- దేవీప్రియ

కోల్పోవడం, నిజానికి
నేను సాధన చేస్తున్న ఒక కళే
కలలు పోగొట్టుకున్నాను
కన్నీళ్ళు పోగొట్టుకున్నాను
అమ్మనీ నాన్ననీ తమ్ముడినీ
అప్పుడప్పుడు ఆమెనీ
ఇప్పుడిప్పుడు పిల్లలనీ పోగొట్టుకుంటూ
ఈ కళలో ఎన్ని ఆకులు చదివానోయేమో…

తాడికొండ చెరువునీ
రెంటచింతల నాపరాతి రోడ్లనీ
గుంటూరు రైలుపట్టాలనీ
కౌమార్యపు కలలలో తెంచి
జేబులో కుక్కుకున్న తళుకులీనే  చుక్కలనీ
ప్రియమైనవాటిని పోగొట్టుకోడం
నిజంగానే, క్లిష్టమైన ఒక కళ

ప్రాణప్రదమైన ఆశయాలనీ
ఆశయ ప్రతిబింబ సాధనలనీ
బతికించి వుంచుతున్న
జీవన అమృత ఆకాంక్షలనీ
కోల్పోతూ బతకడం గొప్ప కళ
నన్ను నేను కొంతకొంతగా కోల్పోతూ
జీవించగలగడం నిజంగానే నేను
రాణిస్తున్న వినూత్న జీవకళ!

(ఎలిజబెత్ బిషప్‌కి ధన్యవాదాలతో…)

2 అభిప్రాయాలు

  1. ravikiran 07 డిసంబర్ 2006 , 10:40 pm

    కళకాదది, జీవన ప్రక్రియ
    ****************

    కోల్పోటానికేం అదొక నిత్య జీవన ప్రక్రియ
    నిన్నని నేడు కోల్పోలేదా, నేటిని రేపు పోగొట్టుకోదా?
    బాల్యాన్ని యవ్వనంలో, యవ్వనాన్ని నలభైల్లో
    నలభైల్ని అరవైల్లో జారవిడుచుకోవా?
    కోల్పోటానికేం అదొక సహజ జీవన ప్రక్రియ
    అయినా ఎక్కడకి పోతాయవి, సవర్గనరకాలకి కాదుకదా?
    మొన్న, మొన్న నా కూతురుతో నేనాడిన బాలాటలో
    నాతోపాటూ నా బాల్యం పరుగెత్తలేదా?
    నూనూగు మీసాల యవ్వనంలో నా మనసుకెక్కిన
    పదహారేళ్ళ పదుచు,సగం నరిసిన వెంట్రుకలతో
    నిన్న నా కళ్ళ పడితే, నా గుండె గతి తప్పలేదా?
    నెరవేరిన కల కన్నా, చేజారిన కలలే కదా
    మనతో నిత్యం కలసుండేది, కడవరకు తోడుండేది?
    పోవటానికేం, రేపు నేనూ పోతాను నా కూతురి
    రక్తంలో, మనసులో గ్నాపకమై నిలచిపోతాను
    కోల్పోవడవేం కళ, అదొక మానవ జీవన ప్రక్రియ.

    రవికిరణ్ తిమ్మిరెడ్డి

  2. aandhrudu 29 డిసంబర్ 2006 , 6:17 am

    very good poem

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)