- చెరబండరాజు

ఏ కులమబ్బీ
మాదే మతమబ్బీ ॥ ఏ కుల ॥

మట్టి పిసికి ఇటుక చేసి
ఇల్లు కట్టి పెట్టినపుడు ॥ ఇల్లు ॥
డొక్కలెండి కోండ్రలేసి
ధాన్యరాసు లెత్తినపుడు ॥ ఏ కుల ॥

పొగ గొట్టాలై పేగులు
కొలిమి సెగలు చిమ్మినపుడు ॥ కొ ॥
దగ్గులతో క్షీణిస్తూ
బొగ్గుట్టలు తవ్వినపుడు ॥ ఏ కుల ॥

మాడు చెక్కలే తింటూ
మాగాణం దున్నినపుడు ॥ మా ॥
ఎండలలో బండలపై
విగ్రహాలు చెక్కినపుడు ॥ ఏ కుల ॥

పూజకు అందిచ్చు పూల
బుట్టలల్లి ఇచ్చినపుడు ॥ బుట్ట ॥
రామకోటి రాసుకునే
కాగితాలు చేసినపుడు ॥ ఏ కుల ॥

పశువులను చంపి మీకు
చెప్పులు కుట్టిచ్చినపుడు ॥ చె ॥
కూటికింత కూడు లేక
కుండలు జేసిచ్చినపుడు ॥ ఏ కుల ॥

సన్యాసులై వస్తే
క్షవరాలు చేసినపుడు ॥ క్ష ॥
మురికి గుడ్డలుతికి
మల్లె పూలు చేసి ఇచ్చినపుడు ॥ ఏ కుల ॥

చెల్లవు మీ కల్లబొల్లి
కబుర్లన్ని చెదలు పట్టె ॥ క ॥
సాగదు మీ పాత రోత
రథం విరిగిపోయింది ॥ ఏ కుల ॥

కులాలనీ కులంలోని
శాఖలనీ వేరుజేస్తె ॥ శా ॥
చెమటోడ్చే మనుషులమూ
చేయి కలిపి నిలబడితే ॥ ఏ కుల ॥

5 అభిప్రాయాలు

  1. ప్రసాద్ 03 జనవరి 2007 , 3:10 pm

    చాలా బాగుంది.

    –ఫ్రసాద్
    http://blog.charasala.com

  2. Rohiniprasad 05 జనవరి 2007 , 7:30 pm

    శ్రీశ్రీ తరవాత వచ్చిన కవుల్లో చెరబండరాజు నిస్సందేహంగా అందరికన్నా గొప్ప కవి. అంత గొప్ప భావాలని అంత తక్కువ పదాల్లో మరెవరూ రాయలేరు.

  3. Karunakar 09 జనవరి 2007 , 4:29 am

    కులాలు లేవంటు, మతాలు వద్దంటూ సాగిన ఇంత మంచి కవిత ప్రచురించ బడిన తర్వాత ఇదే పత్రిక లో దళిత సాహిత్యం, దుదేకుల సాహిత్యం అంటూ ప్రత్యేక శీర్షికలు రావని ఆశిస్తున్నాను.

    కరుణాకర్ కొన్నె
    –**–

  4. B.Ajay Prasad 16 జనవరి 2007 , 2:07 am

    చెరబండరాజు కవిత ప్రచురించినందుకు ధన్యవాదాలు. మనము ఎప్పుడూ గుర్తుచేసుకోవలసిన కవి ఆయన.

  5. ravindra aitham 16 జనవరి 2007 , 11:11 am

    కులాలు మతాలు భారతీయ సమాజంలో విడదీయలేనటువంటివి, వివక్ష లేనంత వరకు ఇబ్బంది లేదు, బాధితులు తమ భావాలు తెలుపటంలో తప్పులేదు, కరుణాకర్ గారు- గమనించగలరు, చెరబండరాజు గారు, చాలా గొప్పగా తెలిపినారు మన సమాజంలోని వివక్ష గురించి.

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)