- వరవరరావు
శ్రమ నిష్ఫలమై ఫలం భోజ్యమయిన పరాన్న భుక్కులు
సంస్కృత భాషలోనైనా మమ్ములను అస్పృశ్యులనే అన్నారు
అధికారం ముందు చేతులు కట్టుకొని
దొర అని సాబ్ అని సార్ అని పిలిచిన వాళ్ళను
తమలో తాము చాటుకు తిట్టుకోవడానికి
మమ్ములను మ్లేచ్ఛులను చేసి వాళ్ళను పోల్చారు
చండాలురమైనా చర్మకారులమైనా
మాల మాదుగులమైనా మనుషులుగా అంటరానివాళ్ళం
పెంపుడు కుక్కలమైనా
యజమానులకు మా మీద విశ్వాసం ఉండేది
అడవి పందులమైనా
మాకు జరిగే అవమానాలకు ఒంటిమీద ముండ్లొచ్చేవి
ఊరూవాడా ఊడుస్తాంగానీ
దొరల బాటల్లో మా నీడకూడా పారకూడదు
పీతిరిదొడ్లు కడగడానికైనా పెద్దమైసమ్మను చేయడానికైనా
పెంటకుప్పలెత్తడానికైనా పంటకుప్పలు నూర్చడానికైనా
మాకు అంటులేదు
నీరేటిగాళ్ళం మేమే కాని మేం ముట్టుకున్న నీళ్ళు తాగరు
కైకిలి నుంచి కళ్ళం నూర్చేదాకా
వెట్టికైనా పెద్ద మాదిగోళ్ళమయినా మేమే
మేం బండ్లకెత్తిన పంటలన్నీ మాచీమూనెత్తురే
అది వాళ్ళకు పంచభక్ష్య పరమాన్నమవుతుంది
తాలూ తప్పా మిగిలిన పొలాలవంటి
కొయ్యకాళ్ళు మిగిలిన చేన్లవంటి
మా జీవితాల్లో మేం
మా చెమటలో మట్టి పిసుక్కుని గాయాలనద్దుకొని తినాలి
గొడ్డులా పనిచేసి చచ్చిన గొడ్లని పీక్కు తినాలి
మమ్మల్ని మురికి కూపాల్లోకి తరిమేసి
మావి మురికి బతుకులని ఈసడిస్తారు
ఆరుగాలం మట్టిలో పనిచేసే వాళ్ళకు
మట్టిరంగు గాక అసూర్యంపశ్యల రంగు ఎలా వస్తుంది
అయినా అదేం న్యాయమో
చల్ల చుక్కేస్తే దాహానికి తప్పులేనట్లు
గడ్డివాముల్లో దొడ్లలో కాలువ గట్లలో పొదల్లో
బలవంతంగా మా ఆడవాళ్ళతో పొర్లడానికి మాత్రం
అంటులేదు
నిప్పుతో కడిగిపెట్టినా మేం చాయ్ తాగిన
గ్లాసులో తాగితే మాత్రం వాళ్ళకు గత్తరొస్తుందంట
కోళ్ళగూడు పసులకొట్టం ప్రహరీగోడ లోపలే వుంటాయిగానీ
మాదిగ వాడలయినా హరిజన కాలనీ అయినా
వాళ్ళ ఇళ్ళకే కాదు ఊరికీ దూరంగా వుండాల్సిందే
మా దేవతలూ క్షుద్ర దేవతలే
రామయ తండ్రికి మా మీద దయ కలిగితే
శబరిచేత సేవలుపొంది శంభూకుని చంపడానికి వస్తాడు
అడవికి పోయినట్లు ఆ రాజు
మాదిగపల్లెకోసం వేరుగా దేవాలయం కట్టుకొని
వాళ్ళ తెరువు పోకుండా
వాళ్ళ అంటూసొంటూ లేకుండా
మాకు మంచినీళ్ళ బావులూ వేరే బళ్ళలో సీట్లూ వేరే
పొరంబోకు భూములు బీళ్ళూ తుప్పలూ రాళ్ళూ రప్పలూ
పొతం చేసే దాకా మావే
తొండలుకూడ గుడ్లు పెట్టని భూములు
కాశ్మీర ఖండాలయ్యాక మాత్రం
కల్లు నీళ్ళకు కామందులకు అమ్ముకుంటాం
మాది తాగుబోతు కులంగదా
బీర్లూ విస్కీలు తాగే పెద్ద దొరలు
బీదవాళ్ళని దయతల్చి
గొంగడి ఇచ్చినా గొడ్లు ఇచ్చినా
అప్పు ఇచ్చినా సబ్సిడీ ఇచ్చినా
అన్నీ కరగతాగి అన్నమో రామచంద్రా అని
ఆకాశం కింద మిగులుతాం
తెల్లదొరలు మమ్ములను దేవుని బిడ్డలన్నారు
దేవునిబిడ్డ జీసస్ శిలువ మోసినట్లుగానే
మేం మా వీపుమీద నాగలి మోస్తున్నాం
నల్ల మహాత్ముడు మమ్ములను హరిజనులన్నాడు
వీపుమీద కొడితే కడుపుమీద కొట్టమని చూపుతున్నాం
మా బాబా సాహెబు మమ్మల్ని నవబౌద్ధులన్నాడు
అందుకే రాజ్యాన్ని వాళ్ళకు పరిత్యజించి
సంఘాన్ని శరణుజొచ్చాం (మత) ధర్మాన్ని శరణుజొచ్చాం
రాజ్యాంగం మమ్మల్ని వోటర్లను చేసింది
మాకు సీట్లూ రిజర్వు చేసింది
వాళ్ళకు వోటేసినపుడు వాళ్ళ నోట్లోకి
మేమే వేసుకున్నపుడు మా కంట్లోకి మా వేలు పోతున్నట్లున్నది
అమ్మా అంటూ చచ్చిన కంచికచెర్ల కోటేశులం మేమే
అన్నా అంటూ చచ్చిన నీరుకొండ శేషయ్యలం మేమే
కారంచేడయినా అగ్రకుల అహంకారం కంట్లో
గుప్పెడు కారం కొట్టిందే తప్ప
ఇంకా చూపుడువేలులో సురేకారం దట్టించాల్సే వున్నది
మేం అణగి వున్నంతకాలం వాళ్ళు మా ఒలికిన నెత్తురు
పాలు పొంగించుకొని అనుభవిస్తారు
అది కుదరదనగానే అచ్చం నెత్తురునే తాగేస్తున్నారు
వాళ్ళ కళ్ళ మంటలకు మా పల్లెలు భగ్గుమంటున్నాయి
మా నెత్తురూ ఎర్రగానే ఉంటుందని మాకు తెలియడం మంచిదే
పల్లెలో పనిలో బడిలో గుడిలో
కులం ఏలుబడిలో గీసిన సరిహద్దులు
యుద్ధంలో చెరిగిపోవడం మంచిదే
నాట్లేసిన చేతులు వోట్లేసిన చేతులు
ముట్టుకుంటే బుసకొట్టే వ్యవస్థ
నెత్తుటిస్నానం చేస్తున్నది
అగ్నిస్నానం చేస్తున్నది
శవాలంకారం పూర్తికానీ
పాడె లేవగానే
ఇదివరకూ చావు డప్పు మేమే కొట్టేవాళ్ళం
పీనుగుల్ని పూడ్చేవాళ్ళం
కాల్చే వాళ్ళం
కాటి కాపరులమూ మేమే
ప్రేతం ఇంక భూతం కాకుండా
అవతారం ఎత్తకుండా
ఆ అంటువ్యాధి క్రిములు మిగలకుండా
ఈ నేలనింక సమూలంగా దున్నేస్తాం
దళిత ద్రుమదళ వికసన్నవ పరిమళాన్ని ప్రకటిస్తాం
దళితుల పట్ల చూపే వివక్ష, దుర్మార్గాలన్నీ ఒకే కవితలో ఇమిడాయి.
–ఫ్రసాద్
http://blog.charasala.com
చాలా బాగుంది.
“తెల్లదొరలు మమ్ములను దేవుని బిడ్డలన్నారు
దేవునిబిడ్డ జీసస్ శిలువ మోసినట్లుగానే
మేం మా వీపుమీద నాగలి మోస్తున్నాం
నల్ల మహాత్ముడు మమ్ములను హరిజనులన్నాడు
వీపుమీద కొడితే కడుపుమీద కొట్టమని చూపుతున్నాం
మా బాబా సాహెబు మమ్మల్ని నవబౌద్ధులన్నాడు
అందుకే రాజ్యాన్ని వాళ్ళకు పరిత్యజించి
సంఘాన్ని శరణుజొచ్చాం (మత) ధర్మాన్ని శరణుజొచ్చాం”
లాంగ్ టర్మ్ ఫలితాలేవైనా, వెనుక వున్న ఫిలసోఫికల్ దోరణులేవైనా, స్తేటస్ కోను మార్చే ఎంత చిన్న వ్యక్తీకరణైనా మంచి పరిణామమే. ఆ దిశలో నే మతమార్పిడి కూడా వొక విప్లవకరవైన, ప్రస్తుతాన్ని ప్రశ్నించి, ధిక్కరించే మంచి పరిణామమే. హైందవంలో దొరకని జవాబులు, పరిష్కారాలూ, బౌద్దంలోనో, క్రైస్తవంలోనో దొరుకుతాయనుకోవటం వొక భ్రమే. ఈ పెనం మీదనించి, ఆ పెనం మీదకి మారినందువలన తాత్కాలి వుపశమనం తప్ప పరిస్కారం దొరకదు. సాక్షం శ్రీలంకలో, అమెరికాలో విస్పష్టంగా కనిపిస్తూనే వుంది. వేదాలూ, బైబిలు, త్రిపిటకాలూ పరిస్కారం కాదు. ఐనా సరే స్టేటస్ కో హిందూ ధర్మాన్ని ధిక్కరించగలిగే మత మార్పిడి వుపయోగకరవైన పరిణామమే.
రవికిరణ్ తిమ్మిరెడ్డి