- ఎండ్లూరి సుధాకర్

మయసభలో నా ఆత్మకథ ఆవిష్కరించబడింది
బహిరంగవేదిక మీద నా సన్మానం మొదలయ్యింది
ఇప్పుడు నా మెడలో దండలు పడుతుంటే
నిన్నటి నా గాయాలు ఉలిక్కిపడతుంటాయి
నా తలమీద పూలు చల్లుతున్నపుడు
నా లోలోపల ముళ్ళ కొరడాలు చరుస్తుంటాయి
నా మీద అభినందన పత్రాలు చదువుతున్నప్పుడు
నా కడుపులో అవమానాల చురకత్తుల గుచ్చుకుంటాయి
నా వెనక వేదమంత్రాలు నినదిస్తుంటే
నా చెవుల్లో సీసం పొగల గావుకేకలు తాండవిస్తుంటాయి
సభావేదిక మీద నన్ను కూర్చోబెట్టినప్పుడు
ఊరి పొలిమేర దగ్గరే నిలబడ్డ నా తాత మొహం గుర్తుకొస్తుంది
నా ముందు నీళ్ళు నిండిన గాజు గ్లాసులు పెట్టినప్పుడు
మోకాళ్ళ పై వంగి నీళ్ళు తాగిన ఎడారి దృశ్యాలు వేడిగా తగుల్తుంటాయి
నా బుజాల చుట్టూ శాలువ కప్పుతున్నప్పుడు
జాకెట్టు లేని నా జేజెమ్మ మసకరూపం గుండెల్ని కోస్తూ ఉంటుంది

పట్టు వస్త్రాలు నాకు అర్పణంగా పెడుతున్నపుడు
చివికి పేలికలయిన నా తాత ముతకపంచెలు
కళ్ళ తీగలపై వేలాడుతుంటాయి
నన్ను విందు భోజనాలకు ఆహ్వానిస్తున్నప్పుడు
చిన్నప్పుడు గొడ్ల చావిట్లో బువ్వ పెట్టిన పొద్దులు గుర్తొస్తాయి
కాలం నా పాదాలకు నమస్కరిస్తుంటే
చెప్పుల్లేని నా తాతల మట్టికాళ్ళు
మనసులో మెదులుతుంటాయి
ఏ రోడ్డు మీదో నా చిన్నప్పటి గురువులు కనిపిస్తే
గద్దను చూసిన కోడిపిల్లలా
నా బొటనవేలు గుప్పిట్లో దాక్కుంటుంది
ఆహా ఓహో ల మధ్య నా కవిత్వాన్ని
రామచిలకలు చప్పరిస్తున్నప్పుడు
మన్నులో ఇంకిపోయిన నా జాతి కవిత్వం
గుర్తొచ్చి క్రూరంగా వేధిస్తుంది
నా కోసం చొరస్తాలు రంగు రంగుల
తోరణాలై ఆహ్వానిస్తున్నపుడు
నాతో ఐదడుగులూ కలిపేందుకు
స్వర్ణహంసలూ సిద్ధపడుతున్నాయి
నా పూర్వీకుల దేహధూళి
నేలమాళిగల్లోంచి కొత్త గాలి పీల్చుకుంటోంది
అసూర్యంపశ్యలు స్వయంవరాల్లో
నాకోసం పోటీ పడుతున్నప్పుడు

తెగిన తలలూ కోసిన అంగాలూ
నా కళ్లల్లో ఎగిరి పడుతూనే ఉంటాయి
దేవాలయాలూ కొత్త దేవుళ్ళూ
నా దర్శనం కోసం పడిగాపులు పడుతున్నపుడు
గుడ్డి చీకట్లో గుడిగంటలు
వక్రధ్వనులతో నవ్వుకుంటాయి
నాలుగు మబ్బుల నీలిగోడల్ని చీల్చుకుంటూ
నేను ఐదవ సూర్యుడినై ఉదయించాను
ఇవాళ నా రక్తకిరణాలు
చంద్రతలం మీద ప్రతిబింబిస్తున్నాయి
ఇప్పటి కొత్త సూర్యుడి వెలుగులో
కాలం నా ఆత్మకథను
పాఠ్యగ్రంథంగా చదువుకుంటుంది.

ఒక్క అభిప్రాయం

  1. Ravikiran Timmireddy 18 జనవరి 2007 , 2:37 pm

    ఊహూ, ఇవాళ కూడా మీ కిరణాలు రక్తం వోడుతూనే వున్నాయ్. నాలుగు మబ్బుల నల్లని గోడలు అక్కడక్కడా కొంచం చిలుం పట్టినా ద్రుఢంగా నిల్చోనే వున్నాయ్. కులం చీకట్లో ఇనుప డేగలు ఇంకా వేటాడుతూనే వున్నాయ్.

    అక్కడక్కడా పడిన బీటల్లోంచి బయటకొచ్చిన అద్రుష్టవంతుల చుట్టూ కనిపించని గిరి గీశాం మేవు. మీ చేతికొచ్చిన అధికారానికే మా సలాం. మీ నలుగురి చుట్టూ మేం కట్టిన గోడలు ఊక్కుకన్నా బలవైనవి. మీరు దిగిన కారు డోరు మేం తెరిచి పట్టుకున్నపుడు, మీ వెనక మీ బేగ్ లు మోస్తూ మేం నడిచినపుడు, ఎప్పుడన్నా మీతో చేయి కలిపి షేక్ హేండిచ్చినపుడు, మీరు మా ఇంట్లో మా పెళ్ళి కొచ్చినపుడు, ఎప్పుడూ మీ చుట్టూ గోడలు, మేం కట్టిన గోడలు మీతోపాటూ, మీకు తెలీకుండానే మీకూ మాకూ మధ్య కంటికి కనిపించని గోడలు.

    మీకు పెట్టే నమస్కారాలు, మీపై పొగడ్తల జల్లు, మీకు చేసే సన్మానాలూ, కప్పే శాలువలు, ఇచ్చే బిరుదులు, అబద్దంలోంచి పుట్టిన మా అవసరపు మర్యాదలు. మా హ్రుదయ విశాలత్వాన్ని లోకానికి చాటుకునే పెదాలమీద మాత్రవే విరిసే చిరునవ్వులు. మనసునిండా మొన్నటి కులంహాకారపు చీకటే.

    పగుళ్ళలోచి బయట పడిన మీ నలుగురికీ, గోడల మధ్య చీకట్లో చితికి, చివికిపోతున్న వాళ్ళకీ మధ్య మరింత బలవైన గోడలు. చదువు గోడలు, ధనం గోడలు, స్టేటస్ గోడలు, నాగరికతల గోడలు, మా గోడల్ని అరువు తీసుకోని మీ చుట్టూ మీరు కట్టుకున్న గోడలు. అగ్ర వర్గపు దళితుల గోడలు. అగ్ర వర్ణపు చీకటి గోడలు.

    అక్కడక్కడా ఎక్కడైనా కుల ప్రసక్తి లేని స్నేహం, మాటా, మర్యాదా, సంపూర్ణవైన మానవ సంబంధాలు వుంటే వుండొచ్చు, వున్నాయ్ కూడా. అయితే ఎక్కువెక్కువగా మన నివాసం మాత్రం ఈ గోడల మధ్యనే.

    రవికిరణ తిమ్మిరెడ్డి.

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)