- డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్
మనిషి తన జీవితంలో రకరకాల భావాలకు లోనవుతాడు. వీటిలో ప్రేమ, జాలి, కోపం, దుఖం ఇలా ఎన్నో ఉంటాయి. ఇవి కాక కొన్ని సందర్భాల్లో దైవభక్తి, దివ్యానుభూతులు, అనిర్వచనీయమైన ఆధ్యాత్మిక ఆనందం వంటి భావనలు కూడా కలుగుతాయి. వీటికి జాతి, మత, ప్రాంతీయ పరిమితులేవీ ఉన్నట్టు కనబడవు.
వ్యవస్థీకృతమైన పెద్ద మతాలే కాదు, ఆదిమజాతి తెగలకు చెంది గ్రామదేవతలు వగైరాలను ఆరాధించేవారికి కూడా నిజంగా ఇలాంటి భావనలు కలుగుతాయనేది తెలిసిన విషయమే. భావాలన్నిటికీ కేంద్రం మెదడే అని భౌతికవాదుల నమ్మకం. ఇతర ఉద్రేకాలకు లోనయినప్పుడు మనిషి మెదడులో ఎటువంటి మార్పులు కలుగుతాయో పరిశోధనల ద్వారా తెలుసుకుంటున్న శాస్త్రవేత్తలు ఆధ్యాత్మిక భావనలు కలిగించే ప్రభావాన్ని కూడా పరిశీలించారు.
ప్రపంచంలో ఎక్కడైనా ఇలాటి భావనలకు కొన్ని లక్షణాలు సామాన్యం. వీటికి లోనయినవారికి కలిగే అనుభూతుల్లో ఒకరకమైన పరిపూర్ణత్వం సాధించినట్టనిపించడం, మైమరచిపోవడం, విశ్వంతో ఏకమైనట్టు అనిపించడం, అనిర్వచనీయమైన మనశ్శాంతి, అన్నిరకాల భయాలనుంచి విముక్తి పొందిన భావన, అలౌకికానందం, భగవత్స్వరూపాన్ని దర్శించడం వగైరాలుంటాయి. అలాంటి పరిస్థితుల్లో మెదడులో ఎటువంటి మార్పులు కలుగుతాయో కనిపెట్టడానికి ధ్యానంలో మునిగిన కొందరు బౌద్ధ భిక్షువులపై ప్రయోగాలు చేశారు. వారి మెదడులో నిద్రాణమైన భాగాలు మేలుకున్నట్టూ, పనిచేస్తున్న కేంద్రాలు సుప్తావస్థకు చేరుకున్నట్టూ తెలియవచ్చింది. ఈ ప్రయోగాల ఉద్దేశం దేవుడున్నాడా లేడా అన్నది నిరూపించడం కాదు. ఆధ్యాత్మిక స్థితిలో ఉన్న మెదడు పనిచేసే పద్ధతిలో కలిగే మార్పులను పసిగట్టడమే.
దీనికి కారణం ఉంది. మతపరమైన చర్యల్లో ఊహలు ఒక భాగం మాత్రమే. మతాల ఆచరణలో పూజలూ, పునస్కారాలూ, తంతులూ, నైతిక ఆచరణా, సత్కార్యాలు చెయ్యడమూ, ఇతరులపట్లా , సమాజం పట్లా ధార్మిక సద్వర్తనా ఇలా అనేకం ఉంటాయి. ఎటొచ్చీ మతవిశ్వాసాలకు బలమైన పునాది ఆలోచనల, భావాలవల్లనే కలుగుతుంది కనక వాటికి గల శారీరిక లక్షణాలను గురించి చర్చించడమే ప్రస్తుత ఉద్దేశం.
ఈ ప్రయోగాలకు గురి అయినవారి మెదడులోని రక్తప్రవాహంలో స్వల్ప మోతాదులో రేడియో ధార్మిక పదార్థాన్ని ప్రవేశపెట్టి దాని ఆచూకీని బైటినుంచి డిటెక్టర్ల ద్వారా కనిపెట్టడం జరిగింది. దీనివల్ల మెదడును “చిత్రీకరించడం” సాధ్యమైంది. ధ్యానస్థితిలో ఉన్నప్పుడు మెదడు ముందు భాగంలోని ప్రక్రియలు వేగవంతం అయాయి. ఏదైనా పనిమీద మనసుపెట్టినప్పుడు జరిగేదిదే. అదే సమయంలో మెదడుకు పైభాగంలోనూ, వెనకా ఉండే పార్శ్విక, లేదా బహిస్థ (పెరైటల్) భాగంలోనూ చర్యలు తగ్గాయి. పరిసరాలను గమనించలేని స్థితిలో ఇదే జరుగుతుంది. ధ్యానంలో నిమగ్నులైనవారికి తమను తాము మరచిపోయినట్టూ, పరిసరాలకూ, స్థలకాలాలకూ అతీతులైనట్టూ అనిపించడానికి కారణం ఇదే. ఈ మార్పులు అనేక పరిశోధనల్లో బైటపడ్డాయి గనక ఆధ్యాత్మిక భావనలకు ముఖ్యకారణాలు ఇవేనని శాస్త్రజ్ఞులు నమ్ముతున్నారు.
మెదడులో కొన్ని భాగాలకు చైతన్యం కలిగి, చైతన్యవంతమైన కేంద్రాలు నిద్రాణస్థితికి చేరుకోవడంతో ఆధ్యాత్మిక స్థితిలో అనుభవించిన యదార్థభావన మెలకువగా ఉన్నప్పుడు అనుభవంలోకి వచ్చే యదార్థత కన్నాగాఢమైనదిగా అనిపిస్తుంది. ఇది చాలా బలమైన ప్రభావం కలిగిస్తుందనడంలో సందేహం లేదు. దైవ ప్రార్థనలవల్ల రోగాలకు ఉపశమనం కలగడమూ, హిప్నోసిస్ ద్వారా చికిత్స జరగడమూ వగైరాలన్నీ మెదడులో కలిగే మార్పులతోనూ, పై అంశాలతోనూ ముడిపడినవే. అందుచేత నాస్తికులు దేవుడు లేడని ఒక్కమాటలో కొట్టిపారేస్తున్నపుడు ఆస్తికులకు తమ ప్రగాఢ విశ్వాసానికి అవమానం జరిగిందని అనిపించడంలో ఆశ్చర్యం లేదు.
పరిశోధనలకు లోనయిన బౌద్ధ భిక్షువులు ధ్యానం చేస్తున్నప్పుడు వారి మెదడులో నిజంగానే ఆనందాన్నీ, ఆందోళనకు దూరం కావడాన్నీ, ప్రశాంతతనూ ప్రతిఫలించే మార్పులు కలిగాయని రుజువైంది. ఆధ్యాత్మిక భావాలు లేని మనుషులకు కృత్రిమంగా ఇటువంటి మనస్థితి కలిగిస్తే వారు సరిగ్గా ఇటువంటి భావనలకే లోనవుతారా అని తెలుసుకోవడానికి కొన్ని పరిశోధనలు జరుగుతున్నాయి. వారిని నిశ్శబ్దంగా, చీకటిగా ఉన్న గదిలో కూర్చోబెట్టి వారి తలలను అయస్కాంతక్షేత్ర ప్రభావానికి గురిచేశారు. ఆ స్థితిలో వారి మెదడులో కలిగే మార్పులు ఆధ్యాత్మిక భావాలను పోలినవా కాదా అని పరిశీలిస్తున్నారు.
సైన్స్‌పరంగా చూస్తే మెదడు విద్యుత్‌రసాయనాలతో (ఎలెక్ట్రో కెమికల్స్) పనిచేసే శరీరభాగం. అందుచేత ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నప్పుడు అందులో ఎలాంటి మార్పులు కలుగుతున్నాయో తెలుసుకోవడం శాస్త్రవేత్తల కర్తవ్యం. ఎపిలెప్సీవంటి కొన్ని రకాల మూర్ఛరోగాలవల్లనూ, కొన్ని మాదకద్రవ్యాలవల్లనూ కూడా మతపరమైన భ్రమలు కలుగుతాయని డాక్టర్లకు తెలుసు. మన దేశంలో కొందరు సాధువులూ, బాబాలూ భంగువంటి మత్తు పదార్థాలు సేవిస్తారనేది తెలిసినదే.
దేవుడి గురించిన భావనలకు సాంస్కృతిక, సమాజపరమైన కారణాలు ఎన్ని ఉన్నప్పటికీ ప్రతి యుగంలోనూ వివిధ జాతుల, ప్రాంతాలవారికి నిజంగానే ఒకే రకమైన ఆధ్యాత్మిక భావనలు కలుగుతూ వస్తున్నాయనడంలో సందేహం లేదు. ఇదంతా ఏదో కుట్ర అనీ, అబద్ధాలనీ అనుకోవడం కూడా సబబు కాదు. దీనికిగల భౌతిక కారణాలు మెదడు నిర్మాణంలోనే ఉన్నట్టు కనబడుతోంది. కొందరు శాస్త్రవేత్తలు ప్రస్తుత పరిణామదశలో మనిషి మెదడులో దేవుణ్ణి నమ్మే లక్షణాలు బలంగా ఉన్నాయనీ, ఇప్పట్లో అందులో మార్పు కలిగే పరిస్థితి లేదనీ అంటున్నారు. అంటే దీనర్థం జ్ఞానోదయం కలిగినప్పుడు గౌతమ బుద్ధుడి మెదడుయొక్క పై భాగం సద్దుమణిగిందనా? మోజెస్, మహమ్మద్ ప్రవక్త తదితరులకు వినిపించిన అశరీరవాణి చిత్త భ్రమేనా? యేసుక్రీస్తు దేవుడితో సంభాషించడం మెదడులో కలిగిన గందరగోళమేనా? దేవుడు మనిషిని సృష్టించాడని నమ్మేవారు మాత్రం దేవుడి గురించిన భావన కేవలం మనిషి మెదడు సృష్టించినదే అంటే ఆగ్రహం చెందుతారు. ఈ చర్చకు స్పష్టమైన వివరణ ఏదీ ఇంకా లభించలేదు కనక మతవిశ్వాసాలు కొందరికి మనశ్శాంతినీ, కొన్ని పరిస్థితుల్లో రుగ్మతల నివారణకూ కూడా ఎలా పనికొస్తున్నాయో, అందుకు దారితీసే ప్రక్రియలు మెదడులో ఎలా జరుగుతున్నాయో తెలుసుకోవడానికి పరిశోధనలు కొనసాగుతున్నాయి.