- ముదిగంటి సుజాతారెడ్డి

వేమన గురించి అంతా మనకు తెలిసినట్లే అనిపిస్తుంది. వేమన మనకు చాలా దగ్గరివాడు, నిత్యపరిచితుడు అనిపిస్తాడు. కాని నిజంగా చూస్తే వేమన ఏ కాలంవాడు, ఏ ప్రాంతం వాడు, ఏ ఊరువాడు, ఏ మత సంప్రదాయం వాడు అని చెప్పడానికి సరైన చారిత్రక ఆధారాలేవీ లేవు. క్రీ.శ. 13వ శతాబ్దం నుంచి క్రీ.శ. 17వ శతాబ్దం వరకు వేమన కాలాన్ని పరిశోధకులు చెప్తుంటారు. 17వ శతాబ్దంలో కరువు కాటకాలతో అస్థిర రాజకీయాల మధ్య ఏర్పడిన నైరాశ్యపు రోజుల్లో వేమన పుట్టి నీతి వైరాగ్య పద్యాలను చెప్పాడని అంటారు. మరికొందరు వేమన కొండవీటి రెడ్డిరాజుల వంశంలో పుట్టాడని, క్రీ.శ. 15వ శతాబ్దం వాడుగా చెప్తారు. గురజాడ అప్పారావు కన్యాశుల్కం నాటకంలో వేమన ప్రసక్తిని తెచ్చి వేమన ఆరువందల ఏండ్ల కిందట వాడని అన్నాడు. కన్యాశుల్కం 19వ శతాబ్దం చివర వ్రాయబడింది. అంటే అప్పుడు వేమన 600 ఏండ్ల కిందటివాడని గురజాడ అంగీకరిస్తే వేమన కాలం క్రీ.శ. 13వ శతాబ్దం అవుతుంది. ఇదే సరైనకాలం అని అనిపిస్తుంది. ఎందుకంటే వేమన పద్యాలల్లో మనకు నాథ సంప్రదాయం సిద్ధాంతాల ప్రభావం బాగా కనిపిస్తుంది. మూఢ నమ్మకాలను విమర్శించడం, విగ్రహపూజలను, తీర్థయాత్రలను, తీర్థ స్నానాలను నిరసించటం, వేదకర్మలను అంటే యజ్ఞయాగాది కర్మకాండలను బ్రాహ్మణాధిక్యతను కాదనటం, కులవివక్షను కులభేదాన్ని నిరాకరించటం, ఆత్మ పరమాత్మ ఒక్కటే అన్న భావజాలం, యోగవిద్యల నభిమానించటం వంటి ఎన్నో విషయాలు వేమన పద్యాల్లో మనకు కన్పిస్తాయి. అందుకే వేమన క్రీ.శ. 13, 14 శతాబ్దాల్లో ఆంధ్ర దేశంలో ప్రచారంలో ఉన్న నాథయోగ సంప్రదాయానికి చెందినవాడని చెప్పవచ్చును. తెలుగులో క్రీ.శ. 15వ శతాబ్దం వాడైన గౌరవ ‘నవనాథ చరిత్ర’ కావ్యం వ్రాశాడు. నవనాథులు అంటే తొమ్మిదిమంది ‘నాథ’ అని పిలువబడే ఆచార్యులు. వీరు నాథ సంప్రదాయాన్ని ప్రజల మధ్య తిరుగుతూ ప్రజల భాషలో రచనలు చేశారు. అద్వైత విశిష్టాద్వైత వంటి ఎన్నో మత సంప్రదాయాలు శిష్టవర్గంలో ప్రచారంలో ఉన్నాయి. వాటి గురించి మనకు తెలుసు. కాని సామాన్య ప్రజల్లో ఎన్నో మత సంప్రదాయాలు ప్రచారంలో ఉండేయి. వాటిని గురించి ఎక్కువగా మనం పట్టించుకోము. బౌద్ధంలో సిద్ధ సంప్రదాయం యోగవిద్య మీద ఆధారపడింది ఒకటి ఉండేది. 84 మంది సిద్ధ యోగులు ఈ బౌద్ధసిద్ధ సంప్రదాయాన్ని ప్రజల్లో ప్రచారం చేశారు. ఈ సిద్ధ సంప్రదాయానికి శ్రీ పర్వతం అంటే ఇప్పటి శ్రీశైలం ప్రధాన కేంద్రంగా ఉండేది. సిద్ధ సంప్రదాయం కన్యాకుమారి నుంచి కాశ్మీరం, సింధు నుంచి అస్సాం వరకు వ్యాపించింది. తమిళనాడులోని సిద్ధ వైద్యం ఈ సిద్ధయోగుల విద్యయే అంటారు. తమిళంలో వేమనలాగానే నీతిధర్మ పద్యాలను చెప్పిన ప్రసిద్ధుడైన తిరువళ్ళువరు ఈ సిద్ధ సంప్రదాయానికి చెందిన వాడే అని అంటారు. బౌద్ధ సిద్ధ సంప్రదాయంలో కుళ్లు ప్రవేశించి క్షీణించిన తర్వాత దాన్నుంచే మత్స్యేంద్రనాథుడు ఆ తర్వాత అతని శిష్యుడు గోరభినాథుడు శివుడ్ని మూలాధారంగా చేసుకున్న నాథయోగ సంప్రదాయాన్ని సామాన్య జనుల్లో బోధించారని అంటారు. వీళ్ళిద్దరే కాక ఇంకా ఏడుమంది చౌరంగనాథుడు, విరూపాక్షనాథుడు, మేఘనాథుడు, నాగార్జున నాథుడు, ఖణికనాథుడు, మంజునాథుడు, బుద్ధనాథుడు వెలిశారని ఈ నవనాథులు ప్రచారం చేసిన మత సంప్రదాయమే నాథ సంప్రదాయంగా ఏర్పడిందని అంటారు. నాథ సంప్రదాయం క్రీ.శ. 8వ శతాబ్దంలో ఏర్పడి క్రీ.శ. 15వ శతాబ్దం వరకు ప్రచారంలో ఉంది. తర్వాతనే నాథ సంప్రదాయం ప్రభావంతో కబీర్‌పంథ, వార్కరీ, సిక్కు, అచల మొదలైన సంప్రదాయాలు బయలుదేరాయి. అందుకే మనకు తిరువళ్ళువరు, కబీరు, వేమనల్లో సమాన భావజాలం కన్పిస్తుంది. వాళ్ళు మూఢ నమ్మకాలను, కర్మకాండలను నిరసించి, నిర్గుణ బ్రహ్మోపాసనను బోధించారు.

వేమన కొండవీటి రెడ్డిరాజుల వంశంలో పుట్టాడని కొండవీటివాడని అంటారు. కాని దానికి ఆధారాలేమీ లేవు. ‘ఊరు కొండవీడు,’ అని వేమన ఒక పద్యంలో యోగార్థం చెప్తూ చెప్పాడు. దాన్నిబట్టి అతని ఊరు కొండవీడు అని అనలేము. కొండవీటి రెడ్డిరాజుల్లో వేమారెడ్డి, అనవేమా రెడ్డి, పెదకోమటి వేమారెడ్డి అని ‘వేమ’ పేరు ఉన్నవాళ్ళు చాలామంది ఉండటం చేతనో ఏమో, వేమనను కూడా ఆ వంశం వాడని చెప్పారు. కాని వేమన భోగభాగ్యాల్లో పెరిగాడని ఒక వేశ్యమూలంగా హఠాత్తుగా భోగి నుంచి విరాగి అయ్యాడని అంటారు. ఆ విధంగా భర్తృహరి, తులసీదాసులు కూడా తమ భార్యల కారణంగా హఠాత్తుగా భోగి నుంచి విరాగులయ్యారని కథలున్నాయి. వేమన గురించి అటువంటి కథే ప్రచారంలో ఉంది. వేమన కర్నూలు జిల్లావాడని, గండికోట దుర్గాధిపతి తమ్ముడని వేమన గురించి పరిశోధన చేసిన బ్రౌను విశ్వసించాడు. వేమన పద్యాలు, వేమన పీఠాలు, వేమన అవతారాలు ఎక్కువగా రాయలసీమలో ఉండటం చేత వేమనను రాయలసీమవాడని, నాథ సంప్రదాయాన్ని విశ్వసించాడు కాబట్టి శ్రీశైలం సమీపంలోని కర్నూలు మహబూబునగరం ప్రాంతాల్లో సంచరించాడని చెప్పవచ్చును. బ్రౌను కూడా వేమన తెలంగాణ దక్షిణ పశ్చిమ ప్రాంతంవాడని, వేమన వాడిన భాషను బట్టి నిర్ణయించాడు.

వేమన చాలాకాలం వరకు మరుగున పడి వున్న కవి! యోగి! ఆధునిక కాలంలో మన రాష్ట్రానికి ఉద్యోగులుగా వచ్చిన బ్రిటిషు అధికారుల ప్రయత్నం వల్లనే వేమన అందరి దృష్టిలోకి వచ్చాడు. లేకపోతే అంతవరకు ప్రజాసామాన్యం నోళ్ళలోనే ఆ కవి పద్యాలు ప్రచారంలో ఉండి నిలిచి ఉన్నాయి. అందుచేత వేమనను అచ్చమైన ప్రజాకవి అని చెప్పవచ్చును. అంతేకాక సామాన్య ప్రజల్లో తిరుగుతూ సామాన్య జనుల భాషలో వాళ్ళకు అర్థమయ్యే రీతిలో వాళ్ళ కోసం చెప్పిన కవి కాబట్టి వేమన ప్రజాకవి! వేమన పద్యాలను మొట్టమొదట క్రీ.శ. 1731లో ఫ్రెంచ్ ఫాదర్ లెగాక్ 368 వరకు సేకరించాడు. వాటిని ప్యారిస్ లైబ్రరీలో భద్రపరిచాడు. తర్వాత అబెదుబాయ్ అనే క్రైస్తవ మిషినరీ, ‘భారతీయుల ఆచారాలు- సంప్రదాయాలు’ పుస్తకాన్ని ఇంగ్లీషులో వ్రాస్తే దానికి జి.యు. పోప్ అనే మిషినరీ ఫాదర్ ముందుమాట వ్రాశాడు. పోప్ తమిళభాషకు చాలా సేవ చేసిన వ్యక్తి. తిరువళ్ళువరు పద్యాలను వెలికితీసి కృషి చేసినవాడు. ఆ పోప్ తన ముందు మాటలో వేమన పద్యాల నడకను, భాషలోని తీయదనాన్ని మెచ్చుకున్నాడు. తర్వాత మేజర్ మ్యాక్‌డొనాల్డ్, డేవిడ్ బార్నెట్, గోవర్, హెన్రీ బవర్, జె.డి.బి. గ్రిబిల్, గ్రియర్సన్ వంటి పాశ్చాత్యులు వేమనను గురించి నూతన విషయాలను సేకరిస్తూ వ్యాసాలు వ్రాశారు.

బ్రిటిషు ఉద్యోగిగా రాయలసీమ కడపకు వచ్చిన సి.పి. బ్రౌను తెలుగు నేర్చుకోవాలని సులభశైలిలో ఉన్న రచనలను చదవాలనే ఉద్దేశంతో ఉండగా అతనికి వేమన పద్యాల తాళపత్ర ప్రతులు దొరికాయి. ఆ విధంగా బ్రౌను 1824 నుంచి వేమన పద్యాల అన్వేషణకు పూనుకున్నాడు. 2500 పద్యాలను సేకరించి వాటిలోని పునరుక్తులను తీసేసి 2100 పద్యాల ప్రతిని తయారుచేశాడు. 1829లో 693 పద్యాల నెన్నుకొని ఆంగ్లానువాదంతో ప్రచురించాడు. తిరిగి 1839లో అదనంగా మరికొన్ని పద్యాలను అనువాదం చేసి 1163 పద్యాలను ఆంగ్లానువాదంతో ప్రచురించాడు. 1879లో బ్రౌను పద్యాలను 1157 తీసుకొని వావిళ్ళవారు ముద్రించారు. ఇది అనేక పునర్ముద్రణలు పొందింది. వేమన పద్యాలను బ్రౌను నీతి, మతం, అవహేళన- అని విభజించి ప్రచురించాడు. నీతి వైరాగ్య ఆధ్యాత్మికం అని కూడా వేమన పద్యాలను విభజించడం జరిగింది. మూఢనమ్మకాలను విమర్శిస్తూ నీతి బోధనలో చేసే వేమన పద్యాలు పాశ్చాత్య పరిశోధకులను, మిషనరీ ఫాదరీలను బాగా ఆకర్షించాయి. ఆ కాలంలో హిందూమతం కుళ్ళిన ఆచారాలతో, మూఢ నమ్మకాలతో అంధ విశ్వాసాలతో, విగ్రహ పూజలు, కర్మకాండలతో, బలులతో, నీతిబోధ, క్రమశిక్షణ విద్యలేని ‘పగన్’ (ఆటవిక) మతంగా వాళ్ళకు గోచరించింది. ఆ అరణ్యం మధ్యలో భర్తృహరి వేమన పద్యాలు సంస్కృతంలో, తెలుగులో ఉన్నవి వాళ్ళను ఆకర్షించాయి. అప్పుడు వేమన పద్యాలను కొన్నిటిని పాఠ్యపుస్తకాల్లో చేర్చారట. కాని సంప్రదాయ పండితులు హిందువులను క్రైస్తవంలోకి మార్చడానికే హిందువుల ఆచారాలను గర్హించే పద్యాలను పెట్టారని తమ నిరసనను తెలిపారట. కాని హిందువుల్లోను అభ్యుదయ భావాలు ప్రవేశించినంక వేమన గొప్పతనాన్ని తెలుసుకున్నారు. తెలుగు సాహిత్యంలోనూ అతనికి గౌరవ స్థానం లభించింది. మొట్టమొదట 1914లో కట్టమంచి రామలింగారెడ్డి తన ‘కవిత్వ తత్వ విచారము’ గ్రంథంలో వేమనను ప్రశంసించాడు. రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ ‘వేమన’ మీద ఉపన్యాసాలు ఇచ్చాడు. వాటిని 1929లో ‘వేమన’ అనే పుస్తకంగా అచ్చు వేశారు. తర్వాత ఆరుద్ర, పట్టాభిరామిరెడ్డి, త్రిపురనేని వేంకటేశ్వరరావు, బంగోరే, మరుపూరు కోదండరామిరెడ్డి, గుర్రం వెంకటరెడ్డి, కొర్లపాటి శ్రీరామమూర్తి, సుభాని, గంథం అప్పారావు, ఎన్. గోపి, ముదిగంటి సుజాతారెడ్డి వేమన గురించి పరిశోధనలు చేసి వ్యాసాలు, పుస్తకాలు ప్రచురించారు. వేమన శ్రీశ్రీకి అభిమాన కవుల్లో ఒకడయ్యాడు. “ఆది కాలంలో తిక్కన మధ్యకాలంలో వేమన ఆధునిక కాలంలో గురజాడ మన తెలుగులో మహాకవులు,'’ అని చాటాడు శ్రీశ్రీ. “ఒక్క గురజాడ మాత్రమే ప్రపంచంలో ఎప్పటి ప్రమాణాలకైనా నిలువగల సార్వజనీనతను సాధించినవాడు. ప్రాచీన కవులలో వేమన అటువంటివాడు,'’ అంటాడు శ్రీశ్రీ, ‘మన గురజాడ’ అన్న పుస్తకంలో. ‘మన గురజాడ’, శ్రీశ్రీ పుస్తకానికి ముందుమాట రాస్తూ చలసాని ప్రసాద్, ‘శ్రీశ్రీ తండ్రి, గురజాడ తాత, వేమన ముత్తాత’ అని పీటలు వేసి గౌరవించాడు. ఆ విధంగా ఒకప్పుడు శిష్ట సాహిత్యంలో గుర్తింపే లేని వేమనకు గొప్ప గుర్తింపు వచ్చింది. కవిగా స్థానం లభించింది.

వేమన ‘ఆటవెలది’ ఛందస్సులోనే పద్యాలు వ్రాశాడు. ఆటవెలది నాలుగు పాదాలల్లో చివరి పాదం, ‘విశ్వదాభిరామ వినురవేమ’ అని మకుట పాదం. అది ఒక్కటే తీరుగా ఉంటుంది. ఇక మొదటి మూడు పాదాల్లోనే అతడు చెప్పదలుచుకున్న విషయాన్ని చెప్తాడు. ఆ మూడు పాదాలు ఏ పాదానికి ఆ పాదం తెగిపోయి సంపూర్ణ అర్థంతో ఉంటాయి. తెలుగు పద్యాల్లో ఒక పాదం మరో పాదంలోకి పదం అక్షరాలు సమాసం అక్షరాలు చొచ్చుకొనిపోయి గొలుసుకట్టుగా ఉంటాయి. యతిప్రాసల దగ్గర విరామం అంటారుగాని అక్కడ కూడా పదం అంతం కావాలనే నియమం లేదు. కాని వేమన ఆటవెలది పాదాలు దేనికదే పదం అంతమై పరిపూర్ణ అర్థంలో ఉంటుంది.
ఉదా:
ఉప్పుకప్పురంబు ఒక్క పోలిక నుండు
చూడచూడ రుచుల జాడవేరు
పురుషులందు పుణ్య పురుషులు వేరయా
విశ్వదాభిరామ వినురవేమ

పై పద్యంలో చూడవచ్చును- ఏ పాదానికి ఆ పాదం తెగిపోయి నిండు అర్థంతో స్వతంత్ర పాదాలుగా ఉన్నాయి. అంతేగాక వేమన పద్యాల్లో ఎక్కడైనా అర్థంగాక కష్టమైన పదంగాని, సమాసాల చిక్కులుగాని కన్పించవు. అందుకే పండు ఒలిచినట్లుగా వేమన పద్యాలు సులభంగా పాఠకులకు, శ్రోతలకు తొందరగా అర్థమవుతాయి. అంతేగాక సులభంగా నోటికి గుర్తు ఉంటాయి. అందుకేనేమో తెలుగు వచ్చినవాడికి ఒక వేమన పద్యమైనా వచ్చి ఉంటుంది. వేమన పద్యం రానివాడే తెలుగువాళ్ళల్లో ఉండడు. వేమన పద్యాలు చక్కని అర్థరామణీయకతలో ఉంటాయి. ధ్వనిపూర్వకమైన అర్థాలు కన్పిస్తాయి. ఉపమ, అర్థాఃతరన్యాసాలంకారాలను సహజంగా ప్రయోగిస్తాడు. ఎక్కడా కృత్రిమత అనేది ఉండదు.

ఉదా: ఉపమాలంకారం శోభ చూడండి-
వేదవిద్యలెల్ల వేశ్యలవంటివి
భ్రమలపెట్టి తేటపడగనీవు…

ఒక దృష్టాంతం చూపి గొప్ప జీవిత సత్యాన్ని చెప్తాడు-

అల్పుడెపుడు పల్కు నాడంబరముగాను
సజ్జనుండు పల్కు చల్లగాను
కంచుమోగునట్లు కనకంబు మ్రోగునా…

ఇప్పుడు అచ్చు వేసేవాళ్ళు వేమన పద్యాలను 5000 వరకు వేస్తున్నారు. వాటిల్లో వేరేవేరు మకుటాలు, వేరువేరు సీసం మొదలైన ఛందస్సులున్నాయి. అట్లాగాక ఆటవెలది ఛందస్సులో వున్నవే వేమన పద్యాలని, ‘విశ్వదాభిరామ వినురవేమ’ అనే మకుటంతో ఉన్నవే వేమన పద్యాలనీ, వాటిల్లోనూ పునరుక్తులు లేనివాటిని రచనాపటిమగల వాటిని వేమన పద్యాలుగా ఎన్నుకొని ప్రచురించవలసి ఉంది. అటువంటి పరిశోధన జరుగవలసి ఉంది. వేమన పద్యాలను పది వరకు చదివినా అటువంటి పద్యాన్నొకదాన్ని మనం చెప్పగలుగుతాం. అంతటి శక్తి, వేమన పద్యాల్లో ఉంది. కాబట్టి వందల సంవత్సరాలుగా ఎందరో వేమన పద్యాల ననుకరిస్తూ చెప్పిన పద్యాలు వేమనవని చలామణి అవుతున్నాయి. కాబట్టి ‘తళుకు బెళుకు రాళ్ళు తట్టెడున్నా నిక్కమైన మంచి నీలాల’ వంటి వేమన పద్యాలను ఏరి శుద్ధపు అని ప్రచురించి వ్యాప్తిలోకి తేవలసిన అవసరముంది.

‘వేమన’ పేరు గురించి కూడా చాలా తప్పు అభిప్రాయం ప్రచారంలో ఉంది. ‘వేము’ అంటే వేపచెట్టు అని చెట్టు పేరును మనిషి పేరుగా పెట్టుకోవటం ఆచారంగా ఉందని, కాబట్టి ‘వేము’ చెట్టు పేరే వేమన పేరు అని అన్నారు. కాని దేవుడు ఆ చెట్టుకింద వెలిస్తే తప్ప కేవలం చెట్టు పేరును పేరుగా పెట్టుకోవటం ఎక్కడా లేదు. శివునికి భీమన అని పేరుంది. ఆ భీమన పదమే ప్రాకృతంలో వీమన అవుతుంది. వీమనయే క్రమంగా ఉచ్ఛారణలో వేమనగా మారింది అని నేను నా పుస్తకం ‘వేమన నాథ సంప్రదాయం’లో వివరించాను. ‘విశ్వదాభిరామ వినురవేమ’ అన్న మకుటానికి విశ్వతం+అభిరామ అంటే అంతటా వ్యాపించిన పరమాత్మ అని అర్థం. ఆ నిర్గుణ పరమాత్మను సంబోధిస్తూ వేమన ‘కహతా కబీర్ సునో భాయి సాధో,’ అన్నట్లుగా పరమాత్మ సాక్షిగా వేమన చెప్పే మాటలు జనులారా వినండి అన్న అర్థాన్ని చెప్పాలి. వేమన పద్యాలల్లో నీతిబోధ ఉంటుంది-

హీనగుణమువాని నిలుసేర నిచ్చిన
ఎంతవానికైన నిడుము కలుగు
ఈగ కడుపుజొచ్చిన యిట్లట్లు సేయదా!

ఎంత చదువు చదివి యెన్ని విన్ననుగాని
హీనుడవగుణంబు మానలేడు
బొగ్గు పాలగడుగ పోవునా మలినంబు

చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు
కొంచెమైనను నదియు కొదవగాదు
విత్తనంబు మర్రివృక్షంబునకు నెంత!

మాటలాడుటొకటి మనసులో నొకటి
ఒడలి గుణము వేరె యోజ వేరే
ఎట్లు గల్గు ముక్తి యీలాగు తానుండ!

మనిషి కామక్రోధలోభమోహమదమాత్సర్యాలను జయించాలని వేమన ఎన్నో పద్యాల్లో చెప్పాడు. మనిషి వాటిని జయిస్తేనే నిజమైన మనిషి అవుతాడు. మానవతా వాది కాగలుగుతాడు.

మోహలోభములను మొనయుట బహు కీడు
మోహముడిగెనేని ముక్తుండగును
లోభముడిగెనేని లోకంబుల నెరుగు

ధనాశను వేమన నిందిస్తాడు. అందుకేనేమో వేమనను కొందరు కమ్యూనిస్టు భావాలు కల కవి అన్నారు.

ధనము కూడబెట్టి దానము చేయక
తాను దినక లెస్స దాచుగాక
చచ్చునపుడు కూడ వచ్చునా పోచయైన

లోభివాన్ని వేమన చాలా తీవ్రంగా నిందించాడు. దానగుణాన్ని ప్రశంసించాడు.

పిసినివాని ఇంట పీనుగు వెడలిన
కట్టెకోలలకును కాసులిచ్చి
వెచ్చమాయె ననుచు లెక్కలెక్కేడ్చురా

లోభివాని జంప లోకంబు లోపల
మందు వలదు వేరు మందు కలదు
పైకమడిగినంత భగ్గున పడిచచ్చు!
లోకంలో ధనం గలవానికే కీర్త, పరువు! కలిమితోనే కులము కూడా!
కులము గల్గువారు గోత్రము గలవారు
విద్య చేత విర్రవీగువారు
పసిడిగల్గువాని బానిస కొడుకు

వేమన అన్ని వ్యామోహాలకు స్త్రీ మూలమని ఒకటి రెండు చోట్ల స్త్రీని తూలనాడినా ఇల్లాలుగా స్త్రీని గౌరవించాడు.

ఇంటి యాలి విడిచి యిల జారకాంతల
వెంట దిరుగువాడు వెర్రివాడు
పంట చేను విడిచి పరిగయేరిన యట్లు

సుగుణవంతురాలు సుదతియై యుండిన
బుద్ధిమంతులగు పుత్రులొప్ప
స్వర్గమేటికయినా సంసారి కింకను

అని సుగుణవతి అయిన స్త్రీని వేమన నోరారా ప్రశంసించాడు. అటువంటి స్త్రీని విడిచిపెట్టి పరస్త్రీని చేరేవాడ్ని వేమన నిందించాడు.

ఏ పని చేసినా చిత్తశుద్ధితో చేయాలని వేమన కోరిక-

ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల
భాండ శుద్ధిలేని పాకమేల?

కులభేదాన్ని వేమన నిరసించాడు-

అజ్ఞానమే శూద్రత్వము
సుజ్ఞానమే బ్రహ్మమౌ
… అంటాడు వేమన.

మాలవాని నేల మహి మీద నిందింప
వానిలోని వెలుగు వాని కులంబేది?
మాలమాలగాదు మహి మీద జూడంగ
మాట తిరుగువాడె మాల గాక
వాని మాలయన్న వాడె పోపెనుమాల

రామరామ పఠన మహిమచే వాల్మీకి
పరగబోయడయ్యు బాపడయ్యె
కులము ఘనముకాదు గుణము ఘనంబురా

 

విగ్రహపూజలను, దేవాలయ నిర్మాణాలను వేమన నిందించాడు-

రాతిబొమ్మకేల రంగైన వలువలు
గుళ్ళు గోపురములు కుంభములును
కూడుగుడ్డ తాను కోరునా దేవుడు?

తీర్థయాత్రలను, తీర్థస్నానాలను నిరర్థకమని వేమన హేతువాదంతో అంటాడు-

నీళ్ళ మునగనేల నిధుల మెట్టగనేల
మొనసి వేల్పులకును మొక్కనేల
కపట కల్మషములు కడుపులో నుండ

తీర్థయాత్రలు చేస్తే పాపాలు హరించుకపోతాయనడాన్ని వేమన నిరసించాడు-

కాశిపోదు ననుచు నడకట్టగా నేల
కాశితీర్థమునకు గదలనేల
దోషకారి నెట్లు దొరుకురా మా కాశి…

వేమన దొంగ సాములను నిరసించాడు-

ఆసనంబు బన్ని అంగంబు బిగియించి
ఒడలు విరుచుకొనెడు యోగమెల్ల
జెట్టిసాము కన్న చింతాకు తక్కువ

ఒడలు బడలజేసి యోగుల మనువారు
మనసు కల్మషంబు మాన్పలేరు
పుట్ట మీద గొట్ట భుజగంబు చచ్చునా

కాయగూరలు అని కాషాయవస్త్రముల్
బోడి నెత్తి గలిగి పొరయుచుండ్రు
తలలు బోడులైన తలుపులు బోడులా

శరీరంలోని ఆత్మయే దైవం, పరమాత్మ అంటాడు వేమన. దాన్ని తెలుసు కోవాలి మనిషి.

శైవ వైష్ణవాది షణ్మతంబుల కెల్ల
దేవుడొక్కడగుట తెలియలేడు
తమకు భేదమైన తత్త్వంబు భేదమా

బ్రహ్మమనగ వేరె పరదేశమున లేదు
బ్రహ్మమనగ తానె బట్టబయలు
తన్ను తానెరిగిన తానె పో బ్రహ్మంబు…

దేవుడని అవతారాలని నమ్మటాన్ని కూడా వేమన ఒక హేతువాదిలాగా ప్రశ్నిస్తాడు-

కనకమృగము భువిని కద్దు లేదనకను
తరుణి విడిచి చనియె దాశరథియు
తెలివి లేనివాడు దేవుడెట్లాయెరా?

విరాగిగా వేమన ఈ లోకం మీది మోహాన్ని ప్రశ్నిస్తాడు-

ఏమి గొంచు వచ్చెనేమి తా గొనిపోవు
పుట్టు వేళ నరుడు గిట్టువేళ
ధనము లెచటి కేగు తానెచ్చటికేగు?

తద్దినాలు, ముహూర్తాలు అనే నమ్మకాలను మూఢ నమ్మకాలుగా వేమన హేతువాదంతో ప్రశ్నిస్తాడు-

పిండములను జేసి పితరుల దలపోసి
కాకులకును బెట్ట గాడ్దెలార
పెంట తినెడి కాకి పితరుడెలాయెనో?

విప్రులెల్ల జేరి వెర్రికూతలు కూసి
సతపతులను గూర్చి సమ్మతమున
మునుముహూర్తముంచ ముండెట్లు మోసెరా!

ఈ విధంగా వేమన సూక్తి పద్యాలను ఎన్నిటినైనా ఉదహరించవచ్చును. ఎన్నో అభ్యుదయ భావాలను హేతువాదోక్తులను చెప్పిన వేమనను అందుకే ఆధునికులు అభ్యుదయ కవి, విప్లవ కవి, కమ్యూనిస్టు కవి, బౌద్ధకవి, మావనతావాద కవి, నాస్తికకవి అని పిలిచారు. ఇక ప్రాచీనులు కూడా శైవకవి, అద్వైత కవి, శివయోగి, యోగికవి అని అన్నారు. వేమన పద్యాల్లో నీలిధర్మమే కాక ఆధునిక పాఠకులకు పనికివచ్చే సూక్తులెన్నో వున్నాయి.

ఎరుక గలవాడె హెచ్చైన కులజుండు
లోభివాని నడుగ లాభంబు లేదయా
దొంగమాటలాడి దొరకునె మోక్షంబు…
సాధనమున పనులు సమకూరు ధరలోన…
కోపమునను ఘనత కొంచెమై పోవును…
అల్పుడాడు రీతి అధికుండు నాడునా…
తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు
పుట్టనేమి వాడు గిట్టనేమి…
కుత్సితుండు చేరి గుణంతు చెరచురా…
మనసు విరిగెనేని మరియంట వచ్చునా…
పచ్చికాయ దెచ్చిపడవేయ ఫలమౌనె…
ఎలుకతోలు తెచ్చి ఎన్నాళ్ళు వుతికినా
నలుపు నలుపేగాని తెలుపుగాదు…
పచ్చికుండ నీళ్ళు పట్టిన నిల్చునా…
కొండలన్ని పిండి గొట్టవచ్చు
కఠిన చిత్తుమనసు కరిగింపగా రాదు
స్థానబలిమిగాని తన బలిమిగాదయా
విత్తనంబు మర్రివృక్షంబునకు నెంత…
కంచు మోగునట్లు కనకంబు మోగునా…
గొడ్డుటావు పాలు గోతితే చేపునా'’
తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు…
గంగగోవు పాలు గరిటైడైననుచాలు
కడివెడైన నేమి ఖరము పాలు'’
మేడిపండు పండు చూడ మేలిమై యుండు
పొట్టవిప్పి చూడ పురుగులుండు
నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు
తళుకు బెళుకు రాళ్ళు తట్టెడేల
కుక్క తోక బట్టి గోదావరీదునా
కాశికరగు పంది గజము కాదు
కొండయుద్ధమందు కొంచెమై యుండదా

వేమన పద్యాలను, సూక్తులను లిఖింపజేసి తిరువళ్ళవరు కొట్టము లాగా ఒక వేమన భవనాన్ని నిర్మించాలి. వేమన చెప్పిన నీతి మాటలను మానవతావాదాన్ని, హేతువాదాన్ని ప్రచారం చేయాలి. అంతటా వినిపింపజేయాలి. అప్పుడే మనం వేమనకు సరైన నివాళిని సమర్పించిన వాళ్ళం అవుతాం!

4 అభిప్రాయాలు

  1. ప్రసాద్ 08 డిసంబర్ 2006 , 11:22 am

    నాకు తెలియని అద్భుత పద్యాలను పరిచయం చేశారు. ఆయన మొత్తం ఇప్పుడు లభిస్తున్న పద్యాలెక్కడైనా online లో వున్నాయా?
    ఆ కాలంలోనే ఇంత హేతుబద్దంగా ప్రశ్నించగలిగినా వాడంటే సత్యాన్ని ఆయనెంతో లోతుగా తెలుసుకున్నవాడు.

    –ప్రసాద్
    http://blog.charasala.com

  2. Rohiniprasad 08 డిసంబర్ 2006 , 3:18 pm

    మంచి వ్యాసం. వేమన పద్యాల్లో ఎక్కడా ముస్లిముల గురించిన ప్రస్తావన ఉన్నట్టు గుర్తులేదు. దీని బట్టే అతను పదమూడో శతాభ్దంవాడని అనుకోవచ్చునేమో సుజాతగారు చెప్పాలి. సంఘంలో అవినీతి పెరిగినప్పుడే నీతిశతకాలు వస్తాయంటారు. ప్రస్తుత కాలంలో ఎన్ని నీతులు చెప్పినా సరిపోవనిపిస్తుంది.

    ప్రసాద్ గారూ, ఈ లింకు చూడండి
    http://eenadu.net/sahithyam/display.asp?url=vemana.htm

  3. శాయి 09 డిసంబర్ 2006 , 1:45 pm

    వేమన పద్యములు ఇక్కడ చదువగలరు -
    http://www.andhrabharati.com/shatakamulu/vEmana/index.html

  4. KS Kiran Kumar 20 డిసంబర్ 2006 , 5:38 am

    చాలా మంచి వ్యాసం అందించారు సుజాత గారు.

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)