- మమత
ఒక సాయంత్రం మా యునివర్సిటీ బస్టాపులో ఇద్దరి మధ్య సంభాషణ విన్నాను. ఒకాయన పోనీటెయిల్ వేసుకొని వున్నాడు. మెడలో ఒక చోకర్ ఉంది. అతను ఇంకొకతనితో “నాలో నేటివ్ అమెరికన్ రక్తం ఉందని మా అమ్మ చెప్పింది. అప్పటి నుండి నేటివ్ అమెరికన్ ఆచారాలను పాటిస్తున్నాను” అని అన్నాడు. అప్పటికే నేటివ్ అమెరికన్ల గురించి తెలుసుకోవాలన్న నా ఆసక్తి వల్ల వాళ్ల సంభాషణ విందామని, వీలయితే అతనితో మాట్లాడుదామని వారికి దగ్గరగా జరిగాను.
“మీది ఏ తెగ?’ అడిగాడు పక్కనున్నతను.
“చెరోకీ” తడుముకోకుండా చెప్పాడు మొదటి అతను.
“ఓహో! చెరోకీనా? అయితే మీది రాచరిక కుటుంబమయి ఉండొచ్చు. మీ ముత్తవ్వ చెరోకీ యువరాణి కాదు కదా?”
“అవును. అమ్మ నాకు అట్లాగే చెప్పింది” అంటూ అప్పుడే వచ్చిన బస్సెక్కి అతను వెళ్లిపోయాడు. రెండవ అతను తనలో తాను చిద్విలాసంగా నవ్వుకుంటూ సిగరెట్టు వెలిగించుకోబోయాడు. నేను అతనితో “ఎక్స్‌క్యూజ్ మీ! అతడి ముత్తవ్వ చెరోకీ యువరాణి అని మీకు ఎలా తెలుసు?” అన్నాను.
ఆయన నా వైపు సీరియస్ గా చూశాడు.
“సారీ, నేను నా ఆశ్చర్యాన్ని అణుచుకోలేక అలా అడిగాను.”
“మరేం ఫర్వాలేదు. ఈ మధ్య ఒక కొత్త ఫ్యాషన్ మొదలయింది. నేటివ్ అమెరికన్ల ఆచారాలు పాటిస్తున్నట్లు కనబడడం ఒక మోజుగా తయారయింది చాలా మందికి. ఆయన పెంచుకున్న జుట్టు, మెడలోని ఆ ప్లాస్టిక్ చోకర్ని చూడగానే అర్థమయింది అతనొక ఫేక్ అని. ఈ ఫేకులకి తొందరగా వచ్చేది “మా ముత్తవ్వ చెరోకీ యువరాణి” అనే మాట. ఇంతకీ చెరోకీ తెగలో కొన్ని సంవత్సరాల పాటు బ్రిటిష్ వారు ఏర్పాటు చేసిన ఒక రాజు ఉండేవాడు. అతని రాచరికాన్ని చెరోకీలు కూడా ఒప్పుకోరు. చెరోకీ తెగలో నాయకుడు ఉంటాడు కాని రాజు ఉండదు. రాజు లేనప్పుడు యువరాణి ఎక్కడి నుండి వస్తుంది? తెల్లవాళ్లు నేటివ్ అమెరికన్లను అణగదొక్కడానికి అన్ని ప్రయత్నాలు చేసి, వారిని తమ గుర్తింపుకు దూరం చేసి మళ్ళీ ఇప్పుడు ఈ కొత్త రకం దోపిడీ మొదలుపెట్టారు. ఇతనిలాంటి వారి వల్ల నేను చెరోకీ తెగకు చెందిన వాడినని చెబితే నువ్విప్పుడు నమ్మవేమో” అన్నాడతను.
“నేను నమ్మనంత మాత్రాన మీరు చెరోకీ కాకుండా ఉండరు కదా” అన్నాను.
“నాకొక సందేహం. నేటివ్ అమెరికన్లను అనుకరించాలని బయల్దేరిన వాళ్లు చెరోకీ తెగనే ఎందుకు ఎన్నుకుంటారు?” అడిగాను.
“చెరోకీ తెగ అమెరికా సంయుక్త రాష్టాల ప్రభుత్వం వల్ల ఎన్నో కష్టాలపాలయింది. ఎన్ని కష్టాలు పడినా ఇప్పుడు బలమైన తెగగా రూపుదిద్దుకొంది. తెగకు సంబంధించిన కోర్టులు ఉన్నాయి. సాంకేతికంగా కూడా అభివృద్ధి చెందింది. చెరోకీ తెగ గురించి ఎక్కువగా తెలియకపోయినా, కనీసం తెగ పేరయినా వినని వారు ఈ దేశంలో చాలా కొద్ది మంది ఉంటారు. అందువల్ల ఈ తెగ పేరును తమకు ఆపాదించుకోవడానికి మోజు పడుతున్నారు. వీరికి తెలిసిందల్లా చెరోకీ యువరాణే కాని మా తెగ కన్నీటి జాడల గురించి తెలియదు.”
“కన్నీటి జాడలా?” అడిగాను నేను. ఇంతలో అతని బస్సు వచ్చేసింది. నన్ను “కన్నీటి జాడలు” (Trail of Tears) అనే ఆ మాట నాతో ఉండిపోయింది. చెరోకీల గురించి తెలుసుకోవాలన్న కోరిక నాలో బలంగా నాటుకొంది.
యూరోపియన్లు రాక మునుపు చెరోకీ తెగ ప్రజలు ప్రస్తుత జార్జియా, ఉత్తర మరియు దక్షిణ కరోలినా, టన్నెస్సీ రాష్ట్రాలలో 200 కు పైగా గ్రామాల్లో నివసిస్తుండే వారు. ఉత్సవాల్లో యుద్ధాల్లో పాల్గొనడానికి ఈ 200 గ్రామాల్లోని వారంతా ఒక దగ్గర చేరడానికి ప్రయత్నించేవారు. కానీ మిగిలిన దైనందిన విషయాల్లో ఏ ఊరి నిర్ణయాలు ఆ ఊరు వారు తీసుకునే వారు.
వారి ఇళ్లను తడికెలతో, మట్టితో కట్టుకునే వారు. మొక్కజొన్న, బీన్సు, గుమ్మడి వంటి పంటలు పండించే వారు. స్త్రీ పురుషుల మధ్య శ్రమ విభజన సమానంగా ఉండేది. పురుషులు యుద్ధాలలో, వేటలో తెగ రాజకీయాల్లో పాల్గొంటే, స్త్రీలు వ్యవసాయంలో , కుటుంబ సంరక్షణలో నిర్ణయాలు తీసుకునే వారు. వంశవృక్షం స్త్రీల వైపు నుండే సాగేది. యూరోపియన్లతో పరిచయం కలిగిన తర్వాత వారితో కలిసిపోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసారు చెరొకీలు. ముందుగా తెల్లవాడి దురాక్రమణను ఎదుర్కున్నా త్వరలో తమ జాతి మనుగడ కోసం తెల్లవాడి ఆచారాలను పాటించడం మొదలు పెట్టారు. దాదాపు అన్ని తెగల కంటే ముందు చెరొకీల్లో మార్పు వచ్చింది. తమ ఆచారాలను పూర్తిగా వదిలివేయకుండా తెల్లవాడి ప్రపంచంలో అడుగు పెట్టారు. కొంతమంది క్రిష్టియానిటీ లో చేరారు. కొందరు ఇంగ్లీషు చదువులు మొదలు పెట్టారు. తెగకు సంబంధించి కోర్టులు కూడా ఏర్పర్చుకున్నారు. చెరోకీ లిపి ని తయారు చేసుకున్నారు. ‘ ద ఇండియన్ ఫీనిక్స్’ (The Indian Phoenix) అనే పత్రికను అచ్చు వేసే వారు. ఈ పత్రికలో ఒక వైపు ఇంగ్లీషులో అచ్చు వేస్తే మరొక వైపు చెరోకీ లిపిలో అచ్చు వేసేవారు. అయితే తెల్ల వాడితో కలిసిపోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా తెల్లవాడు చెరోకీలు తనతో సమానంగా అభివృద్ధి చెందడం సహించలేక పోయాడు.
1540 లో ప్రాంతంలో యూరోపైయన్లు వచ్చారు. అటునుంచి 1828 దాకా చెరోకీ ప్రజలు తమ భూములను రక్షించుకోడానికి ఇతర తెగలతో, యూరోపియన్లతో ఎన్నో యుద్ధాలు చేసారు. 1820 ల్లో అమెరికా సంయుక్త రాష్ట్రాల ప్రభుత్వానికి మద్దతునిచ్చారు. 1828 లో వారికి ఎదురు దెబ్బ తగిలింది. ఆ సంవత్సరంలో ఆండ్రూ జాక్సన్ దేశాధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డాడు. అదే సంవత్సరం చెరోకీ భూముల్లో బంగారం బయట పడింది. నేటివ్ అమెరికన్లందరినీ పడమర వైపు పంపాలని 1802 లోనే థామస్ జెఫర్సన్ ఆలోచన చేసాడు. 1825 లో జేమ్స్ మన్రో ఈ ఆలోచన ను సమర్థించాడు. ఆండ్రూ జాక్సన్ నుంచి వచ్చిన పూర్తి మద్దతుతో 1829 లో ఇండియన్ రిమూవల్ ఆక్ట్ (Indian Removal Act) ను కాంగ్రెసు లో ప్రవేశపెట్టారు. ఆ యాక్ట్ అమలులోకి రావడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. అంతవరకు చెరోకీ లతో కుదుర్చుకున్న ఒప్పందాలను గౌరవించడానికి జాక్సన్ ఒప్పుకోలేదు.
చెరొకీల భూములను దౌర్జన్యంగా ఆక్రమించుకోవడం మొదలైంది. అప్పటి చెరొకీల నాయకుడు జాన్ రాస్ తన తెగ ప్రజలను రక్షించుకోవడానికి సుప్రీమ్ కోర్టు తీర్పు చెప్పింది. జాక్సన్ కోర్టు తీర్పును ధిక్కరించి చెరొకీలు తాము ఉన్న భూములను వదిలి పడమరగా ఉన్న ఒక్లహామా వెళ్లాల్సిందిగా ఆదేశించాడు. 1838 దాకా జాన్ రాస్ చెరొకీ ప్రజల కోసం ప్రభుత్వంతో ఎన్నో విఫల పోరాటాలు చేశాడు. చివరికి మే 1838లో 7,000 అమెరికన్ సైనికులతో జనరల్ విన్ ఫీల్డ్ స్కాట్ చెరోకీల భూముల్లోకి అడుగుపెట్టాడు. అప్పటిదాకా తెల్లవాడి ఆచారాలను పాటించడం వల్ల తమను తాము రక్షించుకుందామనుకున్న చెరోకీల ఆశలు అడియాసలయ్యాయి. తెల్లవాడి జాడల్లో నడుద్దామనుకున్న తాము తుపాకీ ఎక్కుపెట్టిన తెల్లవాడి సాక్షిగా తమ మాతృభూమిని వదలివెళ్లాల్సి వచ్చింది.
వారి ఆస్తుపాస్తులన్నింటినీ వదులుకొని వచ్చిన చెరోకీలను తొందర తొందరగా కట్టిన కంచెల్లోకి నెట్టేశారు. వేసవికాలంలో చాట్టనూగ ( Chattanooga) ప్రాంతంలోని ర్యాటిల్ స్నేక్ స్ప్రింగ్స్ (Rattlesnake spring) దగ్గర కట్టిన ఈ కంచెల్లోకి అసంఖ్యాకంగా చెరోకీలను కుక్కడం వల్ల వారికి మశూచి, కోరింత దగ్గు వంటి రోగాలు వ్యాపించాయి. చాలామంది చెరీకీలను పోగుచేసి తరువాత పడవలో వారిని వేరే ప్రాంతాలకు చేరవేయడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. కాని అనావృష్టి వల్ల నదులు ఎండిపోయాయి. చలికాలాన్ని కంచెల్లో గడపడం వద్దనుకున్న జాన్ రాస్ తమను వెంటనే అక్కడి నుంచి తరలించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరాడు. అక్టోబరు దాకా ప్రభుత్వం ఈ ప్రతిపాదనను ఒప్పుకోలేదు. అప్పటికి చలికాలం మొదలయ్యింది. ఆ చలిలో తమ ప్రయాణాన్ని మొదలుపెట్టారు చెరోకీలు.
సరియైన దుస్తులు, ఆహారం లేకుండానే తమకు తెలియని దూరప్రాంతాల వైపు సాగిపోయారు. దారి మధ్యలో వారి వద్ద మిగిలింది దోచుకోడానికి వచ్చిన తెల్లవాళ్ళను ఆపడానికి అమెరికను సైనికులు ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. చలిలో, మంచులో ప్రయాణించడంవల్ల దాదాపు 4,000 మంది చెరోకీలు మరణించారు. చెరోకీలు అష్టకష్టాలు పడి నడిచిన ఈ దారినే “కన్నీటీ జాడలు” ( Trail of Tears) అంటారు.
ఓక్లహోమాకు చేరిన చెరోకీల మధ్య ఫాక్షన్లు మొదలయ్యాయి. ఎంతోమంది ముఖ్య నాయకులు హత్య గావించబడ్డారు. తొందర్లోనే ఈ ఫాక్షన్లు సమసిపోయి చెరోకీలంతా ఒక జాతిగా జమగూడారు. కాని అంతర్యుద్ధం ( అమెరికను సివిల్ వార్ ) రూపంలో వీరిని దురదృష్టం వెంటాడింది. ఈ యుద్ధం ముగిసే సరికి దాదాపు మూడింట ఒక వంతు జనాభా చనిపోయారు. అటు తరువాత రైల్వే మార్గాల కోసం, తెల్లవారు సెటిల్ కావడానికి చెరోకీలకు చెందిన చాలా భూమిని ప్రభుత్వం అక్రమించుకుంది. యుద్ధం వల్ల జరిగిన నష్టాలను అధిగమించడానికి తమ భూములను తెల్లవాళ్ళకు గుత్తకు ఇవ్వడం మొదలు పెట్టారు చెరోకీలు. 1880 ల్లో నేటివ్ ఇండియన్ ల భూముల్లో ( Indian Territory ) లో చెరోకీల కంటె తెల్లవాళ్ళే ఎక్కువగా ఉండేవారు. 1887లో వచ్చిన డావ్స్ యాక్ట్ వల్ల భూముల్లో మూడింట రెండు వంతులు చెరోకీలకు కాకుండా పోయింది. చెరోకీ జాతి తమకంటూ పూర్తిగా ఒక రాష్ట్రాన్ని ఏర్పరుచుకోవాలని ప్రయత్నించింది. కానీ అలా జరగలేదు. 1906 లో ఓక్లహోమా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో 46వ రాష్ట్రంగా అవతరించింది. 1961 యు. యస్ క్లైమ్స్ కమీషన్ ( US Claims commission) చెరోకీ జాతికి 15,000,000 డాలర్లు అందించింది.
చెరోకీ చరిత్రలో పేరున్న ప్రముఖులు ఎంతోమంది ఉన్నారు. సెఖోయా చెరోకీ భాషకు లిపిని తయారు చేశాడు. ఈ లిపిలో పత్రికలి కూడా ఉన్నాయి. విల్మా మ్యాన్ కిల్లర్ మొదటి చెరోకీ నాయకురాలిగా ఎన్నికయింది. హాలీవుడ్ సినిమాల్లో నటించిన వెస్ స్తుదికి నటుడిగా మంచిపేరుంది. ప్రస్తుతం చాడ్ స్మిత్ నాయకత్వంలో ఉన్న చెరోకీ తెగ రాజకీయాల్లో, సినిమా, సాహిత్యం వంటి ఇతర రంగాల్లో, సాంకేతిక విజ్ఞానంలో ఎంతో అభివృద్దిని సాధించింది. మరే ఇతర తెగ కంటే ఎక్కువగా తెల్లవాడి జీవనంలో కలిసిపోయినా చెరోకీలు తమ ఆచారాలను ఇప్పటికీ మరచిపోలేదు.
తులసివనంలో గంజాయి మొక్కల మాదిరి, చెరోకీలలో కూడా బయల్దేరిన కొందరు స్వార్ధపరుల వల్ల వారికి కష్టాలు ఎదురైన సందర్భాలు లేకపోలేదు. ఉదాహరణకు 1995లో చెరోకీల ముఖ్య నాయకుడిగా ఎన్నికైన జో బర్డ్ ( Joe Byrd) తన ‘సొంత సైన్యం’ ఈ ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించాడు. ఎట్టకేలకు చెరోకీలు ఐక్యంగా నిలబడి అతడిని వదిలించుకోవడం ద్వారా తమ వ్యవహారాలను తాము చక్కదిద్దుకోగలమని నిరూపించారు. ఆ తరువాత ముఖ్యనాయకుడిగా ఎన్నికైన చాడ్ స్మిత్ అంటే చెరోకీలకు వల్లమాలిన అభిమానం.
చెరోకీల కన్నీటీ జాడ ఇక్కడితో ఆగిపోవాలని ఆశిద్దాం.