- వైదేహి శశిధర్

అతడు కంపార్ట్‌మెంట్‌లో అడుగు పెడుతూనే
రైలు అంతా కదుల్తోన్న సంగీతపు పెట్టె అవుతుంది.
ఉబ్బిన నల్లని రెప్పల క్రింద గాజు గోళీల్లా
వ్రేలాడే కళ్ళలో అనంతమైన చీకటిని దాచుకుని
తన అయిదేళ్ళ మనుమరాలినే ఊతకర్రగా చేసుకుని
అతడు పెట్టె పెట్టెలో చిట్లిన పాటలా ప్రవహిస్తాడు
లయబద్ధంగా కదిలే రైలు చక్రాల శబ్దమే మృదంగ ధ్వనులుగా
విసురుగా కిటికీ లోంచి తాకే గాలి వీచికలే వాయులీన తరంగాలుగా
కునికి పాట్లు పడే తాతయ్యలు
ఊహల ప్రపంచం లో విహరించే కుర్రవాళ్ళూ
పోచుకోలు కబుర్లతో కాలక్షేపం చేసే కాలేజీ అమ్మాయిలు
బాధ్యతల బరువుతో కృంగిన మధ్యవయస్కులు
రకరకాల ఆలోచనా ప్రవాహాలలో తేలుతున్న ప్రయాణీకులను
తన అనాసక్త శ్రోతలుగా చేసుకుని
అతని పాట కచ్చేరీ సాగుతూనే ఉంటుంది

ప్రక్క స్టేషన్ సమీపించే కొద్దీ
అతని చేతులు చాచిన ముత్యపు చిప్పలై
రాలని స్వాతి చినుకుల కోసం వృధాగా వెతుక్కుంటూ ఉంటాయి
దాతృత్వపు ముత్యాలకు బదులుగా
నిరసన, నిర్లక్ష్యం, అవహేళనల గులకరాళ్ళని
మౌనంగా ప్రోగు చేసుకుంటూ
దెబ్బతిన్న పావురాయిలా అందరి ముఖాలు పరికిస్తున్న
తన చిన్నారి తల్లి చేయి పట్టుకుని
అతను నిర్లిప్తంగా ప్రక్క స్టేషన్ లో దిగిపోతాడు

రైలు పెట్టెలో మాత్రం అతని
పాట తాలూకు కర్కశ మాధుర్యం
ఇంకా వగరు వగరుగా, దిగులు దిగులుగా
వలయాలు తిరుగుతూనే ఉంటుంది.

(11/10/91)

ఒక్క అభిప్రాయం

  1. ravikiran 07 డిసంబర్ 2006 , 7:14 pm

    “తన అయిదేళ్ళ మనుమరాలినే ఊతకర్రగా చేసుకుని
    అతడు పెట్టె పెట్టెలో చిట్లిన పాటలా ప్రవహిస్తాడు,”

    చాలా బాగుంది.

    రవికిరణ్

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)