-గుర్రం జాషువా

ముప్పు ఘటించి వీని గలిమిన్ గబళించి దేహమున్
బిప్పి యొనర్చు నీ భరత వీరుని పాదము కందుకుండగా
జెప్పులు గుట్టి జీవనము సేయును గాని నిరాకరింప లే
దెప్పుడు నప్పు వడ్డది సుమీ భరతావని వీని సేవకున్

వాని ఱెక్కల కష్టంబు లేనినాఁడు
సస్యరమ పండి పులకింప సంశయించు
వాడు చెమ్మటలోడ్చి ప్రపంచమునకు
భోజనము బెట్టు వానికి భుక్తి లేదు

వాని తలఁ మీద బులిమిన పంకిలమును
గడిగి కరుణింపలేదయ్యె గగనగంగ
వాని నైవేద్యమున నంటు వడిన నాడు
మూఁడు మూర్తులకును గూడఁ గూడు లేదు

పామునకుఁ పాలు, చీమకుఁ బంచదార
మేపుకొనుచున్న కర్మభూమిఁ జనించు
ప్రాక్తనం బైన ధర్మదేవతకుఁ గూడ
నులికిపడు జబ్బు గలదు వీఁడున్న చోట

వాని నుద్ధరించు భగవంతుఁడే లేఁడు
మనుజుఁడెట్లు వాని గనికరించు
వాడు జేసికొన్న పాపకారణమేమొ
యింత వఱకు వాని కెఱుకలేదు

ఆ యభాగ్యుని రక్తంబు నాహరించి
యినుపగజ్జెల తల్లి జీవనము సేయు
గసరి బుసకొట్టు నాతని గాలిసోక
నాల్గు పడగల హైందవ నాగరాజు

* * *

(గబ్బిలం లోంచి)

గమనిక: గబ్బిలం దీర్ఘకవితను పి.డి.ఎఫ్ ( PDF format ) లో చదవండి. PDF

2 అభిప్రాయాలు

  1. kondaveeti satyavati 03 జనవరి 2007 , 12:59 pm

    దళిత సాహిత్య ప్రత్యేక సంచిక గా వచ్చిన ప్రజాకళ ఇప్పుడే చూసాను.గుర్రం జాషువా గబ్బిలం నాకు చాలా నచ్చిన కవిత.చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ కవిత చదివాను.మిగిలిన రచనలను ఇంకా చదవలేదు.చదివిన తర్వాత మళ్ళీ నా అబిప్రాయం రాస్తాను.

    కొండవీటి సత్యవతి

  2. Girija Manohara Sarma Pingali 14 జనవరి 2007 , 6:13 pm

    ఝాషువా గారి కవిత్వము చాలా ఇష్టము. గబ్బిలము కొన్ని పద్యాలు మాత్రము చదివాను. మీ ద్వారా మొత్తం చదివాను. చాలా ఆనందంగా ఉంది.

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)