- శివసాగర్
(’సృజన’ మార్చ్, 1974 సంచిక నుండి పునర్ముద్రణ)

ఈ మధ్య సెంట్రల్ బొంబాయి నుంచి లోక్‌సభకి జరిగిన ఉప ఎన్నికలో ఎన్నికలు బహిష్కరించమని ప్రజలకి పిలుపు యిచ్చినవారు దళితపాంథర్లు. అది విజయవంతమైంది.

ఈ ఉప ఎన్నికలలో పోలయిన ఓట్లు నూటికి 38 మాత్రమే. 1971 ఎన్నికల్లో అక్కడ దాదాపు నూటికి 65 దాకా పోలయినాయి.

శివసేన, రిపబ్లికన్ పార్టీలోని రెండు గ్రూపులు కలిసి కాంగ్రెసు అభ్యర్థిని బలపరిచేయి. సి.పి.ఐ.ని సి.పి.ఎం. బలపరిచింది. జనసంఘ్, హిందూమహాసభలకు వేరు వేరు అభ్యర్థులున్నారు. రాజకీయాల్లో అధికారానిదే పైచేయి. ప్రజలనాడిని సరిగ్గా పసిగట్టింది దళిత పాంథర్లే. ధరల పెరుగుదల వల్ల, తిండిలేకపోవడం వల్ల బాధపడుతున్న ప్రజలకి, బాలట్ బాక్స్ భ్రమలు వదిలిన ప్రజలకి సరైన ప్రతినిధులుగా నిలిచేరు దళిత పాంథర్లు.

“బాలట్ మీకిచ్చేది బులెట్'’. అన్న పాంథర్ల పిలుపు ఎన్నికల ముందు యుద్ధ నినాదమై మారు మోగింది.

ఎన్నికల్ని బహిష్కరించమని విప్లవకర పిలుపు నివ్వడానికి దళిత పాంథర్లు పోలీసు జులుంని ఎదుర్కోవాల్సి వచ్చింది. పోలీసులు, సవర్ణ హిందూ మతోన్మాదులు దోపిడీ ప్రయోజనాల్ని రక్షించడానికి కలిసి పనిచేసారు.

ఓ రాత్రి చాన్ల వద్ద దళిత పాంథర్ల మీటింగుకి అంతరాయం కల్గించారు. వాళ్ళ పెండాల్‌ని తగలబెట్టేరు. వాళ్లమీద రాళ్లురువ్వేరు. దీని తర్వాత వాళ్ళ చాన్ల మీద దాడులు జరిగాయి. పోలీసులు పక్షపాతంతో ప్రవర్తించారు. పోలీసు దుర్మార్గానికి వ్యతిరేకంగా పాంథర్లు ఊరేగింపు జరిపితే పోలీసులు వాళ్లని అడ్డగించి నిర్దాక్షణ్యంగా కొట్టారు. కొందరిని జుట్టుపట్టిలాగి, తుపాకీ మడమలతో కొట్టారు.
నిరాయుధులై వున్న పాంథర్ల మీద లాఠీలతో పోలీసులు, సోడాబుడ్లతోనూ, రాళ్ళతోనూ సవర్ణ హిందూ మతోన్మాదులు దాడి జరిపారు.

దళిత పాంథర్లని వందలకొద్దీ అరెస్టు చేశారు. గాయపరిచారు. భగవత్ రామ్‌జీజాదవ్ అనే అతను వీరమరణం చెందాడు. వోర్లీ (బొంబాయి)లో వీధుల్లో దళిత రక్తం ప్రవహించింది. ఎన్నికల తర్వాత కూడా ఈ రాక్షసత్వం విచ్చలవిడిగా సాగింది.

1972లో స్వాతంత్య్ర రజతోత్సవాన్ని దళిత పాంథర్లు చీకటిదినం (బ్లాక్‌డే) జరిపినప్పుడు ఆ దళిత పాంథర్లే అణచబడిన (దళిత) మహారాష్ట్ర హరిజన యువకుల ఉజ్వల ఉద్యమంగా రూపొందుతారని ఎవరూ ఊహించలేకపోయారు, ఆ ఉద్యమ ప్రతినిధులు ప్రయోక్తలు చాలా మంది తమ సాహిత్య కార్యకలాపాల ద్వారా ప్రముఖులయ్యారు. దళిత యువకులను సమీకరించడానికి, ఇప్పుడు విర్రవీగుతున్న సంఘం మీద యుద్ధం ప్రకటించడానికి వాళ్లు రాజకీయాల్లోకి దూకారు. దళిత రచయితలే దళిత పాంథర్లని సృష్టించారు.

పాలకపార్టీ కుటిలత్వం, షెడ్యూల్ కులాల నాయకుల పచ్చి అవకాశవాదధోరణి, వామపక్ష రాజకీయ పార్టీలనబడేవాటి దివాళాకోరుతనం, కులతత్వాన్ని బద్దలుకొట్టలేని పిరికితనం, వీటన్నిటినీ మించి “26 ఏళ్ల స్వాతంత్య్రం'’ యిచ్చిన అనుభవం దళిత జాతులను ఆగ్రహపూరితులను చేసింది. వాళ్లు వీటన్నిటిలోంచి కొత్త మార్గాన్ని వెతుకుతున్నారు.

సవర్ణ హిందువులు అంటరానివాళ్ళపై సాగిస్తున్న ఆత్యాచారాన్ని గాధలుగా విని ఆందోళన చెందారు. ఓ పల్లెలో అంటరాని ఆడదానికి మానభంగం జరిపిన సవర్ణ హిందూ నేరస్తుడు, తలెత్తుకొనిపోయాడు. ఊరి బావిదగ్గరకు ఇద్దరు అంటరాని ఆడవాళ్ళు వచ్చినందుకు వాళ్ల బట్టలు ఊడపీకారు. స్థానిక ఎన్నికల్లో కామందుకి ఎదురునుంచున్న సాహసానికి ఓ అంటరాని యువకుణ్ణి సజీవ దహనం చేశారు. ఇలా ఒకసారి కాదు, రెండు సార్లుకాదు; ఇలాంటి అత్యాచారాలు అనేకమార్లు జరగటంతో వాళ్లు ఎదురుతిరగక తప్పలేదు. పైకి ఎన్నిమాటలు చెప్పినా అంటరానివాడు అంటరానివాడిగానే మిగిలిపోయాడన్నది వాళ్ళు గ్రహించిన సత్యం.

ఈ కొత్త శక్తిని అర్థం చేసుకోవడానికి వాళ్ళ (దళితుల) సాహిత్యం, వాళ్ల కవితలు, వాళ్ళ కథలు, వాళ్ల నవలలు, పాలసీ ప్రకటనలు చదవాల్సిన అవసరం ఎంతయిన వుంది.

దళిత సాహిత్యం అణచబడిన వర్గాలబాధలకి, వారి తీవ్ర నిరసనకి, సమగ్ర విప్లవానికి వాళ్ళిచ్చిన పిలుపుకీ స్పష్టమైన చిత్రణ.

నామ్‌దేవ్ దషాల్ అనే దళిత పాంథర్ కవి ఇలా అంటాడు. “గాలిలోకి విసిరి వేయబడ్డ మనిషిలాగ నేను రోడ్డు పక్క గడ్డీగాదం తిని బతికేను.'’

అతడు బాధగా ఇలా అంటాడు. “నేను తలలేని ఎలుక మొండాన్ని. నా మీద గోపురాలు లేస్తున్నాయి.'’ మరోపాంథర్ కవి జె.వి. పోవర్ విప్లవానికి పిలుపు యిస్తున్నాడు. ” ఆ బిగించిన పిడికిళ్లు ఇప్పుడు తెరుచుకోవు. తరుముకొస్తున్న విప్లవం నీ కోసం ఆగబోదు. మేము చాలా సహించాం. యిప్పుడిక సహించేది లేదు.'’ నారాయణ సర్వెకి కార్ల్ మార్క్స్ ‘తండ్రి’లాంటివాడు. “నా మొదటి సమ్మెలో నేను మార్క్స్‌ని గుర్తించాను. అతనే మన మార్కస్. మన తండ్రి జర్మనీలో పుట్టాడు'’. తమ లక్ష్యప్రకటన (మానిఫెస్టో)లో దళిత పాంథర్లు తమను తాము వివరించుకునే ప్రయత్నం చేశారు. నిమ్నకులాలు, తెగలు, బౌద్ధమతం స్వీకరించిన వాళ్లు, మాత్రమే కాదు, కార్మికులు భూమిలేని వ్యవసాయ కార్మికులు, సన్నకారు రైతులు కూడా దళితులేనని వాళ్లు నిర్వచించుకున్నారు. హిందూ వర్ణవ్యవస్థను నిర్మూలించే విప్లవ పార్టీ, నిజమైన వామపక్షపార్టీలు తమ స్నేహితులు. పదవి, హోదా, ధనం, భూస్వాములు, పెట్టుబడిదారులు, వడ్డీ వ్యాపారస్తులు, వారి తొత్తులు, కులతత్వాల్లో కూరుకుపోయిన పార్టీలు, ఈ ప్రయోజనాలన్నిటిని కాపాడుతూ సమర్థించే ప్రభుత్వం వాళ్ల శత్రువులు.

పాంథర్ల ప్రణాళిక తమ మనసుల్ని తేటతెల్లం చేస్తుంది. “దళితుల విముక్తి పోరాటం సమగ్రమైన విప్లవం కోరుకుంటుంది. పాక్షికంగా మార్పు అసాధ్యం. అది మాకు వద్దు. మాకు సమగ్ర విప్లవాత్మకమైన మార్పు కావాలి. మొదట మాకు జరుగుతున్న సాంఘిక అన్యాయాలని ఎదిరించడంతో తృప్తి పడినా తర్వాత ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక రంగాల్లో అధికారాన్ని మేమే చేపట్టాలి. మేము ఇంక ఎంత మాత్రం లొంగివుండం. మాకు బ్రాహ్మల్లో స్థానం వద్దు. దేశాన్నంతా మేమే పరిపాలించాలి. మాకు వ్యక్తులపై ద్వేషం లేదు. మా కసి అంతా ఈ వ్యవస్థపైనే. హృదయ పరివర్తనగాని, ఉదారమయిన విద్యావిధానంగాని అన్యాయాన్ని, దోపిడీని రూపుమాపలేవు. విప్లవ ప్రజానీకంలో చైతన్యం రగిలించి వాళ్ళని కూడగడతాం, విప్లవ జ్వాల ఈ విస్తృతమైన ప్రజాపోరాటాలనించే రాజుకుంటుంది. ఎన్నికలద్వారా, సత్యాగ్రహాలద్వారా, రాయితీలద్వారా సాంఘిక వ్యవస్థ విప్లవీకరించబడదు. మా సాంఘిక విప్లవాలోచన యీ నేలలో మొలకెత్తి, ప్రజల మనసుల్లో పెరిగి, చివరకి తపనతో జ్వలిస్తున్న వుక్కులా మెరపులా ఆచరణలోకి వస్తుంది.'’

దళిత సాహిత్యం, దళిత ఉద్యమం అంబేద్కర్, మార్క్స్‌ల సమ్మేళనం. వాళ్ళకి సాంఘిక దోపిడికి ఆర్థికం మూలమనే చైతన్యాన్ని కల్గించింది మార్క్సిజమే అన్నదాంట్లో సందేహంలేదు. భూమిలేని పేదరైతే యీ దేశంలో అంటరానివాడని వాళ్ళకి తెలుసు.

మనకి ఇష్టం వున్నా లేకున్నా, దళిత పాంథర్లు రానున్న కాలంలో మహారాష్ట్ర రాజకీయ కీకారణ్యంలో పేలడానికి సిద్ధంగా వున్న డైనమైట్లు. ఇండియాలో పీడితులందరి నెత్తి మీదా కులం, జాతి అన్న తేడా లేకుండా నాలుగు కొండలు మోసివున్నాయి. సోవియట్ సోషల్ సామ్రాజ్యవాదం, అమెరికన్ సామ్రాజ్యవాదం, భూస్వామ్య విధానం, దళారీ బూర్జువావర్గం. దళితుల మీద మరో కొండ అదనంగా వుంది. అదే సాంఘిక దురన్యాయం, సాంఘిక దోపిడి.

దళిత పాంథర్లు తొందరలోనే తమ అనుభవం ద్వారానే నేర్చుకుంటారు - సాంఘిక పీడన మీద వాళ్ళ పోరాటం మనదేశంలో జరుగుతున్న సామ్రాజ్యవాద వ్యతిరేక, భూస్వామ్య వ్యతిరేక సాయుధ పోరాటానికి చాలా దగ్గరగా ముడిపడివున్నదని, “తుపాకీ గొట్టం నుంచే రాజ్యాధికారం సిద్ధిస్తుంది'’ అన్న మావో సూక్తిలోని శాస్త్రీయ సత్యాన్ని వాళ్లు చాలా తొందరగానే గ్రహిస్తారు. వాళ్ల సమగ్ర విప్లవమనే స్వప్నాలకు స్పష్టమైన వ్యక్తీకరణను వాళ్లు త్వరలోనే వెతుక్కోవాల్సివుంటుంది. అమెరికాలోని బ్లాక్ పాంథర్ల ఉద్యమంలోని బలాన్నీ బలహీనతలను ఎంత ఎక్కువ తెలుసుకుంటే అంత ఎక్కువగా వాళ్ళ చాన్లలోంచి బైటికి వచ్చి తమ విప్లవవర్గ సోదరులతో చేతులు కలుపుతారు.

విప్లవ పరిస్థితుల్లో “పాత పద్ధతిలో జీవనం సాగించడం అసాధ్యమని అణచబడిన వర్గాలు గుర్తించి, మార్పు కావాలన్నప్పుడు, దోపిడీదార్లు ధనస్వాములు పాతపద్ధతిలో అధికారం చలాయించలేనప్పుడు” సాంఘిక ఆర్థిక సమస్యలపై సాగే మిలిటెంట్ పోరాటాలకు, సాయుధ విప్లవ ప్రధానమార్గానికి మధ్య చైనాగోడ వుండదు. ఈ పోరాటాలు పాలక వర్గాన్ని బాధిస్తాయి. కలవరపరుస్తాయి.

దేశవ్యాప్తంగా వున్న విప్లవకారులందరూ పోరాడే దళిత పాంథర్లకి మనస్ఫూర్తిగా తమ స్నేహ హస్తం అందిస్తారు.

దళిత పాంథర్లకు త్రీ ఛీర్స్!

పాంథర్ల కోరిక న్యాయమైనదే. అందుకే వాళ్లు వంటరివాళ్లు కాదు.

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)