-శివసాగర్

నల్ల నల్ల సూరీడు
నల్లాటి సూరీడు
నలుపు నలుపు సూరీడు
గెలుపు దారి సూరీడు

అందాల సూరీడు
అందమైన సూరీడు
అందమైన సూరీడు
ఆకు సెప్పుల సూరీడు || నల్ల నల్ల ||

ఏరువాక సూరీడు
కారు మబ్బుల సూరీడు
సినుకు సినుకు సూరీడు
సిన్నారి సూరీడు || నల్ల నల్ల ||
జొన్నవెన్ను కన్నుల్లో
జోలపాడే సూరీడు || నల్ల నల్ల ||

ఉట్టి మీద సూరీడు
మట్టి కుండల్లో సూరీడు
ఎద్దు కూర సూరీడు
సద్దిబువ్వ సూరీడు
తాటాకు పాకలో
సిందు తొక్కే సూరీడు || నల్ల నల్ల ||

కొమ్ముకండె సూరీడు
కల్లుగీత సూరీడు
మాతంగి సూరీడు
గోసంగి సూరీడు

ఆలిచిప్ప అద్దంలో నవ్వుకునే సూరీడు
నత్తగుల్ల గజ్జె కట్టి నాట్యమాడె సూరీడు

అందాల సూరీడు
అందమైన సూరీడు
అందమైన సూరీడు
అంటరాని సూరీడు || నల్ల నల్ల ||

సజీవ దహనంలో బూడిదైన సూరీడు
బూడిద నుండి లేచి భగ్గుమన్న సూరీడు
కారంచేడు పొలాలలో నెత్తురొడ్డిన సూరీడు
నెత్తుటి తోవలోన నడక నేర్చే సూరీడు
తుంగభద్ర అలలపైన గోనిసంచిలో సూరీడు ||నల్ల నల్ల ||

సెమట సుక్క స్వర్ణమ్మతో
చెలిమి చేసే సూరీడు
చంద్రవంక ఏసన్నకు
మనసిచ్చిన సూరీడు || నల్ల నల్ల ||

ఆలీసమ్మ బాసల్లో నిప్పుకణిక సూరీడు
అనిల్ బాబు చూపుల్లో
చురుకు చురుకు సూరీడు
సిక్కోలు కొండల్లో సీమల బారు సూరీడు
గోదారి వరదలకు ఎదురీదే సూరీడు
తెగిపడ్డ శంభూకుని శిరస్సులాంటి సూరీడు
చూపుడు వేలుతో చూడసక్కని సూరీడు || నల్ల నల్ల ||

సందెకాడ సూరీడు
చందమామ సూరీడు
నీలిజెండ సూరీడు
నీలాల సూరీడు || నల్ల నల్ల ||

శూరుడమ్మ సూరీడు
సురకత్తుల సూరీడు
కన్నీళ్ళ సూరీడు
కాలజ్ఞాని సూరీడు || నల్ల నల్ల ||

దమ్మమే సద్దమ్మగా
పురివిప్పిన సూరీడు
శూరుడమ్మ సూరీడు
గెలుపు దారి సూరీడు || నల్ల నల్ల ||

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)