- ఎస్. జయ (30-9-06)
“నాన్నా! నాన్నా! ”
… …
“లే నాన్నా! నీ ప్రీతిని పిలుస్తున్నాను. లే నాన్నా!”
చంద్రశేఖర్ ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. ప్రీతి తనను పిలవడమేమిటీ? కలకంటున్నానా? అనుకున్నాడు చుట్టూ పరికిస్తూ.
బెడ్‌రూంలో తాను తన భార్య శ్రీవిద్య తప్ప ఎవరూ లేరు. శ్రీవిద్య గాఢనిద్రలో వుంది. ఆమెకు ఈ పిలుపులు వినిపించడంలేదా? అనుకున్నాడు. భార్య వైపు తదేకంగా చూశాడు శేఖర్. బ్లూకలర్ బెడ్‌లైట్ వెలుగు ఆ గదిలో వెన్నెల కురుస్తున్నట్లుగా వుంది. పాతికేళ్ళ శ్రీవిద్య చాలా ప్రశాంతంగా నిద్రపోతోంది. ఎనిమిది నెలల చూలాలు కావడం వల్ల శ్రీవిద్య ఆ వెలుగులో మరింత అందంగా ఆరోగ్యంగా కనిపించింది.
“ఎవరూ లేరే, తను కల కన్నాడు అంతే,” అనుకున్నాడు శేఖర్.
శ్రీవిద్య నడుం మీద చేయి వేసి నిద్రపోవడానికి ప్రయత్నించాడు.
“నాన్నా! నీవు కలగనడం లేదు. నీ ప్రీతిని మాట్లాడుతున్నాను నాన్నా! ”
‘ఎక్కడ్నుంచా ఆ మాటలు వినిపిస్తోంది’ అని పరికించి చూశాడు.
“నాన్నా, అమ్మ పొట్టలోంచి మాట్లాడుతున్నను నాన్నా! ”
అర్జునుడి మాటలు వింటూ సుభద్ర నిద్ర పోతే అభిమన్యుడు తల్లి కడుపులో వుండి తండ్రి మాటలు విన్నాడని, అలా పద్మవ్యూహంలోకి వెళ్ళడం తెలుసుకున్నాడని కథలు విన్నాడు. కాని తల్లి పొట్టలో వున్న పాపలు మాట్లాడడం వింతగా వుంది. అతనికి నమ్మబుద్ధి కాలేదు. అంతా తన భ్రమ అనుకున్నాడు శేఖర్.
“నాన్నా! నువ్వు భ్రమపడడం లేదు. నిజంగానే నేను మాట్లాడుతున్నాను. నా మాటలు విను నాన్నా!”
పుట్టబోయే పాపాయి తనతో మాట్లాడుతోంది అని భాస్కర్‌కు ఆశ్చర్యంగా, సంతోషంగా ఉంది.
“మీరు చాలా ప్రేమగా నాకు ప్రీతి అని పేరు పెట్టుకోవాలని, నాకు రంగురంగుల ఫ్రాకులు కొని, ఆడించాలని, చాలా చాలా కలలు కంటున్నారు. మీకు పాప పుట్టబోతుందని తెలిసి కొందరు పెదవి విరవడం కూడా విన్నాను. అయినా మీరు నన్ను బాగా చూసుకోవాలని మీరు చెప్పుకొనే కబుర్లు విన్నాను నాన్నా! కాని, నాన్నా! నాకు చచ్చిపోవాలని వుంది నాన్నా! నాకు పుట్టాలని లేదు నాన్నా, నన్ను చంపేయండి నాన్నా!”
శేఖర్ భయంతో లేచి కూర్చున్నాడు. శ్రీవిద్యను లేపబోయాడు.
“నాన్నా నీకు చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. నన్ను చెప్పనీయి నాన్నా, అమ్మను లేపొద్దు. ఇప్పుడు నిద్ర పోని. తరువాత ఆమె బాధపడుతూ ఎన్నో రాత్రులు నిద్ర పోకుండా ఉండాల్సి ఉంటుంది.”
”మీరు నన్ను ప్రేమగా చూసుకుంటారని నాకు తెలుసు నాన్నా. కాని ఈ అసమానతల సమాజం నన్ను ఎన్నో విధాల వేధిస్తుంది. నన్ను చూసి మీరు కూడా బాధపడతారు. ఆడపిల్లను కనడం నేరంగా, తక్కువగా చూస్తోంది. ఆడపిల్లలంటే అబార్షన్లు చేయించుకొని మగపిల్లవడిని మాత్రమే కనే తల్లిదండ్రులు, మగపిల్లవాడికోసం ముగ్గురు నలుగురు ఆడపిల్లల్ని కని, ఆడపిల్లలకు మంచి చదువులు కూడా చెప్పించకుండానే చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేసి, మగపిల్లవాడికే అన్ని అవకాశాలు, ఆస్తులు ఇచ్చే తల్లిదండ్రులు గౌరవించబడుతున్నారు. కాని నాన్నా మగ పిల్లలు లేని ఆడపిల్లల తల్లిదంద్రులు ఆడపిల్లలాగే బాధలు పడుతున్నారు. అవమానాలు పొందుతున్నారు. నాన్నా, నన్ను కన్నందుకు మీరు బాధలు పడకూడదు. అందుకే నన్ను చంపేయండి నాన్నా!”
“మా చిన్నారి తల్లి, ప్రీతీ, నిన్ను కంటిపాపలా కాపాడుకుంటాం. నీకా భయం వద్దు. నువ్వు మా మధ్యకు రావాలమ్మా” అన్నాడు శేఖర్.
“పక్కింటి దీప్తిని చూశాక నాకు భయమేస్తుంది నాన్నా. అమ్మకు దీప్తి చెప్పిందంతా విన్నాను నాన్నా. కట్నం కానుకలు చాలక దీప్తిని కాపురానికి తీసికెళ్ళలేదు అని మాత్రమే నీకు తెలుసు కాని, నీకు దీప్తి గురించి అన్ని వివరాలు అమ్మ చెప్పలేదు. దీప్తి గురించి విన్నాక నా నిర్ణయాన్ని ఒప్పుకుంటావు”.
దీప్తి
దీప్తి తండ్రి గోపాల్‌రావుది కర్నూలు. నలుగురు అన్నదమ్ములు. చివరి వాడిని చదివించారు. అన్నలు పొలాలు సాగు చేస్తుంటే తాను హైదరాబాద్ వచ్చి ఒక పత్రికాఫీసులో సర్క్యులేషన్ మేనేజర్‌గా చేరాడు. ఆయనకు దీప్తి, ఇందిర ఇద్దరు కూతుళ్ళు. ఇద్దరిని ఇంజనీర్స్ చేయాలని అతని కల. దీప్తి ఫైనలియర్ చదువుతున్నప్పుడే వాసవి కాలేజీలో కంప్యూటర్ ఇంజినీరింగ్ చదివాడని ఒక బంధువు ఒక సంబంధం తెచ్చాడు. అబ్బాయి తల్లిదండ్రులు పెద్దగా చదువుకున్న వాళ్ళు కాదని, కాని నంద్యాలలో పెద్ద చెరువు కింద పాతికెకరాల పొలం వుందని, ఒక్కడే కొడుకని ఆ సంబంధానికి ఒప్పుకున్నాడు. పాతిక లక్షల కట్నం ఇచ్చి, మరో పది లక్షలు ఖర్చుపెట్టి వైభవంగా పెళ్ళి చేశాడు. అమ్మాయిని, అల్లున్ని అమెరికా పంపాలని అనుకున్నాడు. పెళ్ళయిన కొత్తలో ఏవేవో కోర్సులు చేస్తున్నానని చెప్పేవాడు భాస్కర్. ఎప్పుడో తప్ప ఇంటికి వచ్చేవాడు కాదు. ఏడాదికి దీప్తికి పాప పుట్టింది. అల్లుని సంగతి అంతుబట్టని గోపాల్‌రావు, ఒక రోజు ధైర్యం చేసి వాసవి కాలేజీలో ఎంక్వైరీ చేయించాడు తన దగ్గరి బంధువైన జర్నలిస్టుతో.
భాస్కర్ ఇంజనీరింగ్ కోర్సు పూర్తిచేయలేదని, బాక్‌లాగ్స్ మూడో సంవత్సరానివి, ఫైనలియర్‌వి కలిపి 10 సబ్జెక్ట్సు మిగిలిపోయాయని తెలిసింది. అంటే బి.ఇ. రెండేళ్ళు మాత్రమే చదివాడు, మరో రెండేళ్ళు చదివింది లేదు. జులాయిగా తిరిగి తాగుడుకు అలవాటు పడ్డాడు. ఆ తల్లిదండ్రులకు కొడుకు వుద్యోగం చేయకుండా వూళ్ళో వున్నా పట్టలేదు. కట్నం పాతిక లక్షలు వచ్చాయి. కోడలి వైపు నుంచి పదెకరాల మాగాణి కూడా వస్తుంది. కొడుకు విషయంలో వారికి ఎలాంటి అసంతృప్తి లేదు. సిటీలో వుండడం వల్ల గోపాల్‌రావు కూతురు, అల్లుని మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. అవన్నీ చెల్లాచెదురు కావడంతో, రెండో అమ్మాయి విషయంలోనైనా జాగ్రత్తగా తగిన సంబంధం చూడాలని, తోడల్లున్ని చూసైనా పెద్దల్లుడిలో బాధ్యత పెరుగుతుంది అనుకున్నాడు. ఇందిరకు అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్న కార్తీక్‌తో పెళ్ళి జరిపించాడు మరో పాతిక లక్షలు ఇచ్చి. ఇందిర అమెరికా వెళ్ళాక, దీప్తిని, అల్లున్ని దగ్గర వుంచుకొని, అల్లుడిని బాగు చేసుకోవాలని తలపోశాడు గోపాల్‌రావ్. తమ ఇంట్లోనే వుండి బి.ఇ. పూర్తి చేసుకోమని అల్లుడికి సలహా ఇచ్చాడు.
భాస్కర్ అందుకు అంగీకరించి, “దీప్తిని, పాపను ఒకసారి మా ఇంటికి తీసుకొని వెళ్లి వస్తాను. వచ్చాక చదువులో పడతాను. నా బి.ఇ డిగ్రీ చేతికి వచ్చేదాక ఇక ఎక్కడికి వెళ్లను”, అన్నాడు.
దీప్తి భర్త వెంట వూరు వెళ్లింది. దీప్తి వింటుండగా భాస్కర్ తన తల్లిదండ్రులతో మామగారిచ్చిన సలహా చెప్పాడు.
అది విన్న భాస్కర్ తండ్రి, “అమెరికా స్వర్గానికి బెత్తడు దూరంలో వుంటుంది అంటారు. మరి స్వర్గానికి వెళ్లిన వారు తిరిగి రారు. ఇందిర కూడా ఇక రాదు. మీ నాన్న తన అన్నదమ్ముల నుంచి ఇంకా ఆస్తి పంపకాలు చేసుకోలేదట కదా, ఆ పంపకాలు పూర్తి చేసి, వచ్చిన పొలం, బ్యాంకు బాలెన్సు మా వాడి పేర చేయించమని చెప్పు. మీరు మా అందరి ఎదురుగా వుంటారు. భోగభాగ్యాలు అనుభవిస్తారు. ఈ కాలంలో అన్నదమ్ములను నమ్మితే, రేపొద్దున మీ నాన్నకు ఏమన్నా అయితే, ఆ పొలం వారి సొంతం అవుతుంది.”
గోపాల్‌రావు ఆయన సోదరులు చాలా అన్యోన్యంగా వుంటారు. అన్నదమ్ముల మధ్య అపనమ్మకాలు, డబ్బు, ఆస్తులు పోగేసుకోవడం వంటివి గోపాల్‌రావుకు ఇష్టం వుండదు. మంచి అవకాశాలు కల్పించుకోవాలి. కష్టపడి పనిచేయాలి. ఆనందంగా అందరం కలిసి జీవించాలనేది ఆయన తత్వం. సరిగ్గా దీనికి భిన్నమైంది దీప్తి భర్త వైపు కుటుంబం. మామగారి మాటలు విన్న దీప్తికి చిరాకు వేసింది. తన మీద ప్రేమతో కాదు భర్త తనను ఇక్కడికి తెచ్చింది. ఆస్తిపాస్తుల కోసం అని అర్థం చేసుకుంది. ఆమెకు భర్త మీద వున్న కాస్తా సదభిప్రాయం కరిగిపోయింది.
“మీరు అడిగినంత కట్నం పెళ్లి నాడే ఇచ్చారు. ఇక నాన్నను మీరేం అడిగినా నాకు ఇష్టం వుండదు అని తేల్చి చెప్పింది దీప్తి.
“మీరు ఇద్దరూ కూతుళ్లే. ఇప్పుడు ఒక్కదానివే, అదంతా మా వాడికే చెందాలి. మీ నాన్న ఆస్తిపాస్తులు మంది పాలు కావడమేమిటి? ఆయనకు తరువాత ఏం బుద్ధిపుడుతుందో, ఇప్పుడు మా వాడి సొంతం కావాలి. మీ అమ్మను, నాన్నను ముసలితనంలో సాకాల్సింది మావాడే కదా? వాళ్లు అల్లుడి దగ్గర వచ్చి వుంటామంటే వద్దనకూడదు కదా! మరి మీ నాన్న తన సంపాదనను, ఆస్తిపాస్తుల్ని అన్నదమ్ములకి ఇచ్చి, వట్టి చేతుల్తో ఇక్కడికి వస్తే ఎట్లా చూసుకోవాలి? ఆస్తిపాస్తులు పంచుకుని వచ్చి, నీకు ఇందిరకు సెరి సగం ఇస్తే, ఇందిర అమెరికాలో ఉండి తల్లిదండ్రులను చూసుకోలేదు కదా. మా వాడే కదా చూసుకోవాల్సింది. పెద్దల్లుడికి ఏమీ ఇవ్వకుండా, మా వాడి దగ్గరికి బతకడానికి వస్తే ఎలా దగ్గర వుంచుకోవాలి?” శ్రీధర్ తల్లి విపులంగా చెప్పింది.
తన తండ్రిని ఒక నిస్సహాయుడిగా చిత్రిస్తున్న అత్తగారి వాదనలు విన్న దీప్తి, “మీరు చాలా దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. మా అమ్మ, నాన్న గురించి మీరు మాట్లాడే ధోరణి నాకేం బాగు లేదు. నాకివ్వాల్సింది ఇచ్చారు. ఆయనకై ఆయన ఏమైనా ఇస్తే తీసుకుంటాను కాని, ఆయన ఆస్తిని, సంపాదనను అడుగను. మా నాన్న నుంచి అంతా తీసుకొని బికారిని చేసి, అల్లుడి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడేట్టు చేయలేను”, అంది.
“పెళ్లయిన తర్వాత ఆడపిల్లకు భర్త, భర్త ఇల్లే ముఖ్యం. ఇంకా అమ్మా, నాన్న అంటూ మాట్లాడతావేంది? ఇన్ని మాటలు నీ నుంచి వినడానికి కాదు. చెప్పింది చేస్తావా లేదా?” అని అడిగింది అత్తగారు.
“లేదు” అని వెంటనే సమాధానం ఇచ్చింది.
దీప్తి నోటి నుంచి ఆ మాట వచ్చిందో లేదో ఆమె చెంప మీద అత్తగారు ఒకటిచ్చింది. దిమ్మెరపోవడం దీప్తి వంతయింది. కొడుకును కన్న అహంకారంతోనే కదా చదువు రాకపోయినా ఇంజనీరింగు చదివిన తనను కొట్టగలిగింది? అత్త తనపై చేయి చేసుకోవడం చాలా అవమానంగా భావించి, పాపను తీసుకొని ప్రయాణమయింది దీప్తి.
“ఆపరా దాన్ని, ఎక్కడికి పోతదో నాలుగు అంటించరా” అంటూ చర్నాకోలా అందించింది భాస్కర్ కు అతని తల్లి.
“ఖామోష్! మరొక్క దెబ్బ నా మీద పడితే, మీరంతా జైల్లో వుంటారు, ఖబర్దార్” అంది దీప్తి ఏ మాత్రం తొణక్కుండా.
“ఏమిట్రా అది హైదరాబాద్ లో వుందనా మనల్ని తురకంలో బెదిరిస్తోంది. దాని అంతు చూడు” అంటూ కేకలేసింది.
“అమ్మా కొంచెం ఆగు. మా పెళ్లి రోజున పేపర్లో పెళ్లికి శుభాకాంక్షలు తెలిపే ప్రకటనలు చూసి సంబరపడ్డావు గుర్తుందా? దీప్తిని కొడితే, పేపర్లోకి ఎక్కుతాయి మన పేర్లు. నా బతుకు బండలవుతుంది. నీ కోపం తగ్గించుకో” అని సలహా ఇచ్చాడు భాస్కర్ చాలా శాంతంగా.
దీప్తికి జరిగిన అవమానం తెలిసి ఆ తల్లిదండ్రులు చాలా కుమిలిపోయారు.
గోపాల్‌రావు అల్లున్ని దారిలో పెట్టలేకపోయాడు. కాని దీప్తిని మంచి పేరున్న కంప్యూటర్ కంపెనీలో వుద్యోగంలో చేర్పించగలిగాడు. భాస్కర్ దీప్తిని చూడ్డానికి కూడా రావడం లేదు. ఆయన కలలన్నీ కల్లలు కాగా, దీప్తిని చూసుకుంటూ బతుకు బండిని భారంగా లాగుతున్నాడు.
“నాన్న ఇప్పుడు చెప్పు ఆడపిల్లల్ని కన్నందుకే కదా ఆ తల్లిదండ్రులు బాధలు పడుతున్నారు?”
“ఇందులో గోపాల్‌రావు తప్పు వుంది. పెళ్లికి ముందు భాస్కర్ గురించి బాగా తెలుసుకోవాల్సింది. చెప్పుడు మాటలు విని అలాంటి పెళ్లి చేయడం వల్ల, దీప్తికి కష్టాలు వచ్చాయి, వారికి మనశ్శాంతి పోయింది. ఆడపిల్ల పెళ్లి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేగాని ఆడపిల్లలు వద్దు అనుకోకూడదు” అన్నాడు శేఖర్.
“మీ పిన్ని కూతురు జ్యోతిని మరిచిపోయావా నాన్నా? చిన్నప్పుడు నీతో కలిసి ఆడిపాడినదే కదా!”
శేఖర్ గతాన్ని గుర్తు చేసుకున్నాడు.
జ్యోతి
జ్యోతి అన్న రాజేష్ సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ చదవడానికి అమెరికా వెళ్లి తిరిగిరాని దూరతీరాలకు వెళ్లిపోయాడు. జ్యోతి అమ్మమ్మ తన కూతురిని, అల్లున్ని ఆ దుఃఖంలోంచి బయట పడేయడానికి జ్యోతికి ఎం.ఏ ఫైనలియర్ లో వుండగానే పెళ్లి జరిపించింది. జ్యోతి ఒకతే కూతురని, దూరం బంధువైన శ్రీకాంత్ కట్నం అడక్కుండా పెళ్లి చేసుకున్నాడు. చదువు పూర్తయ్యే వరకు జ్యోతి తల్లిదండ్రులతోనే వుంది. ఈ లోగా ఆమె గర్భవతి కావడంతో కాన్పు వరకు వుండిపోయింది. నిరుద్యోగిగా వున్న శ్రీకాంత్ అపుడపుడు వచ్చిపోయేవాడు. ఆడపిల్ల పుట్టిందని కబురు అందజేస్తే చూడడానికి వచ్చిన శ్రీకాంత్, తను బిజినెస్ చేయాలనుకుంటున్నానని, అందుకోసం పది లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అంత డబ్బు లేదంటే అప్పు చేసి ఇవ్వమన్నాడు. లేదా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోమని, ఎప్పటికైనా జ్యోతి తల్లిదండ్రులను తనే సాకాలి కనుక తను వాళ్ల బాగోగులు చూసుకుంటానని చెప్పాడు. జ్యోతి తండ్రి దీర్ఘాలోచనలో పడ్డాడు. “అవును ఇంకో ఏడాదేగా సర్వీసు వుండేది, వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటేనేం” అనుకున్నాడు. కాని జ్యోతి తల్లి సుజాతకు ఇంకా ఎనిమిదేళ్ల సర్వీసు వుంది. అల్లుడి మాటలు తీరు కోపం తెప్పించాయి. “వుద్యోగం సద్యోగం చూసుకోలేని వాడివి, నీకు డబ్బిచ్చి బిజినెస్ పెట్టిస్తే మమ్మల్ని సాకుతావా, నిన్ని నీవు పోషించుకోలేని వాడిని మమ్మల్ని పోషిస్తావా?” అని నిలదీసింది.
“మీకున్నది ఒక కూతురే కదా! అడిగినప్పుడు డబ్బిస్తారులే అని, వుద్యోగం చేయకుండా బిజినెస్ చేయొచ్చని ఇన్నాళ్లు ఎదురు చూశాను. జ్యోతికి పుట్టింది ఆడపిల్ల. మీరు పది లక్షలు ఇచ్చేదాకా జ్యోతిని కాపురానికి తీసుకెళ్లను” అని బెదిరించాడు శ్రీకాంత.
సుజాతకు చాలా కోపం వచ్చింది. “జ్యోతిని నీ వెంట పంపేదే లేదు అంది.”
జ్యోతి తండ్రి కల్పించుకుని, “పల్లెల్లో ఒక సాంప్రదాయం వుంది. ఒక్క కూతురే వున్న ఇంటికి అల్లుడే ఇల్లరికం వస్తాడు. టౌన్ జీవితం కనుక అడగలేదు. ఎక్కడెక్కడో వుద్యోగాలు చేయాల్సి వుంటుంది. ఒక ఇల్లంటూ వుండదు కదా. కాని నువ్వు బిజినెస్ చేస్తానంటున్నావు. నువ్వు మా దగ్గరే వచ్చి వుండు. ఏ రకం బిజినెస్ కు నువ్వు సరిపోతావో ముందు మమ్మల్ని తెలుసుకోనివ్వు.” అని శ్రీకాంత్ ను సముదాయించాడు.
“అత్తా మామలు చెప్పినట్టు నడుచుకునే మనిషిని కానండీ నేను. ఇంత సేపు నేను వాదించకుండా జ్యోతికి నాలుగు అంటించివుంటే డబ్బొచ్చి పడేది నా చేతుల్లో.” అంటూ, “జ్యోతీ రడీ అవు. మా వూరు వెళదాం” అన్నాడు విసురుగా.
“నేను రాను. డబ్బు రాబట్టడానికి నన్ను తీసికెళతానంటున్నావు. ఇక్కడే వుంటాను. నువ్వు వుద్యోగమో, బిజినెస్సో చేసినప్పుడు వస్తాను” అంది జ్యోతి.
ఇది గడచి రెండేళ్ళయినా శ్రీకాంత్ తిరిగి ఆ గడప తొక్కలేదు. ఉన్న ఒక్క కూతురుకి తగిన భర్త లభించలేదని జ్యోతి తండ్రి దిగులుతో రిటైర్డ్ అయిన కొన్నాళ్ళకే గుండెపోటుతో చనిపోయాడు. జ్యోతికి కాలేజీ లో వుద్యోగం దొరికింది. పాపను చూసుకోవాలని సుజాత వాలంటరీ రిటైర్మెంటు తీసుకొంది. ఇంటికొచ్చే పేషంట్లని చూస్తోంది.
“పది రోజుల క్రితం అమ్మను చూడదానికి వచ్చింది జ్యోతి అత్త. అత్త అమ్మతో ఏమందో తెలుసా నాన్నా?”
“……………”
“అమ్మా, నాన్న అంటే నాకు చాలా ప్రేమ. అన్నయ్య పోయాడు. వాళ్ళను ఒంటరిగా వదిలిపోవాలంటే నాకు దుఃఖం కలిగింది. అమ్మ వాళ్ల నాన్న కమ్యూనిస్టు. ఆడవాళ్ళ హక్కులకు ఎక్కడ భంగం కలుగుతున్నా సహించలేదు అమ్మ. అలాంటి అమ్మ ముందు ఆ రోజు శ్రీకాంత్ చాలా చెత్తగా మాట్లాడాడు. ఆమెకు కోపం వస్తే ఇంకేమైనా వుందా? ఆ రోజు నాకు చాలా భయమేసింది. అయినా ఆ రోజు అమ్మ చాలా కంట్రోల్ లో వుందనే చెప్పాలి. నన్ను అడ్డు పెట్టలేదు. పోవడం మానడం నా ఇష్టానికే వదిలేసింది. అంత ఆవేశపడే అమ్మలో నిస్సహాయత చూసాను. అది భరించలేక నేను శ్రీకాంత్ వెంట వెళ్ళలేదు. రోజు రోజుకూ ఏదో తెలియని బలహీనత మనసులో కొంచెం కొంచెం ఇంకుతోంది. శ్రీకాంత్ పిలిచినప్పుడు వెళ్ళాల్సిందేమో. నేను తప్పు చేసానేమో. జీవితం ఆగిపోయినట్టనిపిస్తుంది. నా కాపురం బాగుంటే నాన్న ఇంకొన్నేళ్ళు బతికే వాడు. నేనే నాన్నను చంపానని వెక్కి వెక్కి ఏడ్చింది జ్యోతత్త”.
“జ్యోతి తను తప్పు చేసానని ఎందుకనుకోవాలి. ధైర్యం లేదు. పిరికి పిల్ల. శ్రీకాంత్ కోసం ఇంకా ఎదిరి చూడడమేమిటీ? జ్యోతి అమాయకత్వం చూసి వాడట్లా ప్రవర్తిస్తున్నాడు.”
“పైకి చాలా ధైర్యంగా వుండే వాళ్ళు కూడా భర్త, కుటుంబం అనే సరికి మెత్తబడి పోతారు నాన్నా! నేను కడుపులో పడ్డప్పటి నుండీ అమ్మను చూస్తోంది డాక్టర్ అరుణ. ఆమె చాలా ధైర్యస్తురాలు కదూ! ఆమె గురించి నీకు తెలుసా నాన్నా?”
“ఆమెకి బాధలా? నేను నమ్మను. ఎంత చలాకీగా, ఫ్రీగా వుంటుంది. ఎన్ని విషయాలు మాట్లాడుతుంది. ఆడపిల్లలంటే అలా వుండాలి. అలాంటి డాక్టర్ అరుణకి సమస్యలా?”
“అవును నాన్నా! అరుణకు కూడా ఇటువంటి సమస్యలే!!”
అరుణ
డాక్టర్ జగన్నాథం కూతురు అరుణ. డాక్టర్ల వద్దకు ప్రజలు రావడం కాదు ప్రజల వద్దకు డాక్టర్లు వెళ్ళాలనే వాడు. డాక్టర్ కోట్నీస్ అంటే అభిమానం. చైనా లో ఒక బిడ్డనే కంటారు. భారతీయులం కూడా ఇదే పద్ధతి అనుసరించాలని, అరుణ పుట్టగానే, భార్యకు కూడా చెప్పకుండా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నాడు. అరుణ తన క్లాస్‌మేట్ నే ప్రేమించి పెళ్ళి చేసుకుంటే, తలితండ్రులు అడ్దు చెప్పకపోగా, వరున్ని వెదికే భారం తగ్గించినందుకు సంతోషపడ్డాడు ఆ తండ్రి. ఆ సంతోషం వాళ్లకు అట్టే కాలం నిలవలేదు. అరుణ, ఆమె భర్త వినోద్ ఇద్దరూ అపోలో హాస్పిటల్ లో డాక్టర్లుగా చేరారు. జీతాలు బాగానే ఉన్నాయి. ఆపరేషన్ చేసినప్పుడు అదనంగా డబ్బు కూడా వస్తోంది. అయినా, సొంత హాస్పిటల్ లేకపోయిందని చింత వారిని ఎప్పుడూ వేధించేది. అరుణ తండ్రి గురించి చెబుతుంటే, ‘కూతురికి అల్లుడికి ఒక హాస్పిటల్ నిర్మించి ఇవ్వడా. ఆయనకున్న పేరు ప్రఖ్యాతుల వల్ల పేషంట్లు తమ హాస్పిటల్ కు క్యూ కట్టక పోరు,’ అనుకున్నాడు డాక్టర్ వినోద్. పెళ్ళి తర్వాత తెలుసుకున్నాడు అరుణ తండ్రి ఏమీ సంపాదించలేదని. పేదలకు వైద్యంతో పాటు మందులివ్వడం, మందులు లేక పోతే డబ్బులిచ్చి పంపడం వినోద్ కు నచ్చేది కాదు. రోజు రోజుకూ వినోద్ అసహనం భరించలేక ఒక వైపు, కాలంతో పాటు మారని తండ్రిని చూసి చిరాకు పడుతూ అరుణ ఒక రోజు భర్తతో కలిసి వేరే ఇంట్లో కాపురం పెట్టింది.. అరుణ అట్లా వెళ్ళి పోవడంతో ఆమె తల్లి చాలా ఆవేదన చెందింది. ఆ దిగులు తోనే ఆమె చనిపోయింది. ఒంటరి అయిన తండ్రిని అడిగింది అరుణ ఒక రోజు “మాతో కలిసి వుండు నాన్నా! నువ్వేమీ చెయ్యక్కరలేదు. నీకిష్టమైన బుక్స్ చదువుకుంటూ వుండు.”
“వైద్యం చేయకుండా వూరికే వుండు అంటావు. అవునా?” అన్నాడు జగన్నాథం కూతురి కళ్లలోకి చూస్తూ.
“అవును నాన్నా! నిన్ను చూసుకుంటాం. కాని నువ్వు ప్రజాసేవ పేరిట డబ్బు ఖర్చు చేయొద్దు. నీ కెంత డబ్బు కావాలన్నా ఇస్తాము.” అంది అరుణ తల దించుకుని.
“డబ్బేం చేసుకోను? నేనో నర్సింగ్ హోమ్ కట్ట లేక పోయానని నా మీద కంప్లేంట్స్ వుండనే వున్నాయి. మీరనుకున్నట్టు నేను పాత కాలం మనిషినే. నన్ను ప్రజలే చూసుకుంటారు. నాకేం భయం లేదు. ముసలితనంలో ఎలా అని భయపడుతూ బతకడం కన్నా ఘోరమైన నరకం మరొకటి లేదు. నన్ను మొండివాడని ఈసడించుకున్నా పర్వాలేదు. నా కిష్టమున్నట్టు బతికే స్వేచ్ఛ నాకుంటే చాలు. నీకెప్పుడూ ఆంక్షలు పెట్టలేదు. స్వేచ్ఛ నిచ్చాను. నువ్వు కూడా నన్ను అలానే చూడు.” అన్నాడు కూతురుతో.
మామగారి భారం తమ మీద పడనందుకు వినోద్ సంతోషించాడు. అరుణ కూడా మారని తండ్రి మనస్తత్వానికి విసుగుపడిందే కాని ఆయన ఆదర్శాలని అలవోకగా మర్చిపోయింది. మర్చిపోలేక పోతే తను వినోద్ తో కలిసి శాంతిగా బతుకలేననుకుంది.
ఒక రోజు వుదయాన్నే తండ్రి చనిపోయినట్టు కబురంది పరుగు పరుగున ఇంటికి వెళ్ళింది అరుణ. అప్పటికే ఇంటి ముందు వందలాది మంది గుమి గూడి వున్నారు. రాత్రి నిద్రలో స్ట్రోక్ వచ్చి చని పోయాడు అని అనుకుంటున్నారు తండ్రికి తెలిసిన డాక్టర్లు. “అది వుత్తి స్ట్రోక్ కాదని డాటర్ స్ట్రోక్” అని అపరాధ భావనతో అనుకుంది అరుణ. వందలాది మంది వూరేగింపుతో ఆయన శవ యాత్ర జరిగింది. ఆయన వీలునామాలో తన డెడ్ బాడీ హాస్పిటల్ కు డొనేట్ చేయాలని, ఇల్లు లైబ్రరీకి వుపయోగ పడాలని రాసాడని ఆయన కొలీగ్స్ ఆ వీలునామా అరుణకు చూపించారు. వీలునామా చూసి, ఒక్క సారిగా బావురుమంది అరుణ.
రక్తం పంచుక పుట్టినా, తండ్రి ఎన్నెన్నో విషయాలు చెబుతూ ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో పెంచినా, తను మార్కెట్ వలలో చిక్కుకున్నానని, కన్న తండ్రికి పరాయిదాన్నైపోయానని, ఆయన చివరి రోజుల్లో తోడుగా వుండలేకపోయానని అపరాధభావన ఆమెను వేధిస్తోంది. కాని వారి గురించి తెలిసినవారందరూ అరుణ పిచ్చిదని, అరుణకు ఆడపిల్లగా ప్రవర్తించడం రాదని, శ్రీధర్ తెలియక అరుణను పెళ్ళి చేసుకున్నాడని, పాపం అని అతనికే సానుభూతి తెలుపుతూ వుంటారు. ”ఇప్పుడు చెప్పు నాన్నా! ఆడపిల్లల్ని కన్న తండ్రులు కూడా పితృస్వామ్యం బాధితులే కదా నాన్నా!” ………………. ”అమ్మా, నువ్వు మంచి వాళ్ళు. నా వల్ల మీరు బాధలు పడడం నాకు ఇష్టంలేదు నాన్నా. నన్ను చంపండి నాన్నా”?
శేఖర్ దగ్గర సమాధానాలు లేవు. శేఖర్ రెండు చేతులు ముఖం మీద కప్పుకొని వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు.
శ్రీవిద్యకు మెలుకువ వచ్చింది. శేఖర్ ను చూసి గాభరా పడింది. “ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావ్” అని అడిగింది.
తన ముఖమీది చేతులు తీసివేసి. కళ్ళు తుడుచుకుంటూ “ఏమీ లేదులే” అన్నాడు.
”ఏం లేకపోవడమేమిటీ? అలా ఏడుస్తూ. ఏమైనా పీడకల వచ్చిందా?”
”అవును పీడకలలాంటిదే. పడుకో ఏం లేదులే.”
శేఖర్ పడక మీది నుంచి లేచి మంచినీళ్ళు తాగి వచ్చాడు.
”ఏం కల వచ్చింది? ఆడపిల్ల కన్నా అన్యాయంగా ఏడ్చేశావు. పీడకలలకు ఏడ్చే నిన్ను చూస్తుంటే నవ్వొస్తోంది. చెప్పు ఏం కల వచ్చిందో” లలాలనగా అడిగింది శ్రీవిద్య.
“చెబితే నమ్మవు నువ్వు. కాని నిజం. కల రాలేదు. మేల్కొనే వున్నాను. చాలా సేపట్లుంచి మన పాప ప్రీతితో మాట్లాడుతూ ఉన్నాను.”
“పాపతో మాట్లాడావా? నమ్మలేని ఊహలు చేశావే!”
“ముందే చెప్పాను. నువ్వు నమ్మవు అని. కాని నిజం. మన పాప మీద ఒట్టు.”
“అయితే ఏమంది మనపాప?”
“నేను చెప్పను. నా నోటితో నేను చెప్పలేను. మన పాప ఏం కోరుతున్నదో?” అంటూ మళ్ళీ ఏడ్వడం మొదలుపెట్టాడు శేఖర్.
శ్రీవిద్య పూర్తి మెలుకువలోకి వచ్చింది. “విషయం చెప్పకుండా నువ్వలా ఏడుస్తుంటే చాలా బాధగా వుంది. నాకు చెప్పకూడదా? నువ్వు, నేను పరాయి వళ్ళమా? పాప మాట్లడింది అంటావు. ఏమిటో చెప్పమంటే ఏడుస్తావు. నాక్కూడా ఏడుపొస్తోంది”, అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.
“నువ్వు బాధ పడకూడదు విద్యా. కాని విని తట్టుకోలేవని చెప్పలేక పోతున్నాను. కాని చెప్పక తప్పదనిపిస్తోంది. ధైర్యంగా వుండాలి నువ్వు.”
“అలాగే” అంది.
ప్రీతి చెప్పిన విషయాలు చెప్పాడు.
శ్రీవిద్య తన పొట్టవైపు అప్యాయంగా చూసుకుంది. “మనకు ప్రీతి ఉంటుంది. ఇది పీడకల అని మరిచిపో. దగ్గరగా పడుకో,” అంటూ శేఖర్‌ను పక్కన పడుకో బెట్టుకొని, అతని తలను తన గుండెలోకి పొదుపుకుంది. అతని తలలోకి వేళ్ళు పోనిచ్చి సుతారంగా దువ్వుతూ “మనలోని భయాలే మన పాపతో మాట్లాడించాయి. వద్దు భయపడవద్దు మనం,” అంటూ ఓదార్చింది. ఆమె మాటలు విన్న తరువాత కాసేపటికి శేఖర్ నిద్రలోకి జారుకున్నాడు. కాని శ్రీవిద్య ఆలోచనలతో మేల్కొంది.