-మమత

అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఎన్నో వందల నేటివ్ అమెరికనుల తెగలు వున్నాయి. ఏ తెగ గురించి మొదట మీకు చెప్పాలి అని ఆలోచించాను. నాకు వెంటనే తట్టిన పేరు లెన్ని-లెనాపె (Lenni-Lenape). కొన్నేళ్ళ క్రితం నేను ఉండిన ఊరికి దగ్గరలోనే లెన్ని -లెనాపెల పౌ-వవ్ (Pow-wow - నేటివ్ అమెరికన్లు జరుపుకునే జాతర) జరుగుతోందని తెలిసింది. అప్పటికి నాకు నేటివ్ అమెరికన్ల గురించి తెలియక వెళ్ళలేదు. అలా నేటివ్ అమెరికనులను ఎంతోమందిని ఒక్క చోట చూడగలిగిన మొట్టమొదటి అవకాశాన్ని పోగొట్టుకున్నాను. అందువల్ల నేటివ్ అమెరికన్లను తలచుకున్నప్పుడల్లా లెనాపెలే గుర్తుకు వస్తారు. నా స్వంత కారణలు పక్కన పెడితే ఈ తెగను ఎంచుకోవడనికి మరెన్నో కారణాలు ఉన్నాయి. లెన్ని- లెనాపె తెగ పురాతనమైన నేటివ్ అమెరికన్ తెగల్లో ఒకటి. ఈ తెగను లెనాపె తెగ అని కూడా అంటారు. లెనాపె తెగ ప్రజలు స్వతహాగా సాధు స్వభావులు. తమ మధ్య జరిగే గొడవలను శాంతియుతంగా పరిష్కరించుకునేవారు. అంతేకాక ఇతర తెగల్లో జరిగే గొడవల్లో మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ “ముత్తాత తెగ” అని పేరు తెచ్చుకున్నారు. వీరు శాంతాన్ని ఎంతగా కోరుకునేవారో స్వేచ్ఛను కూడా అంతే కాంక్షించేవారు. లెనాపె తెగ యురోపియనులతో పరిచయం ఏర్పడిన మొదటి తెగల్లో ఒకటి. తూర్పు నుంచి వచ్చి పడుతున్న యురోపియనులనుంచి తప్పించుకోవాడానికి పడమర వైపు అనంత దూరాలకు ప్రస్థానం మొదలుపెట్టిన తెగ ఇది. తెల్లవాడు ఏర్పరచిన రిజర్వేషన్లలో మొదట చేరిన తెగల్లో కూడా ఒకటి. తెల్లవాడి దౌర్జన్యాలను మొదట ఎదుర్కున్న ఈ “ముత్తాత తెగ” తో నేటివ్ అమెరికనుల జీవితాలను గురించిన మన అన్వేషణను ప్రారంభిద్దాం.

లెన్ని లెనాపెల పరిచయం:

తమ తెగ పుట్టుక గురించిన ఒక గాధను లెనాపె తెగవారు నమ్ముతారు. ఈ కథ ఇలా సాగుతుంది: సృష్ట్టి కర్త అయిన కిషెలెముకాంగ్ (Kishelemukang) మహా సముద్రపు లోతుల్లోంచి ఒక బ్రహ్మాంఢమైన తాబేలును పైకి లేపాడు. ఆ తాబేలు పెరుగుతూ పెరుగుతూ ఇప్పుడు ఉత్తర అమెరికాగా పిలువబడుతున్న దీవిగా మారింది. తాబేలు చిప్ప మీద పెరిగిన చెట్టునుంచి మొదటి ప్రజలు పుట్టుకు వచ్చారు. అటు తరువాత కిషెలెముకాంగ్ ఆకాశాన్ని, సూర్యుడిని, చంద్రుడిని, అన్ని రకాల జంతువులను, చెట్లను, రుతువులను ఏలే నలుదిక్కులను సృష్టించాడు. నాలుగు దిక్కులలో మూడింటిని “ముత్తాతలని”, వసంత కాలపు వెచ్చని గాలులను తెచ్చే దక్షిణ దిక్కును “వెచ్చగా వుండే ముత్తవ్వ” అని పిలుస్తారు.

పురావస్తుశాస్త్ర (archaelogy) ప్రకారం లెనాపె తెగ వారు అట్లాంటిక్ తూర్పు కోస్తా (East coast of the Atlantic) కు 3,000 ఏళ్ళ క్రితం పడమటి దిక్కునుంచి వలస వచ్చి న్యూ యార్కు నుంచి డెలవేర్ (Delaware) దాకా వున్న ప్రస్తుత న్యూ యార్కు (New York), న్యూ జెర్సి (New Jersey), పెన్సిల్వేనియా (Pennsylvania), డెలవేర్ (Delaware) రాష్ట్రాల్లో స్థిరపడ్డారు. కాల క్రమేణా ఈ తెగలో మూడు ప్రధాన జాతులు (Clans) ఏర్పడ్డాయి: డెలవేర్ నది దగ్గర స్థిరపడిన ఉనామీలు (Unamis) తాబేలు జాతికి (డెలవేర్ నది ఒడ్డున స్టిరపడినందుకు, ఈ జాతిని డెలవేర్ ఇండియనులని కూడా అంటారు), సముద్రపుటొడ్డున నివసించిన వునలచ్టికోసులు (Wunalachticos) సీమ కోడి (Turkey) జాతికి, మొన్సిలు (Monsys) తోడేలు జాతికి చెందుతారు.

లెనాపెలు సముసద్రపుటొడ్డున, చిత్తడి భూముల్లో, దట్టమైన అడవుల్లో, లోయల్లో, కొండలపై, ఇలా ఎన్నో రకాల చోట్ల నివసించేవారు. ప్రకృతినుంచే జీవించడానికి కావలసిన సామాగ్రిని సమకూర్చుకునేవారు. మొక్క జొన్న, బీన్సు, బీరకాయ వంటి పంటలు పండించేవారు. జింక, ఎలుగుబంటి, దుప్పి వంటి జంతువులను వేటాడేవారు, చేపలు పట్టుకునేవారు. పనిముట్లను, ఆయుధాలను, కొన్ని పవిత్రమైన వస్తువులను రాయి, కొయ్య, ఎముక, కొమ్ము, చిప్ప వంటి వాటి నుంచి తయారు చేసుకునేవారు. ఈ పనిముట్లను, వస్తువులను ఉపయోగించి ఇళ్ళు కట్టుకునేవారు, దోనెలను (Canoes), విల్లంబులను, గిన్నెలను, చెంచాలను తయారు చేసుకునేవారు. జింక, దుప్పి చర్మాలతో దుస్తులు చేసుకునేవారు. ఈ దుస్తులను రంగులతో, చిన్ని చిప్పలతో, గింజలతో, చిన్ని రాళ్ళతో, మెరిసే రంగు లేపనాలు పూసిన ముళ్ళపంది ముళ్ళతో అలంకరించుకునేవారు. శరీరాలపై కూడా రంగులతో జంతు, ఇతర బొమ్మలను గీసుకునేవారు. ఇదంతా తెల్లవాడు రాకమునుపు. తెల్లవాడి రాకతో వీరి సరళ జీవనం అస్తవ్యస్తమయింది.

యురోపియనుల ముట్టడి:

ఇటలీకి చెందిన నావికుడు, జివాని ద వేరజనో (Giovanni Da Verrazanno), ఉత్తర అమెరికా తూరుపు ఒడ్డున ప్రయాణిస్తున్నప్పుడు మొట్టమొదటిసారి లెనాపెలకు తెల్లవాడి పరిచయం జరిగింది. 1609 నుంచి వేరజనో వంటి అన్వేషకులు తారసపడడం ఎక్కువైంది. అప్పటికి రెండేళ్ళ ముందునుంచే లెనపే తెగకు దక్షిణాన వున్న వర్జీనియా కాలనీలోని జేమ్స్ టౌనులో (Jamestown) మొదటి ఇంగ్లిషు సమాజం స్ఠిర నివాసాలు ఏర్పరచుకుని నివసిస్తుండేవారు. అతి కొద్ది సంవత్సరాలలోనే లెనాపె తెగల చుట్టూ ఎన్నో అపరిచిత సమూహాలు పుట్టుకొచ్చాయి.

వేరే ఖంఢంనుంచి వచ్చిన తెల్లవాళ్ళను లెనపీలు షౌవున్నాక్కులు (Shouvunnock) అని పిలిచేవారు. అంటె “చేదు మనుషులు” అని అర్థం. యురోపియన్లకు ఈ లెనాపె పేరు పెట్టడానికి కారణం వారు ఉప్పు సముద్రాన్ని దాటి వచ్చారనేకాక, స్వతహాగా తెల్లవాడికి తమ జాతికి చెందనివారిపట్ల, లెనాపెల పట్ల ఉండే విరోధ భావం వల్ల ఈ పేరు వచ్చింది.

కొత్తగా తాము కనిపెట్టారనుకున్న ఆ అపారమైన ఖంఢంలో ఎంతటి ఐశ్వర్యం దాగివుందోనని తెల్లవాడు కలలు కన్నాడు. ఆ కలలను నిజం చేసుకోవాడానికి ఎన్నో ఉపాయాలు చేశాడు. కొందరు గాజు, లోహపు వస్తువులను నేటివ్ అమెరికనులకు ఇచ్చి వాటికి బదులుగా విలువైన జంతు చర్మాలను, బొచ్చులను తీసుకునేవారు. కొందరు నేటివ్ అమెరికన్లనే సంపదలు తెచ్చిపెట్టే వనరులుగా లెక్కించి వారిని తమ పొలాల్లో, చేలల్లో కూలివాళ్ళుగా పెట్టుకోవడానికి ప్రయత్నించారు. ఇంకొంతమంది నదుల ఒడ్డున, కొండల్లో వెండి, బంగారు వంటి విలువైన ఖనిజాలు దొరకుతాయని ఉహించి లెనాపెలు మొదలగు నేటివ్ అమెరికనులు నివసించే ప్రదేశాలను ఆక్రమించుకోవడానికి తొలిబీజాలు వేశారు. ఈ ప్రదేశాలలో బస్తీ చేసుకుని వ్యాపారం చెయ్యడం కోసం లెనపే తెగ ఉత్తర భాగంలోని హడ్సన్ (Hudson) నది పొడవునా ఎన్నో దుర్గాలు వెలిశాయి. అటు దక్షిణంవైపునుంచి బ్రిటిషు ఆక్రమణదారులు జేమ్స్ టౌను దగ్గరి తమ కాలనీని విస్తరించుకోవడం మొదలుపెట్టారు. ఫ్రెంచి, స్వీడెన్ దేశస్తులు కెనడా (Canada) నుంచి దక్షిణంవైపు ప్రయాణిస్తూ నగరాలు కట్టుకోవడం మొదలుపెట్టారు. యురోపియనుల విస్తరణ వల్ల ఎన్నో నేటివ్ అమెరికను తెగలు ఎన్నో యురోపియను దేశాలతో వ్యాపారాలు చెయ్యడం ప్రారంభించాయి. 1655లో డచ్ సైన్యం స్వీడెన్ పై యుద్ధం చేసి వారు కట్టిన నగరాలను గెలుచుకున్నాయి. ఈ యుద్ధంతో అమెరికా ఖంఢంపై పెత్తనం గురించి యురోపియను దేశాలు పోటీపడుతున్నాయన్న విషయం తెలిసిపొయ్యింది.

1650 నాటికి ఈశాన్యంలో ఉన్న యురోపియను జనాభా సంఖ్య 5,000. 1776 నాటికి ఆ సంఖ్య 750,000 కు చేరుకుంది. ఈ క్రమంలో ఈ ప్రదేశంలో నివసిస్తున్న నేటివ్ అమెరికనుల సంఖ్య అనూహ్యంగా తగ్గిపొయ్యింది. 1633 నుంచి 1702 దాకా దాదాపు 14 సార్లు మశూచి, మలేరియా, తట్టు వంటి మహమ్మరులు లెనాపెలకు సోకాయి. తెల్లవాడికి సాధారణంగా సోకి తగ్గిపొయ్యే ఈ రోగాలు నేటివ్ అమెరికనులకు మొట్టమొదటి సారిగా సోకడంవల్ల వారి దగ్గర ఇలాంటి కొత్త రోగాలకు విరుగుడు లేనందువల్ల ఈ జబ్బులు నయమవక ఎంతో మంది వీటి బారినపడి చనిపొయ్యారు. ఒక డచ్ పరిశీలకుడి ప్రకారం 1700 నాటికి 3,000 కంటే తక్కువ లెనాపెలు బ్రతికి వున్నారు. తమ జనాభా సంఖ్య ఇంత భయంకరంగా పడిపోయినా, నేటివ్ అమెరికను తెగలు ఇతర తెగలతో, యురోపియన్లతో వ్యాపారపరంగా పోటీ పడాల్సిన దుస్థితి ఏర్పడింది. తాము ఇంతవరకు ఆధారపడ్డ భూములు, వనరులు హరించుకుపోవడమే ఈ పోటీకి కారణం. వ్యాపార స్థలాలపై ఏకాధికారాన్ని సంపాదించుకోవడానికో, బొచ్చుగల చర్మం వున్న జంతువులు ఎక్కువగా వుండే భూములపై, లేదా వ్యాపార మార్గాలపై అధికారానికో నేటివ్ అమెరికను తెగలు పోటీ పడడం ప్రారంభించాయి. అప్పటి పరిస్థితులకు తట్టుకుని నేటివ్ అమెరికన్లు, తమ జీవనం కొనసాగించడానికి అవసరమయ్యే వస్తువులు ఏవైతే స్వంతంగా తయారు చేసుకోలేరో (తుపాకులు, రాగి గిన్నెలు, ఇనుప కత్తులు, గొడ్డలి వంటి వస్తువులు) వాటిని బొచ్చుగల చర్మాలతో వ్యాపారం చెయ్యడం ద్వారా సంపాదించుకోవలసి వచ్చింది. తమను, తమ కుటుంబాలను పోషించుకోవడం కోసమేకాక తమకు హాని తలపెట్టేవారి నుంచి రక్షించుకోవడానికి ఈ తెల్లవాడి వస్తువులు నిత్యావసరమయ్యాయి. ఈ పోటీలు నేటివ్ అమెరికను తెగల మధ్య కొత్తరకమైన విరోధాలను సృష్టించాయి.

లెనాపెలు మొదట చర్మవ్యాపారం మీద ఆధారపడకుండా సముద్రపుటొడ్డున దొరికే చిప్పలను ఉపయోగించి ఊదా, తెలుపు రంగుల్లో వుండే చిన్ని గొట్టాల్లాంటి వాంపం (Wampum) పూసలతో యురోపియనలతో వ్యాపారం చేసేవారు. మొదట చేతితో కొద్ది మొత్తంలో మాత్రమే తయారు చేసినా యురోపియన్లు పరిచయం చేసిన యంత్రాలతో మిలియన్ల కొద్దీ వాంపములను తయారు చెయ్యడం మొదలెట్టారు. నేటివ్ అమెరికన్లు ఈ వాంపం పూసలను తమ ఆచార వ్యవహారాల్లో ఉపయోగించేవారు. యూరోపియన్లకు ఇవి వేరే రూపంలో ఉపయోగపడేవి. నాణేల కొరత వల్ల యురోపియన్లు వాంపం పూసలను నాణేలకు బదులుగా వాడడం మొదలుపెట్టారు. ఈ వనరులను తమ జీవికకోసం ఉపయోగించుకోవచ్చని ఆశపడ్డారు లెనాపెలు. కానీ ఇతర తెగవారు లెనాపెలనుంచి వాంపం పూసలను దౌర్జన్యంగా లాక్కోవడానికి ప్రయత్నించేవి. లెనాపెలు తమచుట్టూ వున్న ఇతర బలమైన తెగలకు, యురోపియన్లకు ఎదురు నిలువలేక చివరకు ఈ పూసలను కప్పం చెల్లించడానికి ఉపయోగించడం మొదలు పెట్టారు. లెనాపెలు నివసించేచోట బొచ్చుగల చర్మం వున్న జంతువులు తక్కువగా వుండేవి. అందుచేత ఇలాంటి జంతువులు ఎక్కువగా వుండే ఒహాయో (Ohio) కు చెందిన తెగలతో సంబంధాలు ఏర్పరచుకున్నారు. అయితే లెనాపెల కదలికలను అదుపులో పెట్టడానికి యూరోపియన్లు, ఇతర తెగలు ప్రయత్నించాయి.

లెనాపెలు తమ చుట్టూ వున్న యురోపియన్లతో మొదట వ్యాపారాలు మొదలుపెట్టినా వారి మధ్య తొందరలోనే యుద్ధాలు మొదలయ్యాయి. లెనాపె భూములను ఆక్రమించుకోవడం కోసం డచ్ సైన్యాలు ఒకసారి ఎలాంటి హెచ్చరిక లేకుండా ఒక లెనాపె ఊరిని ముట్టడించింది. పగ తీర్చుకోవడానికి లెనాపెలు డచ్ తో యుద్ధాలు మొదలుపెట్టారు. 1640 నుంచి 1649 దాక లెనాపెలకు యూరోపియన్లకు మధ్య ఘర్షణలు నడిచాయి. 1643 నుంచి 1645 దాకా డచ్ సైన్యాలు లెనాపెలను సామూహిక హత్యలు చేశారు. ఈ రెండేళ్ళ దశను గవర్నరు కీఫ్టు యుద్ధం (Governor Kieft’s war) అని అంటారు. ఫిబ్రవరి 23, 1643లో శరణాగతులుగా పడమరకు వలస వెళుతున్న లెనాపె తెగకు చెందిన ఒక మొన్సి గుంపును సామూహికంగా హత్య చేసేందుకు కీఫ్టు ఆజ్ఞ ఇచ్చినందుకు ఈ పేరు వచ్చింది. 1655లో మరో ఘర్షణ మొదలయ్యింది. ఈ యుద్ధాన్ని “పీచ్ యుద్ధం” (The Peach War or The Peach Tree War ) అని అంటారు. తన పొలంలోని పీచ్ చెట్టునుంచి పండు తెంపిన లెనాపె అమ్మాయిని ఒక డచ్ వాడు చంపడంతో మొదలయిన ఈ యుద్ధం రెండేళ్ళ తరువాత ముగిసింది. నేటివ్ అమెరికన్లతో సాగిన ఇలాంటి యుద్ధాలవల్ల డచ్ సైన్యాలు బలహీనపడ్డాయి. అదే అదునుగా బ్రిటిషు సైన్యాలు డచ్ సైన్యాలను యుద్ధంలో ఓడించాయి. డచ్ చేసిన తప్పులను తాము చెయ్యకుండా బ్రిటిషువారు లెనాపెలతో శాంతి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. లెనాపె తెగలకు చెందిన భూములను చిన్న మొత్తాలకు కొనుగోలు చేసుకోవడం మొదలుపెట్టారు. కొన్నిసార్లు ఈ భూములను పరస్పర అంగీకారంతో కొనుగోలు చేసినా ఎక్కువసార్లు మోసపూరితంగా ఆక్రమించుకునేవారు. ఇందులో పేరు మోసింది 1737లో జరిగిన “వాకింగ్ పర్చేజ్” (Walking Purchase). దీనికి ముందు విలియమ్ పెన్ ( William Penn) లెనాపెల దగ్గర భూమి కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకున్నాడు. 1718లో ఆయన చనిపోయిన తరువాత 1730ల్లో అయన కొడుకులు దివాళాకు దగ్గరయ్యారు. లెనాపెలనుంచి చిన్న మొత్తాలకు భూములను కొనుగోలు చేసి పెద్ద మొత్తాలకు వాటిని అమ్మడానికి ఎత్తు వేశారు. అయితే కొత్తగా భూములను అమ్మడానికి లెనాపెలు ఆసక్తి చూపలేదు. 1736లో పెన్ సోదరులు తమ తండ్రి లెనాపెలతో చేసిన ఒప్పందపు పత్రాన్నొకదాన్ని వెలికి తీశారు. ఈ ఒప్పందం ప్రకారం, తాము నియమించిన మనుషులు నడిచినంత స్థలం పెన్ సోదరులకు దక్కుతుంది. ఈ దస్తావేజును గౌరవించడానికి లెనాపెలు ఒప్పుకున్నారు. అయితే పెన్ సోదరులు నడిచేవాళ్ళను కాక రన్నర్లను నియమించారు. వీరు ఒకటిన్నర రోజుల పాటు ఎడతెగకుండా పరిగెత్తి పెన్ సోదరులకు ఎన్నో మైళ్ళ స్థలాన్ని సంపాదించిపెట్టారు. దీనివళ్ళ లెనాపెలు ఊహించినదానికంటే రెండు రెట్లు ఎక్కువ స్థలాలను పోగొట్టుకున్నారు. అటు తరువాత కొన్ని జాతులు పడమర వైపు తమ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. నేటివ్ అమెరికను చరిత్రలో మరే తెగా లెనాపె తెగ వెళ్ళినంతటి దూరాలకు ప్రయాణించలేదు. అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఏర్పరచిన మొదటి రిజర్వేషన్లలో చేరిన తరువాత కూడా వీరికి స్థల మార్పిడి తప్పలేదు. అమెరికా ప్రభుత్వం వీరికి ఒకసారి ఒక స్థాలాన్ని కేటాయించి, ఆ స్థలంలో ఏవైనా వనరులు బయటపడ్డాయని తెలియగానే లెనాపెలను మరో ప్రదేశానికి తరలించేవారు. కొన్ని లెనాపె జాతులు తెల్లవాడి హింసనుంచి తప్పించుకోవడానికి ఇతర జాతులనుంచి విడిపోయి వేరే దిశలో ప్రయాణాలు చేశాయి. మొన్సిలు కెనడా వైపు ప్రయాణించి ఒంటారియోలో (Ontario) స్థిరపడ్డారు. మరికొన్ని లెనపె జాతులు పెన్సిల్వేనియా, తరువాత ఇండియానాలో (Indiana), తరువాత మిస్సౌరిలో ( Missouri), తరువాత కాన్సస్ (Kansas) లో ఆగుతూ చివరికి ఓక్లహోమాలో (Oklahoma) స్థిరపడ్డారు. మరికొన్ని జాతులు టెక్సస్ (Texas) వైపు ప్రయాణించి చివరికి ఓక్లహోమాలో స్థిరపడ్డారు.

భవిష్యత్తులోకి మరో ప్రయాణం:

19వ శతాబ్దపు చివరి భాగాన కొన్ని వందలమంది లెనాపెలు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో, కెనడాలో స్థిరపడ్డారు. అప్పటినుండి లెనాపెల సంఖ్య ఇతర తెగలవలె పడిపోలేదు. 300 ఏళ్ళుగా యూరోపియన్ల రోగాలనుంచి, దౌర్జాన్యాలనుంచి వారు నేర్చుకున్నవిజ్ఞత, పడమరవైపు నెట్టివేస్తున్న తెల్లవాడి ధాటికి తట్టుకుని జీవించడానికి ఉపయోగపడింది. కొత్తగా వచ్చిన తెల్లవాడి వల్ల వీరికి ఉద్యోగాలు కూడా దొరకడం మొదలయ్యింది. ఎంతోమంది పొలాల్లో, పశువులశాలల్లో ఉద్యోగాలకు కుదురుకున్నారు. లెనాపె ఆడవారు దుస్తులు కుట్టేవారిగా, ఇళ్ళల్లో పనివాళ్ళుగా, నర్సులుగా ఉద్యోగాలు సంపాదించుకున్నారు. లెనాపెలు తెల్లవారిలాగే తమకు కావలసిన వస్తువులను అంగళ్ళలో కొనుగోలు చెయ్యసాగారు. ఇప్పటికీ కొన్ని దుస్తులను సాంప్రదాయబద్దంగా అలంకరించుకుంటారు కానీ, అందుకు కావలసిన సరంజామాను మునుపటిలా తామే తయారు చేసుకోకుండా అంగళ్ళలో కొనుక్కుంటారు. తమ దుస్తులను జింక, దుప్పి చర్మాలతో తయారు చేసుకోకుండా రెడీమేడ్ దుస్తులను ధరించడం మొదలుపెట్టారు. ఇందుకు ఒక కారణం తెల్లవాడు వీరి సంస్కృతిని నాశనం చెయ్యడానికి చేసిన ప్రయత్నాలైతే జింక, దుప్పుల సంఖ్యలు హరించిపోవడం మరొక కారణమయింది.

మొదట లెనాపెల శ్రమను బాగానే ఉపయోగించుకున్న తెల్లవాళ్ళు, తరువాతి కాలంలో కొత్తగా వచ్చిన తెల్లవాళ్ళను ఎక్కువగా పనిలో పెట్టుకునేవారు. కఠినమైన పనులు చెయ్యడానికి మాత్రమే లెనాపెలను పెట్టుకునేవారు.

అప్పటి అమెరికన్ ప్రభుత్వం కొత్తకొత్త శాసనాలు చేసి ఇతర నేటివ్ అమెరికన్ తెగలమాదిరిగానే లెనాపెల ఆచారాలను వారినుంచి దూరం చెయ్యడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. పిల్లలను బలవంతపు బోర్డింగ్ స్కూళ్ళలో చేర్పించి, వారిని వారి తెగ పెద్దలనుంచి వేరు చేసి వారి ఆచారాలు ముందు తరాలకు చేరకుండా ఎన్నో ప్రణాళికలను అమలులోకి తెచ్చింది. తెగలకు సమిష్టిగా ఇచ్చిన రిజర్వేషన్లను ప్లాట్లుగా విడగొట్టి తెగలోని వారికి విడివిడిగా స్థలాలను కేటాయించింది. విభజన తరువాత మిగిలిన భూములను వేరుగా తెల్లవాళ్ళకు అమ్మడం 1910 లోపల పూర్తయ్యింది. తరువాతి దశకంలో ఓక్లహోమాలో ఆయిల్ బయట పడింది. లెనాపెల భూముల్లో ఆయిల్ బయటపడినా సహజవనరులపై వారు హక్కులు పోగొట్టుకున్నందువల్ల ఎలాంటి లాభాలు పొందలేకపొయ్యారు. ఈ విభాగాలవల్ల ఇబ్బందులు ఎదురవ్వవచ్చని అమెరికా ప్రభుత్వం గుర్తించింది. అందువల్ల 1924 లో లెనాపె తెగవారికి అమెరికన్ పౌరసత్వం ఇచ్చింది. దీనివల్ల ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు వున్నా తెల్లవాడి సంఘంలో సరియైన గుర్తింపు దొరకదని విశ్వసించి, తెగలతో ప్రభుత్వం చేసుకున్న ఒడంబడికల నుంచి వచ్చే రక్షణను వదులుకుని అమెరికా పౌరసత్వాన్ని స్వీకరించడానికి వెనుకాడారు. కానీ వారి అయిష్టాన్ని ఖాతరు చెయ్యకుండా వారిని అమెరికా పౌరులుగా గుర్తించింది అమెరికా ప్రభుత్వం.

1932లో ఫ్రాంక్లిన్ డి.రూజవెల్ట్ (Fraklin D. Roosevelt) రూపంలో లెనాపె తెగలకు కొంత ఉపశమనం లభించింది. గ్రేట్ డిప్రెషన్ ( Great Depression) రోజుల్లో అందరికంటే ఎక్కువ కష్టాలు పడింది నేటివ్ అమెరికన్లే అని రూజవెల్ట్ ప్రభుత్వం గుర్తించి వీరికి ఉపయోగపడే ఎన్నో చట్టాలను ప్రవేశపెట్టింది. ఇందులో ముఖ్యమైనది ఇండియన్ రీఆర్గనైసేషన్ ఆక్ట్ (Indian Reorganization Act – IRA). ఈ చట్టం తెగల పాలనాధికారాలను ఆయా తెగలే నిర్ణయించుకునేందుకు అవకాశం ఇచ్చింది. దీనివల్ల తెగల ఆస్తులపై వారికే పూర్తి హక్కులు వచ్చాయి. తరువాత 1960ల్లో లిండన్ జాన్సన్ (Lyndon Johnson) ప్రవేశపెట్టిన “పేదరికంపై యుద్ధం” (War on Poverty) వంటి చట్టాల వల్ల ఇతర నేటివ్ అమెరికన్ తెగలలాగే లెనాపెల జీవితాల్లో కొంత మార్పు వచ్చింది. ప్రభుత్వంలో వచ్చిన కొద్దిపాటి ఈ మార్పు నేటివ్ అమెరికన్లకు కొంత ఉపశమనం కలిగించినా ఎన్నో సమస్యలు మిగిలే ఉన్నాయి. అయితే ఈపాటికి లెనాపెల్లో తమ ఆచార వ్యవహారాల పట్ల, తెగ విజ్ఞత పట్ల ఆసక్తి పెరిగింది. 1972 లో నేటివ్ అమెరికనుల వెతల గురించి ప్రభుత్వానికి తెలియజేసేందుకు జరిగిన “భగ్నమైన ఒప్పందాల జాడలు “ (Trail of Broken Treaties) అనే నిరసన ప్రదర్శనలో పాల్గొనడంద్వారా, 1973లో స్థాపించబడిన అమెరికన్ ఇండియన్ మూవ్మెంటులో చేరడం వల్ల లెనాపె తెగల్లో కొత్త చైతన్యం వచ్చింది. లెనాపె యువకుల్లో తెగ ఆచార విలువల పట్ల అవగాహన పెరిగింది. తమ సంస్కృతిని కాపాడుకోవాలన్న ఆశతో తమ సనాతన విలువలను తెగలో తిరిగి అంకురించేందుకు లెనాపె పెద్దలు ఎంతో కృషి చేశారు.

తెల్లవాడి సమాజంలో వీరి పట్ల ఇప్పటికీ కొంత అసమానత ఉంది. కాని లెనాపెలు ఎంతోమంది తమ తెగ ఆచారాలను స్వేచ్చగా పాటిస్తూ కొత్త ప్రపంచంలో తమ ఉనికిని ఉటంకిస్తూ ముందుకు సాగుతున్నారు.

2 అభిప్రాయాలు

  1. prashanth 07 డిసంబర్ 2006 , 12:46 am

    మమత గారు మీ వ్యాసము బాగున్నది.ఆక్కడి సాహిత్యాన్ని పరిచయము చేస్తేమంచిది.

  2. kiran 12 డిసంబర్ 2006 , 4:54 am

    వ్యాసము చాలా సరళముగా వుంది. రాజకీయాలు,సామాజిక విషయాలు మరి కొంచము వుంటే బాగుంటుంది. పీపర్ వ్యాసంలా వుంది.

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)