- ఎండ్లూరి సుధాకర్

నల్ల రంగే కదా
నిన్ను పేరంటాలకూ
పెళ్ళిళ్ళకూ రాకుండా చేసింది
నీ నల్లని పాదాలుచూసి
తెల్లకళ్ళు వాంతులు చేసుకునేవి
వాయినాలు నీలో దు:ఖ వాయులీనాలవుతుండేవి
నీకు గుర్తుందా అమ్మా!


మన ఎదురింటిమేడమీది అమ్మాయి సమర్తాడితే
నీ కూతురు పెద్దమనిషి అయినంతగా
పొంగిపొయ్యావు
గుండెను బంతిగా ఆకాశంలోకి ఎగరేశావు
వాడవాడలా నోటి దండోరా వేశావు
కనీసం ఎవరూ మన ఇంటి గడప తొక్కలేదు
అంతటా అసహ్యం మురిక కాల్వలా మొహాల్లో
ప్రవహించేది

బొట్టులేని నీ కాటుకరంగు నుదురు చూస్తే
కుంకుమ భరిణెలు నెత్తురు కక్కుకునేవి
నేను మరిచాననుకున్నావా
ఎవరైనా దయతలిచి పిలిస్తే
ఒక మూల బిక్కుబిక్కున నక్కినక్కి కూర్చుని
సిగ్గుతో అన్నం తిని
చెంబు చంకలో పెట్టుకొని
విస్తరాకు ఎత్తుకొని
భయం భయంగా అర్ధాకలితో వెళ్ళిపోయేదానివి
ఏ కొళాయి దగ్గరో బావి ద్గగ్గరో
నువ్వు దాహమై నిల్చినపుడు
నీ నల్లకుండలో వెలిగాలులు వీస్తున్నప్పుడు
ఎన్ని తిట్లు సూదులై
నీ గుండెల్లో కుట్లు వెయ్యలేదు?
బలిసిన అహంకారాలన్నీ
జింకతనం లాంటి నీ అమాయకత్వం మీద
చీకటి పులులై ఎన్నిసార్లు ఎగబడి పంజాలు
విసరలేదు?

నీకు కులం పేరే తప్ప
నీ సొంతపేరు పెద్దనోళ్ళకు తెలియదు కదా
ఆటల్లో నేను దెబ్బలు తిని వచ్చినప్పుడు
నువ్వు కన్నీటి కత్తివై
లోలోన తరుక్కుపోయేదానివి
ఎప్పుడూ ఒక నల్ల గొడుగు నీ నెత్తిమీద
నీలిదెయ్యమై వెంటాడుతుండేది
మన పండక్కి కర్జకాయలు చేసి
ప్రేమ పళ్ళెంలో పెట్టి వాళ్ళిళ్ళకి పంపిస్తే
అర్ధరాత్రి దొంగచాటుగా విసరేసిన నెత్తుటికందుల్లా
తెల్లారి చెత్తకుండీల్లో ప్రత్యక్షమయ్యేవి
నువ్వెంత కలవాలనుకున్నా
నీ నల్లమాటలకు మీగడలద్ది
అప్యాయంగా వరుసలు కలుపుకున్నా
కొన్ని చూపులు నిప్పుకోళ్ళై తప్పుకునేవి
మనం ఎప్పుడైనా మాంసం కూర వండుకుంటే
అది ఏ మాంసమో తెలుసుకునేందుకు
రకరకాల మీమాంసలు గుసగుసలాడుకునేవి
నీ ముట్టుబట్టలకు రహస్యంగా నిప్పుబెట్టి
నువ్వు కడుపునొప్పితో మెలికలు తిరుగుతుంటే
చూడాలని
దిష్టికళ్ళు ఎంత ఆబగా చూసేవి

నిన్ను అకారణంగానూ అన్యాయంగానూ
కొప్పుపట్టి లాగి కొడుతున్నప్పుడు
నీమీద ఆకూవక్కా నమిలి ఉమ్ముతున్నప్పుడు
ఆడ దుశ్శాసినులు నీ కోకలు చింపుతున్నప్పుడు
ఒక కొడవలి లాగో
ఒక కాళజుకలాగో మారకుండా
ఆడక్రీస్తులా
అలా బేలగా ఉండి పొయ్యేదానివి

నా బాల్యానికి భాషలేదు గానీ
నీ బాధ, నీలాంటి వాళ్ళ బాధ
మరో మహాభారతమై ఉండేది
పెండ పిసికి పిడకలు కొట్టి
రొట్టెలు కాల్చి రోకళ్ళు పట్టి
జీవితాంతం ఊడిగమైపోయి
జీడిగింజల్లా మారిన నీ నల్లవేళ్ళ సాక్షిగా
నేనిప్పుడు
కొత్త భారతానికి కొత్త తలనవుతున్నాను

నా తల మీద
నా మాతృదేశం మీద
నా తల్లి జెండా తలెత్తుకొని ఎగురుతుంది
ఇప్పుడే కాదు
ఎప్పటికీ
నా జెండా రంగూ
నా తల్లి రంగూ ఒక్కటే!

2 అభిప్రాయాలు

  1. Ravikiran Timmireddy 07 జనవరి 2007 , 7:28 pm

    సుధాకర గారూ, నల్లని నాలుగక్షరాలలో ఎన్ని కన్నీళ్ళనీ, ఎంత నిస్సహాయతనీ, ఎన్ని అవమానాల్ని, ఎంత క్షోభని, కరుడుకట్టిన ఎంత అసహ్యపు సమాజాన్ని చూపించారండీ. అందరం భరతమాత బిడ్డలే, కానీ కొదరు మాత్రం కులం గబ్బుని మనసులో నింపుకోని, మిగిలిన మెజారిటీ బిడ్డల్ని, సాంఘీకంగా, ఆర్దికంగా, మానసికంగా చెరిపి చెరపట్టే సమాజాన్ని గురించి చాలా బాగా చెప్పేరండీ. కళ్ళ ముందు అమ్మని, అమ్మ కళ్ళలో నీళ్ళనీ, “కులందేవుందండీ” అనే అగ్ర కులపు మాటల గారడిని, అతి సహజంగా ఆవిష్కరంచారు.

    రవికిరణ్ తిమ్మిరెడ్డి

  2. సాహిత్యం గురించి మంచి కవితలు సెలక్ట్ చేశారు.ఆభినందనలు
    http://vrdarla.blogspot.com

    http://dalitatatwikudu.blogspot.com/

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)