- గద్దర్
యాలరో ఈ మాదిగ బతుకు
మొత్తుకుంటె దొరకదురా మెతుకు
నీకు మొత్తుకుంటె దొరకదురా మెతుకు ||యాలరో||
మాలన్న మాదిగన్న
నీరుడన్న బేగరన్న
మేదరన్న మాతరన్న
లంబడన్న చెంచన్న
కులం కులం కులమంటూ
కుమిలిపోయే కూలన్న
గొంతు విప్పి పాడుతున్న
మనసువిప్పి వినరన్నా ||యాలరో||
బొందలు దవ్వేటి
బాగరక్కు మనది
సచ్చిన పసులు మోసే
మాదిగక్కు మనది
నీళ్లని కాపాడె
నీరుడక్కు మనది
రోతను సాఫు జేసే
మాతరక్కు మనది
బాంచెబతుకె మన బతుకని
మన బతుకుల మన్ను బోసి
బలిసిన దోపిడిదొంగలు
బాగ బలిసి పోతుంరు ||యాలరో||
బంగారు పంటలిచ్చె
భరత గడ్డ మనది
గంగమ్మ ప్రవహించే
పుణ్యభూమిరా మనది
గంగ యమున బ్రహ్మపుత్ర
కృష్ణ పెన్న కావేరీ
ఎన్నెన్నో జీవనదులు
ప్రవహించే జీవగడ్డ
మాల మాదిగన్నలకే
మంచి నీళ్ళు కరువాయే ||యాలరో||
శాస్త్రిగారు ఆవులకు
గరకదెచ్చి గడ్డిదెచ్చి
తిండిబెట్టి కుడితిబోసి
బుదగరిచ్చి పాలుబిండి
పాలుమీగడలు శాస్త్రులు
పసందుగా మింగుతుంటే
సల్లబొట్టు శాస్త్రులంటే
అంటయితది అడుగకనె ||యాలరో||
ప్రాణాలు బోవంగా
పునాదులూ తవ్వి
రక్తాలు కారంగా
రాల్ల గోడ బెట్టి
కంటికి ఇంపైన
కర్ణపోని బంగ్ల గట్టి
ఇంట లగ్నమయితుంటే
ఇనామిస్తడని పోతే
కులం తక్వ ముండకొడుక
గడప దాటి రాకుమనే ||యాలరో||
మతం మార్చుకుంటెనేమొ
మనసు సల్లబడుతదాని
కష్టాలు బోతయని
క్రైస్తవ మతముల జేరితె
కమ్మ క్రైస్తు రెడ్డి క్రైస్తు
మాల క్రైస్తు మాదిగ క్రైస్తు
అంటరాని పిశాచమూ
యెంటబడుతున్నాది ||యాలరో||
మాలమాదిగల నడుమ
మంచినీళ్ల బాయి గొట్టి
మాలోల్ల గిరక దిక్కు
గజం లోతు ఎక్కువ దొవ్వి
మాలోల్ల గిరక దిక్కు
మాదిగోల్లు రావొద్దని
మనలో మనమిద్దరమే
తన్నుకోని సస్తుంటే
తాకులాట పెట్టి దొరలు
తమాష సూస్తున్నారు ||యాలరో||
సర్పంచ్ గ్రామపంచ్
సంతకాలు దీసుకొని
కర్ణము కనకయ్యకు
కోడిపుంజు కాలబెట్టి
గిర్దావర్ గానికి
గురదక్షిణ చెల్లించి
తాహ్సిల్దార్ సంతకముకు
తలపానం తోకకొచ్చె
ఎర్రగ బుర్రగ ఉన్నావు
మాదిగంటె నమ్మనండు
సర్టిఫికెట్ లేకుంటే
సీటురాదు సారంటే
నొసటిమీద మాదిగోల్ల
ముద్దరేసుకోమన్నడు ||యాలరో||
దొరవారి కొడుకులను
అరే అన్నందుకు
తెల్లని మల్లెమొగ్గ
చీర గట్టినందుకు
కోటేసును గాల్చింరు
కొండమ్మను చెరిచింరు
తప్పుడు కొడుకులను దన్న
ఉప్పెన వలె ఉరికిరార ||యాలరో||
బెల్చిలో భూస్వాముల
కథ తెలుసా నీకు
దున్నేవానిదే భూమి అన్నందుకు
భూస్వాముల కాళ్లకాడ పడి ఉండానందుకు
భూస్వాములు ఏకమయ్యి
మీసాలు దువ్వుకుంటు
పట్టపగలే నీ వాళ్లను
కాళ్లు చేతులు గట్టి
మంటలల్ల కిసిరేసి
మజా జేసుకున్నరంట ||యాలరో||
టర్క్‌మన్ గేటుకాడి
తతంగమూ తెలుసా
గేటు చుట్టు గరీబోల్ల
గుడిసెలున్నయన్నా
చాపచింపులు లేని
చీపురోల్ల వాడలు
కూడుగుడ్డ లేని
కార్మికుల పాకలు
ఇది చూసి సంజయ్‌కి
ఇషి ఇషి అనిపించిందట
ఢిల్లి లాంటి నగరంలో
అల్లి బిల్లి గుడిసెలేల
బుల్డోజరు తీసుకొచ్చి
భూమట్టం చేసింరు
గుడిసెలు పీకెయ్యొద్దని
తిరగబడ్డ వాళ్లను
పిట్టలను గాల్చినట్టు
పట్టపగలె కాల్చికూల్చి
టాంక్ కింద పడదోసి
తార్ రోడ్డులేసింరట ||యాలరో||
ఇందిర కాంగిరేసు
హితం చేస్తదంట
జనతా నాయకులు
జయం చేస్తరంట
నిన్న మొన్న నేడు రేపు
నీ రక్తం దాగినోల్లు
కవల పిల్లలీల్లంతా
కలల కూడ మరిసిపోకు ||యాలరో||
భూమంత భూస్వాముల
వలల ఉందిరన్నా
వాళ్లను కూల్చేదాక
కులం పోదురన్నా
గనిలో బొగ్గుదవ్వే
గని మనిషివి నీవు
సమ్మెట బట్టినోడ
సమ్మె జేయరారా
కమ్మని బతుకుకొరకు
కత్తి నూరుకోరా
నీ చెమటినకని చేనుందా
నువు జెయ్యని చీజుందా
శ్రమజీవుల విముక్తికై
పిడికిలెత్తి బాస జెయ్ ||యాలరో||
అంతా బాగుంది. భూస్వాములను కూల్చడమంటే భౌతికంగా వారిని నిర్మూలించడం గాకుండా వ్యవస్థను నిర్మూలించడమని అర్థం చేసుకుంటే బాగుంటుందేమొ!
–ఫ్రసాద్
http://blog.charasala.com