- సుంకోజి దేవేంద్రాచారి

“టిఫను తినేసి పోండి,'’ అంది అత్త.

“లేటయితే శవాన్ని తీసేస్తారేమో,'’ అంది ప్రియ.

“పన్నెండు గంటలకన్నారు. రెండు దాటతాదిలే,'’ మామ మధ్యలో కలగజేసుకున్నాడు.

“మీర్రారా?'’ అడిగాను.

“మేం రాత్రే పోయొచ్చినాం. మీరు పొయ్యేసి రాండి,'’ మామే బదులిచ్చాడు.
ప్రియ, నేనూ ఉద్యోగరీత్యా ఐదేళ్ళుగా బెంగుళూరులో ఉంటున్నాం. ఇద్దరివీ ప్రైవేటు ఉద్యోగాలు కావడంతో సెలవులు తక్కువ. మేం తిరుపతికి రావడమూ తక్కువే. ఉద్యోగ విధుల్లో మార్పు లేకపోవడంతో ఈమధ్య ప్రియ చానా అసహనంగా ఉంటోంది. అందుకని ఇద్దరం నాలుగు రోజులు సెలవుపెట్టి నిన్న సాయంత్రం తిరుపతికి బయలుదేరాం. మేం బెంగుళూరు బస్టాండులో ఉండగానే ఇక్కడి నుంచి ఫోన్ వచ్చింది. కమలమ్మ చనిపోయిందని.

కమలమ్మ ప్రియ వాళ్ళకు దూరపు బంధువు. ఒకే వూరిలో ఉండటంతో కాస్త దగ్గర. పెళ్ళయిన కొత్తలో మమ్మల్ని తీసుకెళ్ళి బట్టలు పెట్టారు వాళ్ళు. అందువలన నాకు ఆమె బాగా గుర్తు. వరుసకు నాకు అత్తవుతుంది. ఎటూ తిరుపతికి వచ్చాం కదా అని వాళ్ళింటికి చూడ్డానికి వెళ్తున్నాం.

సమయం తొమ్మిదిన్నర.

టిఫిన్ తిని, రెండేళ్ళ పాపను ఇంట్లోనే వదిలి, మామ బైక్ మీద బయల్దేరాం. గాంధీరోడ్‌కు పోయి ఒక పూలహారం కొన్నాం. బైరాగి పట్టెడ దాటాం. అక్కడ నుంచీ దారి పొడవుకూ బ్యానర్లున్నాయి. ఏవో ఎన్నికలు జరుగుతున్నట్టుంది. అవిలాలలో కమలమ్మత్తోళ్ళ ఇంటికి చేరేప్పటికి పదకొండు గంటలయింది.

ఇంటి ముందు షామియానా వేసిండారు. షామియానా కింద వేసిన కుర్చీల్లో మగవాళ్ళు కూర్చోనుండారు. వాళ్ళకు మధ్యలో రెండు కర్రలు కాలుతున్నందుకు గుర్తుగా పొగ వస్తోంది. వాళ్ళకు దూరంగా ఆరేడుమంది మాదిగలు పలకలు పక్కన పెట్టుకోని కింద కుచ్చోనుండారు.

ప్రియను చూడగానే చాలామంది పలకరింపుగా నవ్వారు. నన్ను చూసి ఇద్దరు ముగ్గురు నవ్వారు. వాళ్ళు ఎవరో గుర్తు రాలేదు. అక్కడ గంభీరమైన వాతావరణం నెలకొని ఉంది. అందరి ముఖాల్లో బాధకు బదులు అలజడి. ఇంటి ద్వారానికి ఆనుకుని బయట ఇరవై ఏళ్ళ కుర్రాడు నిలబడుకోనున్నాడు. మమ్మల్ను చూడగానే, “లోపలికి పాండికా,'’ అన్నాడు.

హాల్లో ఫ్యాను తిరుగుతున్న చప్పుడు తప్ప నిశ్శబ్దంగా ఉంది. హాలు మధ్యలో గాజుపెట్టెలో కమలమ్మత్త దేహాన్ని ఉంచారు. పెట్టపైనంతా పూలహారాలు. మేము తీసుకుపోయిన హారాన్ని కూడా అక్కడ ఉంచాం.

హాల్లో చాపల మీద చుట్టూ ఆడవాళ్ళంతా కూర్చొని ఉన్నారు. చాలామంది ముఖాల్లో ఏ భావమూ కన్పించడం లేదు. వంటగది తలుపు దగ్గర ఒకమ్మాయి కూర్చుని ఉంది. ఏడ్చి ఏడ్చి కళ్ళు ఉబ్బి ఉన్నాయి. ప్రియ ఆ అమ్మాయి పక్కకు వెళ్ళి కూర్చుంది. ప్రియను చూడగానే ఆ అమ్మాయి కళ్ళలో మళ్ళీ నీళ్ళు.

కాసేపు అక్కడే నిల్చున్నాను. ఇంతలో బయట ఏవో గట్టిగా అరుపులు వినిపిస్తే గబగబా బయటకు వచ్చాను. గట్టిగట్టిగా అరుస్తున్నారు ఇంటి ముందు కూర్చున్న వాళ్ళలో కొందరు. ఒక కుర్రాడు లేచి కుర్చీ ఇచ్చాడు. రాత్రంతా ప్రయాణం చేయడంతో అలసటగా ఉంది. తలనొప్పిగా ఉంది. అందుకని మారుమాట్లాడకుండా కుర్చీలో కూర్చున్నాను.

వీధిలో నాలుగైదు చోట్ల బ్యానర్లున్నాయి. సర్పంచ్‌గా గెలిపించమని. పోలింగ్ అయిపోయి ఐదు రోజులయింది.

“ఆ లమ్డీ కొడుక్కు నేనే… ఈ చేతలతోనే… మనిసికి వేయి లెక్కన లెక్కేసి… పదివేలిచ్చినా… అయినా వోళ్ల పక్కన వోట్లేసినాడే,'’ ముప్ఫై ఐదేళ్ళుంటాయి. నల్లగా బక్కపలచగా ఉన్నాడు. ఆవేశంగా ఊగిపోతున్నాడు.

“పది వోట్లే గదరా భాస్కరా… మనోడికి యాభై ఆరోట్లు తక్కువొచ్చినాయే…'’ ఒక పెద్దాయన.

“అన్నీ లెక్కలే మామా నాకు. ఈ చాకల్‌నాకొడుకు ఇంట్లో పదోట్లు. దిగవీధిలో సుబ్బారెడ్డి ఇంట్లో ఆరోట్లు… మురుగా వాళ్ళయి నాలుగు…'’

“ప్పో… చాల్లే… బలే చెప్పినావు… మేము మాట తప్పేవోళ్ళం కాదు… నీకాడొక మాట వాళ్ళకాడొకమాటా మాట్లాడం. మా ఇంట్లో నాలుగు వోట్లూ మీకే ఏసినాం…'’ మురుగా అక్కడే ఉన్నాడు. భాస్కర్ మాటలను మధ్యలోనే అడ్డుకున్నాడు. రాగిరంగులో, పొట్టిగా, దిట్టంగా ఉన్నాడు.

“ఈన్నే ఉండావా… ఎలక్సన్ రోజే నిలేయాలనుకున్నే. ఓట్లు లెక్కేసినాక మా మామ గెలిస్తే అడిగే ఉండను… మొన్నట్నించి నీకోసరం చూస్తాండా… ఈ పొద్దు దొరికినావు…'’ కుర్చీలోంచి లేచి ఊగిపోతున్నాడు భాస్కర్.

“నేనేమన్నా దొంగనా దాంకోని తిరిగేదానికి… మా వోట్లు మీకే ఏసినామంటే నమ్మవే.'’

“ఎలక్సన్ రోజు పద్దన్నే ఐదోగంటకంతా, మీ యింటికి వోళ్ళమనిసి వచ్చి ఆరువేలు దుడ్డు ఈలేదా? చెప్పు…? నాకేం తెల్దనుకున్నేవా?'’
మురుగా తడబడ్డాడు. మౌనంగా ఉండిపోయాడు.

“ఒగ అయ్యా అమ్మకు పుట్టినోడయితే మాట తప్పడు…'’

“మాటలు మర్యాదగా రానీ… మేము ఓటు ఎవరికేసినామో నువ్వు చూసినావా? మేమేమన్నా దుడ్డులేనోళ్ళమా… మీ నాలుగు వేలు నా ఎంటికతో సమానం… ఏమనుకున్నేవో,'’ మురుగా కూడా కోపంగానే మాట్లాడాడు కుర్చీలోంచి లేచి.

“అట్లావోనివి ఆ పొద్దు దుడ్డెందుకు తీసుకున్నేవు…'’ భాస్కర్‌లో ఆవేశం తగ్గలేదు.

“నిన్నెవడు ఇమ్మన్నాడు… నేనేమన్నా వచ్చి అడిగినానా…?'’

“అయితే మా దుడ్డు పారదెంగేయ్… ఓటెయ్యంది గాక పెద్ద రోషంగా మాట్లాడతాండావే…'’

“నీకేం బాకీనా… ఆ పార్టీవోళ్ళు ఓటుకు పదైదు నూర్లు పంచినారు. నీ దగ్గర వెయ్యిలెక్కన తీసుకున్నేమని గమ్మునయిపోయినాం. ఆ లెక్కన నువ్వే నాకు రెండువేలు ఇయ్యాల. పోనీలే అని మర్యాదగా మాట్లాడతాంటే రెచ్చిపో తాండావే…'’ మురుగా చేతులు తిప్పుతూ మాట్లాడినాడు.

“ఓట్లెయ్యమని దుడ్డు ఇచ్చేది, లంజకు సెంచికారం ఇచ్చినట్టే గదా… కుచ్చోరా అబ్బోడా గమ్మున,'’ ఎవరో తలపండిన పెద్దాయన.
భాస్కర్ మురుగాను ఉరిమి చూస్తా కుచ్చొన్నాడు.

సుమారు యాభైమంది ఉంటారు. అందరూ మగవాళ్ళే. అంతవరకూ అందరి ముఖాల్లో వినోదం చూస్తున్న ఉత్సాహం. ఇద్దరూ మౌనంగా ఉండిపో యాలకు అందరిలో నిర్లిప్తత చోటు చేసుకుంది.

ఒక కుర్రాడు డిస్పోజబుల్ గ్లాసులో టీ ఇచ్చాడు. వేడి తక్కువగా ఉంది. టీ రుచి లేదది. తలనొప్పి కాస్తయినా తగ్గుతుందేమోనని తాగాను. అప్పటికే కింద అక్కడక్కడా నలిగిపోయిన డిస్పోజబుల్ గ్లాసులు పడున్నాయి.

“భాస్కర్‌కు కాలే కాలే టీ తెచ్చీబ్బా,'’ ఎవురో చెప్పారు.

“వోనికి కాలేటిగా కాదు… చల్లగా కావాల… ఏంరా…'’ భాస్కర్ మూతిని బిగించేశాడు.

చుట్టూ చెట్లున్నాయి. షామియానా నీడలో ఉన్నాం. అయినా ఉక్కపోతగా ఉంది.

కాసేపు అక్కడ మౌనం.

“అబ్బా… ఈ మాదిర్తో ఓట్లబ్బుడు దుడ్డు ఖర్చు చేయడం నేనెప్పుడూ చూడలా… ఎవురికి వోళ్ళు మైళ్ళకు మైళ్ళు నడుసుకోని పోయి ఓట్లేసి వస్తాంటిమి,'’ తలపండినతను. కాలు మీద కాలు వేసుకుని కుర్చీలో కూర్చోనుండాడు. వార్ధక్యమో, బాధ్యతల భారమో… వంగిపోయిండాడు.

“అదంటే ఎర్రికాలంలే తాతా…'’ గుంపులో గోవిందుడు.

“ఎర్రికాలం అయితే ఏం… నేయంగా ఉన్నేం. ఓట్ల కోసరం దుడ్డు తీసుకునేది లేదు. ఇచ్చేవోళ్ళు కూడా కాదు… వూరందరం ఒగే మాట మింద ఉంటాన్నేం. ఒగరికే ఓటేస్తాన్నేం. ఇబ్బుడు తాగేవోడని లే, తాగనోడని లే… అందరికీ మందుబాటర్లు ఇస్తాండారే… ఇట్ల తాగేసి రోడ్ల మింద పోయేవోళ్ళు అప్పుడు ఎందురున్నేరు… వూరందరికీ కలిసి తాగుబోతు నాయాండ్లు ఒగరో ఇద్దురో ఉంటాన్నేరు. పై తెలీకుండా తాగేది, పెండ్లాం బిడ్డలను సావగొట్టేది. అట్లా వోళ్ళు గూడా వూర్లో పెద్దమనుసుల చూస్తే పిల్లి అయిపోతాండిరే,'’ గతాన్ని వర్తమానాన్ని తూకం వేశాడు తాత.

“మేమేమన్నా పోయి అడుక్కుంటాండామా… వోళ్ళు వచ్చి దుడ్డు ఇస్తాంటే తీసుకోకుండా ఎట్లుంటాం… దుడ్డేమన్నా చేదా…'’ మురుగా తన పనిని సమర్థించు కున్నాడు.

“దుడ్డు చేదుగాదు… కానీ ఓటుకోసం దుడ్డు తీసుకోవటం చేదే…'’

“ఎవురబ్బా… అయివోరా… మీ అన్న వార్డుమెంబర్‌కే ఓటుకు ఐదు నూర్లు, కోర్టర్ బాటిల్ ఇచ్చినే…'’ నిలదీసినాడు మురుగ.

“మా అన్నకొగ న్యాయం… మీకొగ న్యాయం ఉంటాదా? ఎవరికైనా అంతే. ఓటుకోసరం డబ్బు తీసుకోకూడదు. వాళ్ళూ ఈకూడదు,'’ బదులిచ్చినాడు అయ్యవారు.

“ఎందుకు తీసుకోకూడదూ… మనకేమన్నా తిరిపానికి దుడ్డు ఇస్తాండారా? ఓటేస్తాండ్లా…'’ గుంపులో గోవిందుడు.

“ఓటేసేది తిరిపానికీ కాదు, దుడ్డుకూ కాదు. ఓటుకుండే శక్తి దేశంలో ఇంక దేనికీ లేదు. ఇప్పుడు తిరపతే తీసుకో… ఇంటి పట్టా కావాలని ఎమ్మార్వో ఆఫీసుకు పోయినా, లోను కావాలని ఎంపిడివో ఆఫీసుకు పోయినా… మీకు వెంటనే ఇస్తాండారా… ఎవురు చెప్తే ఇస్తాండారు…?'’

చర్చ ఆసక్తిగా ఉంది. తలనొప్పి తగ్గుతుందని వాళ్ళ మాటలపైనే దృష్టి పెట్టాను.

అయ్యవారి ప్రశ్నలకు ఎవ్వరూ సమాధానం చెప్పలేదు. తిరిగి ఆయనే మాట్లాడ్డం మొదలుపెట్టాడు. “మీకు ఆ ఆఫీసుల్లో ఏ పని కావాలన్నా… ఎమ్మెల్యేనో, మున్సిపల్ ఛైర్మనో చెప్పాల. వాళ్ళు చెప్తేనే అధికారులు ఎందుకు వింటున్నారు? మీ మాటెందుకు వినటంలేదు?'’

“ఎమ్మెల్యే చెప్తే ఎందుకీరు?'’

“ఎందుకివ్వాల…? ఆయనకేమన్నా రెండు కొమ్ములుండాయా? నీలాగా ఆయన మనిషి కాదా?'’

“అదెట్లా… ఆయన ఎమ్మెల్యే కదా… పెద్దోళ్ళు… చెప్తే ఇంటారు ఆపీసర్లు,'’ మురుగా అన్నాడు.

“అదే… నేను చెప్తాండేది కూడా… ఏ విధంగా పెద్దోళ్ళు అయ్యారు. మీరు ఓట్లేస్తేనే కదా… మీరు గెలిపించకపోయింటే పెద్దోళ్ళు అయ్యిందురా…? మీరు ఓటేసి గెలిపించేది ఎందుకు? మీకు ఏ ఆపదొచ్చినా వాళ్ళు ముందుండి అధికారులతో, ఇంకా పెద్ద నాయకులతో పోరాడతారు. మీకు న్యాయం జరిగేలా చూస్తారు. ఎమ్మెల్యే అంటే ఒక అసెంబ్లీ నియోజకవర్గంలోని ప్రజలందరికీ ప్రతినిధి. మీ అందరి సమస్యలూ అతనివే. మీకోసరమే అతను పనిచేయాల. సర్పంచ్ కూడా అంతే. మీ వూర్లో తాగేనీళ్ళు రాలేదు. ఆయన పోయి పై అధికారులతో మాట్లాడతాడు. నిధులు తెస్తాడు. మీకు నీళ్ళు ఇప్పిస్తాడు. ఔనా కాదా…?'’

ఇలాంటివన్నీ పాఠాల్లో చదువుకోలేదా? అయ్యవార్లు చెప్పలేదా? ఈయనలో అయ్యవారి బుద్ధి పోలా. పెద్దోళ్ళను కూడా పిల్లోల్లమాదిరిగా చూస్తాండాడు. విసుగ్గా అనిపించింది. టైము పదకొండున్నర. ప్రియ బయట రానేలేదు. వస్తే ఇంటికిపోయి పడుకోవచ్చు.

“ఇంక అసలు విషయంలోకి వస్తా… మురుగా… ఏమన్నావూ నువ్వు… దుడ్డు ఎవురికి చేదు అనిగదా… ఇంగోరెవురో తిరిపంగా వస్తే దుడ్డు తీసుకోరా… అంటాన్నారే. మొన్న ఎన్నికల్లో ఓటుకు వెయ్యి రూపాయలు ఇచ్చినారు. కొందురు పదైదు నూర్లు కూడా ఇచ్చినారంట. చాలందానికి మందు బాటిళ్ళు… మీరేమో అయ్యన్నీ తీసుకోని ఓట్లేసినారు. ఇంగ మీ వూర్లో మంచినీళ్ళ బోరు పని చేయలేదనుకోండి. ఎవురికి చెప్పాల. సర్పంచ్‌కే గదా. పదిసార్లు అడిగినా పట్టించుకోడు, పదకొండోసారి నిలదీస్తే… పోపోయ్యా… ఆ పొద్దు ఓటుకు వేలకు వేలు దుడ్డు తీసుకోని గదా ఓటేసింది. నా ఇష్టమొస్తే చేస్తా, లేదంటే లేదు. పోండి పోండి. అంటే ఏం చేస్తారు. మనం డబ్బు తీసుకోని ఓటేసినాక, మన పని ఏదన్నా చేసి పెట్టమని ఏ అధికారంతో అతన్ని నిలదీస్తాం…?'’ అయ్యవారికి ఆవేశం వచ్చేసింది. చాలా గట్టిగా మాట్లాడినాడు.

అందరూ మౌనంగా ఉండిపోయారు.

“నాయనా గోపీ… నీళ్ళు తే…'’ అన్నాడు అయ్యవారు.

తలుపు దగ్గరున్న కుర్రాడు లోపలకు వెళ్ళి బాటిల్ తీసుకొచ్చి ఇచ్చాడు.

పక్కన కూర్చోనుండే మాదిగోళ్ళు పలకలు చేతుల్లోకి తీసుకున్నారు.

కర్రలు పూర్తిగా కాలిపోతున్నాయి. పొగ తక్కువగా ఉంది.

“ఇంగో రెండు కట్టిలు తెచ్చి ఎయ్యండి,'’ పెద్దాయన అన్నాడు.

కుర్రాడొకడు పరుగున ఇంట్లోకి పోయి రెండు కర్రలు తెచ్చి రగిలించాడు.

“య్యోవ్… ఇప్పుడే కొట్టద్దు పలకలు,'’ చెప్పాడొకతను. అతని ముఖం అభావంగా ఉంది. బట్టతల. ఉన్న జుట్టు కూడా తెల్లబడింది. తెల్ల పంచె, తెల్ల షర్టులో ఉన్నాడు.

“పన్నెండుకంతా దానం అయిపోవాలంటివి కదనా…'’ అడిగాడొకతను ఎడమ భుజానికి పలకను తగిలించుకోని, కుడి చేత్తో పుల్లలు పట్టుకోని.

“లేదులే… రావుకాలం పోనీ…'’ చెప్పాడతను.

“అదేంనా… రావుకాలం ముందే అంటివే పద్దన గూడా…'’ భాస్కర్ అడిగాడు.

“అంటినప్పా… మా తమ్ముడోళ్లు ఇంగా రాలా… వోళ్ళకు ఈ పొద్దు ఓట్లేసేది గదా… ఫోన్ చేసినా… మద్యానాలకు వస్తామన్నేరు. వాళ్లొస్తానే దానం చేద్దాంలే,'’ చెప్పి ఇంట్లోకి పోయాడతను.

ఐదారుమంది లేచి మళ్ళొద్దాం పాండి అనుకుంటున్నారు.

అక్కడ ఉండీ చేసేదేం లేదు. నాక్కూడా ఇంటికి పోదామనే ఉంది. తలనొప్పి ఎక్కువ అవుతోందే కానీ, తగ్గడం లేదు. ప్రియ లోపల్నుంచి బయటకు రానేలేదు. కుర్చీలోంచి లేచి తలుపు దగ్గరకు పోయి లోపలకు చూశాను.

ప్రియ అక్కడే కూర్చుని ఉంది. తన ఒడిలో తల పెట్టుకుని పడుకోనుంది ఆ అమ్మాయి. కాసేపు ప్రియనే చూస్తూ నిలబడుకున్నాను. నావేపు చూస్తే వెళ్దామని సైగ చేద్దాం అనుకోనుండా. కానీ ప్రియ చూళ్ళేదు. అక్కడికి వెళ్దామంటే దారి లేదు. ఆడవాళ్ళు ఒకరి ఒడిలో ఒకరు కూర్చున్నట్టున్నారు. అప్పుడొకరు అప్పుడొకరు వస్తూనే ఉన్నారు. అలా వచ్చిన వాళ్ళలో ఆడవాళ్ళంతా లోపలే ఉండిపోయారు. మగవాళ్ళు బయటున్నారు. కొంతసేపు చూశాను. ప్రియ వచ్చే వరకు కూర్చుందామని బయటకు వచ్చేశాను. ఐదారు కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. అయ్యవారు కూడా వెళ్ళిపోయాడు. కుర్చీలో కూర్చున్నాను. ఎండ ఎక్కువగా ఉంది. బాగా ఉక్కపోతగా ఉంది. చెమటలు కారుతున్నాయి.

“మీ వూర్లో ఎవురు గెల్చినారప్పా?'’

“ఏ వూర్లో అయినా ఎవురు గెలుస్తారులేన్నా. తెలీందేముండాది?'’ అన్నాడతను. అతను అప్పుడే వచ్చినట్టున్నాడు. తల నుంచీ కారుతున్న చెమటను టవల్‌తో తుడుచుకుంటున్నాడు. తల ముందుకు వంచి ఉఫ్ అంటూ ఊదు తున్నాడు. పీక్కుపోయిన ముఖం. మాసిన జుట్టు. పెరిగిన గడ్డం. లావు మీసాలు. కళ్ళు చెర్రీల్లాగా ఉండాయి.

“అక్కడా ఓటుకు వెయ్యి ఇచ్చినారా?'’ మురుగా అడిగినాడు.

“వెయ్యా…'’ అన్నాడతను.

“అందుకూ మా మామ మాదిర్తో ఇస్తార్లే ఉండు వేలువేలు…'’ భాస్కర్ అందుకున్నాడు.

“యిప్పుడే కదా నాయనా ఐవోరు చెప్పింది, ఓటేసేదానికి దుడ్డు తీసుకోకూడదు, ఈగూడదు అనీ,'’ తాత తలదూర్చాడు.

“గమ్మునుండు ముసిలాయనా… ఐవోరుకేం… ఎన్నయినా చెప్తాడు. నెల జీతగాడు కదా… కరువు కాలంలో పది రూపాయలు దుడ్డు కావాలంటే ఎవురి స్తారు…? వెయ్యి రూపాయలు కావాలంటే ఎన్నగసాట్లు పడాల? ఆ యప్పకున్నిట్టే అందరికీ సల్లంగా ఉండాదనుకుంటే ఎట్ల,'’ గుంపులో గోవిందుడు.

“ఆ యప్పయన్నీ కడుపునిండిన మాటల్లే…'’ మరొకడు.

“చెప్పనే లేదున్నా… మీ వూర్లో ఓటుకు ఎంత?'’

“ఓటుకు ఎంతా…? అంటే దానికి మతింపు లేదప్పా,'’ అన్నాడతను.

“వెయ్యి కన్నా ఎక్కువా?'’ భాస్కర్.

“మా వూర్లో పోటీ చేసిండేది ఎవురనుకున్నేరు… సన్నాబన్నా రైతా…? సన్నాబన్నా నాయకుడా…?'’ కనుబొమలెగరేసి, పిడికిలి బిగించి చేతిని పైకెత్తి అడిగాడతను.

అందరూ మౌనంగా ఉండిపోయారు.

“ఒగాయన తమ్ముడు బెంగుళూరులో ఉండాడు. అదేందో స్టార్ ఓటల్ పెట్టుకోనుండాడంట. ఆయప్పకు రోజుకు ఆదీకం లక్షకన్నా ఎక్కువేనంట,'’ అన్నాడతను చేతులు తిప్పతా.

“లక్షా…'’ చాలామంది ఆశ్చర్యపోయారు.

“ఇంగేమనుకున్నేవు… ఇంగో ఆయన అన్నకు అయిద్రాబాద్‌లో అట్లాడితే స్టార్ ఓటల్ ఉందంట. ఆ యప్పకు గూడా దినానికి ఆదీకం లక్షకు పైన్నే అంట. వోళ్ళు రేత్రిల్లో పడుకునేది గూడా దుడ్డు పరుపుమిందేనంట.'’

“ఆఁ…'’ ఇద్దరు ముగ్గురు నోరెళ్ళబెట్టారు.

“నీకెవరు చెప్పినారున్నా…?'’

“మా వూర్లో అందురూ చెప్పుకుంటా ఉండార్లే…'’

“ఓటుకెంతో చెప్పనే లేదే…'’

“మతింపు లేదప్పా… నామినేషన్ ఏసే దినమే జనాలను జీపులు పెట్టి తోలినారు మండలాఫీసుకాడికి. ఆ పొద్దే ఒగోరికి ఇన్నూర్రూపాయలు. రెండు కోర్టర్లు మందు ఇచ్చినారు. ప్రచారానికి దినమ్మూ నూరుమందికి తక్కువ లేకుండా ఉన్నారు. ఒగోరికి రోజూ కోర్టర్ మందు, నూరేబై దుడ్డు. మద్యాన్నం అన్నం, మద్దెమద్దెలో కూల్‌డ్రింకులు మామూలే…'’

“ఓయమ్మా… అంత పెట్టినారా.. అయితే ఓట్లేసే దినం ఎంత పెట్టింటారో…'’

“ఓట్లేసే దినమా… మనిషికొగ వెయ్యి. మొగోడయితే ఫేంటూ సొక్కాయి, కోర్టర్ బాటిలు. ఆడోళ్ళయితే చీరా జాకెట్టు…'’

“అబ్బో… అంతా…?! మా వూర్లో వెయ్యి రూపాయలు ఇచ్చిందానికే సస్తాండారే కొందురు,'’ మురుగా అన్నాడు.

భాస్కర్ అతని వైపు ఉరిమి చూశాడు.

నాకిదంతా వింతగాను, విచిత్రంగాను ఉంది.

“మీరు అదే గొప్పంటా ఉండారే… మా వూర్లో కత చెప్తే తల తిరగతాది మీకు,'’ ఒకతను అందుకున్నాడు మాటలు.

“మా వూర్లో కన్నా ఎక్కువ… మీ వూర్లో…?'’ అన్నాడు మొదటతను. అలా ఉండడానికి వీల్లేదు అన్నట్టుంది అతని మాటల ధ్వని.

“మా వూర్లో పోటీ చేసిండేది ఎవురనుకున్నేవు. ఇక్కడ ఎమ్మెల్యేకి చెల్లెలు మొగుడు. ఇంగో పక్క కర్నాటక మంత్రికి బామ్మర్ది. ఆ మంత్రి బామ్మర్దికి ప్రచారానికి వచ్చినప్పుడు మా ఆడోళ్ళు ఆరతిచ్చినారు. ఆరతిచ్చి తావనంతా మనిసికి ఐదు నూర్లు తట్టలో ఏసినాడు,'’ ఆ డబ్బేదో తనే ఇచ్చినంత గొప్పగా చెప్పాడతను.

“నిజమా…?!'’

“ఏమనుకున్నేరు మా వూరంటే,'’ అంటా బీడీ వెలిగించాడతను. మనిషి నల్లగా ఉండాడు. పొట్టి. బక్కపలచన. గోధుమరంగులోకి మారిన తెల్లబట్టలు. భుజంపైన చిరుగుల టవల్. అతను అందరి వైపు ఒకసారి ఏదో సాధించినవాడిలా చూసి నిక్కరు జోబీలో నించి బీడీ తీసి, పక్కనతన్ని అగ్గిపెట్టె అడిగి వెలిగించాడు.

“దుడ్డుండే మారాజులు ఏమయినా చేస్తార్లేప్పా…'’

“ఏం నారాయణా… ఈ యరవకా వచ్చేది. ముందు చెప్పిన టయానికి అయింటే ఈ పాటికి దానం అయిపోయిండునే…'’

“మా వూరేమన్నా పక్కనుందా… మదనపల్లెకు ఆ పక్కన్నించీ రావద్దా…'’ ఎముకల గూడులా ఉన్నాడతను. తను తెచ్చిన చిన్న పూలహారాన్ని తీసుకొని పోయి లోపల గాజుపెట్టె మీద ఉంచేసి వచ్చాడు.

“బెంగుళూరు నుంచీ కూడా వచ్చిండారు. మీ వూరు అంతకన్నా దూరమా?'’

ఐదారుమంది నావైపు చూశారు. నాకు ఇబ్బందిగా అనిపించింది.

“వస్తారు… ఎందుకు రారుప్పా… వోళ్ళ రూట్లో మంచి మంచి బస్సులుంటాయి. రోడ్లు బాగుంటాయి. అర్ధరేత్తిరికాడ కావాలన్నే బస్సులుంటాయి. మాకు అట్లకాదే… కడుపుతో ఉండే తల్లి కాన్పు కోసరమని బస్సెక్కితే, ఆస్పత్రికి పోక ముందే కాన్పు అయిపోవాల్సిందే… అట్లుండాయి రోడ్లు. రోజుకు మూడు సింగల్లే ఉండేది. పద్దన్నే బస్సు తప్పోతే మళ్ళ మద్దేనమే. అది తప్పోతే మల్ల రేత్తిరికే. ఎట్ల రానవుతాదిప్పా బిన్నే…?'’

నిజమే అన్నట్టు తల ఊపినారు కొందరు.

“వొగనివే వచ్చినావే… మీ భార్య రాలేదా?'’

“ఒగన్ని వచ్చేదానికే చేతిలో దుడ్డులే. ఒరుపు కదా. ఇంగ ఇద్దరం యాడొస్తాం.'’

“ఓట్ల పండగొచ్చినా ఒరుపేనా…?'’ గుంపులో గోవిందుడు.

తలనొప్పి తగ్గలేదు. కండ్లు మూసుకుని కుర్చీలో వెనక్కు తలవాల్చి కూర్చున్నాను. వాళ్ళ మాటలు వినకూడదని ఎంత ప్రయత్నించినా చెవుల్లో దూరుతున్నాయి.

“ఓట్ల పండగొస్తే మాత్రం… మాయ్యేమన్నా దుడ్డుండే వూర్లా… మా పక్క దుడ్డుండే మనుసులు ఎవురుండారు…'’

“అయితే ఓట్లకు దుడ్డే ఈలేదా?'’

“ఇచ్చినారు… ఎందుకీలా… పేపర్లల్లో చూసినాం కదా. కొన్ని తిక్కుల వేలకు వేలు ఇచ్చినారంటనే… మాకు మనిసికి నూర్రూపాయలు, మందు బాటర్లు ఇచ్చినారంతే.'’

“అంతేనా…'’ అతనివైపు హీనంగా చూసినాడు భాస్కర్.

“తునకలు పెట్టినారు. ఓట్లేసేదానికి రెండు రోజుల ముందు నుంచీ పొట్టేండ్లు కోసి మనిసికి అరకేజీ లెక్కన ఇచ్చినారు. ఈళ్ళూ ఇచ్చినారు. వోళ్ళూ ఇచ్చినారు. వొరుపొచ్చినాంక పొట్టేలి కూర తినిందే లేదుగదా. ఆ పారం కోళ్ళు తినితిని తునకల కోసరం నోరు చవి చెడిపోయిన్నింది. అందరికీ తునకల పండగనుకోప్పా. ఇంట్లో ఎక్కువమంది ఉండేవోళ్ళు ఉప్పోసలు చేసుకున్నేరు.'’

“కాలాస్తిరి తిక్కు ఆడోళ్ళకు చీరాజాకెట్టు… మందు ఆటలు గూడా ఇచ్చినారంట. కొన్ని తిక్కుల ముక్కుపుల్లలు ఇచ్చినారంట. మొగోళ్ళకు వాచీలు ఇచ్చినారంట… ఏమీ ఈకుండా ఓటేసినోడు, ఏమీ తీసుకోకుండా ఓటేసినోడుంటే… పాపాత్ముడనుకో…'’

“అయితే మేము పాపాత్ములమేన్నా…'’

“ఏమి… మీరు దుడ్డు తీసుకోలేదా?'’

“ఇస్తే కదా… తీసుకునేదానికి.'’

“అయితే ఓటు ఎవురికేసినారు?'’

కండ్లు తెరిచి చూశాను. బక్క పలచటి యువకుడు. పాచిరంగు ఫేంటు పైకి తెల్ల రంగు షర్టు వేసుకోనుండాడు. జేబులో పెన్ ఉంది. చేతికి పాత కాలం వాచీ ఉంది.

“ఓటేడ ఎయ్యనిచ్చినారు…? బూతు కాడికే మమ్మల్ను రానీలా? కట్టెలు, కత్తులు తీసుకోని మమ్మల్నందరినీ గోడవున్లోకి తోలి తలుపేసినారు. వోట్లన్నీ వోళ్ళే ఏసుకున్నేరు. సందేళ దాంకా భయంతో, ఆకలితో సచ్చినామనుకో… సందేలొచ్చి వొదిలినారు. ఈ సంగతి ఎవురికన్నా చెప్తే పాణం తీస్తామన్నేరు.'’

“మా వూర్లో ఆ గొడవలే లేవు…'’ నల్లరంగు ఫేంటు, గోధుమరంగు షర్టు వేసుకోనుండాడు. రెండు వేళ్ళకు ఉంగరాలు. బంగారం రంగులో ఉండే వాచీ. కుడిచేతికి బ్రాస్‌లెట్. మెడలో చైను. కళ్ళకు నల్లద్దాలు.

“ఏం…'’

“ఏమా… ముందే వూర్లో అందురం కలిసి మాట్లాడుకున్నేం. ఈళ్ళు గెల్చినా వూరికి చేసేదేముండదు. అందురూ దెంగి తినేదే కదా. అందుకని యాలం యేసినాం. ఎవురు ఎక్కువ పాడుకుంటే వాళ్ళే సర్పంచ్ అన్నేం. మొత్తం నాలుగు లక్షలకు యాలం పాడుకున్నేడు ఒగాయన. డబ్బు కట్టేసినాడు. ఆయన సర్పంచ్‌కు, ఆయన మనుషులు మెంబర్లుగా నామినేషన్లు వేసినారు. యునానిమస్ అయింది. దాంతో మాకు ఈ ఓట్ల గొడవలే లేవు,'’ అన్నాడతను సిగరెట్ తీసి వెలిగిస్తూ.

“ఏకగ్రీవమైతే పదైదు లక్షలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది కదా. ఇంక ఆ డబ్బంతా పంచాయితీకి ఖర్చు చేస్తాడా?'’ గుంపులో గోవిందుడు.

“ఆఁ… లాస్ట్ టైమ్ కూడా ప్రభుత్వం లక్షో, రెండు లక్షలో ప్రకటించింది. లాస్ట్ దాకా ఈలా… ఇప్పుడు మాత్రం ఇస్తాదని గ్యారెంటీ ఏముండాది. అయినా మనకు దాంతో సంబంధం లేదు. యాలంలో పాడుకున్నేడు. డబ్బు కట్టేసినాడు. వచ్చే డబ్బు ఏమన్నా చేసుకోనీలే. ఓట్లేసి గెలిపించినామనుకో… ఆ మాత్రం డబ్బయినా పంచాయితీకి ఖర్చు పెడతారని గ్యారంటీ ఏముంది?'’ తాము చేసింది కరెక్టు అన్నట్టుగా ప్రశ్న సంధించాడు.

అందరూ అతను చెప్పిందానికి ఔనన్నట్టుగా తలలూపారు.

“రెండున్నరయిందే… ఇంకా మొదలుపెట్టలేదా?'’ అయ్యవారు తిరిగి వచ్చాడు.

“కుచ్చో ఐవోరా… ఇంతసేపూ నువ్వు లేవు…'’ అంటూ ఏ వూర్లో ఎంతెంత ఇచ్చింది గొప్పగా చెప్పారు కొందరు.

“ఇప్పుడేమంటావు ఐవోరా… ఒగూర్లో అంటే ఏమో అనుకోవచ్చు… అన్ని వూర్లల్లో ఇట్లే ఉందే… ఒగోటు ఎక్కువ వచ్చినా గెల్చినట్టే కదా… అట్లాంటప్పుడు ఇదే రైటు కదా,'’ భాస్కర్ అడిగాడు, ఎగతాళిగా నవ్వుతూ.

అయ్యవారు తలొంచుకుని మౌనంగా ఉండిపోయాడు. ఆయన ముఖంలో ఏం భావాలున్నాయో? ఆయన ఏం చెప్తాడో విందామని ఆతృతగా ఉంది. ఆయన్నే చూస్తున్నాను.

“చెప్పయివోరా…'’ మురుగా.

“ఏం చెప్పమంటారు…? పాలకులు ఓట్లకిచ్చే డబ్బుతో క్షణికానందానికి గురయిన మీ కండ్లు వాస్తవాన్ని చూడటం లేదని చెప్పనా…? నాయకులు ఇచ్చే మందుతో మీ బుర్రలు పని చేయడం మానేసినాయని చెప్పనా…? అందరూ కలిసి ఎన్నికల విధానాన్ని హత్య చేసినారని చెప్పనా…? ప్రజాస్వామ్య దేశంలో ఆటవికం కన్నా హీనమయిన పాలన సాగుతోందని చెప్పనా…? నన్నేం చెప్పమంటారింగ,'’ అన్నాడు. ఆ మాటలంటున్నప్పుడు అతని గొంతు ఆవేశంతో బొంగరుపోయింది. అయ్యవారి కళ్ళల్లో నీళ్ళు.

నాకూ బాధనిపించింది.

ఇంతలో పలకలు మోగటం మొదలయింది. ఇద్దరు కుర్రాళ్ళు ఆకాశివలు కాల్చటం మొదలుపెట్టారు. అయ్యవారు ఇంకా ఏదో ఆవేశంగా మాట్లాడుతూనే ఉన్నాడు. అయితే పలకల శబ్దానికి మాటలు విన్పించటం లేదు.

శవాన్ని వీధిలోకి తెచ్చారు, స్నానం చేపించడం కోసం.

దూరంగా వెళ్ళి నిలుచున్నాను. చాలామంది శవం చుట్టూ గుంపుగా మూగారు.

ఇద్దరు పాడెను సిద్ధం చేస్తున్నారు.

శవాన్ని గుంతలో పూడ్చేప్పటికి సాయంకాలం ఐదుగంటలయింది.

అంత్యక్రియలు నిర్విఘ్నం ముగించి అందరూ వారివారి ప్రజాస్వామ్య పల్లెల్లోకి బయలుదేరారు.

ప్రియను తీసుకొని బైక్‌లో బయలుదేరాను. దారిలో మెడికల్ షాపు దగ్గర ఆపాను.

“ఏం అరుణ్… ఇక్కడ ఆపావే,'’ ప్రియ అడిగింది.

‘’తలనొప్పి ఎక్కువగా ఉంది. టాబ్లెట్ కోసం,'’ అన్నాను బైక్‌కు స్టాండ్ వేస్తూ.

అన్ని తలనొప్పులకూ మందులుంటాయా…? అసలు తలనొప్పి రాకుండా చేసుకోలేమా…?

5 అభిప్రాయాలు

  1. సూర్యకిరణ్ 07 డిసంబర్ 2006 , 3:42 am

    సాహిత్య ప్రక్రియలలో అన్నింటి కంటే, బహుశ కథ, ప్రసంగాలలోనే హాస్యం వ్యక్తం చేయడానికి అవకాశం ఎక్కువ. కవిత, వ్యాసాలలో అంత అవకాశం వుండదు, అతకదు కూడా. దేవేంద్రాచారి రాసిన “అంత్యక్రియలు” కథ చాలా అద్భుతంగా వుంది. దొంగనోట్ల, దొంగవోట్ల ప్రజాస్వామ్యాన్ని కళ్ళకు కట్టినట్లుగా, నాటకీయంగా, హాస్యంగా చూపించింది. పల్లె లో గాలి స్వచ్ఛమైనది, అలాగే జనం మాట్లాడే భాష కూడా స్వచ్ఛమైనది. పట్టణంలోకి వచ్చేసరికి భాష కొంత కల్తీ అయిపోతుంది. ఈ కథలో రాయలసీమ పల్లెలలో జనం మాట్లాడకునే భాష వున్నది. రాజకీయా దళారీలు సమాజాన్ని ఎంతగా భ్రష్టుపట్టిస్తున్నారో, అవినీతిలో ముంచెత్తుతున్నారో చూపించింది. రచయిత తన సందేశాన్ని చాలా తేలికగా జనానికి అందించగలిగాడు. జనాన్ని కదిలించే ఇలాంటి కథలు ఇంకా రావాలి.

  2. ప్రసాద్ 08 డిసంబర్ 2006 , 11:41 am

    చాలా బాగుంది. ఎన్నికల్లో నిజం నిస్సిగ్గుగా వలువలు వలిచేసి నిలబడింది.

    –ప్రసాద్
    http://blog.charasala.com

  3. aari sItaaraamayya 10 డిసంబర్ 2006 , 2:28 pm

    ఇంతకు ముందు ఎన్నో మంచి కథలు రాసిన దేవేంద్రాచారి గారు మరో మంచి కథ రాశారు. కమలమ్మ అంత్యక్రియలకై వెళ్ళిన మగవాళ్ళు ఇంటి బయట కూర్చోని రాజకీయాల గురించి మాట్లాడు కోవటం,రాజకీయాల్లో ఈనాడు ఉన్న అవినీతిని ఖండిస్తున్న అయ్యవారిని ఆయనకేంలే నెలజీతగాడు అని మిగతావాళ్ళు తీసిపారెయ్యటం - మన పల్లెల వాతావరణాన్నిచక్కగా చూపెట్టాయి. కథలో సంభాషణలు సులభంగా దొర్లిపోయాయి. సహజంగా ఉన్నాయి.

    కానీ, ముఖ్య పాత్రకీ కథకీ సంబంధం లేకపోవటం కథలో పెద్ద లోపం అనిపించింది. ఎన్నికలలో జరుగుతున్న దురాచారాల గురించి అందరూ మాట్లాడు కుంటుంటే కథా నాయకుడికి “ఇదంతా వింతగానూ విచిత్రంగానూ” ఉంటుంది. ఆయనది ఏవూరూ? అతనికి ఇవన్నీ తెలియకపోవటానికి కారణం ఏంటీ? ఐదేళ్ళనుంచీ బెంగుళూరులో ఉన్నంత మాత్రాన మనరాజకీయాల్లో ఉన్న అవినీతి వింతగా కనిపిస్తుందా? బెంగుళూరులో ఇవేమీ ఉండవా?

    మన రాజకీయాల్లో ఉన్న కుళ్ళును తలనొప్పిగా మాత్రమే చిత్రించటం కూడా నాకు నచ్చలేదు.

    కథలో మొట్టమొదట పరిచయం అయ్యే పాత్రలు కథానాయకుడి అత్తమామలు. వారికి కథతో ఎలాంటి సంబంధమూ లేదు. ఈ పాత్రలు లేకుండా ఉంటే బాగుండేది. అసలు మొదటి మూడు నాలుగు పేరాల్లో కథా నాయకుడూ అతని భార్య ప్రియా, వాళ్ళు కొన్నాళ్ళుగా బెంగుళురులో ఉంటున్నారన్న సంగతీ, ప్రియ ఈమధ్య అసహనంగా ఉంటుదనటం ఇవన్నీ కథకు అనవసరం. రాజకీయాలతో ఆసక్తిలేనివాడు ఎవరైనా ఈ సంభాషణలన్నీ వినిఉండవచ్చు.

    కథావస్తువు అంత్యక్రియల గురించి కాదు గాబట్టి వేరే పేరు పెట్టుంటే బాగుండేదేమో అనిపించింది.

    పై లోపాలు ఉన్నా, సంభాషణలద్వారా చాలా చాకచక్యంగా చెప్పిన కథ ఇది. దేవేంద్రాచారి గారికి అభినందనలు.

  4. R. Raghava Reddy 13 డిసంబర్ 2006 , 1:22 pm

    కథ బాగుంది. సీతారామయ్య గారి అబిప్రాయంలో కథ పేరు కుదరలేదని అన్నారు. కాని ఇది చాలా సరైన పేరు, కథతో సంబందం ఉన్న పేరు. ఎందుకంటే కథలో ప్రజాస్వామ్యానికి జరుగుతున్న అంత్యక్రియలే చూపబడ్డాయి.

    కథలో బలమైన సన్నివేశం ఏదీ లేకపోవటం వలన కథ బలమైన అనుభూతిని ఇవ్వటం లేదేమో!

    మాండలికంలో ఉన్నంతమాత్రాన “దెంగటం” లాంటి మాటలు వాడటం సమంజసమేనా …

    దేవేంద్ర గారినుంచి మరెన్నో మంచి కథలు రావాలని కోరుకుంటున్నాం….

  5. ravindra aiyham 25 డిసంబర్ 2006 , 5:07 am

    అంత్యక్రియలు చాలా బాగుంది నేటి సమాజాన్ని అద్దం పట్టే విధంగా వుంది, చాలా కాలానికి, చక్కని కథ చదివాను. ధన్యవాదాలు.

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)