ప్రఖ్యాత సాహిత్య విమర్శకులు వల్లంపాటి వెంకటసుబ్బయ్య 02 జనవరి 2007, సాయంత్రం మదనపల్లిలో కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ మరణించిన వెంకటసుబ్బయ్య తెలుగు సాహిత్యానికీ, సాహిత్య విమర్శకూ అందించిన సేవలు అసాధారణమైనవి. మదనపల్లి కళాశాలలో ఇంగ్లీషు అధ్యాపకులుగా పనిచేసి పదవీ విరమణ చేసిన వెంకట సుబ్బయ్య తెలుగులో కథారచన, సాహిత్య విమర్శ రంగాల్లో కృషి చేశారు. సాహిత్య విమర్శలో ఆయన వెలువరించి ‘వల్లంపాటి సాహిత్య వ్యాసాలు’, ‘కథాశిల్పం’, ‘నవలాశిల్పం’, ‘విమర్శా శిల్పం’, ‘రాయలసీమ సాహిత్యం’ గ్రంథాలు కొత్తచూపుకు, లోతయిన పరిశీలనకు నిదర్శనాలుగా నిలిచాయి. ఆయన ఇహెచ్‌కార్ రచించిన ‘చరిత్ర అంటే ఏమిటి?’తో పాటు ఎన్నో పుస్తకాలను తెలుగులోకి అనువదించారు. ఆయన మృతి పట్ల ప్రజాకళ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తోంది.