ఒక పద్యం ఉరితీయబడింది
పద్యాలెప్పుడూ ఉరి తీయబడుతూనే ఉన్నాయి.
బహుశా, ఏ మంచి పద్యానికయినా
ఉరి వుచ్చులో కాసేపు గిలగిల్లాడడమే
సరయిన చివరి చరణం అనుకుంటాను
శతృవేదిక మీద నిటారుగా నిలబడి
మృత్యువు కళ్ళలో కళ్ళు పెట్టి చూడడమే
పద్యం తన సజీవత్వానికి తాను
పెట్టుకునే పరీక్ష అనుకుంటాను
అందుకే పద్యం చివరి శ్వాసలోనూ
ముఖం మీద ముసుగును తిరస్కరిస్తుంది
మొదట్లోనయినా చివర్లోనయినా
పద్యం ఏమికోరుకుంటంది
తన సమస్త సౌందర్యాలతో
సత్యానికి బాసటగా నిలబడాలనుకొంటుంది
మన కళ్ళలో శుక్లాలు సరిచేసి
నిజాన్ని నిజంగా అబద్ధాన్ని అబద్ధంగా
చూసే చూపును మనకివ్వాలనుకుంటుంది
చివరి క్షణాల్లో అబద్ధం తలారి రూపమెత్తి
అతి గంభీరంగా ముఖంపెట్టి
నీ ఆఖరి కోరిక ఏమిటని అడిగితే
అద్భుతాన్ని కలగనే పద్యం ఏం చెబుతుంది
తన కోరిక అబద్ధం తీర్చగలిగేది కాదు
సత్యం చెరసాల ఎదుట ఆరుబయలు బందీ
మనం సత్యమేనా? మనం సత్యమయినట్లయితే
రుబయలు బందీలమయిన మనకు వినిపించేలా
పద్యం తన మొదటి చివరి కోరికను ప్రకటించింది
‘ఇరాక్ సమైక్యంగా వర్ధిల్లాలి
పాలస్తీనా కల ఫలించాలి’
ఉరి వుచ్చులో స్వరపేటిక నలిగిపోయి
మెడ ఎముక విరుగుతున్నప్పుడు
గొంతు చుట్టూ కట్టిన ఎర్రగుడ్డ మీద
పద్యం చేసిన ముదురు ఎరుపు చేవ్రాలు
స్పష్టంగానే వుంది
‘సామ్రాజ్యవాదం నశించాలి.’
ఇరాన్ సమైక్యంగా వర్థిల్లాలి ???????????-ఇరానా లేక ఇరాకా?