రక్తమే సముద్రమైందో – లేక
సముద్రమే రక్తమై నరాల్లో వొదిగిందోగానీ
ఈ ఆటు పోట్ల నెత్తుటి చెలగాటంలో
బతుకొక తీరంలేని పడవ….
సప్పిడి పప్పు కలిపిన కూటిలో కూడా
కాస్త చిన్నుల్లిపాయాకారానికి సోటుండదు
కమ్మటి సల్లబువ్వలో కూడా
సిటికెడు ఉప్పు కలపటానికి కూడా సేతులు రావు
సట్టిలో రొయ్యలకారం పళ్లికిలిస్తూ
ఆదివారపు మసాలావాసన ఎగదోసి వెనక్కిపోతూ
ఛీ…. ఇదొక ‘నెత్తుటి కూడు’
పంట కాలవ లాగ
అప్పుడే కుతికె తెగిన దున్నకుర్ర గొంతులో నుండి ఎగిసిన నెత్తుటి ధారలాగ
నా రక్తానికి ప్రవహించమని ఎవరు ఆజ్ఞలు జారీ చేశారు?
ప్రవహిస్తే ప్రవహించింది…
సిన్నప్పుడు సెడుగుడు వయసులా
అప్పుడు పరిగెత్తితే పరిగెత్తనీ
ఇప్పడీ ముప్ఫయ్యేడేళ్ల ముసిల్తనంలో పిల్ల చేష్టల్లా
ఉండమన్న చోటుండకుండా ఉరికే నెత్తురికి
ఎంత పిచ్చిది కాకపోతే మాత్రం
గుండె కాయ కడుపు చించుకున్న కన్నతల్లై కూకుంటదా
దొరగార్ని చూసి గబక్కన లేవలేకపోతే పట్టినట్టు
ఈ రోగం వచ్చీరాక ముందే సిరిసెవట్లు
కుప్ప నూర్పిళ్లయ్యిందాకా కూటికి లేసేదే లేనంటే తిరిగినట్టు
ఈ మాయదారి జబ్బు అంటుకుందంటే
తిర్నాల రంగుల రాట్నం తిరిగినట్లు కళ్లు ఒకటే తిరుగుడు
కలెక్టరయ్య గోర్ని చూసినప్పుడు ఎట్టోడికి పుట్ట కొచ్చినట్టు
గుండెల్నిండా అదుపు చేసుకోలేని దడ
నిన్నటి దాకా ఈ రోగం రాకముందు దాకే నయ్యం
ఊరోళ్లు గొడ్డళ్లలో నరకందే
నాకాళ్లు గిజగిజాలాడవు
నాకు వొకటికో రెంటికో వచ్చినట్టుండదు
దొంగ నెత్తురు
ఇన్నాళ్లు తక్కువోడని ఎవురన్నా ఎంత ఇది చేసినా
అప్పుడెందుకు పరిగెత్తలేదూ?
ఎంత ఉద్యోగమొచ్చినా
ఎంత ముడ్లో సొక్కా ఏసుకోని, బంగారపు గొలుసులు దిగేసుకొని
ఎంత పోజుగొట్టినా
ఎక్కడా తక్కువ సూపే తరాజులో బరువైతూగుతుంటే
అప్పడీ నెత్తుటి ఉరుకు ఎక్కడ వచ్చింది?
ఇన్నాళ్లూ కోపాన్నంతా
కులం తక్కువ తనంతో తలొంచుకుంటా తగ్గిచ్చుకుంటావస్తే
ఇప్పుడీ రొస్టు
బిళ్లలేస్తే తప్ప తగ్గి సావటం లేదు
ఈ వైద్యుడొకడు….
మందు ముట్టమాకంటాడు
ముట్టుకుంటే మట్టైపోతావంటాడు
రేయంబగుళ్లూ సేలలో శాకిరై వొళ్లునెప్పులై అల్లాడతంటే
కాస్త సర్దుకోవటానికి మందుగాక మందుబిళ్ల లేసుకోవటానికి
నేనేవన్నా ఊళ్లల్లో ఊరేగుతున్న ఉండోడి కొడుకునా?
నా అనుమానం ఈ డాక్టర్లు కూడా పెద్ద కులపోళ్లే
లేకపోతే ఇన్నాళ్లూ నా మాంసాన్ని వాళ్ల మాగాళ్లకి ఎరువుగాసల్లినా సాలక
ఎగబడి నేనె ఎంటబడి నరికి నానెత్తుర్ని ఎండ్రిన్లా చల్లుకున్న సోట
ఈ రోగం పుణ్యాన్నైనా కనీసం కవిత్వంలోనైనా
నా శత్రు మాంసాన్ని తింటాన్నంటే వొద్దంటారా!
మాతాత మా అయ్య మా సినబ్బ
అందరూ సచ్చినట్టే
నేనూ ఏ గుండెపోటొచ్చో గుటుక్కుమనొచ్చు
మా అయ్య సమాధికాడ
ఎటుపోవాలో తెలీక దిక్కులేనోణ్ణై నేను నిలబడ్డట్టు
నా ఇద్దరు పిల్లలూ నిలబడొచ్చుగాక
ఇన్ని వేల ఏళ్ల అడ్డగోలు తనానికి ఎదురు నిలబడి
ఇప్పుడైనా యుద్ధం చేయటానికి
నారోగం నాకు కోపాన్నిచ్చింది
నా బి.పి. నాకు బతుకు పోరుబాట నిచ్చింది
అమ్మా! రక్తపోటా! అందుకు నీకు వందనాలు తల్లీ
అందుకే నీకు కోటానుకోట్ల నమస్కారాలు
తండ్రీ….. ఏసయ్యా
రక్తం చిందించందే
పాపులకు విముక్తిలేదని నీరక్తాన్నే చిందించావే….
తిరిగి లేచాక కూడా
నీ గాయాలను తడమందే నమ్మని తోమాల్ని భరించావే
నీకున్న సహనాన్ని నాకివ్వనందుకు
నీకూ నమస్కారాలు తండ్రీ
నాకిసువంటి నెత్తుర్నిచ్చినందుకు
నీకీ స్తుతులూ స్తోత్రాలు నాయనా!
దేవుడివి కాబట్టి
ఈ దేశంలో ఉండీలేనట్టు రిజర్వేషన్లు పొడిగించినట్టు కాక
నువ్వింకా ఖచ్చితమైన కృపాకాలాన్ని పొడిగిస్తున్నావు కానీ
లూసీఫర్ లయలమారి మాటల్ని నమ్మి మోసపోయిన
ఆదాము అవుల ముని ముని ముని ముని ముని మనవాణ్ణి
నేను కృపాకాలాన్నివ్వ లేకపోతున్నా తండ్రీ
నన్ను మన్నించు
మాలెక్కల ప్రకారం నువ్వాగింది రెండువేల సంవత్సరాలే
లెక్కలకందని మా కృపాకాలం నాలుగువేల సంవత్సరాలు దాటింది
తండ్రీ
ప్రభువా….
నా జాతికంతటికీ చివరి ఆశీర్వాదంగా
రక్తపోటునిచ్చి చూడు తండ్రీ
మేమంతా…….
హిత్సవత్సరాలమై నీ సాక్ష్యంగా వుంటాం
20-4-2001