-పెద్దరామస్వామి
ఘటన సామాజిక స్థితికి వ్యక్తరూపం.
అంతమాత్రమే కాదు, దాన్ని యింకా చాలా రకాలుగా చూడవచ్చు.
తీవ్రమైన సామాజిక వ్యక్తతనూ - దానికి ముందు, తర్వాత సాగిన అంతర్గత పరిణామాలనూ కలిపి చదువుకునే పద్ధతి అందరికీ తెలిసిందే. ఘటన సంకేతంగా, ఉదాహరణగానే కాక ఒక గీటురాయి కావడానికి కూడా అవకాశం ఉంటుంది.
ఘటన ద్వారా మన అనుభవంలో, అవగాహనలో భాగమైన చైతన్యం ఒక మలుపును సూచించే చారిత్రకప్రాధాన్యం కలిగిందిగానే గాక, ప్రతి సమకాలీనాంశాన్ని పరీక్షించుకోవడానికి దోహదపడుతుంది.
అవ్యక్తంగా, చైతన్యరూపంగా ఉన్నవాటికి ఘటన ఒకానొక భౌతికవాస్తవిక రూపాన్ని అందిస్తుంది. అప్పుడు ఘటన నిర్ధిష్ట స్థలకాలాల యదార్ధానికే పరిమితం కాకుండా, వాటి ఆధారంగా అనేక సమకాలీనాంశాలకు గీటురాయిగా మారుతుంది. ఒక ఘటన గురించి పదేపదే చెప్పుకుంటున్నామంటే - దాని సమకాలీన విస్తరణరూపంగా స్వీకరిస్తున్నామని అర్థం చేసుకోవచ్చు.
యింత ఉపోద్ఘాతం దేనికంటే - వేంపెంటలో మాదిగలపై, బలహీనవర్గాలపై జరిగిన మారణకాండకు సంబంధించిన కేసును కోర్టు కొట్టివేసిన నేపథ్యంలో (11, డిసెంబర్ 2006) దళిత సాహిత్యం గురించి ఆలోచిస్తు - ఒక ఘటనకూ నడుస్తున్న కాలంలోని సామాజిక, సాహిత్య పరిణామాలకూ సంబంధం ఏమైనా ఉంటుందా? ఉంటే ఎట్లా ఉంటుంది? అనే సందేహాలు తలెత్తాయి. దాని చారిత్రక ప్రాధాన్యతను గుర్తించడంతోనే సందేహనివృత్తి జరగదుగదా.
వేంపెంటలో 1998 జులై 16న జరిగిన ఘటన మీద కోర్టు యిచ్చిన తీర్పు ప్రకారం అక్కడ ఏం నేరం జరిగింది? నేరస్తులు ఎవరు? అనేవి యితమిద్దంగా తేలనట్టే. తాను నిర్ధేశించుకున్న చట్రంలో సాక్షాధారాలు దొరికితేగాని నిర్ధారణకు రాలేని న్యాయవ్యవస్థకూ - సాహిత్యానికీ ఏరకంగానూ పోలిక ఉండదు. సాహిత్యరచనకు సంఘటన ఎంత ప్రేరణగా పనిచేసినా; ఘటనలో కనిపించే నిజానిజాలను తేల్చుకునే విచక్షణ, వైఖరి దగ్గరే ఆగిపోకుండా అక్కడ తేలిన అంశం ఆధారంగా సాగే జీవిత అన్వేషణ ఫలితంగానే సాహిత్యం రూపొందుతుంది. అందుకే సామాజిక అంతర్గత స్థితిని, సంఘర్షణను ప్రకటించే ఘటనలను రచయితలు ఘటనలుగానే చూసి సంతృప్తి చెందరు. జీవిత అన్వేషణలో నిగ్గుదేల్చుకోవలసి వచ్చినప్పుడల్లా ఘటనల గీటురాయి మీద అప్రమత్తమవుతూ ఉంటారు.
వేంపెంట కేసు కొట్టేయడం అనూహ్యమేమీ కాదు. మానవ జీవితంలో నేరం లేదా అవాంఛనీయ ఘటనలు జరిగిన, జరగడానికి అవకాశం ఉన్న ఆవరణకు - న్యాయవ్యవస్థ నేరాన్ని పరిగణలోకి తీసుకొని సాక్ష్యాధారాలతో నిర్ధారణకు వచ్చే ఆవరణకూ మధ్య చాలా ఎడం ఉంటుంది. అందువల్లనే కోర్టులు తాము కోరుకునే పద్ధతిలో సాక్ష్యాధారాలు దొరికి నేరాన్ని గుర్తించినా, నేరస్వభావాన్ని గుర్తించలేవు. అందులోనూ నేరం జరిగిందనుకుంటున్న ‘జీవిత’ ఆవరణలోకి తొంగి చూడటం తమ కర్తవ్యం కాదని కూడా కోర్టులు అనుకుంటాయి.
ఈ తరహా చర్చలోకి వెళ్ళనవసరం లేదుగాని, వేంపెంటకు సంబంధించిన రెండు కేసులను కోర్టు కొట్టేసింది. మాదిగ బలహీనవర్గాలపై దాడి కేసు, దానికి నేపధ్యంలో ఆరోజు రాత్రి విప్లవకారులు ఒక వ్యక్తిని హత్యచేసిన కేసు రెండింటిని కొట్టేస్తూ ఒకేసారి తీర్పు వచ్చింది. తెర వెనక్కి వెళ్ళితే రెండు కేసుల్లోని ముద్దాయిలు ఎప్పుడో రాజీపడ్డారు. ఆ రకంగా వేంపెంట సమస్య పరిష్కారమైపోయింది. రాజీకుదరడం అనేదాన్ని చట్టపరిధిలో చూస్తే మనమూ కోర్టు తీర్పు దగ్గరికే వచ్చి ఆగిపోతాం. ఈ ఘటనలోని సంఘర్షణ, కేసుల్లోకి వచ్చిన వాస్తవాలు - వక్రీకరణలు, న్యాయవ్యవస్థకు ఉండే అగ్రవర్ణ స్వభావం మొదలైన విశ్లేషణల చట్రాన్ని దాటితే యింకా ఈ ‘న్యాయక్రమం’ వెల్లడి చేస్తున్న అనేక సమస్యలు కనిపిస్తాయి.
* * *
ఇప్పుడు సాహిత్యానికే పరిమితమై - వేంపెంట వైపు నుండి దళిత సాహిత్య ధోరణిని చూడ్డం వల్ల ఏమైన ప్రయోజనం ఉంటుందా? అనే ప్రశ్న వేసుకోవడం అవసరం. ఎందుకంటే సామాజిక స్థితికి వ్యక్తరూపమైన ఘటన వెనుక, దాని పూర్వాపరాల వెనుక ఉన్న వాటిని చర్చించడానికి సాహిత్యరంగమే బలమైన వాహిక కాబట్టి.
దళిత సాహిత్య విశ్లేషణలో కారంచేడు కేంద్రంగా ఉండటం దాని చారిత్రకతను తెలియజేస్తుంది. కారంచేడు పూర్వాపరాలు దళిత సాహిత్యక్రమం లోని అనేక చలనాలకు, చైతన్యాలకు, వ్యక్తీకరణ రూపాలకు సామాజిక ఉపపత్తిని సమకూర్చాయి. దాని ప్రాధాన్యత అటువంటిది. అట్లా వేంపెంట వైపు నుండి దళిత సాహిత్యాన్ని చూడ్డానికి కనీసం కేసు కొట్టివేత అయినా ఒక సందర్భంగా నిలబడుతుందని నమ్మకం. కారంచేడు, చుండూరు ఘటనల్లోని వ్యక్తాంశాలు దళిత సామాజిక, సాంస్కృతిక జీవనంలోని అవ్యక్తాంశాల దగ్గరికి తీసుకపోయి, ఆ జీవన పునాదిని ప్రతిబింబించడంలో సాహిత్యరంగాన్ని నిర్దేశించింది. అట్లా 1998 తర్వాత దళిత సాహిత్య ప్రయాణం మీద వేంపెంట ఏమైనా ప్రభావం చూపిందా? సూటిగా ఈ ప్రశ్న వేసుకొంటే కొత్త పరిశీలనలకు ఆస్కారం ఉండొచ్చు.
అయితే వేంపెంట ఘటన జరిగేనాటికి దళితవాదంలో సామాజికంగా, సాహిత్యపరంగా జరిగిన ముఖ్యమైన పరిణామాన్ని స్థూలంగానైనా గుర్తు చేసుకోవాలి. కారంచేడు ఉద్యమంతో రూపొందిన దళిత నాయకత్వం రాజకీయాల్లో, సాహిత్యంలో వేంపెంట నాటికల్లా ఫేడ్ ఔట్ అయిపోయింది. కొత్త శక్తులు ముందుకు వచ్చాయి. 1985-95 దశాబ్దంలోని దళిత విశ్లేషణలు వెనక్కి పోయి, కొత్త ఆకాంక్షల మీద కొత్త సమీకరణాలను మోసుకొని కొత్త తరం ముందుకు వచ్చింది. దళిత క్షేత్రం అంతా కొత్త నిర్వచనాల, వ్యాఖ్యానాల పునర్నిర్మాణానికి గురి కావలసి వచ్చింది. మాదిగ దండోరా ఆవిర్భావం దళిత ఉద్యమంలో, సాహిత్యంలో అలాంటి ఒక కీలకమైన మలుపు. అది దళిత సాహిత్యం అప్రమత్తం కావలసిన సందర్భం. అక్కడ నిలబడి గతాన్ని, వర్తమానాన్ని వివరించవలసి ఉండింది. కానీ ఆ పని జరగలేదు. జరగకపోవడం కూడా కొత్త ఆకాంక్షల, సమీకరణాల ప్రాబల్యాన్ని సూచిస్తుంది. అందులోని భావోద్వేగాల తీవ్రతను వేంపెంట ఘటన దిగ్భ్రాంతికరం చేసింది. దళిత సాహిత్యధోరణి సహజంగానే సృజనాత్మక సాహిత్యంలో వ్యక్తమయినంతగా సామాజిక వ్యాఖ్యానంలో మేధోశక్తిని విడుదల చేయలేకపోయింది. ఈ మాట కొంచెం నొప్పి కలిగిస్తుందేమో కాని ఈవైపు నుండి సహనంగా చూడ్డం వల్ల భవిష్యత్తు మాట ఏమోగాని, గతాన్ని లోతుగా చూడ్డానికి వీలవుతుంది. ఇవి ఎట్లాగూ ఆవేశకావేశాలకు, ఉద్రిక్త సూత్రీకరణలకు కాలం చెల్లిన రోజులు కాబట్టి నిబ్బరంగా అన్వేషించవచ్చు.
ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే - మాదిగదండోరా సృజించిన భావోద్వేగాల సన్నివేశంలో వేంపెంట ఒకానొక ద్రిగ్భాంతికరమైన అనుభవంగా మిగిలిపోయిందేకాని, సృజనాత్మకరంగంలోని మేధో అవసరాన్ని రచయితలు పట్టించుకోలేకపోయారు. ఆ డిమాండ్‌ను దళిత రచయితలు స్వీకరించలేకపోయారు. ఈ వైఫల్యం వల్ల దళిత సాహిత్యకారులు వేంపెంట ప్రభావానికి లోనుకాలేకపోయారు, దాన్నుండి ఏమీ తీసుకోలేకపోయారు. నిజానికి యింకోరకంగా చూస్తే ఈ అవసరాన్ని మేధోస్థాయికి తీసుకుపోనవసరం లేకుండానే అప్పటికే దళిత సాహిత్యానికి నిండుగా ఉన్న జీవితనుభవ గాఢత నుండయినా ఈ ద్రిగ్భాంతికరమైన దాని వెనుక ఉన్న క్లిష్టతను అన్వేషించడానికి పూనుకొని ఉండాల్సింది. అదే జరిగి ఉండింటే దళిత సాహిత్యమే గాక, మొత్తంగా తెలుగు ప్రగతిశీల సాహిత్యశిబిరం శక్తివంతం అయి ఉండేది. సాహిత్యం సామాజిక తాత్వికతను గాఢంగా ప్రకటించుకొని ఉండేది.
కారంచేడు నుండిగాక యింకా వెనక్కి వెళ్ళి కంచికచర్ల, కాటూరు ఎలమర్రు కాలం నుండి దళితులపై జరిగిన దాడులను పరిశీలిస్తే, వాటికీ - వేంపెంట ఘటనకు అంతర్గత స్వభావరీత్యానే చాలా తేడా ఉన్నట్టు తెలుస్తుంది. తక్కిన వాటికంటే వేంపెంట మారణకాండకు దారితీసిన పరిస్థితులు చాలా సంక్లిష్టమైనవి. దళితుల ఆత్మగౌరవ ప్రకటనను, ప్రతిఘటనను మన సామాజిక వ్యవస్థలోని అనేకానేక క్లిష్టతలనుండి వేంపెంట వినిపించింది.
దళితులు ఆత్మగౌరవాన్ని ప్రకటించుకుంటే, తమ క్రియాశీల భాగస్వామ్యాన్ని ప్రతిష్టించుకుంటే, అది నిర్ణాయాత్మక రూపంలో (అది సర్వామోదం పొందే రూపం కానవసరం లేదు) కూడా ఉంటే సమాజం ఎట్లా ప్రతిస్పందిస్తుంది? అనేది చాలా ముఖ్యమైన విషయం. దళితులపై జరిగిన దాడులన్నీ ఈ ప్రతిస్పందన ఫలితాలే. వేంపెంట అయితే - ఆ నిర్ణయాత్మకత మాదిగల్లో (ఏ కొంచెమో) ఉంటే మాలలు ఎట్లా ప్రతిస్పందిస్తారు? అని నిర్ధిష్టంగానూ; ఏ కింది కులమైనా అలా వ్యవహరిస్తే మిగతా కులాలన్నీ ఎట్లా తీసుకుంటాయి? అనే సాధారణ స్థాయిలోనూ అనేక విషయాలను బైటికి లాగింది. అంటే వేంపెంటలో ‘భిన్న సమాజాల’ ప్రతిస్పందనను చూడవలసి వచ్చింది. యిది కులవ్యవస్థ సంక్లిష్టతకు అచ్చమైన ఉదాహరణ.
అప్పటికే న్యాయమైన అకాంక్షతో వచ్చిన మాదిగ దండోరా వల్ల మాదిగ, మాల సొంతదనం, ప్రత్యేకతలు, ప్రయోజనాల గురించిన సంఘర్షణ సామాజికంగా వైమనస్యానికి దారి తీసి ఉన్నప్పటికీ, ఈ ప్రభావం యించుమించుగా ఏమీ లేకుండానే వేంపెంటలో యింతకన్నా తీవ్రమైన కులవైరుధ్యాలు బైటికి వచ్చాయి. అక్కడి భూస్వామ్యానికి అదనపు లక్షణంగా ఉన్న ఫ్యాక్షనిజం తోడై సామాజిక వ్యవస్థ క్లిష్టతనంతా విషాదంగా మన అనుభవంలోకి వచ్చిన ఘటన అది. అయితే దీన్ని సామాజిక ఉద్యమాలు యిట్లా చూడగలిగాయా? అని సందేహం.
వాస్తవానికి వేంపెంట ఘటనలోని క్లిష్టతకు అక్కడి వర్గపోరాటం కారణం. అట్టడుగు శ్రేణులు వర్గపోరాటంలోకి రావడం వల్ల వాటి మధ్య ఉన్న వైరుధ్యాలను అది పట్టికుదిపింది. అప్పట్లో విప్లవకారుల అవగాహన, అచరణల గురించి చర్చ జరిగినంతగా (అదీ అవసరమే) ఈ అనుభవం నుండి దళిత ఉద్యమం స్వీకరించవలసింది ఏమైనా ఉన్నదా? అనే ఆలోచన సాగలేదు. ఘటన నేపథ్యం రీత్యా విప్లవకారులు అవగాహన గురించి విమర్శ చేయడం తప్పనిసరైనా, వేంపెంట నుండి వాళ్ళు ఏం నేర్చుకుంటారు? అనేదానితో పాటు ముఖ్యంగా దళిత రచయితలు - విడివిడి కులాల అస్తిత్వ చైతన్యంతో ఉన్నాసరే - వేంపెంట ఘటనను కనీసం జీవితానుభవపు లోతులనుండయిన అర్థం చేసుకునే ప్రయత్నం చేసి ఉంటే దళిత సాహిత్యధోరణి యివ్వాళ ఉన్న స్థితిలో అయితే ఉండేది కాదని చెప్పవచ్చు. విడి కులాల సాంస్కృతిక జీవిత చిత్రణతో పాటు కులచట్రంలోని వేర్వేరు పీడిత కులాల మధ్య ఉన్న వైరుధ్యాలను, ఐక్యతను దళిత సాహిత్యం చిత్రించి ఉండేది. ముఖ్యంగా ఆత్మగౌరవాన్ని ప్రకటించుకోవడం, కాపాడుకోవడం సంపద, అధికారం కేంద్రంగానే సాధ్యం అవుతుందని చెప్పి ఉండేది. వేర్వేరు అస్తిత్వ నిర్మాణాలుగా ఉన్న కుల వ్యవస్థలో ఒక కులం ఆ ప్రయత్నం చేయగానే మిగితా కుల ప్రజలు ఒక సమూహంగా, ఒక నిర్మాణంలోని సభ్యులుగా ప్రతిస్పందించే తీరును - దాన్ని ఐడింటిటీ నిర్దేశించే తీరును పట్టించుకొని ఉండేది. సంపద, అధికారం నిషిద్ధమైన కింది కులాల్లో - వాటి కేంద్రంగానే సహకారాన్ని పెంచడం అనే క్లిష్టమైన క్రమంలోకన్నా మానవ సంబంధాలను, ఉద్వేగాలను, స్వభావాలను గుర్తెరిగి, చిత్రించే సందర్భం సాహిత్యానికి ఏముంటుంది? కంటికి కనిపించే వాస్తవాలు, గుర్తించి పోల్చుకోదగిన అనుభవాలు సామాజిక విశ్లేషణ సాధనాలు కాగలవుకాని, అనుభవంలోకి వచ్చీ నిగ్గుదేలని వాటి సారం ఏమిటో చెప్పగలిగేది సాహిత్యం మాత్రమే. దళిత సాహిత్యానికి అనుభవాన్ని గాఢంగా, తీవ్రంగా చెప్పగల నేర్పు ఉన్నా, ఆ అనుభవాన్ని విశ్లేషణాత్మకంగా, సామాజిక తాత్విక కోణంలో చెప్పడంలో పరిమితి ఉన్నది. దీనివల్ల చాలా సంక్లిష్టమైన జీవిత ప్రతిఫలనంగా బద్దలయిన వేంపెంట ప్రభావానికి అప్పటికే విడికులాల అస్తిత్వ చైతన్యంలోకి వెళ్ళిపోయిన దళిత సాహిత్య ధోరణి గురికాలేకపోయింది. పైగా స్వీయ అస్తిత్వ అనుభవంలో అర్ధమైన, నిగ్గుదేలిన విషయాలను చిత్రించడంలో సౌకర్యం ఉంటుంది. అక్కడ వ్యక్తమయ్యే శక్తీ అపూర్వమైనదే. కానీ అనుభవంలో నిగ్గుదేలని వాటిని తరచి చూడాలంటే మేధోస్ధాయిలోకి కూడా తీసుకెళ్ళవలసి ఉంటుంది. మళ్ళీ పదే పదే వేంపెంట ఘటనలాంటి గీటురాళ్ళ మీద తరచి చూసుకొనే క్రమంలోనే సాహిత్యం రూపొందుతుంది, సామాజిక జీవితానుభవానికి తాత్వికస్పర్శ సమకూరుతుంది.
కానీ అప్పటికి స్వీయశక్తుల అస్తిత్వం అనే నిర్దిష్టతను దళిత సాహిత్యం ఉక్కు చట్రంగా భావించి స్వయం సంకెళ్ళలో ఉన్నది. దీనికి సమర్ధనగా సిద్ధాంత రూపకల్పన చేస్తూ ఉన్నది. వేంపెంట దీనికి భిన్నమైన అనుభవాన్ని తీసుకురావడం వల్ల దళిత రచయితలు సహజంగానే దాన్ని పట్టించుకోలేకపోయారు. పీడిత కులాల (పీడిత వర్గ) ఐక్యత అనే విప్లవకారుల వ్యూహం బెడిసికొట్టిందని అనుకున్నా; విడివిడి కులాల అస్థిత్వం వైపు నుండైనా సరే దళిత సాహిత్యం నేర్చుకోవలసింది వేంపెంటలో ఉన్నది.
మాదిగదండోరా దళిత సాహిత్యంలోకి తీసుకు వచ్చిన అపురూపమైన నిర్దిష్టతకు, వైవిధ్యానికి వేంపెంట అనేక సౌకర్యాలను సమకూర్చింది. పలు నిర్దిష్టతల మధ్య ఉండే వైరుధ్యాల స్వభావాన్ని చెప్పడమేగాక, పీడితకులాలన్నిటి మధ్య ఏర్పడాల్సిన పరస్పర సహకార సంబంధాన్ని, ఐక్యతను - సంపదలో, అధికారంలో సమాన భాగస్వామ్యం అనే ప్రాతిపదికలు మాత్రమే సాధ్యం చేయగలదని - ఆ ప్రాతిపదికనే ఐక్యత క్రమంలో అనేక సంఘర్షణలకూ కారణం అవుతాయని కూడా వేంపెంట ఘటన నిరూపించింది.
సామాజిక రంగంలోని ఈ సవాల్‌ను దళిత, ప్రగతిశీల శక్తులు పరిష్కరించడం - కారంచేడు, చుండూరు లాంటి ఘటనల నుండి దళితుల ఆత్మగౌరవం, ప్రతిఘటనలను తీర్చిదిద్దినంత సులువైన పని కాదు. అంత మాత్రాన నిరాశపడనవసరం లేదు కాని, దాన్ని సాధ్యం చేయడంలో సాహిత్యం పాత్ర గుర్తించవలసి ఉన్నది. కారంచేడు నుండి దళిత సాహిత్యం సృజనాత్మక ప్రక్రియల్లో విస్తరించడంతోపాటు, దానికి అవసరమైన సిద్ధాంతరూపకల్పన కూడా చేస్తూ వచ్చింది. దీనికి దళితులపై హత్యాకాండలతో పాటు అనేక రూపాల్లో కొనసాగుతున్న వెలి, వివక్ష, అణచివేత రూపాల వల్ల పోగుబడ్డ దళిత అనుభవం వనరుగా ఉపయోగపడింది. సామాజిక వ్యవస్థా నిర్మాణాలను సిద్ధాంత స్థాయిలో అర్ధం చేసుకొనే ప్రయత్నం దళితసాహిత్యానికి తనదైన గొంతును, చూపును అందించాయి. చారిత్రక ప్రాధాన్యంగానే కాక ఒక అనుభవంగా, గీటురాయిగా కారంచేడును వర్తమాన విస్తరణ రూపంగా స్వీకరించారు. వేంపెంటను దాని గుణాత్మకరూపంగా దళిత రచయితలు గుర్తించి ఉంటే పరిస్థితి మరోవిధంగా ఉండేది.
***
అయిదు మంది మాదిగలను నలుగురు బలహీన వర్గాల వారిని అగ్రవర్ణ భూస్వామ్య ముఠానాయకుల నాయకత్వంలో కొన్ని బి.సి. కులాల వాళ్ళు, మాల కులస్తులు హత్యచేసి, గృహదహనాలకు పాల్పడిన ఘటన అప్పటి దళిత బహుజన ఉద్యమ నిర్మాణాల్లో, పోరాటాల్లో, ఆకాంక్షల్లో ఒక ప్రధానాంశం కాలేకపోవడం ముఖ్యమైన సమస్య. అంటే కారంచేడు ఘటన దళిత ఉద్యమ నిర్మాణానికి, దళిత సాహిత్యధోరణికి కేంద్రంగా నిలబడితే వేంపెంట ఘటన జరిగేనాటికల్లా ఆ ఉద్యమాల్లో దానికి చోటు దొరకని స్థితి వచ్చింది. సానుభూతి, ప్రతిస్పందనలతో ఆగిపోకుండా దళిత ఉద్యమ అవగాహనను, పోరాటరూపాలను బలోపేతం చేసే అంశంగా వేంపెంట ఉండాల్సింది. దళిత ఉద్యమ దశలోని మౌలికమార్పును యిది సూచిస్తుంది. కారంచేడు నుండి బయల్దేరిన దళిత ఉద్యమం అనేక నిర్దిష్టతల్లోకి ప్రవహించడం ప్రజాస్వామిక పరిణామమే అయినా కుల వ్యవస్థలోని, భూస్వామ్యంలోని క్లిష్టతను సవాల్‌గా స్వీకరించలేని స్థితిలోకి వెళ్ళిపోవడం వాస్తవం. నిజానికి మాదిగదండోరా ఏ వాస్తవికతను చాటిచెప్పిందో అలాంటి వాస్తవికతనే భీభత్సంగా వెల్లడిచేసిన వేంపెంట దండోరా ఉద్యమానికి, సామాజిక విశ్లేషణకు కీలక సాధనం కావలసి ఉండింది.
సామాజిక ఉద్యమాలకు ప్రాధాన్యతలు, విస్మరణలు ఉండేవే అనుకున్నా దళిత సాహిత్యకారులు, విశ్లేషకులు జీవిత చిత్రణ పరిధిని విస్తరింపచేయడానికి వేంపెంట ఘటనను ఒక అధ్యయన వనరుగా, గీటురాయిగా పరిగణించి ఉండాల్సింది. నిజానికి అప్పటికే దళిత సాహిత్య ఉధృతి తగ్గిందనీ, విస్తృతి కావడం లేదనీ అభిప్రాయాలు మొదలయ్యాయి. వాటి నిజానిజాల సంగతి ఎలా ఉన్నా, వేంపెంట కేంద్రంగా దళిత బహుజన సాహిత్య సృజనను పరీక్షకు పెట్టి ఉంటే కుల నిర్మాణాల మధ్య వైరుధ్యాలతో పాటు అంతిమంగా మానవ సంబంధాల్లో గెలిచే అంశానికే పట్టం కట్టడం ఎలా అన్న ప్రశ్న దళితవాద సాహిత్యంలో భాగమై ఉండేది. కులవ్యవస్థలోని వివక్ష, అంతరం, అణచివేత రూపాలన్నిటినీ చిత్రిస్తూ వాటికి వ్యతిరేకంగా ఎక్కడికక్కడ సాగే పోరాటం వైరి స్ధానాలను తుడిచేసి సమస్త ఆధిపత్య నిర్మాణల్లోని అగ్రవర్ణతత్వాన్ని ఓడించడానికి సంఘటితపడే క్రమాన్ని చిత్రించగలిగేది. అలాంటి సన్నివేశం చరిత్రలో భాగమై దూరంగా వెళ్ళిపోయింది. ‘వేంపెంట సంఘటన’ అని వ్యవహార సౌకర్యం కోసం అనవచ్చుగాని వాస్తవానికి అదొక ఎరుక. యింకా బాగా చెప్పాలంటే ఎరుకక్రమం. ఇప్పుడు గడచిన చరిత్ర ఎలా ఉండేదో చెప్పడం వల్ల ప్రయోజనం ఉండకపోవచ్చు గాని, నిజంగానే అదొక ఎరుక క్రమంగా మనలో ప్రతిఫలించి ఉంటే దళిత సాహిత్యం ఎలా ఉండేది? అనే ఆసక్తినైతే తుడిచేసుకోనవసరం లేదుగదా.