- కత్తి పద్మారావు

నేను నల్లనిదానను
నా చెమట చినుకులతో
భూమిప్రియుడు పులకిస్తున్నాడు
నాగేటిచాళ్లలో నేను చల్లిన విత్తులు
నా పాదాల ఎరుపుతో మొలకెత్తుతున్నాయి

చిగురాకుల వంటి నా వ్రేళ్ళు
భాగ్యనగర్ నిర్మాణంలో రాళ్ళయ్యాయి
నా స్తన్యం గ్రోలిన బిడ్డడే
నన్ను చెంగుపట్టుకున్నపుడు
ఈ దేశం గుండెల్లో దాగున్న రాచపుండు
నా కర్థమయింది

బ్రహ్మజెముడు చెట్టు కూడా
తన్ను తాను రక్షించుకోవటానికి
ముళ్ళకిరీటం ధరించింది
నా రక్షణ వలయం నన్నే భక్షిస్తుంది

కాకి సామ్రాజ్యాధినేత అయిన నాడు
కోకిల కూడా కాకినే అంటుంది
మనకి వర్ణభేదం లేదు స్వరభేదమేనంటుంది
పంచమస్వరం కూడా రసతరంగిణి అయినపుడు
చతు:స్వరాలన్నీ పంచమంలోనే పలుకుతున్నాయి

కానీ నాస్వరాన్ని నేను గుర్తించగలను
ఈ భూమి సాక్షిగా నేను నల్లని దానను
భూమి కూడా నా నెత్తురు సాక్షిగా నల్లనిది
నేను నల్లనిదానను
నా స్వరం ఆదిమం

అన్ని వర్ణాలూ నలుపులోకి ప్రవహిస్తున్న ఈనాడు
మాతృత్వం నాదని గర్విస్తున్నాను

నేను ప్రాకృతికం
నన్నీసడించుకున్న కృతకాలన్నీ
నాలో సంలీన మౌతున్నాయి
నెహ్రో కోటు ఎర్రగులాబీ రాలిపోతుంది
మా ఊరి మాదిగకుంటలోని
నల్లకలువకే పట్టాభిషేకం

గోదావరి ఒడ్డున
చింతచెట్టు కొమ్మకు
మా అమ్మ నన్ను ఏలాడగట్టి
మట్టి మోస్తున్నపుడు
నా ఏడుపు విని వచ్చిన
కాకుల కేకలే
నా సంగీత పాఠాలు

నాగార్జున సాగర్
డామ్ నిర్మాణంలో
గోడకూలి
మా అయ్య చచ్చినపుడు
నాకు ధైర్యమిచ్చిన
కొండలే
నా నిబ్బరానికి గురువులు

పుల్లల కోసం
అడవి కెళ్ళిన మాయమ్మ
ముళ్ళపొదల్లో
ఇరుక్కున్నపుడు
కారిన నెత్తురే
నా కనుల్లో వున్న
వర్ణం

తూర్పు గోదావరి
కోతల కెళ్ళిన
మామ్మ
నేను స్టేషన్ లో పెట్టిదించి
తమ్ముణ్ణి వదిలి
తిరిగి వచ్చేసరికి
రైలు పట్టాల మీద
తెగిపడటం
చూసిన
కళ్ళలో స్రవించిన
దు:ఖాగ్రహమే
నా రసశాస్త్రం

ట్రంకు రోడ్డుమీద
తారుపోసినపుడు
కాలిన తారులో
కాలు పెట్టిన నన్ను
చెప్పులు లేకుండ
లేవ నెత్తిన
నాతల్లి కే
నాగుండె నాదం

సముద్రంలో
వేట కెళ్ళిన
మా అన్న
తుఫాన్ లో
ఇరుక్కున్నాడని
విని
ఒడ్డున వెతుక్కుంటూ
పోయినపుడు
భీమిలి
ఒడ్డున కనబడిన
దృశ్యమే
నాకళ్ళలో
వున్న శిల్పం

నల్లకాకి
నల్ల కొండ
నల్ల తారు
నల్ల సముద్రం
నా సంకేతాలు
నల్లరాజ్యం వైపు నా ప్రయాణం.

( నల్లకలువ పుస్తకం నుండి )

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)