- సుద్దగోని సంజీవ్
ఏ నిశ్శబ్ద పరీవాహక లోయ ఇది
ఏ వనాలు పూసిన తృణీకరించబడ్డ పుష్పాలివి
రాలే మొగ్గలకు సరిహద్దులెక్కడ
బతుకు పూదోటలకు చెలియలికట్టలు లేని కాలమెక్కడ
రాత్రి ఆహ్వానాన్ని తిరస్కరించిన
నక్షత్ర సమూహానికిదే స్వాగత సత్కారం
కరుణారహిత నిశ్శబ్దాన్ని ఛేదించిన వాడా
మంచుకురిసే వీధుల
నిస్సహాయ మరణాల ఆత్మల మేల్కొల్పినవాడా
కవీ…
నదిహొయలకు
నిశి కప్పినవాణ్ణి వెలివేసిన తత్వవేత్తా…
రెండు చందమామల ప్రేమగల చూపులకు
నల్లవస్త్రాల చీకట్లున్నంత కాలం ప్రయాణించు
జాలి చూపే జోలపాటలకేం
నవయవ్వనం మీద నడిచిపోయే
మబ్బుతెరల మాటలున్నంతకాలం ప్రయాణించు
రాత్రి పూవులకేం
సమస్త సమూహ ఆనందహేలలోనూ
ఉరిమే పూవులూ
ఆడే నక్షత్రాలూ
నిశ్శబ్దాన్ని మటుమాయం చేసేవరకూ
ప్రయాణించు
ప్రయాణించు
(ఒర్హాన్‌పాముక్ ‘స్నో’ నవలకు కృతజ్ఞతలతో…)