-వట్టికోట ఆళ్వార్‌స్వామి

కొన్నాళ్ళకు గొట్టం కోటయ్య మరణించాడు. కోటయ్య జీవించి ఉన్నప్పుడే కొమరయ్యకు పెండ్లి చేశాడు. తల్లి అన్నమ్మ అనుభవాన్ని ఊతగా తీసుకొని కొమరయ్య వ్యవసాయం పొదుపుగా సాగిస్తున్నాడు. కొమరయ్యకు ఒక కొడుకు కూడా పుట్టాడు. తండ్రి పేరే పెట్టుకున్నాడు కొడుకుకు. ఒకసారి కంఠీరవం కోటయ్యను యెత్తుకొని ముద్దులాడ్తు, “కొమరయ్యా! కోటయ్య పేరేమీ బాగులేదు. ‘ముద్దులకోట’ అని పెట్టు” అన్నాడు. అన్నమ్మ సంతోషంతో ఉప్పొంగిపోయింది. కోడలు కనకమ్మ క్షణంపాటు కొడుకును చూచి, ఒక చిరునవ్వు విసిరింది.

కొమరయ్య కొడుకును చిటికెలతో పిలిచి “టర్” అన్నాడు. కోటయ్య బోసినోరును విప్పి కండ్లన్ని మూతలు పడంగ కడుపునిండా నవ్వాడు. ఎత్తుకొమ్మన్నట్లు తండ్రివైపు చేతులు చాపాడు. కొమరయ్య కొడుకును కంఠీరవం నుండి తీసికొని తనివితీరా ముద్దులు కురిపించి “నాకోట, నా బంగారుకోట, పెట్టనికోట, ముద్దుల కోట.” అంటూ రెండు చేతులతో పైకి ఎత్తి “టర్” అన్నాడు. ఇంతలో సేతుసింధీ వచ్చి “దొర రమ్మంటున్నాడు” అని కొమరయ్యతో అన్నాడు. “ఆ కండ్లు, ముక్కు, అంతా కోటయ్యే!” ఆ ఇంట్లో వారంతా అనుభవిస్తున్న ఆనందంతో తానుకూడా పాల్గొన్నాడు సేతుసింధీ.

“ఎందుకు? ఏం పనంటావు?” అని కొమరయ్య కొడుకును తల్లికి అందించి బయలుదేరి సేతుసింధీతో వెళ్ళాడు.

రామభూపాల్‌రావు పడకకుర్చీలో కూర్చొని పొగచుట్టను పొతం చేసుకుంటున్నాడు. కొమరయ్య వెళ్ళగానే “తోటబావి భూమి నేను ఇంకోండ్లకు కౌలుకు ఇవ్వాలనుకుంటున్నాను. రబ్బీపైర్లు అయిపోయిన తర్వాత నువ్వు పునాసకోసం భూమి పొతం చేయవద్దు” అన్నాడు.

“కౌలుకిస్తారా? ఎవరికండీ? అసలు కౌలు కివ్వడమంటే నాకేం తోచటంలేదు” దిగులుగా అన్నాడు కొమరయ్య.

“అవును! కౌలుకిస్తాను. ఎప్పటికి నీవే శాశ్వతమా? నీ సొంత భూమి కాదుగా! ఎప్పటికి నీవే ఉండటానికి?”

“ఏందో! అంత గందరగోళంగా మాట్లాడుతున్నరు.”

“గందరగోళమేం లేదు. అసలా భూమి మీది కాదు. మీ అయ్య కౌలుకు తీసుకున్నాడు. అదన్నా తెలుసుగద?”

“ఆ మాత్రం తెలుసులే. కాని ఆ భూమి ఎవరో బామ్మనోళ్ళ దట గదుండీ?”

“మరి నేనన్న దేంటి? అందుకే ఆ భూమి మీది కాదంటున్నాను.”

“మరి ఆ బామ్మనాయనతోటే మేము మాట్లాడుకుంటాం.”

“ఆ బ్రాహ్మడికి కౌలు కట్టినవా ఎప్పుడైనా?”

“ఆరి జాడ జవాబే లేకపాయె. ఎవరికి కట్టు?”

“ఉ! కౌలు తీసికొనేవాడు లేడుకాబట్టి భూమి నీదంటావు? అంతేనా? సరేపో. తర్వాత మాట్లాడుకుందాం” రామభూపాల్‌రావు తీవ్రంగా ఆలోచిస్తూ కుర్చీలోంచి లేచి ఇంట్లోకి వెళ్ళాడు.
కొమరయ్య అయోమయ స్థితిలో అక్కడి నుండి బయలుదేరి కంఠీరవం ఇంటిదోవ బట్టాడు.

కంఠీరవం తండ్రి కూడా మరణించి చాలాకాలమైంది. మరణదశ రోజుల్లో పెద్దకొడుకు వెంకటాచారి ఇంట్లో లేడు. రఘునాథాచార్యులు భార్య ఆండాళమ్మను, కంఠీరవాన్ని పిలుచుకొని కన్నీరు తీశాడు. దీనంగా భార్యవైపు చూచాడు. ఆండాళమ్మ లోలోన కుమిలిపోతున్నది. రఘునాథాచార్యులు కంఠీరవం చేతిని గట్టిగా పట్టుకున్నాడు. దుఃఖాన్ని దిగమింగుతూ గద్గదసర్వంతో మనోబాధను వెళ్ళకక్కాడు. “నాయనా! మన కుటుంబ స్థాయికి, నీ ఆలోచనలకు పొంతనలేదు. ఏమవుతావో కొడుక; నా గౌరవం కాపాడుతావు కదు కొడుక? అన్నయ్యకు నీకు దేంట్లోను పడిరాదు. నేనా! ఎట్లా పుట్టానో అట్లాగే పోతున్నాను. నావి ఎప్పుడూ వట్టిచేతులే. కాని ఒకమాట కొడుక! నేలవిడిచి సాముచేయకు! ఆవేదనను మాత్రం చంపుకోకు. ఈమాటలే నీకు నేనిచ్చే ఆస్తి” అని పలికిన మాటలు కంఠీరవాన్ని ఎల్లప్పుడూ కలిచివేస్తుంటాయి. ఆ మాటలు జ్ఞాపకము రాగానే దిగ్భ్రాంతుడై దిక్కులు పరికించిచూస్తాడు. ఎవరో పిలుస్తున్నట్లు నలువైపుల చూస్తాడు.

కొమరయ్య రామభూపాల్‌రావు ఇంటికి వెళ్ళగానే కంఠీరవం కొమరయ్య ఇంటి నుండి బయలుదేరి తన ఇంటికి వెళ్ళాడు. కొమరయ్య ఇంటి వాతావరణం, వాండ్ల కుటుంబం, వ్యవసాయం, కొడుకుతో ఆటలు, వాండ్లు పొందుతున్న ఆనందాన్ని తలుచుకుంటూ ఇల్లు చేరుకున్నాడు. ఇంటికి వచ్చేవరకు తల్లి ఏడుస్తూ ఓ మూలకు కూర్చొని వుంది. అన్న వెంకటాచార్యులు తల్లిని దుర్భాషలాడుతున్నాడు. ఆండాళమ్మ నెత్తి ముడి ఊడి, వెండ్రుకలు చెల్లాచెదురై ఉన్నవి. ఆండాళమ్మను కొట్టడం తిట్టడం వెంకటాచారికి మామూలై పోయింది. ఆరోజున తిరిగి జరిగిందని కంఠీరవం గ్రహించాడు.

కంఠీరవం తన ఇంట్లో ఆ దృశ్యాన్ని చూడలేకపోయాడు. “దేన్ని చూచుకొని ఈ మాత్సర్యం?” వెంకటాచార్యులపై కండ్ల నురిమించి అన్నాడు.

“పెద్దవాడు, అన్నయ్యను అట్లా అనగూడదు నాయనా!” ఆండాళమ్మ బలవంతంగా దుఃఖాన్ని చంపుకొని అన్నది.

“పెత్తనము ఇట్లా ఉంటుందా? పెత్తనము రక్షించుకునేవాడే పెద్దవాడనిపించుకుంటాడు. సాగిందల్లా పెత్తనమనిపించుకోదు.” కంఠీరవం గొంతు చించుకొని అన్నాడు.

ఆండాళమ్మ అక్కడినుండి లేచి వంటింట్లోకి వెళ్ళింది.

“నా పెత్తనానికి అర్ధాలుతీసే ధైర్యంకూడా కలిగింది నీకు. నోరెత్తావంటే చీల్చేస్తా” వెంకటాచారి ఉగ్రుడై అన్నాడు.

“అది, అసలు నీ పెత్తనం తల్లిపై చేయిచేసుకునే నీవు, తమ్ముడిని చీల్చేస్తే ఆశ్చర్యం ఏం లేదు”

“మాట మాటకి అమ్మని వెనకేసుకొని వస్తావు! ఏమిటి నీ ప్రయోజకత్వం? పెట్టి సాద్తున్నావా? కష్టపడి సంపాదిస్తున్నావా? రండగా బ్రతుకుతున్న నీకే అంత నీల్గుడుంటే నేను నీకు భయపడ్తాననుకున్నావా? ఈ ఇంటికి నేను పెద్దను. మంచికి, చెడ్డకు నేను బాధ్యుణ్ణి. నాకెవరు అడ్డం వచ్చినా నేనూరుకోను. ఇంకా నోరెత్తావంటే వీపు పగులుతుంది. ఏమనుకొంటున్నావో” వెంకటాచారి కొట్టేంత కోపంతో అన్నాడు.

“వీపు పగులగొట్టి? ఆ తర్వాత? ఇంకేం చేస్తావు? వెళ్ళగొట్టవు?”

“సిగ్గు, లజ్జ అనేవి ఉంటే ఇంకా అనాల్నా?”

కంఠీరవం గిరుక్కున ఇల్లు వదిలి బయటపడ్డాడు.

“పో! ఎక్కడికి పోతావో, పో! ఈ బెదరింపులు నా దగ్గరనా? ఒక్క గవ్వ ఆదలేకున్నా నెత్తిన కూర్చునేవారే. అప్రయోజకపు ముండాకొడుక, మళ్ళా ఇంట్లో కాలుపెట్టావంటే చూడు” అని వెంకటాచారి మంచం దబాలున వేసుకొని, తత్తరపడ్తు కూర్చున్నాడు.

ఆండాళమ్మ ఆవేదనతో “ఎటుపాయె? ఎక్కడికి పోతడు?” అంటూ ఇంటి బయటికివెళ్ళి నాలుగు వైపుల సందులు పరికించింది. కంఠీరవం కనబడలేదు. “ఎంత మొండిపుట్టుక నాది, ఇవ్వన్ని చూడటానికే ఆ పరమాత్ముడు నన్ను బ్రతికిస్తున్నాడు. పోయినవాండ్లే మహారాజులు” అనుకుంటూ, వెంకటాచారిని భయంతో చూస్తూ తిరిగి వంటింట్లోకి వెళ్లింది.

వెంకటాచారి తానొక ఘనకార్యం చేసినంత సంతృప్తితో, తమ్మునిపై వచ్చిన కోపాన్ని చల్లార్చుకుంటున్నాడు.

“దొర మిమ్ముల రమ్మంటున్నాడు.” అని ఆడబాప రంగడు నిలుచున్నాడు.

“ఎవరు నాయనా! ఎందుకు?” అండాలమ్మ వడిగా వంటింట్లోంచి బయటికి వచ్చి అడిగింది.

వెంకటాచారి ఇల్లు వదిలి వచ్చిన వానితో వెళ్ళిపోయాడు.

ఆండాళమ్మ పసిపిల్లవలె కుమిలి కుమిలి ఏడ్వసాగింది.

5

కంఠీరవం పట్టలేని, భరింపరాని అవమానముతో చెరువు కట్టమీద నుండి పోతున్నాడు. ఎక్కడికి పోతున్నాడో, ఎవరి దగ్గరికి పోతున్నాడో, ఏమి చేయనున్నాడో, అతనికే తెలియదు. సుమారు ఒకటిన్నర మైలు పోయినాక ఒక చేనులో దోవ పక్కనే ఉన్న పాత గుడిలో ప్రవేశించాడు. కాళ్ళు బారవేశాడు. ముఖంనిండా పైపంచె కప్పుకున్నాడు. ఆలోచనలో లీనమయ్యాడు. సరిగా రెండు జాములవేళ. ఆకలితో కడుపు దహించుక పోతున్నది. ఆవేదనతో హృదయం తల్లడిల్లుతున్నది. అతనికి, అన్నకు జరిగిన వాదన మెదడులో మారు మోగుతున్నది. తల్లిని అన్న కొట్టే దృశ్యాలు జ్ఞాపకం రాసాగాయి. “అమ్మా” అని బావురుమంటూ ఏడ్చాడు.

మంచె కింద నీడన అన్నంతింటున్న చేను కాపరులు ఆ ఏడ్పువిని ఆశ్చర్యపడి, మెల్లగా వెతుక్కుంటూ, ఆ గుడి ముందరికి వచ్చి చకితులై చూశారు. వాండ్లకు ఎటూతోచలేదు. వాండ్లలో వాండ్లు ఏవో గొణుగ మొదలు పెట్టారు. కంఠీరవం ఏడుస్తూనే ఆ అలికిడిని కనిపెట్టి, ముఖం మీద బట్టతీసాడు. ఎదురుగా నిలుచున్న పిల్లలను చూచాడు. తిరిగి ఇంకా బావురమని ఏడ్చాడు.

ఆ పిల్లల్లో ఒకడు. “అయ్యగారి తమ్ముడురా!” అన్నాడు.

“ఇక్కడెందు కేడుస్తున్నడో?” ఇంకొక డన్నాడు.

“కడుపు నొప్పి లేస్తున్నదేమో.” మరొక డన్నాడు.

“ఏడ్వవద్దని చెప్పరాదురా?” ఒకడు ఇంకొడికి సలహా చెప్పాడు.

“ఆకలి అవుతుండొచ్చు, నెత్తిమీదికి పొద్దొచ్చింది. మొఖాన బొట్టులేదు.”

‘నేనుపోయి ఇన్ని దోసకాయలు, పెసరకాయ కంకులుతెస్తా. దారా పోదాం” అని ఒకడు ఇద్దరిని వెంటబెట్టుకొని వెళ్ళాడు.

కంఠీరవం వాండ్ల మాటలను, వాండ్ల అమాయకపు చూపులను శ్రద్ధగా గమనిస్తూ దుఃఖాన్ని అదుపులోకి తెచ్చుకున్నాడు. ఆ పిల్లలకు అడ్డంగా అప్పుడప్పుడు సజ్జకర్రలు ఊగుతుంటే, వాటికున్న కంకులు తమ ఆహారంగా అర్పిస్తున్నట్టనిపించింది. ఆ కర్రల మమతను కంఠీరవం ఆనందంతో అనుభవించాడు.

“ఈ చేను మీదేనా?” బొంగురుపోయిన గొంతుతో కంఠీరవం ఆ పిల్లలను ప్రశ్నించాడు.

“అవును మాదే. ఎందుకు? కంకులు కావాలా” పట్టరాని ఆనందంతో అని ఒక పిల్లవాడు ఇతర పిల్లవాండ్లను వికసించిన ముఖంతో చూచాడు.

“మనోళ్ళు ఎప్పుడొస్తారో? మనం తెంపుదాం” అని ఇద్దరు పిల్లలు కంకులు తెంపసాగారు.

“ఇట్టి అమృత హృదయాలుగల పిల్లలు పుట్టిన ఈ గ్రామంలో నా అన్నవంటి వాండ్లెట్లాపుట్టారో!” కంఠీరవం హృదయం కొట్టుకున్నది.

మొదట కంకులకై వెళ్ళిన పిల్లలు వచ్చారు. వెంట కట్టెపుల్లలు తెచ్చారు. వాండ్లలో అందరికంటె పెద్దవాడైన కనకయ్య తన నడుముకు చుట్టి ఉన్న జకముకి సంచి తీసి నిప్పుకొట్టి ఆ పుల్లలకు అంటించి మంటపెట్టాడు. కొందరు కంకులు కాలుస్తున్నారు. కొందరు దోస పిందెలచెక్కు తీస్తున్నారు. కొందరు పెసరకాయలు ఒలుస్తున్నారు.

కంఠీరవం పిచ్చివానివలె ఆ పిల్లల ఆరాటానికి, ఆప్యాయతకు ముగ్ధుడై ఆలోచిస్తున్నాడు. వీరెవరు? నేనెవరు? వీరికి నాకు ఏమిటి సంబంధం? నా ఆకలికి వీరి మనసు లెందుకు చలించాయి? నా ఏడుపు వీరి నెందుకింత కలవర పరచింది? అడుగనిదే ఏమిటి వీరి పరిచర్య, స్నేహభావము, ప్రేమ, మన్నన? ఎవరు నేర్పారు వీరి కివన్నీ? మంచి నేర్చుకోనవసరం లేదోమో! నేర్చుకోవలసినవి చెడ్డ విషయాలే కాబోలు! కంఠీరవం హృదయంలో తుఫాను రేగింది.

ఒక పిల్లవాడు దోసకాయలను ఎనిమిది భాగాలుగా కోసీ కంఠీరవం ముందర పెట్టాడు.

కంఠీరవానికి తల్లి జ్ఞాపకం వచ్చింది. ఏ విధంగాను సంబంధంలేని ఆ పిల్లలు ఆ విధంగా ఆత్మీయులై ఆదుకొని తహతహలాడ్తున్నారు. ఇక కన్నతల్లి తనకై ఎంత కుమిలిపోతున్నదో అని ఖేదపడ్డాడు. అతనికై విలపిస్తున్న తల్లిని అన్న ఎన్ని దుర్భాషలాడుతున్నాడో, ఇంటిలో ఎంత గంద్రగోళం జరుగుతున్నదో అని ఆలోచనలో పడ్డాడు.

రెండు దోసపిందెలు తిని చాలు నన్నాడు కంఠీరవం. కాల్చిన సజ్జలను పిల్లలు అందించారు. “మన మంతా కలసి తిందాం” అంటూ కంఠీరవం అందరి మధ్యలో కూర్చున్నాడు.

“ఇక ఏడ్వవు కద?” ఒక పిల్లవాడు అమాయకంగా అడిగాడు.

“ఏడ్వను” అని ఆ పిల్లవాని వీపు నిమిరాడు కంఠీరవం.

“నాకింకో సహాయం చేయాలె మీరు” అని కంఠీరవం ఇంకా ఏదో చెప్పబోతుండగనే “ఓ” అని పిల్లలంతా అన్నారు.

“మీలో ఎవరైనా వెళ్ళి గొట్టం కొమరయ్యను యిక్కడికి తీస్కరావాలె. నేనిక్కడే ఉన్న సంగతి మావాండ్లకు, మీవాండ్లకు ఎవరికి తెలియవద్దు” కంఠీరవం దీనంగా అన్నాడు.

“నేను వెళ్తా, నేను వెళ్తా” అని ఒకరికొకరు పోటీ పడ్డారు. కనకయ్య ముగ్గురు పిల్లలను పంపాడు.

“ఒరే! నీ గురిగి కడిగి అయ్యగారికి మంచినీళ్ళు తేనా?” ఒక పిల్లవాడు అన్నాడు.

“మనం తెస్తే అయ్యగారు తాగుతాడురా!” కనకయ్య వెంటనే అందుకొని, కంఠీరవాన్ని చూశాడు.

“అరె! ఎందుకు తాగను?” కంఠీరవం పరధ్యానంలో అన్నాడు.

“నిజంగా తాగుతవా?” ఒక పిల్లవాడు గట్టిగా అడిగాడు.

కంఠీరవానికి ఆ పిల్లవాడు అంటున్నది అప్పుడు తెలిసింది. వాండ్లు తెస్తే త్రాగడానికి అతనికి మనస్కరించక పోయినా, ఆ విషయం వాండ్లతో చెప్పడం బాగుండ దనుకున్నాడు.

“మీరు తేవడ మెందుకు? మనమే పోదాం. దగ్గరేనా కాలువ?” అంటూ కంఠీరవం లేచాడు. పిల్లలుకూడా లేచారు.

“మరి నేను ఒలిచిన పెసరగింజలు మరి?” ఒక పిల్లవాడు ముఖం మాడ్చుకొని అడిగాడు.

“మంచినీళ్ళు తాగి మంచెమీద కూచొని తిందాం” కంఠీరవం సమాధానం చెప్పాడు.

అంతా మంచినీళ్ళు తాగి మంచె మీదికి చేరుకున్నారు.

కంఠీరవం దిగాలుపడి తనగ్రామం వైపు చూస్తూ మంచె పై నిలుచున్నాడు.

“పుట్టి పెరిగిన గ్రామాన్ని విడిచి, నేను ఎల్లప్పటికి దూరం కావల్సిందే? నాకు, అన్నయ్యకు మధ్య ఏర్పడిన అగాధ మిట్లనే ఉంటుందా! మాకోసం మా అమ్మ యీ విధంగా ఎన్నాళ్ళు కృశించుతుండాలె? నాకు ఆదుకొనే దిక్కేలేదా? ఈ అన్యాయాలను అన్యాయాలుగా అనేవాడు, అడ్డుకొనేవాడే లేడా? అయితే ఈ విధంగా చూస్తూ ఊరుకోవడమేనా?” కంఠీరవం హృదయం కొట్టుకొన్నది.

పక్కన నిలుచున్న కనకయ్య నాలుగు వైపుల చూసి, “ఎవరోయ్” అని కేకవేశాడు.

కంఠీరవం తడబడుతు లేచి నిలుచున్నాడు. నాలుగు వైపుల చూచి “ఎవరు? ఎక్కడ? ఏరి? ఎవరూలేరే? కొమరయ్య వస్తున్నాడేమో” అన్నాడు.

కనకయ్య ఒకవైపు చూపుతూ “అగో! అటు చూడు. తెలతెల్లగా కనపడుతున్నరు. వీండ్లకోసమే మేము చేలలో కావలుండేది. వీండ్లతో ఏగలేం, కంకుల కాల మొచ్చిందంటే” అన్నాడు.

“ఎవరు వాండ్లు?” కంఠీరవం అడిగాడు.

“ఎవరో దిక్కులేని వాండ్లు, వాండ్లకిదేపని. సమయం కనిపెట్టి ఎవరి చేలనో జొరబడి అయినన్ని కంకులో, కాయలో తెంపుతరు. వాటితో ఆ రోజు గడిచిపోతది. పుట్టగతిలేనోండ్లు. ఇట్లా పదిమంది చేలోపడితే ఏచేనూ ఆగదు. మిగిలేది చొప్పే” అంటూ కనకయ్య మంచె దిగబోయి, తిరిగి ఒక కేక వేశాడు. పరీక్షగా చేనువైపు చూచాడు.

చేనులోనుండి యిద్దరు వ్యక్తులు బాటకు చేరి చేతులు పైకి లేపి ఏమి తెంపలేదన్నట్లు చేతులు తిప్పారు. ముందుకు నడిచి పోయారు.

“దొంగ ముండా కొడుకులు. చూచి కేక పెట్టకపోతే యాభై కంకుల కట్టయిన కట్టుకపోదురు. కనిపెట్టి కేకపెడ్తే, కంకులు తెంపలేదని బుద్ధిమంతులోలె వెళ్ళిపోతున్నారు” అన్నాడు కనకయ్య.

అతిశ్రద్ధగా కనకయ్య మాటలు వింటున్న కంఠీరవం “అయితే నాకు పెట్టిన కంకులు, దోసకాయలు, పెసరకాయవల్ల మీకు నష్టమే నంటావా?” అన్నాడు.

“అట్లనుకుంటే ఎట్ల? మేం మాత్రం అప్పుడప్పుడు కంకులు అవో ఇవో తింటూనే ఉంటం. కష్టాల్లో ఉన్న నీకు పెడ్తే మంచిదేగా, పైగా మీరు పెద్దలు. మీ కెంత పెడ్తే మా కంత పుణ్యముంటది. పని పాటలేక, జీతం నాతం లేక బతికే యీ అలగాజనంతోటి వస్తుంది కష్టం. అసలు పని లేకుండా ఎట్లా బతుకుతరో, నాకేం తోచదు. ఎండకాలంలో మాకు చేను పనులు లేకుండోర్కె మాకెక్కడ తోచదు. ఏదన్న పని మొదలు పెట్టుకుంటం” ఈ విధంగా కనకయ్య చెప్తున్న విషయాలు కంఠీరవం హృదయంలో నాటుకపోతున్నాయి. ఎవరో ఉపదేశం చేస్తున్నట్టనిపించింది. కనకయ్య మాటలకు వ్యాఖ్యానంగాని, అర్ధం కాని చెప్పనవసరం లేకుండానే మానవ ప్రవృత్తిని, సహజ భావాలను ప్రతిబింబింప చేస్తున్నాయని కంఠీరవం భావించాడు. కాని తన కులంవాండ్లను కనకయ్య అన్న మాటల్లో సోమరులుగా తలవక పోవడం కనకయ్య ఆలోచనా లోపమని కంఠీరవం అనుకున్నాడు.

“అయితే మేము పనిచేయక బ్రతికినా ఫర్వాలేదంటావా?”

“మీ కెట్లైనా రోజులు గడుస్తయి.”

“బిచ్చ మెత్తుకొని వెళ్ళ తీసినను మంచిదంటావా?”

“అది బిచ్చ మెందుకైతది?”

“అది నేను బిచ్చమంటా. గౌరవ మర్యాద లేని బ్రతుకంటా. సోమరితనమంటా.”

“మీరనేది నిజమైతే అది తప్పే” అంటూ కనకయ్య లేచి నిల్చొన్నాడు. ఒళ్ళు విరుచుకొని, చేను నాలుగు దిక్కులు చూచాడు. అరచేయి కండ్లకు కప్పుగా చేసికొని ఒకవైపు శ్రద్ధగా చూచి, “కొమరయ్య వస్తున్నట్టుంది” అన్నాడు.

కంఠీరవం ఆతురతతో లేచి నిలుచున్నాడు. “ఏడి? నిజంగానా? ఎక్కడినుండి వస్తున్నాడని” కనకయ్య పక్కకు నిలుచుండి కనకయ్య చూస్తున్న వైపు చూచాడు.

కంఠీరవం కొమరయ్యను రానైతే రమ్మనాడు కాని ఎందుకు పిలిపించింది, ఏమి అడగాల్సింది ఆలోచించనేలేదు.

కొమరయ్య దగ్గరికి వస్తున్న కొద్దీ కంఠీరవం దుఃఖం ఉబికి రాసాగింది. తన హృదయావేదనను విని అతని దుఃఖంలో, ఆవేదనలో, అభిప్రాయాల్లో భాగస్వామియై మానసిక భారాన్ని కొమరయ్య తీర్చగలడని అప్పుడు కంఠీరవానికి ఆశ కలిగింది.

కొమరయ్య, అతనికై వెళ్ళిన పిల్లలతో సహా సమీపానికి రాగానే కంఠీరవం వడిగా మంచెదిగాడు. తల్లి లేనప్పుడు పరాయిపిల్లలతో దెబ్బలు తిన్న చిన్న పిల్లవాడు కన్నతల్లి రాగానే పైనబడి ఏడ్చినట్టు, కంఠీరవం కొమరయ్యను అమాంతంగా కౌగిలించుకొని ఏడ్చాడు. కొమరయ్యకు ఏమీ అర్థం కాలేదు. అంతగా కుమిలిపోవడానికి కారణం కూడా తెలియదు. పిల్లలు పిలువగానే చేనునుండి నేరుగా అక్కడికి వచ్చాడు.

“మగవాడివి ఆ విధంగా ఏడుస్తావా? ఏమీ చెప్పకుండా అట్లా ఏడిస్తే ఎట్లా తెలుస్తుంది? రా! అటుపోయి కూర్చుందాం” అన్నాడు కొమరయ్య.

“పాపం! ప్రొద్దటినించి అన్నం తినలేదు. ఇన్ని సజ్జలు, దోసపిందెలే తిన్నడు” కనకయ్య దీనంగా అన్నాడు.

కొమరయ్య ఆశ్చర్యంగా కనకయ్యను చూచాడు. “ఏంది కనకయ్య! నువ్వు ఈ చేనుకాడ ఉన్నవు?” అన్నాడు.

“కోమటి శంభయ్యది ఈ చేను. నేను జీతానికున్న”

“మీ చేనేమైంది?”

“మా చేను అమ్మినంగదన్న? ఏయేటికి ఆయేడు శిస్తు యెళ్ళటమే కష్టమైంది. మా అయ్య చచ్చేముందే అమ్మేసి కోమటి శంభయ్యకు బాకీ కట్టినం. శంభయ్యే పాపమని జీతాని కుండమన్నడు” అంటూ కండ్లకు నీళ్ళు తీసుకొన్నాడు కనకయ్య. “సరే! నా దేందిగాని, అయ్యగారి సంగతేందో కనుక్కొ ముంజాత” అన్నాడు కనకయ్య.

కంఠీరవం కనకయ్య మాటలు శ్రద్ధగావింటూ తన దుఃఖాన్ని ఆపుకున్నాడు.

“ఊళ్ళోకి పోదాం పద, ఏమొచ్చింది అడవిలో పడి ఉంటానికి” కొమరయ్య కంఠీరవాన్నుద్దేశించి అన్నాడు.

కంఠీరవం దిగులుగా దిక్కులు పరికించాడు. “మనసు పట్టలేక నిన్ను పిలిపించిన, నీ పనులేమీ చెడిపోవుకద! నాకు నీవుతప్ప ఎవరు లేరని అనిపించింది.” ఒక్కొక్కటి తూచినట్టన్నాడు.

“మళ్ళా మీ అన్నకు నీకు నడిచిందన్నమాట. నేను ముందరే దొర పిలిస్తే పోతిగద! ఆడ్నించి మీ ఇంటికే వచ్చిన. మీ ఇంట్లో ఎవరూ లేరు. మీ అన్న నాకు దోవలో కనపడ్డడు. దొరోరింటికి పోతుండె. సరే, అదంత పోనీయిగాని, ఊళ్ళోకి పొదాంపద! మా యింటకిరా! నీకేం భయంలేదు. లే పోదాం” కొమరయ్య బలవంతం చేశాడు.

“కొద్దిగా చీకటి పడని. లేకుంటే మావాండ్లకు తెలుస్తుంది. మా అమ్మవచ్చి ఆరాటం చేస్తుంది. అప్పుడు ఇంటికిపోక తప్పదు. మా అన్నయ్యను కలిసికోక తప్పదు. అతను ఏదో అంటాడు. నేను ఊరుకోను. పైగా మా అన్నయ్య నన్ను ఇంట్లోంచి వెళ్ళి పొమ్మన్నాడు కూడా” కంఠీరవం అన్నాడు.

“మీ అన్నయ్య అనగానే అయింది? పెద్దమనిషి మీ అమ్మ లేదు? ఊళ్ళో పెద్దమనుషులు లేరు? మంచీ, చెడ్డా ఏమీలేకుండా ఇట్లా జరుగుతుంటే ఎవరు ఊరుకుంటారు?” కొమరయ్య ధైర్యంగా మాట్లాడాడు.

“ఏందో పాడు ఊరు. అన్నిటికీ దొరేనాయె. ఏం నాయం పాడైతది” తిరిగి కొమరయ్య నిరుత్సాహపడ్డాడు. “సరే నీ యిష్టం, చీకటి పడ్డాకనే పోదాం” అని ఇద్దరూ ప్రత్యేకంగా ఒకచోట కూర్చున్నారు. అన్నకు తనకు జరిగిన పంచాయితీ వివరాలు కంఠీరవం చెప్పాడు. ముసి ముసి చీకటి పడగానే ఊరివైపు బయలుదేరారు. చేనుకాపరి పిల్లలు దీనంగా కంఠీరవాన్ని చూచారు. ఒక పిల్లవాడు “మళ్ళా రేపు వస్తే చాలా కంకులు తెంపిపెడ్తం” అన్నాడు.

“దండం అయ్యగారు” కనకయ్య అన్నాడు. వెంటనే పిల్లలంతా “దండం అయ్యగారు” అని వికసించిన ముఖాలతో ఒకరినొకరు చూచుకున్నారు.

(మిగతా వచ్చే సంచికలో)

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)