కవిత్వం కావాల్ట, కవిత్వం
సత్యంతో కలుషితం కాని స్వచ్చమైన కవిత్వం
ఆ పిల్లాడు చాక్లెట్ల కోసం యేడవడం లేదు
బాంబుల దాడిలో తెగిపోయిన
రెండు చేతుల కోసం యేడుస్తున్నాడు
దేశాల కోసం జెండాల కోసం కూడా కాదు
గుండెలు బాదుకోవడానికి
రెండు చేతులు లేవని యేడుస్తున్నాడు
యిప్పుడు కవిత్వం కావాల్ట , కవిత్వం
యితర్లకేం వాళ్ళకు మాతృ భూములున్నాయి పితృ భూములున్నాయి
ఆ పిల్లాడికీ నాకూ వున్నది వొకే వొక్క నేల
అన్నం తినడానికీ దొడ్డికి పోవడానికీ చివరి నిద్ర పోవడానికీ
మాకున్న వొకే వొక్క నేల తూట్లు పడుతుంటే
అదంతా చూస్తూ వుండిపోయినందుకు కళ్ళు పొడుచుకోవాలనిపిస్తోంది
నోటికి ముద్ద అందిస్తున్న చేతిని నరుక్కోవాలనిపిస్తోంది
యింకా బతికి వున్నందుకు సిగ్గుతో చచ్చిపోవాలనిపిస్తోంది
యేమో నేను నిజంగా చచ్చిపోయానేమో
డయాక్సీ న్యుక్లిక్ యాసిడ్ పరీక్షలకందని మరణాన్ని
యిసుక దిబ్బలకు కానుక చేశానేమో
నా మరణంతో మరో యుద్ధం మొదలవుతోంది
నా అదృశ్యంతో మరొక దృశ్యం ఆవిష్కృతమవుతోంది
రెక్కలు విప్పుకున్న గద్దకీ కోటి కోట్ల కోడిపిల్లలకీ మధ్య
మనస్సులనే అడవులు గెరిల్లా స్థావరాలుగా
అసలయిన ఆర్మగెడ్డాన్ , వొక కల్పాంతం
యిక యే శిఖరానికీ భద్రత లేదు యే లోయకూ శాంతి లేదు
భూగోళం నేడొక రేప్ చేయబడుతున్న నిస్సహాయ స్త్రీ
గయ్యాళి గంప
అన్ని ఆభిజాత్యాలను తుంగలో తొక్కేశాక
యెవర్నీ యే నీతీ కాపాడలేదు
యిక గయ్యాళి గంపలదే రాజ్యం
కవిత్వం కావాల్ట వాడికి , కవిత్వం
రూపక ఉపమా అలంకృతమయిన పారుష్య మంటని స్వచ్చమైన కవిత్వం
పాలస్తీనా నడి రోడ్డు మీద కన్న బిడ్డను కడుపులో పొదువుకోవడానికి
చివరి వరకు ఆరాటపడిన తండ్రి సాక్షిగా
బ్లాడర్లు బ్లాడర్లుగా పోస్తున్నా కడుపారా తాగమంటున్నా
మేము వొక జాతి తలెత్తుకొని నిలబడుతున్న అద్భుత క్షణాల్ని
బి- 52 బాంబర్లకందని గుండెల్లోపల పొదువుకుంటాం
వూరేగింపులన్నీ సద్దుమణిగి కొట్లు నిర్భయంగా తెరిచాక కూడా
యిసుక రేణువుల్లో ఆరని పౌరుషాగ్నిని ప్రేమిస్తుంటాం
టీవీ తెరల మీద కొత్తగా అవమానకర దృశ్యాలెందుకు
మేము యేనాడు సన్మానించబడ్డామని
అలెండీ మీద బాంబుల వానలో పినోఛెట్ వూరేగినప్పుడా
రసాయనిక బాంబుల మంటలు తాళలేక
నా వియత్నాం చిట్టితల్లి నడి వీధిలో పరిగెట్టినప్పుడా
తల్లిని తొక్కుతూ పిల్ల పిల్లను తొక్కుతూ తల్లి
జలియన్ వాలా బాగ్ పార్కులో తొక్కిసలాడినప్పుడా
మా బతుకు మమ్మల్ని మర్యాదగా బతకనిచ్చిందెప్పుడు
యిరాక్ లో జరుగుతోంది వొక మామూలు యుద్ధం కాదు
ప్రథమ ప్రపంచ స్వాతంత్ర్య సంగ్రామం