- స్కైబాబ

సర్వేంద్రియానాం
అందమైన చిన్నప్పటి కన్నుపాఠం
కన్ను బొమ్మ ఎంత ముద్దుగ గీసేటోన్నో
ఇప్పట్కి కళ్ళల్ల తిరుగుతున్నది
చిన్నతనం పెన్సిల్ మల్లమల్ల దిద్దిన నెమలుకన్ను
కన్ను అంటే సాలు అందమైన బొమ్మేమెదిలేది
పెద్దయినంక తెలిసొచ్చింది
అందమైన కన్నుకు మాకు శానా దూరమని..
అరెరే తేరుకునే లోపల్నే
కాలం కన్ను సొన కారిపాయె

ఇప్పుడు కన్ను అంటె
ఎంతకు నిద్దర పట్టక
జీవం లేనట్లు కదలాడే గరీబు ఖాజామియా
పంక్చర్లు బాగు చేసే ఉస్మాన్ భాయ్ ఢీలాపడ్డ చూపు…
మా అమ్మీ కంటి కింద నల్లగా పగిలినరేగడి
ఊర్లె శానా ముస్లిం ఇండ్లల్ల షాదీ కాని చెల్లెల్లా
అబ్బాజాన్ పక్షవాతపు రెప్పల మధ్య అడ్డంగా
కండ్లద్దాలు మసకబారి
కుట్టు మిషన్ సూదిల దారం ఎక్కని నానీమా తనుకులాట

ఇయాల కన్ను అంటే
కొడుకు గూడలు పట్టుకుని లేవాల్సిందిపోయి
చీకటి పడితే గోడలు పట్టుకొని నడిచే మాదిగ ఎంకయ్య తాత
ఎద్దుకొమ్ము విదిలిస్తే
కారిపోయిన నాగయ్య మామ ఒక్కగానొక్క కొడుకు చూపు
పగిలిన ఒంటికన్ను అద్దంతో
కనాకష్టాలు పడే పెరిక లచ్చువమ్మ
చిన్నతనంతో కొడుకుని తడిమి తడిమి చూసుకున్న యాదిల
వాడు తప్పిపోయిన పట్నం బాటకు
అతుక్కొని చితికిపొయిన ఈదయ్య కక్కయ్య
అయ్యో….
తల్చుకుంటే ఊరంతా పరేశాన్లతోని
కళ్ళన్నీ గుంతలు పడి చూపానుకుంటయ్యో
కన్ను ఇప్పుడు అందమైన బొమ్మ కాదురా తమ్మీ
అగాధపు లోతుల్ని చూపే గుంత
మా ఊరే ఇప్పుడు
కన్ను ఊడబెరికిన ఖాళీ బొయ్యారం

(8-10-2006)

ఒక్క అభిప్రాయం

  1. ravikiran 07 డిసంబర్ 2006 , 7:12 pm

    స్కైబాబ గారు చాలా బాగా వ్రాశారండి. చాలా బాగా వ్రాయటవే కాదు, చాలా నిజాన్ని కూడా వ్రాశారు.

    రవికిరణ్

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)