- ఎన్. వేణుగోపాల్

నాలుగువేల కోట్ల రూపాయలు సునాయాసంగా స్వాహా చేసేవాళ్ళూ, నాలుగణాల కోసం తమ ఆత్మాభిమానాన్ని పణంగా పెట్టక తప్పనివాళ్ళూ సహజీవనం చేస్తున్న సమాజం మనది. అత్యాధునిక కంప్యూటర్లు జీవిత కోణాలన్నిటినీ స్పృశిస్తున్న చోటనే, రక్త పారిశుధ్యం గురించి వేల ఏళ్ళ కిందటి ఆదిమ భావజాలం కొనసాగుతున్న వ్యవస్థ మనది. వీసమెత్తు శ్రమ కూడా చేయని పిడికెడు మంది ఈ సంపన్న దేశాన్ని సొంత ఆస్తిగా భావిస్తున్న సమయంలోనే, ఈ సమాజ చక్రాల్ని తిప్పుతున్న కోట్లాదిమంది ఈ దేశానికి తమను తాము పరాయిగా భావించుకోవలసి వస్తున్న దుస్థితి మనది.

ఈ వైవిధ్యం, భిన్నత్వం, భయంకరమైన అంతరం అన్నిటికన్న ఎక్కువగా సాహిత్యంలో ప్రతిఫలించడం సహజమే. అందులోనూ ఈ అగాధం వల్ల దారిద్య్రానికీ, ఆత్మాభిమానం కోల్పోవడానికీ, అణచివేతకూ, వెలికీ గురయిన వాళ్ళు తమ స్థితిని ఏదో ఒక రూపంలో వ్యక్తీకరించడం సహజమే. ఇటువంటి సహజమైన విస్ఫోటనమే దళిత సాహిత్యం. 1950 చివరి రోజుల నుంచీ దళిత సాహిత్యం అనే మాట ప్రాచుర్యంలోకి వచ్చింది. అస్పృశ్యులుగా, సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక అసమానతకు బలి అయినవాళ్ళుగా దళితులు తమ విముక్తి కోసం ప్రకటించే తిరుగుబాటు, ఖండన దళిత సాహిత్యంగా గుర్తించబడుతోంది. దళిత సాహిత్యానికి మూలం బుద్ధుని రచనల్లోనో, చొఖమేల రచనల్లోనో, జ్యోతిబాపులె రచనల్లోనో, ప్రొఫెసర్ ఎస్ ఎం మాటె రచనల్లోనో వెతికే ప్రయత్నం జరిగింది గాని, దళిత ప్రారంభకుడు డాక్టర్ అంబేద్కర్ అని అర్జున్‌దాంగ్లె అంటాడు.

అర్జున్ దాంగ్లె సంపాదకత్వంలో వెలువడిన మూడు మరాఠీ దళిత సాహిత్య సంకలనాలు (నో ఎంట్రీ ఫర్ ద న్యూ సన్ - కవిత్వం, హోమ్‌లెస్ ఇన్ మై లాండ్ - కథ, ఎ కార్ప్స్ ఇన్ ద వెల్ - ఆత్మకథ) దళిత సాహిత్యపు విస్తృతినీ, భారత సామాజిక దౌష్ట్యాన్నీ, కులవ్యవస్థ కింద దళితులు అనుభవించవలసి వస్తున్న దుర్భరత్వాన్నీ స్పష్టంగా చూపుతాయి.

“డాక్టర్ అంబేద్కర్ విప్లవ భావాలు మహారాష్ట్ర దళితులను మేల్కొలిపాయి. వారిలో ఒక నూతన ఆత్మగౌరవాన్ని రేకెత్తించాయి. దళిత సాహిత్యమనేది ఈ చైతన్యానికి సాహిత్య వ్యక్తీకరణే'’ అని అర్జున్ దాంగ్లె ఈ సంకలనాల ముందు మాటలో రాశాడు. 1972లో దళిత పాంథర్లు తమ రాజకీయ కార్యాచరణ ప్రారంభించడంతో దళిత సాహిత్యపు విస్తృతి వెలుగులోకి వచ్చింది. దళిత పాంథర్ ఉద్యమ నాయకులందరూ సృజనాత్మక రచయితలే. 1970లలో మరాఠీ సాహిత్యంలో దళిత రచయితలు తమ అనుభవాలను బలమైన భాషలో వ్యక్తీకరించడం ఒక వెల్లువలా సాగింది. దళిత సాహిత్యం గురించీ, దాని పాత్ర గురించీ నిర్వచనాలు వెలువడ్డాయి. ఇరవై సంవత్సరాలకు పైగా గడిచిపోయిం తర్వాత ఆ సంచలనాన్నీ, దాని పరిణామాల్నీ సింహావలోకనం చేస్తూ, “దళిత సాహిత్యం కేవలం సాహిత్యం కాదు. ఇవాళ చాలామంది దళిత రచయితలు దళిత సాహిత్య మూలాల్ని మరచిపోయి వుండవచ్చుగాని, దళిత సాహిత్యం మార్పుకోసం సాగే ఉద్యమంతో కలగలిసి వుండింది. ఈ ఆవిర్భావ అవగాహనతోనే ఈ సంకలనంలో కవిత్వాన్ని ఎంపికచేశాను'’ అని అర్జున్ దాంగ్లె అంటాడు. అట్లాగే కథల ఎంపికలో దళిత సాహిత్యపు ‘భిన్నత్వాన్ని’ బలంగా చూపే కథల్ని ఎంచుకున్నాననీ, మరాఠీ సాహిత్యపు ప్రధాన స్రవంతికీ దళిత సాహిత్యానికీ మధ్య అగాధమైన అంతరం వున్నదనీ, దళిత కథల భాష, అనుభవాలు, నాయకులు పూర్తిగా భిన్నమైన వాళ్ళనీ ఆయన అంటాడు. ఇక వేరు వేరు కాలాలకూ, వేరు వేరు సామాజిక స్థాయిలకూ చెందిన దళిత ఆత్మకథలు దళిత ఉద్యమంలోని వేరు వేరు కోణాల్ని చూపుతాయి. మనుగడ కోసం పెనుగులాట, దళితుల జీవన ఉద్వేగాల ప్రపంచం, స్త్రీ పురుష సంబంధాలు, గ్రామీణ జీవిత రథచక్రాల కింద నలిగిపోయిన అస్తిత్వం, అవమానాలనూ, అత్యాచారాలనూ అనుభవించే జీవితం, కొన్నిసార్లు పూర్తి లొంగుబాటునూ, కొన్ని సార్లు తిరుగుబాటునూ వ్యక్తం చేసే జీవితం - ఇదీ దళిత ఆత్మకథలు చూపే దృశ్యాలు.

మూడు సంకలనాలనూ ఏకబిగిన చదివినప్పుడు వేరు వేరు ప్రక్రియలలో ఒకే చేదుపాట వింటున్నట్టనిపిస్తుంది. జీవఫలం చేదు విషంగా తరతరాలుగా మనుగడ సాగిస్తున్న అసంఖ్యాక భూమి పుత్రులు తమ విస్సహాయ ఆక్రోశాన్ని ప్రకటించడం వినిపిస్తుంది. ఆ ఆక్రోశం క్రమక్రమంగా ఆందోళనగా మరి, ‘ఈ దేశం మాది కాదు’ అని తిరుగుబాటు స్వరంగా ఎదగడం కనిపిస్తుంది. కవితా సంకలనం తన శక్తివంతమైన వ్యక్తీకరణలతో ఆశ్చర్యపరిస్తే, ఆ ఆశ్చర్యం కథా సంకలనంలో, చివరికి ఆత్మకథా సంకలనంలో ఇంకా ఇంకా పెరిగిపోతుంది. సామాజిక జీవనపు అగాథ తలాల నుంచి అపారశక్తితో ఎగసివస్తున్న నినాదాలు, సకల సంపదలకూ సృష్టికర్తలు అక్షర సృష్టిలోనూ ప్రవేశించి పండిస్తున్న అపురూప సంపదలు ఈ సంకలనాలు. దళితుల జీవితంలోని దుర్భరత్వం పట్ల స్వానుభవం లేని దళితేతరు లెవరయినా ఈ సంకలనాలలోని ఏ ఒక్కటి చదివినా, ముఖ్యంగా ఆత్మకథా సంకలనం చదివితే, తమ అల్పత్వం పట్ల “తమ'’ సమాజంలో కొనసాగుతున్న దుర్మార్గం పట్ల కొత్త చూపు వస్తుంది.

“అమ్మా, నువు చెపుతుండేదానవి
నేను పుట్టినప్పుడు
నీకు నొప్పులు చాలసేపు వచ్చాయని
అమ్మా, నీ సుదీర్ఘ ప్రసవవేదనకు
కారణం చెప్పనా?
నీ గర్భం లోపల నేను సందేహిస్తూ ఉండినాను
నేను పుట్టదలిచానా?
అసలీ దేశంలో
నేను పుట్టదలిచానా?
ఇక్కడ అన్ని దారులూ దిగంతం వేపు పరుగులు తీస్తాయి
నాకెందులోనూ ప్రవేశం లేదు…

అమ్మా, ఇది మీ దేశం
నదులు ఒడ్లొరసి ప్రవహిస్తాయి
చెరువులు నిండిపోతాయి
కాని మానవ జాతికే చెందిన నువ్వు మాత్రం
దోసెడు నీళ్ళ కోసం
రక్తం చిందించాలి
పోట్లాడాలి కలబడాలి
ఈ మహాసంస్కృతి మీద నేను ఉమ్మేస్తున్నాను
ఇక్కడ పుట్టినంత మాత్రాన
ఈ నేల నీదవుతుందా అమ్మా?
నీ కడుపున పుట్టినంత మాత్రాన
ఈ నేల నాదవుతుందా?
ఈ మహాభూమి నాదని చెప్పుకోనా?
ప్రేమించనా
ఘనత కీర్తించనా?
అమ్మా, క్షమించు
నిజం చెప్పాలంటే
పుట్టాలా అని
ఈ దేశంలో పుట్టాలా అని
సంకోచించాను నేను'’
అంటాడు ఎల్. ఎస్. రొకౌడె.

పాట అనే కవితలో భీమ్‌సేన్ దెతె ఒక హృదయ విదారక దృశ్యం కళ్ళకు కడతాడు. తన తండ్రి రాళ్ళు, మోస్తున్నాడట. మీసాలు మెలిపెట్టుకుంటూ మేస్త్రీ ఆ తండ్రిని పాటలు పాడమని అడిగాడట. పాటగాడి పేరు కిస్న. ప్రేమగీతాలు పాడడంలో అనితర సాధ్యమైన ప్రతిభ గలవాడే. అతని పాటల్లో చంద్రోదయాలుండేవి, సూర్యకాంతి వుండేది. పూలు వికసిస్తుండేవి. సముద్ర కెరటాలు హోరెత్తేవి, ప్రేమ మధువులో మత్తెక్కిన ఉద్వేగభరిత ప్రేయసి వుండేది.. ఆ పాట విని చెమటతో తడిసిన చేతులు చప్పట్లు కొట్టేవి. అన్ని వేపుల నుంచీ ప్రశంసలు వచ్చేవి. తండ్రి కదిలిపోయేవాడు. అతని మనసంతా కృతజ్ఞత నిండిపోయేది. ఇంటికి తిరిగి వస్తూ అతను పట్టెడన్నపు పాట కోసం వెతుకుతుండేవాడు. అతడెన్నడూ పాడలేని పాట పట్టెడన్నపు పాట!

కంచికచెర్ల నుంచి చుండూరు దాకా దళితుల మీద సాగిన ఎన్నో మారణకాండల ప్రతిధ్వని అశోక్ చక్రవర్తి ‘పంట’లో వినబడుతుంది.
“నరబలుల పంట ఇక్కడ అనంతంగా సాగుతుంది
గాలిని బట్టి రుతువులు మారుతాయంటే
తూర్పు నుంచి పడమటికి, ఉత్తరం నుంచి దక్షిణానికి
పంట ఎప్పుడూ ఆగదు, ఏడాది పొడుగునా
రాబందుల కోసం.'’

“ఈ దేశం వెయ్యి ముక్కలయిపోయింది
ఈ దేశపు పట్నాలు, మతం, కులాలు
జనాలు, చివరికి మనసులు
అన్నీ ముక్కలయిపోయాయి, విడిపోయాయి
ఈ దేశంలో, ప్రతి దినమూ మండిపోతుంది
మా జీవితాల ప్రతిక్షణాన్నీ తగులబెడుతుంది
మేం అంగీకరించని
ఈ మా జీవితంలో
మేం అవన్నీ సహిస్తాం, కొండలలా దృఢంగా నిలుస్తాం
మా ఆక్రోశాలన్నీ కేవలం
ఈ దేశపు
ఈ నగ్న దేశపు చరిత్ర రాసేందుకు చేసే ప్రయత్నాలే
ఈ దేశపు మతానికి హృదయం లేదు
ఇక్కడి జనం తమ వల్ల చట్టాలు చూసుకుని మురిసిపోతారు
మేం అసలు పుట్టనే లేదని ప్రకటిస్తారు
తమ్ముడూ, పద మరో దేశానికి వెళిపోదాం
ఎక్కడయితే బతికి వున్నప్పుడు
నీ తలమీద ఓ కప్పు వుంటుందో అక్కడికి
ఎక్కడయితే చనిపోయినప్పుడు
నీదంటూ ఒక శ్మశానం వుంటుందో అక్కడికి'’
అంటాడు బాపూరావు జగ్‌తాప్.

ఇంతకూ దళిత కవిత్వం అడిగేదేమిటి? శరణ్‌కుమార్ లింబాలె మాటల్లో చెప్పాలంటే వాళ్ళు మీ ఆకాశంలోంచి సూర్యుణ్ణీ అడగడం లేదు, చంద్రుణ్ణీ అడగడం లేదు. మీ భూమి కాదు, మీ పొలం కాదు, మీ భవంతులు కాదు, మీ మేడలు కాదు, భగవంతుళ్ళూ వద్దు, పూజా పునస్కారాలూ వద్దు, కులాలూ వద్దు, తెగలూ వద్దు. మీ తల్లో, అక్కచెల్లెళ్ళో, కూతుళ్ళో కూడ వద్దు. దళితుడికి కావలసిందల్లా ఒక మనిషిగా అతని హక్కులు. “నాకు నా హక్కులు కావాలి. నాకు నా హక్కులివ్వండి'’. ఈ దందహ్యమాన స్థితిని నిరాకరిస్తారా? అతను పవిత్ర గ్రంథాన్ని రైలు పట్టాల్లాగ పీకేస్తాడు. మీ అన్యాయ న్యాయచట్టాల్ని సిటీ బస్సులాగ తగులబెడతాడు. అతని హక్కులు సూర్యబింబంలాగ ఉదయిస్తున్నాయి. సూర్యోదయాన్ని ఆపగలరా? అని ప్రశ్నిస్తాడు లింబాలె.

కనీస మానవహక్కుల కోసం సమాజంలోని ఒక ముఖ్యమైన భాగం ఇంతగా పోరాడ వలసి వస్తున్న స్థితిని ఈ కవిత్వం కన్న శక్తివంతంగా చూపుతాయి కథలు. కుక్కలతో, భూస్వాముల పశువులతో సమానంగా, వాటికన్న హీనంగా పంటల కాలంలో బిచ్చమెత్తి రొట్టెలు సంపాదించుకుంటే, అవి విషపు రొట్టెలు, మహర్‌ల శ్రమ భూస్వాములకు ధనరాశులు సమకూర్చి పెడుతోంది గాని వాళ్ళ నోటికి మాత్రం విషపు రొట్టెలందిస్తోంది. “మన కులం ఏటేటా బిచ్చంగా సంపాదించుకునే ఈ రొట్టెలు ఇక వద్దు. వీలయినంత చదువుకో. మహర్‌ల నోటి ముందునుంచి ఈ శాపపు తిండిని లాగేసెయ్యి. ఈ విషపు రొట్టె మనిషిలోని మానవత్వాన్నే చంపేస్తుంది'’ అంటాడు బంధుమాధవ్ కథ ‘ద పాయిజన్‌డ్ బ్రెడ్’లో యెటల్య.

ఆకలి బాధతో విలవిలలాడే దళితులకు ఎక్కడో ఒక ఆవు శవం పడి వుందని తెలిస్తే ఎంత సంచలనం రేగుతుందో, కాకులతో, గద్దలతో, రాబందులతో, కుక్కలతో, నక్కలతో పోట్లాడి ఒకటి రెండు పూటల తిండిని సమకూర్చుకోవడానికి వాళ్ళు పడే ఇక్కట్లెట్లాంటివో ఒక పసివాడి కళ్ళలోంచి చూపుతాడు అమితాబ్.

చదువు ఆత్మగౌరవం సాధించడానికి ఒక మార్గంగా కనబడే చోట, అనుక్షణం ఆత్మగౌరవం అవమానపడే చోట చదువుకు చాల విలువ వుండటం సహజమే. కాని కొనసాగుతున్న విలువల్లో ఆ చదువు దళితులకు ఎంత కష్టసాధ్యమవుతుందో, వాళ్ళ దారిలో ఎన్ని అడ్డంకులున్నాయో కేశవ్ మెశ్రామ్ కథ వివరిస్తుంది.

ఈ సంకలనంలో వస్తువు రీత్యానూ, శిల్పం రీత్యానూ కూడ పాఠకుల మనసులో తీవ్రమైన సంచలనం రేపే కథ అన్నాభావు సాఠె రాసిన ‘గోల్డ్ ఫ్రమ్ ద గ్రేప్’. శక్తి సామర్థ్యాలున్నప్పటికీ చెయ్యడానికి పని దొరకని దళితుడు ఏం చేస్తాడు? సవర్ణ హిందువుల శవాలు తగులబెట్టినప్పుడు, ఖననం చేసినప్పుడు, ఆ శవాల నోటిలో ఎంతోకొంత బంగారం వుంచుతారు. చితుల్లో నుంచి సమాధుల్లో నుంచి ఆ బంగారాన్ని వెతికి తీసుకుని, అమ్మకోవడం జీవికగా చేసుకున్నాడు భీమా. ఒక సమాధిలో నుంచి మృతదేహాన్ని తీసి, దవడలు విడదీసి, నోట్లో వేళ్ళు పెట్టింతర్వాత దవడలు మూసుకుపోయాయి. మరోవైపు నక్కలూ తోడేళ్ళూ మీద పడ్డాయి. ఇంకోవైపు నుంచి గ్రామస్తులు పరుగెత్తుకొచ్చారు. వేళ్ళు విరగ్గొట్టుకుని తప్పించుకుని వెళ్ళిపోయాడు. ఇంత దుర్భరమైన జీవితం గడపక తప్పనివాళ్ళు ‘ఈ నేల మాది కాదు’ అనుకున్నారంటే అందులో అసహజమేమీ లేదు.

కాని ఇవన్నీ కథలు గదా, నిజాలు ఇంత దుర్భరంగా లేవు అని ఎవరయినా వాదించదలచితే వాళ్ళకు దళితుల జీవితాల నమూనాలు చూపుతుంది మూడో సంకలనం. ఈ సంకలనం చదవడం నిజంగా ఒక భయంకరమైన అనుభవం. ఇరవయ్యో శతాబ్దంలో కొన్ని జీవితాలు ఇంత దారుణంగా గడిచాయని, గడిచే అవకాశం వుందని ఊహించడం కూడా సాధ్యం కాదు. కాని నిజానికి ఇవన్నీ ఆ అనుభవాలలో నుంచి పైకి, మధ్యతరగతిలోకి, ఎదిగి వచ్చిన వాళ్ళు రాసిన ఆత్మకథలలోని శకలాలు. అసలు పూర్తి ఆత్మకథలు ఇంకెన్ని భయానక దృశ్యాల్ని చూపుతాయో?! ఆ ఆత్మకథా రచయితల లాగ రాయడానికీ చెప్పుకోడానికీ అవకాశాలు లేని ఇంకెన్ని కోట్లాది జీవితాలు ఇంతకన్న దుస్సహంగా గడిచాయో, గడుస్తున్నాయో! ఏడుగురు రచయితల ఆత్మకథల లోంచి తొమ్మిది భాగాల్ని ప్రకటించిన ఈ సంకలనం గురించి వివరించాలంటే దాదాపు ప్రతి అక్షరాన్నీ వివరించాల్సిందే. ఆధునిక భారత సమాజంలో కొనసాగుతున్న అమానుషత్వానికి ఎత్తిపట్టిన అద్దం ఈ సంకలనం. ఇటువంటి భూమి ఇంకెక్కడా లేదని ఘనకీర్తి చాటుకునే వాళ్ళు ఒక్కసారి ఈ అద్దంలో భారతదేశపు ముఖం చూసుకుంటే నిజంగానే ఇటువంటి భూమి ఇంకెక్కడా వుండే అవకాశం లేదనిపిస్తుంది!

ఈ మూడు సంకలనాలు చదివిన తర్వాత, వీటి అద్భుతత్వాన్ని గుర్తిస్తూనే ఒక మినహాయింపు కూడా చెప్పవలసి వుంది. కవిత్వం రూపంలోనయినా, కథ రూపంలోనయినా, ఆత్మకథ రూపంలోనయినా వెలువడిన ఈ అనుభవాలన్నీ చాలా విలువయినవి. భారత సామాజిక చరిత్రలో ఈ వ్యక్తికరణలకు గణనీయమైన స్థానం వుంటుంది. కాని ఇవి విశ్లేషణగా ఎదగకపోతే, సామాజిక చరిత్రకు చోదక శక్తిగా మారగలిగిన ఒక దృక్పథంగా వికసించకపోతే కేవలం అనుభవాలవల్ల అంతగా ఉపయోగం లేదు. కొత్తగా చిగుళ్ళు వేస్తున్న సిద్ధాంత రాహిత్య సిద్ధాంతం ఈ మధ్య విస్తృతంగా అనుభవ ప్రాధాన్యతను ప్రచారం చేస్తోంది. అనుభవం లేని విశ్లేషణ పిడి, జడవాదానికి ఎట్లా దారి తీస్తుందో, విశ్లేషణ లేని అనుభవం కూడా అంతగానే ఏ గమ్యమూ లేని శుష్క లోకజ్ఞానానికి దారి తీస్తుంది. ఈ రెండు అతివాదాలకూ కొట్టుకుపోకుండా సమాజ గమనంలో విశ్లేషణకూ, అనుభవానికీ మధ్య వున్న గతి తార్కిక సంబంధాన్ని గుర్తించడానికి ఈ సంకలనాలు ఉపయోగపడతాయి. అటువంటి కొత్త ఆలోచన, కొత్త దృక్పథం ఈ సంకలనాల్లో వున్నాయంటాడు అర్జున్ దాంగ్లె.

( ఆంధ్రజ్యోతి, 23 నవంబర్, 1992 నుండి పునర్ముద్రణ)

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)