లో పెట్టారు. మాట్లాడడం మొదలుపెట్టాక, అకస్మాత్తుగా ఫోన్ పనిచేయడం ఆగిపోయింది. అప్పుడప్పుడు, సాంకేతిక ఇబ్బందుల వల్ల అట్లా జరుగుతుంటుంది, అట్లానే జరిగింది అనుకున్నాను. అంతలో ఒక గార్డు ‘ఫోన్ నాకు ఇవ్వు! ఫోన్ నాకు ఇవ్వు!’ అంటూ అరుస్తూ వచ్చాడు. “ఏమయింది” అని నేను అడిగాను. నాకు ఏమీ చెప్పకుండా మళ్లీ “ఫోన్ నాకు ఇవ్వు” అని అరవడం మొదలు పెట్టాడు. ఇంతలో జైలు అధికారుల గుంపు ఒకటి కనబడింది, అందులో ఒక అధికారి వైపు చూసాను, “చూడు, పైనుండి ఒక ఫోన్ కాల్ వచ్చింది”, అని అన్నాడు. అంతే. అదొక్కటే వాళ్లు నాకు చెప్పింది.

కంప్యూటర్ గొంతు: మీరు మాట్లాడడానికి ఇంకా ఒక్క నిమిషం సమయం మాత్రమే ఉంది.

ఏమీ గుడ్‌మన్: ముమియా, నేను ఒక ప్రశ్న అడగాలి. ఇంకో పదిహేను నిమిషాల కొరకు మళ్లీ ఫోను చేయగలరా?

ముమియా అబు-జమాల్: లేదు, కంప్యూటర్ షట్ డౌన్ అవుతుంది. ఈ కాల్ తర్వాత, మళ్లీ 24 గంటల వరకు నేను ఎవ్వరికీ, ఎక్కడికీ ఫోన్ చేయలేను.

ఏమీ గుడ్‌మన్: చివరగా ఒక ప్రశ్న అడుగుతాను, మీరు పోలీస్ ఆఫీసర్‌ని చంపలేదని ఎప్పుడూ బాహాటంగా ఎందుకు అనలేదని చాలా మంది అడుగుతారు. దానికి మీ సమాధానం?

ముమియా అబు-జమాల్: నేను అట్లా అనలేదనటం నిజం కాదు. నేను ఆఫీసర్‌ని చంపలేదని అన్నాను. అలా అనడం ఎక్కడ ఐతే అన్నింటికన్నా ముఖ్యమో అక్కడ అన్నాను. న్యాయస్థానంలో నా ముందు ఉన్న జూరీతో అన్నాను. నేను నిర్దోషినని వాళ్లతో అన్నాను. ఆ జూరీ, ఎవరంటే…

కంప్యూటర్ గొంతు: మీరు మాట్లాడడానికి ఇంకా 15 సెకండ్ల సమయం మాత్రమే ఉంది.

ముమియా అబు-జమాల్: నాకు మరణ శిక్ష వేసిన 12 మంది జూరీ సభ్యులు నేను అట్లా అనడం విన్నారు. నా తరఫున న్యాయవాది కూడా సరిగా లేని విచారణ (trial)లో కూడా విన్నారు.

ఏమీ గుడ్‌మన్: పెన్‌సిల్వేనియా లోని డెత్-రో నుండి మాట్లాడుతున్న ముమియా అబూ-జమాల్. అంతటితో మా సంభాషణ బలవంతంగా ముగించబడింది. మీరు వింటున్నది డెమాక్రసీ నౌ!

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)