- వట్టికోట ఆళ్వార్‌స్వామి

రామభూపాలరావు దొర బంకుల్లో అల్లుడు కొండలరావుతో కాలమాన పరిస్థితులను గురించి మాట్లాడుతూ కూర్చున్నాడు. పెద్ద గుమాస్తా హైదరలీ పత్రికను శ్రద్ధగా చూస్తున్నాడు. హైదరలీ ఆశ్చర్యంతో లేచి, “చూచారా దొరవారు! ఒక పిల్లకు రెండు తలలట, అదేదో ఊళ్ళో ఒక హరిజన స్త్రీకి పుట్టిందట. ఈ హరిజనులనే వాండ్లు ఏ దేశంలో ఉంటారు దొరవారు?'’ పత్రికను రామభూపాల్ రావుకు అందిస్తూ అన్నాడు.

“ఏ దేశమేందయ్యా! అగాధం మనిషివి. మాలమాదిగలకు గాంధీ ఆ పేరు పెట్టాడు,'’ కొండల్‌రావు హేళనగా నవ్వుతూ అన్నాడు.

“ఎక్కడ తోచక లేనిపోనివి ఏవేవో లేవదీస్తుంటారు. హరిజనుడైతేమి, ఆది దేవుడైతేమి. మాల మాలే మాదిగ మాదిగే, ఉండలేని చేష్టలుగాని,'’ రామభూపాల్ రావు పత్రికను చూస్తూనే అన్నాడు.

“అయితే ఇక మీద మాలమాదిగలను హరిజనులనాలని సర్కారు ఖానూన్ చేస్తుందా దొరవారు?'’ అమయాకంగా అడిగాడు హైదరలీ.

“సర్కారు ఖానును కాదు. గాంధీ అని ఒక కాంగ్రెసువాడున్నాడు. ఆయన ముద్దుగా ఆ పేరు పెట్టాడు. దేవుని మనుషులని దాని అర్థమట,'’ కొండల్‌రావు వివరించాడు.

“మనమంతా దేవుని మనుషులం కాకపోతే దయ్యాలకు పుట్టినమా? సరేగాని దొరవారు! మాలమాదిగలంటే యాదికొచ్చింది. ఇయ్యాల రేపు అందరికి మాల మాదిగలంటే దయగలుగుతున్న దెందుకో? ఈ గాంధే గామాలు, మాలమాదిగలు వేరే మతాల్లో చేరితే, చచ్చిందాకా ఉపవాసము జేస్తానన్నాడట. ఎవరో వాండ్లు వీండ్లు పోగై గాంధీని సమ్మతి పరిచినారట నిజమేనా? ఏది నిజమో ఏది అబద్ధమో, మొన్న నిజామాబాదులో మా అల్లుని ఇంట్లో అనుకుంటే వింటి,'’ హైదరలీ అన్నాడు.

“ఏమిటో జరుగుతుంటాయి,'’ రామభూపాల్‌రావు ఆవలింతదీసి చిటికెలు వేశాడు. హైదరలీ నుద్దేశించి, “చూడు, నేను చెప్ప మరిచిపోయిన. కోమటి శంభయ్యను పేటకు పొమ్మని అనుంటిని. వాడు అశ్రద్ధ మనిషి. నీవే స్వయంగా వెళ్ళి వెంట ఉండి పంపించు. తెల్లవారే వరకు రావాలని చెప్పు. అటే పోతు పోతు, నాగబోయిన యల్లడికి, ఈరబోయిన రంగడికి చెప్పి రేపు కచ్చడాలకు ఎడ్లు కావాలని చెప్పంపు,'’ అన్నాడు.

“మన కచ్చడపుటెడ్లు అవసరమేమోనని ఇవ్వాళ్ళ రేపు బాగా మేపండని కొట్టంలో కట్టించిన,'’ హైదరలీ కండ్లద్దాలు పెట్టెలో పెడ్తూ అన్నాడు.

“ఇవ్వాళనే నడిచి నడిచి వచ్చినవాయె. రేపు మళ్ళీ పోవాలంటే ఎట్లా? యల్లడి, గంగడి గిత్తలు కచ్చడానికి బాగా అలవాటైనవి,'’ రామభూపాల్‌రావు అన్నాడు.

“అట్లైతే సరే!'’ అంటూ హైదరలీ వెళ్ళిపోయాడు.

తండ్రి చెప్పిన విషయాలు మామతో ఏ విధంగా చెప్పాలని కొండల్‌రావు ఆలోచిస్తున్నాడు. చేతికర్రను వింతగా పరీక్షిస్తున్నాడు.

“మీవైపు బాగా వర్షాలు ఉన్నట్టేనా?'’ రామభూపాల్‌రావు అడిగాడు.

“వర్షాలు అట్టట్లనే ఉన్నయి. ఈ సంవత్సరం పశువులు కూడా చాలా నష్టపడ్డవి. రెండు ఇంజన్లు పెట్టిద్దామని నాయన అనుకుంటున్నాడు. డబ్బు తెమలక ఇబ్బందిగా ఉందని మీతో చెప్పమన్నాడు,'’ కొండల్‌రావు అవకాశాన్ని పురస్కరించుకొని అనేశాడు.

అల్లుని మాటలు వరదక్షిణ పైకం కావాలంటున్నట్టు రామభూపాల్‌రావు పసిగట్టాడు. ఇదివరకే ఎన్నో వాయిదాలు పెట్టాడు. ఈ పర్యాయం ఏం చెప్పాలో వెంటనే తలపురాక గొంతు సరాయించుకున్నాడు. “మాకు వర్షాలుండగనే అయిపోయింది? ఎన్ని వనరులు అనుకూలంగా ఉండాలె,'’ గొణిగినట్లు పైకి అన్నాడు.

“పెండ్లి బాపతు పైకం ఈ పర్యాయం పూర్తిగా తీసికొని రమ్మన్నాడు,'’ కొండల్‌రావు కుండ బద్దలుకొట్టినట్టు అనేశాడు.

“మీ నాయనకేం? మహారాజు, అనుకున్నట్టల్లా సాగుతూ ఉంది. ఏమైనా అంటాడు. ఆయనకే ఇబ్బందిగా ఉంటే నాకెట్లా ఉండొచ్చు. కొంచెమీ నాయనను ఆలోచించమను,'’ రామభూపాల్‌రావు మందహాసముతో అన్నాడు.

కొండల్‌రావు ఇక మాట్లాడటం లాభం లేదనుకున్నాడు. కాని వరదక్షిణ పైకం వసూలు చేసికోలేని అసమర్థుడని తండ్రి కోప్పడతాడని ఆరాటపడ్డాడు. ఇంతలో దాసీవాడు వచ్చి స్నానానికి రమ్మని పిలిచాడు. కొండల్‌రావు లోపలికి వెళ్ళిపోయాడు.

ఇంతలో హైదరలీ వచ్చాడు. కోమటి శంభయ్యను ప్రయాణం చేయించానని, ఎడ్లకు ఏర్పాటు జరిగిందని చెప్పాడు. కండ్లద్దాలు తగిలించుకొని దఫ్తరాల గూడు వద్దకు వెళ్ళాడు.

రామభూపాల్‌రావు చేత్తో సైగచేసి దగ్గరికి పిలిపించుకొన్నాడు. “చూడు, నీకు చెప్పడం మరచిన. ఖుర్ఖీ వచ్చినప్పుడు మన గర్సెలో వున్న ఏడు పుట్ల వడ్లు శంభయ్య ఇంట్లో దాచిపెట్టింటిమి గదా! వాటికి ధర కట్టి డబ్బిస్తానన్నాడు శంభయ్య. వాడు పేట నుంచి రాగానే ఆ పైకం రాబట్టు.'’

“మీ బాకీ కింద చెల్లు పెడ్తానని మీతో ఒకసారి అన్నట్లు జ్ఞాపకం.'’

“అన్నాడనుకో! అనగానే అయిపోతుందా? మన అవసరాలు కూడా చూచు కోవాలెగాని. అదీగాక, ఆ వడ్లు బాకీ కింద చెల్లుబెట్టుకోవాలని కాదుగా వాడికి ఇచ్చింది? గింజలు జప్తు కాకుండా వాడి దగ్గర దాస్తే ఇప్పుడు చేతిలో గింజలు చిక్కాయని అట్లా అంటున్నాడు. ఇట్లయితే వ్యవహారాలెట్లా సాగుతాయి? నీవైన ఆలోచించవద్దు? అతనన్నదే ఖానూనైందని నీవు ఊరుకోవడమేమిటి? ఇట్లయితే బాగానే ఇక,'’ రామభూపాల్‌రావు కొంచెం కటువుగా హైదరలీని మందలించాడు.

“సరే! పేట నుంచి వస్తాడు కద! వసూలు చేస్తాను. డబ్బు లేకపోతే గింజలు తెప్పిస్తా,'’ అన్నాడు హైదరలీ.

“గింజలెందుకు? శంభయ్య ధర కూడా నిర్ణయం చేసుకున్నాడు. ఇప్పుడు గింజలు తీసికొంటే అప్పటి ధరకు అమ్ముడుపోతయా? నీకు చిలుకకు చెప్పినట్లు నేర్పాల్సి వస్తున్నదే?'’

హైదరలీకి అటువంటి పోటుమాటలు, చీదరింపులు అలవాటే. అద్దాల సందుల్లోంచి వింతగా ఒక క్షణంపాటు రామభూపాల్‌రావును చూచి తన పనిలో లీనమైనాడు.

వంటవాని పిలుపు రాగానే రామభూపాల్‌రావు ఇంట్లోకి వెళ్ళిపోయాడు.

మరునాడు మేనాలో బిడ్డను, కచ్చడంలో అల్లుడిని సాగనంపాడు. మేనాకు రెండు వైపుల ఇద్దరు దాసీలు, అల్లుడు బండి తొట్లో దాసీవాడు, బండి ముందర మాదిగవాడు, బండి వెనక చాకలివాడు, ఇంకో కచ్చడం ఖాళీగా, దాని వెనుక కోటయ్య వద్ద తీసుకున్న ఆవు బయలుదేరాయి.

మేనా, బండ్లు బయలుదేరక ముందే ఇద్దరు సేతు సింధీలు బాట ముందు హడావుడిగా వెళ్ళి కుండలతో ఎవరూ ఎదురు గాకుండాను, అరుగుల మీద ఎవరూ కూర్చొనకుండాను ఏర్పాటు చేశారు. మేనా చప్పుడు మూగల చప్పుడు విని, ఆనందంతో అల్లరి చేస్తూ, అడ్డం వచ్చిన పిల్లవాండ్లను అదలించి పక్క సందుల్లోంచి తరిమారు. వీధులు ఇంచుమించు నిర్మానుష్యమైనాయి. ప్రజల ముఖాల్లో భయము, హేయభావము తాండవించాయి. బిడ్డ, అల్లుడు ఊరు విడిచి వెళ్ళిపోయారు.

3

కంఠీరవం వయసు మీరుతున్న కొద్దీ బడికి పోవడం తక్కువైపోయింది.

ఒకనాడు భోజనాల కని, మరోనాడు వేరే ఊరికి సంభావనకని, ఇంకొకనాడు దొర వెంట ఎక్కడికో వెళ్ళాడని బడిపంతులుకు తెలిసినప్పుడల్లా బడిపంతులు చికాకు పడేవాడు. మొత్తముపై కంఠీరవం అటు ఇటు తిరగడం, చదువుకు దూరం కావడం పంతులుకు సహించరాని విషయమైంది. తన సొంత కొడుకునే ఇతరులు బలవంతంగా పెడమార్గాన పెడ్తున్నారన్నంత బాధపడ్డాడు.

ఒకనాడు రఘునాథాచార్యులను బడికి పిలిపించుకున్నాడు పంతులు. “పెద్ద కొడుకును చెడగొట్టింది చాలక, చిన్న కొడుకును కూడా తయారుచేస్తున్నారు,'’ పంతులు కటువుగా అన్నాడు.

పెద్దకొడుకైన వెంకటాచార్యులను, ఒకనాడు బడిలో నుండి ఏ విధంగా లాగుకొనిపోయిందీ, రఘునాథాచార్యులకు తటాలున జ్ఞాపకం వచ్చింది.

రఘునాథాచార్యులు శిష్య సంచారం నుండి ఒకనాడు బడి ముందర నుండి యింటికి వెళ్ళుతున్నాడు. బడిలో పిల్లల ఏడ్పు వినిపించింది. ఆగిపోయి ఆవేదనతో బడిలోకి తొంగి చూచాడు. సాతాని పంతులు సపుకు చేతిలో పట్టుకొని నిలబడి వున్నాడు. కోదండంపై నల్గురు పిల్లలు వేలాడుతున్నారు. అందరికంటే కింద వున్న వెంకటాచార్యులు పెద్దగా బొబ్బలు పెట్టి ఏడుస్తున్నాడు. సాతాని పంతులు సపుకుతో పఢాలున నాలుగు దెబ్బలు వేశాడు. రఘునాథాచార్యులు ఉగ్రుడైపోయాడు. “పంతులువా పశువువా? ఎవడురా నీకు ఉద్యోగం ఇచ్చింది? పోరగాండ్రను చంపుతున్నావు. నీ చదువు పాడుగాను,'’ అంటూ పంతులు చేతిలోని సపుకును గుంజి వడిగా గోడ ఆవలికి విసిరివేశాడు. పంతులు కోపంతో వణికి రఘునాథాచార్యులను బెదరి చూచాడు. రఘునాథాచార్యులు వేలాడుతున్న పిల్లలను కిందికి దింపి, వెంకటాచార్యులను కౌగలించుకొన్నాడు. వీపు నిమిరాడు. ఎర్రపడి, వంకర తిరిగిన వేళ్ళను పంతులుకు చూపుతూ, “కండ్లుంటే చూడు, మనిషివా, రాక్షసుడవా?'’ అని వెంకటచార్యులను వెంటబెట్టుకొని ఇంటికి వచ్చాడు. భార్య ఆండాళమ్మకు కొడుకు చేతులు చూపాడు. “ఇక మీద నా కొడుకును బడికి పంపను. నీవు పంపావంటే చూడు, ఏం చేస్తానో, అది బడి కాదు, బందెర దొడ్డి,'’ అన్నాడు.

రఘునాథాచార్యులకు ఈ సంఘటన జ్ఞాపకం రాగానే, “అవును నా పెద్దవాడిని బడి నుండీ, పంతులు క్రౌర్యం నుండీ రక్షించుకొన్నాను. కాని విద్యావంతునిగా మాత్రం చేయజాలలేదు. అందుకే ఈనాడు వాడు నాకు చావు బరువుగా తయారైనాడు,'’ గంభీరంగా అన్నాడు.

“ఆనాటి పరిస్థితిలో ఆ విధంగా జరిగిందేమో, కాని ఇప్పుడు కంఠీరవానికి ఎట్టి బాధలు లేవని మీరు నమ్మరా?'’ పంతులు ప్రశ్నించాడు.

“రామానుజ! అపచారము!! అటువంటి మూర్ఖుడననుకొన్నారా? కాని ఏమి చేయమంటారు? విధి లేదు. మా ఆర్థిక పరిస్థితులు మమ్ములను అరాజక స్థితికి తెచ్చినవి,'’ రఘునాథాచార్యులు సూక్ష్మంగా సూచించాడు.

“అందరికి విద్యాబుద్ధులు చెప్పి ప్రోత్సహించాల్సిన మీరే మీ పిల్లల విషయంలో ఈ విధంగా అశ్రద్ధ చేస్తే, మీరు నేర్చుకున్నదేమిటి? సమాజానికి నేర్పేదేమిటి?'’ పంతులు మూల ప్రశ్ననే తవ్వాడు.

“నా అంతటి వాళ్ళు నా కొడుకులు కావాలని నాకు లేదనుకుంటారా? కాని బడులు పెట్టించిన ప్రభుత్వం బ్రతుకుదెరువు గురించి ఆలోచించదాయె. మావి ఆదరవు లేని బ్రతుకులు. యాచించో, దీవించో కాలం వెళ్ళబుచ్చు తున్నాము,'’ ఆర్థిక నిస్సహాయతను వివరించాడు రఘునాథాచార్యులు.

“అవును! మీరన్నది నిజమే. కాని, చూచిన వేళావిశేషమేమిటో కాని మీ కంఠీరవం పూర్తిగా మావాడైపోయిండు. వయసుకు మించిన బుద్ధులు, ఆలోచనలు, అణకువ, అపేక్షలున్నాయి. అవకాశముంటే ఆదర్శనీయుడు కాగల అంశ కలవాడు. అతనితో కాలం గడుపుతుంటే నాకు సంతానం లేని లోపం కూడా తీరిపోతుంది. నేను యిక్కడ శాశ్వతంగా ఉంటానా? ఉన్నప్పుడే అతనినొక మార్గంలో పడవేస్తే అల్లుకపోతాడని అనుకుంటున్నాను. మీతో ప్రార్థించేదేమంటే, మీ కులవృత్తి గొడవలోకి అతడిని ఈడ్చకండి దయచేసి,'’ పంతులు దీనంగా అన్నాడు.

“చెడకొట్టుకోవాల్నని మేము మాత్రం ఎందుకనుకుంటాం? మా పెద్దవాడు విద్యకే కాదు, విధేయతకు, విచక్షణా జ్ఞానానికి కూడా దూరమైపోయాడు. నా కడుపులో అటువంటివాడు పుట్టడమే మా వంశానికి తీరనిలోటు. కాని ఏం చేయగలం? అధికారి రాగానే బేగారివానికై వెదికించినట్లు, మేము దొరకు అవసరమున్నప్పుడల్లా వంట మనుషులుగా తలచబడతాం. తప్పించుకోలేం. కాదంటే కాలం గడవదు. కడుపు మాడి చావవల్సిందే. అందుకే ఇన్ని అవస్థలు కడుపు చీల్చుకుంటే కాళ్ళ మీద పడ్తాయి. ఏనాటి తపఃఫలమో మీరు మావాడికి పట్టుగొమ్మై నిలిచారు. సాధ్యమైనంతవరకు బడికి పంపించుటకై శ్రద్ధ తీసికొంటాను. ఇక వెళ్ళుత,'’ అంటూ రఘునాథాచార్యులు వెళ్ళబోయాడు.

“సాధ్యాసాధ్యాలు నాకే వదిలివేయండి,'’ అంటూ పంతులు రఘునాథా చార్యులకు నమస్కరించాడు.

కొన్నాళ్ళకు ఆ బడిపంతులు వేరే ఊరికి మార్చబడ్డాడు. ఈలోగా కంఠీరవం నాల్గవ తరగతి పూర్తి చేశాడు. ఇంకా ఎక్కువగా చదివించాలంటే వేరే చోటికి పంపించాలె. అది ఆ ఇంటివాండ్లకు సాధ్యంకాని పని.

ఇంట్లో వెంకటాచార్యులకు, కంఠీరవానికి ఏ విషయంలోను ఏకాభిప్రాయం కుదరటం లేదు. వారిద్దరికి పంచాయితీ ఏర్పడినపుడల్లా తల్లి కంఠీరవం వైపు, తండ్రి వెంకటాచార్యుల వైపు వాదించేవారు. రఘునాథాచార్యులు వృద్ధుడై కూడా ఎక్కడికైనా ఆదరవుకై శిష్య సంచారం వెళ్ళక తప్పేది కాదు. ఎక్కడికైనా వంట చేయడానికో, యాచనకో, సంభావనకో వెంకటాచార్యులు వెళ్తుండేది. వైష్ణవుల కులవృత్తిగా తలచబడుతున్న వాటిని గురించి కంఠీరవం అపుడపుడు తండ్రితో వాదిస్తుండేది. తండ్రి కొడుకు వాదనపై, వైష్ణవజాతి పొందిన పతనస్తితిపై చాలా బాధపడేవాడు.

“దొర నీకంటే ఎక్కువ చదువుకున్నవాడా నాయనగారూ,'’ కంఠీరవం ఒకసారి తండ్రిని ప్రశ్నించాడు.

“వాండ్ల అధికారానికి, చదువులకు సంబంధం లేదు. అశక్తుల నణచివేయడమే వాండ్ల గొప్పతనం. ఇంత ఆర్భాటం చేసే రామభూపాల్‌రావు ఒక పోలీసు జవానుకు, తహశీలు చప్రాసికి దాసోహమంటాడు. వాండ్ల పశుబలం కింద చదువులు, సంప్రదాయాలు, కట్టుబాట్లు పనికిరాని రోజులు తండ్రీ,'’ ఇంకా ఏమో అనబోయి ఒక నిట్టూర్పు విడిచాడు రఘునాథాచార్యులు. “విజ్ఞానానికి విలువ కట్టని సమాజానికి వృద్ధి లేదు, వికాసము చెందదు,'’ తిరిగి బరువైన ధ్వనిలో అన్నాడు.

కంఠీరవం తీవ్రంగా ఆలోచనలో పడ్డాడు. ఆలోచిస్తూనే ఊరి బయట చెరువుకట్ట మీదికి వెళ్ళాడు. సూర్యాస్తమయ సమయము. పశువులు ఇండ్లకు చేరుకుంటున్నాయి. పక్షులు అరుస్తూ గూళ్ళలోకి చేరి భార్యభర్తలు, తల్లీపిల్లలు కిచకిచమంటున్నాయి. కూలీకి వెళ్ళిన కూలీ స్త్రీలు జంటలు జంటలుగా పాడుకుంటూ ఇండ్లకు చేరుకుంటున్నారు. ప్రొద్దస్తమానం కష్టించినా ఆ కూలీల కెంతో ఆనందం కలుగుతున్నది. కాలు కదపక, గుట్టుగా కూర్చునే తన ఇంట్లో ఆ ఆ ఆనందం లేదు. కంఠీరవం ఆందోళనపడ్డాడు. తనను తాను మరిచి స్త్రీల పాటల్లో లీనమైనాడు. స్త్రీలు వెళ్ళిపోగానే తిరిగి తన కుటుంబస్థాయిపై, వైష్ణవుల జీవనస్థితిపై ఆలోచించ మొదలుపెట్టాడు. కూటికి లేకున్నా కూలి చేసుకోకూడదు. ఆ పూటకు తిండిలో ఉప్పు లేకున్నా ఊళ్ళో అందరికంటే అగ్రజాతివారు. అయినా అగ్రజాతికున్న గౌరవమేముంది? సంభావనకై చేసే ఆరాటము, పోరాటము, దబాయింపు, దర్పము జ్ఞప్తికి వచ్చి సిగ్గనిపించింది. వంటవాండ్లుగా పొందిన పతన స్థితిపై బల్లెంపోటువలె బాధించింది. కురూపముతో కొట్టవస్తున్నట్టుండి నేడు చలామణి అవుతున్న అలవాట్లకు పునాది భక్తి, భయము, గౌరవములని కంఠీరవానికి ఒకసారి తండ్రి చెప్పాడు. భక్తితో పుణ్యబుద్ధితో సంభావన ఇచ్చేవాడు బలవంతం చేసినా ససేమి అంటున్నాడు. శక్తిలేదని వాపోయే వానికి ముక్తి కలుగుతుందని స్వార్థులు శాస్త్రాలను సాగదీస్తున్నారు. ఈ విధంగా ఆలోచనలో మునిగి తేలుతున్న కంఠీరవం పిచ్చివానివలె చెరువుకట్టపై నిలుచుండిపోయాడు.

చేను నుండి వస్తున్న కొమరయ్య సమీపించే వరకు చూడలేదు. కొమరయ్య మందలించితే తెప్పరిల్లి, “కొమరయ్యా!'’ ఆనందంతో కేకవేశాడు.

“ఇదిగో! కంకులు, నీ కోసమే తెస్తున్నా,'’ చేతిలోని సజ్జ కంకుల కట్టను, ధోతిలోని దోసపిందెలు, పెసరకాయలు కంఠీరవం పై పంచెలో పోశాడు. కంఠీరవం, కొమరయ్య ఆ మాట ఈ మాట మాట్లాడుతూ కొమరయ్య ఇంటికి చేరుకున్నారు. కొమరయ్య ఇల్లు ఆరోజు కంఠీరవానికి చాలా ఆకర్షణీయంగా కనిపించింది. ఇంటి ముందర గుంజకు కట్టివేసిన బర్రెదూడలు, తల్లికై అవి చేస్తూన్న ఆరాటము,వ వాటి పెండవాసన, ఇంకొకవైపు పచ్చిమేత కుప్పలో నుండి అలము, గడ్డి వాసన, కుడితి వాసన, దోమల స్వైరవిహారము, ఓ మూలకి జల్ల, గుమ్మి, ఓ మూలకు మోటబొక్కెన, పలుపులు, తాళ్ళు, కుంపట్లో నుండి మెల్లగా పైకి లేస్తున్న పొగ, వంటింట్లో నుండి కూరగాయల వాసన- ఇవన్నీ కంఠీరవానికి ఒక నూతన వాతావరణంగా తోచింది. “వస్తాను కొమరయ్యా,'’ అని అక్కడి నుంచి లేచి ఇంటి దోవబట్టాడు. కొమరయ్య వలె కష్టించి బ్రతికే ప్రయోజకుడు కాజాలనందుకు లోలోన కుందుతూ యింటికి చేరుకున్నాడు.

 

< < మొదటి భాగం  | (మిగతా వచ్చే సంచికలో)

 

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)