ఊరిచివరి పేటలోని పేదపిల్ల
జమీందారు మీద కోపంతో
బందిపోటుదొంగను ప్రేమిస్తుంది
నా ప్రియమైన భూగోళమిప్పుడు
సద్దామ్ హుస్సేన్ ను ప్రేమిస్తోంది
అమెరికన్లు టాయిలెట్ పేపర్ మీద ముద్రించినా
సద్దామ్ హుస్సేన్ మురిక్కాల్వలో కొట్టుకుపోడు
( మిస్టర్ ప్రెసిడెంట్ ! హి విల్నాట్ గో డౌన్ దిడ్రెయిన్ )
బహుశా చాలాకాలం
తన విముక్తికి తానే నడుం కట్టేవరకు
భూగోళం సద్దామ్ హుస్సేన్ ను ప్రేమిస్తుంటుంది
ఇసుక దిబ్బల్లో అనామక గోరీల మధ్య
గాజుకళ్ళ ముసలమ్మలా తిరగాడాల్సివచ్చినా
భూగోళం సద్దామ్ హుస్సేన్ ను ప్రేమిస్తుంటుంది
ఎలా గెలుస్తాడో ఏమో
సద్దామ్ హుస్సేన్ గెలవాలంతే
ఎక్కడి కక్కడ హేండ్ గ్రెనేడ్లవుతాడో
అల్ హుస్సేన్ క్షిపణుల అక్షయ పాత్రవుతాడో
తారుమేఘాలావరించిన గగన మవుతాడో
రెక్కల కింద మందుపాతరలున్న
సముద్ర పక్షి అవుతాడో
తెలవారు ఝాము స్వప్నంలో
అల్లా ఆదేశమవుతాడో
చివరి పోరుకు బరితెగించిన
పాలస్తీనా శిబిరమవుతాడో
సద్దామ్ హుస్సేన్ గెలవాలంతే
రాంబో సమాధి మీద
జయకేతన మెగరాలంతే
మతాన్ని అయుధం చేసుకున్నా
వాడు మధ్యయుగమృగం కాడు
ఆయిల్ డబ్బు కోసం పేచీపడుతున్నా
అంతా నాదనే దురహంకారి కాడు
వాడి జెండా ఏదయితేనేం
అజెండా ఏమయితేనేం
ఇప్పటికిప్పుడు
వాల్ స్ట్రీట్ కుయుక్తులపై
పూరించిన శంఖం
షేక్ డమ్స్ పాలెగాళ్ళకు
మొదటి మరణ శాసనం
నా స్టవ్ లో కిరోసిన్
నన్ను భయపెడితే భయపెట్టనీ
జేవియర్ పెరిజ్ డిక్యూయా
ప్రపంచానికి ప్రతినిధి కాడని
నిరూపించే పని కొనసాగనీ
ఇప్పటికి నా పే స్లిప్
చేతివేళ్ళమధ్య నుంచి
జారిపోతే జారిపోనీ
మూడో ప్రపంచం
అంకుల్ శామ్ భోజనం బల్ల కాదని
నిరూపించే పని మాత్రం కొనసాగనీ
గర్జించిన సోవియట్ల దేశం
రైతుయోధుల వీరవియత్నాం
బతికుంటే చాలని
యాంకీ మామను కావలించుకున్న వేళ
అతి హింసాత్మక
అసహజ నిశ్శబ్దం కడుపున
రగిలిన అరాచక శబ్దం ,
విసిగిపోయిన మానవాళి
ఎంచుకున్న నిరసన స్వరం ,
తలకిందుల లోకానికి
అందమైన యాంటీ హీరో ,
నూతన శిశువు కాడుగాని
భూగోళం పురిటినొప్పి సద్దామ్ హుస్సేన్
ఫవాద్ నపుంసకుడు అస్సాద్ తార్పుడుగాడు
తుర్గత్ ఓజల్ శవాల మీద పేలాలేరుకునేవాడు
ఎటుచూస్తే అటు ఫవాద్ , అస్సాద్ , ఓజల్
అద్నాన్ ఖషోగ్గీ నేడు
స్వతంత్ర భారతికి ఉత్తమోత్తమ అతిధి
అస్గరలీ ఇంజనీర్ అవేదన అరణ్యరోదన
ఎం. జె అక్బర్ వెయ్యో అబద్దానికి మళ్ళీ గిరాకీ
భూగోళం ప్రేమించడానికి ఇంకేముంది
ద్వేషం మీద ద్వేషాన్నే ప్రేమిస్తోంది
భూగోళం సద్దామ్ హుస్సేన్ ను ప్రేమిస్తోంది
తిక్క ముదిరి తొక్క మీద కాలు వెయ్యటం అంటే ఇదే. అమెరికా ఒక వెధవ దేశం, అత్యంత హీన రాజకీయాలు ఉపయోగించే దేశం. దీనిని దేహం మీద తలకాయ ఉన్న వాడెవ్వడూ కాదనడు. కానీ ఈ సద్దాం భజనను నేను ఖండిస్తున్నాను. సద్దాం పేద ప్రజల రక్తం తాగిన నియంత. అమెరికా పెంచి పోషించిన త్రాచు పాము. అంతా సరిగ్గా జరిగి ఉంటే మనకే పక్కలో బల్లెంలా తయారయ్యేవాడేమో. షియాలను ఊచకోత కోసాడు. మీ ఊక దంపుడు సాహిత్యాలకు ప్రజాకళ అని పేరు పెట్టి నియంతలను కీర్తిస్తూ ప్రజా సాహిత్యాన్ని అవమానించకండి…చేతులెత్తి మొక్కుతా…