- కాళోజి

           “ఎంత బాగుందోయి పాట. కొంతసేపాగి, విని, మరిపోదామా?”

           “నాకు విందామనే వుంది కాని సమయానికక్కడ చేరకపోతే దయాదాక్షిణ్యం లేక దండన విధిస్తాడు ఆ యమధర్మరాజు తెలుసా?”

           “ఆ భయం మనకు లేనిదెప్పుడు. వైతరణి  దాటితే  యమపురి ఎంతదూరం. కొంచెం తొందరగా నడిస్తే  వేళకందలేమా  ఏమి?”

           “సరే నీ ఇష్ట్టం . కాని, పాశాల్లో జీవాలున్నావే, వెంట తీసుకుని ఎలా వెళ్ళడం గంధర్వులగానం వినేటందుకు?”

           “వానిని వైతరణీ తీరాన వదిలేద్దాం. తిరుగుతాయి పాపం కొంచెం స్వేచ్ఛగా. ఎటైనా పారిపోతాయన్న భయమూ లేదు. మళ్ళీ ఎన్నాళ్ళకో స్వేచ్ఛ. తలచుకుంటాయి కూడానూ.”

           “సరే, నీవు చెప్పినట్లు చేయుటకు నాకేం అభ్భంతరం లేదు. కాని, అక్కడకెళ్ళి ఆ పాట వింటుంటే మనకు యమపురి సంగతి ఈ ప్రాణులసంగతి జ్ఞాపకం వుంటుందా అని?”

           “నేను చెపుతాను లేవోయి కొంతసేపు కాగానే. నీవు నడుద్దూ ఈ పాశాన్ని నాదానితోపాటిక్కడ వదలి.”

           “సరే, నడువు అట్లాగయితే.”

                                               ***

           “ఇదేమిటి? ఇప్పటికి నేనొక్కడనే అనుకుంటున్నాను ఈ ప్రదేశంలో కాని, మీరెవరో వున్నారే నాతోపాటు? మనమెక్కడ వున్నది మీకేమైన తెలుసా?”

           “నేను అదే అలోచిస్తున్నాను. ఈప్రదేశం నాకు కొత్తే. ఎక్కడున్నది ఏమి బోధపడడం లేదు కూడాను.”

           “సరే కాని, ఎక్కడివాడవు నాయనా నీవు?”

           “అయ్యా, నేను భారతీయుడను.”
          
           “ఏమి, భారతీయుడవా, నా తండ్రీ! మా దేశీయుడవేనా నీవు?”
 
           “మహాభాగ్యం, మీరు భూలోక స్వర్గమగు భరతదేశం వారేనానండి?”

           “అవును కాని, ఏ ప్రాంతం నాయనా నీది?”

           “అయ్యా, నేను  నిజాం రాష్ట్రంలోని తెలంగానా మనిషిని.”
 
           “ఏమిటి? ఏమంటివి! నిజాం రాష్ట్రంలోని తెలంగానా వాడవే? స్వదేశీయుడవే కాకుండా స్వప్రాంతీయుడవు కూడానా నాయనా? మరి, నీవు మాట్లాడేభాష ఏది, తండ్రీ, ఈ ప్రాంతంలో?”

           “ఇంకేభాష మాట్లాడమంటారు మమ్మల్ని? మేము మాట్లాడేది అచ్చం తెలుగండి మహాప్రభో.”

           “ఏమి! ఏమి! తెలుగే. అట్లయితే నీవు నిజాం రాష్ట్రాంధ్ర సోదరుడవేనా తండ్రీ? అందుకే , నిన్ను చూడడంతోనే ఒక విధమైన సోదరప్రేమ కలిగింది, నాయినా. అయితే ఇక్కడికెలా రావడమైంది, బాబూ?”

           “ఏమోనండి, అదే బోధపడడం లేదు నాకూను. ఉదయం మాఊళ్ళో జరిగిన కొట్లాటలో నాతలపైన దుడ్డుకఱ్ఱ పడ్డాక నాకు స్పృహతప్పింది. తర్వాత ఏమి జరిగిందో తెలియదు. ఇప్పుడు చూస్తే ఇక్కడున్నాను.”
  
           “ఎంత చిత్రం, మీ ఊళ్ళో కూడా ఉదయం గోల జరిగిందా. మా ఊళ్ళో జరిగిందే నా తల పైన గొడ్డలిపడడం వరకు జ్ఞాపకం వుంది. తర్వాత ఏమి జరిగినదీ నాకు తెలియదు. ఇప్పుడు చూస్తే ఎక్కడున్నది బోధపడడం లేదు.”

           “సరే బాగానే వుంది. అయితే మీ ఊళ్ళో జరిగినసంగతేమిటో చెప్పండి. నేను మా సంగతి చెపుతాను తర్వాత. చాలా అన్యాయంగా వుందండి కథ. ప్రపంచంలో దయ అనేది లేకపోవడం సత్యమని బోధపడుతుంది మీకే తర్వాత. మీరు కూడా నాతో మరియు నాతోటివారితో సహానుభూతి చూపకమానరు నా కథ విన్నాక.”

           “నా కథా అలాగే వుంది అబ్బాయి. ప్రపంచంలో ధర్మమనేది నాశనమయిపోతున్నది దినదినం. ఆచార వ్యవహారాలు మంటగలుస్తున్నాయి లోకంలో. మా ఊళ్ళో జరిగిన కథ చెప్పితే ఆశ్చర్యపడడమే కాకుండా నమ్మనైనా నమ్మవేమో అని అనుమానిస్తున్నాను. అందుకే, నీవే నీ కథ మొదలు చెప్పితే బాగుంటుందని నా అభిప్రాయం.”

           “నిజమేనండి . ప్రపంచంలో మనుష్యత్వమే లేకుండా అయింది. ఏమి చెప్పేది మా ఊళ్ళో అవస్థ. ఏదో చెపుతాను వినండి. మా ఊళ్ళో ఒక దేవాలయం వుంది. అది మా ప్రాంతంలో చాలా పురాతనమైనది , ప్రసిద్ధికెక్కినది కూడానూ. ప్రతిసంవత్సరము పెద్ద తీర్థం సాగుతుంది. ఈ ఏడు జాతర అప్పుడు దేవాలయం ప్రవేశవిషయంలో వచ్చింది తగాదా అస్పృశ్యులకు సవర్ణ హిందువులకు. సవర్ణులలో కొందరు హరిజనులపక్షం వహించి దేవాలయ ప్రవేశానికి సాయపడతాం అన్నారు. దాంట్లో ఒకరిద్దరు బ్రాహ్మణులు కూడా వుండడం తటస్ఠించింది. జాతరకంటె ఒక వారం ముందే హరిజనులందరు నిరసన వ్రతంతో దేవాలయప్రవేశ విషయమై సత్యాగ్రహం మొదలుపెట్టారు. బ్రాహ్మణులు, యితర హిందువులూ లాఠీలతో గుడిచుట్టూ కాపలా కాస్తున్నారు. ఈరోజు ఉదయం హరిజనులు కూడా సత్యాగ్రహానికి స్వస్తి చెప్పి జబర్దస్తీగా దేవాలయ ప్రవేశం చేద్దామని లాఠీలతో తయారైనారు. జరిగింది సవర్ణ అవర్ణ హిందువులకు లాఠీలతో సంగ్రామం.”

           “ఏమి!  నీవూ ఆ దేవాలయ ప్రవేశసందర్భములోనే నెత్తిపగిలి స్పృహదప్పిన మహావీరుడవా నాయనా? ధన్యుడవు. స్వర్గంలో ఇంద్రవైభవము పొందగలవు. ధర్మసంగ్రామంలో  పాల్గొన్నవాడవు. పుణ్యాత్ముడవు. నీ తల పగులగొట్టిన ఆ పాపాత్ముడెవడు?  వానికి నరకం తప్పునా? నేనూ ఆ ధర్మయుద్ధంలో పాల్గొన్న వీరుడనే తండ్రీ. ఇంతకూ, మనమిరువురము ఒక్క ఊరివారమే నాయనా. అయిన నిన్ను కొట్టిన ఆ దుర్మార్గుడెవరో జ్ఞాపకమున్నదా?”

           “కష్టమన్నది తెలియక రోజు మూడుపూటలూ అన్యాయంగా మమ్మల్ని దోచుకొని తిని బాగా బలిసిన ఒక లావాటి బాపనయ్య, ప్రక్కనుండి, నా తలపై దుడ్డుకఱ్ఱ వేసాడు. అతనికీ తగినశాస్తి అయిందనే నా అభిప్రాయం. మా వెంకడు అప్పుడే గొడ్డలితో అతని బుఱ్ఱపై కొట్టినట్లు  చూడడం నాకు జ్ఞాపకం.”

           “ఓరి ముండాకొడుకా! మాదిగవెధవవు ఇక్కడా  దాపరించావు?  పొద్దున్న కసితీర లాఠీతో కొట్టి దేవాలయ ప్రవేశంకంటె మొదలు యమపురి ప్రవేశం చేయిస్తామని అనుకుంటే ఆ గొడ్డలిదెబ్బ నా తలపై పడడం చేత తప్పించుకుపోయావు. కాని ఇప్పుడెటు పోతావురా? గొంతుకపిసికి పారేస్తాను చూడు.”

           “ఆ బాపనయ్యవు నీవేనా? బొర్రపై ఒక లాఠీతో కొట్టానంటే నిన్న సంతర్పణలో తిన్న భక్షాలన్నీ బయటపడాలే. జాగ్రత్త నా మెడ పిసకడమంటే పిండాలకూడు పిసకడం అనుకున్నావా”

           “అబ్బా! ఎంత తన్ను తన్నితివిరా?”

           “అయ్యో చస్తి! చేతకాక కొడుతావటయ్యా? ఉండు నీపని పట్టిస్తా”

           “అబ్బా ఎంత గుద్దు గుద్దితివిరా. పేగులు వెళ్ళేటట్టు తొక్కుతానుండు.”

           “ఏడ్చావు బాపనయ్య కిందపడ్డా నాదే గెలుపంటావు. చూడు నీవు చేస్తానన్న పని నేనే చేస్తా.”

           “అయ్యో చస్తీ! చస్తీ! ఎవ్వరన్నా రక్షించండి బ్రాహ్మణ్ణి, చచ్చిపోతున్నాను పుణ్యానికి.”

                                             ***

           “అరే చాలురా పాటవినడం. నదీతీరాన ఏవో కేకలు వినవస్తున్నాయి. ప్రాణాలను పాశాల్లోంచి వదిలివచ్చాం. అలవాటు చొప్పున ఇక్కడా కొట్లాడుకుంటున్నాయో ఏమో.”

           “అవునురా ఈ కేకలక్కడివే. ఆ బ్రాహ్మణ మాదిగపంచాయితేరా ఇక్కడ కూడా.”

           “నడువుమరి”
           
           “మంచిది”
           “……………….”

           “………………..”

           “………………..”
        
           “…………………”

           “వీరి కాపరం మండా. ఇక్కడేదో పోనీ పాపమని కొంత స్వేచ్ఛ యిస్తే మళ్ళీ తన్నుకుంటున్నారేమిరా?”

           “చచ్చి ఇంకా సరిగా పదిగంటలు కాకపోయే. ద్వేషం అప్పుడే పోతుందా?”

           “వీరి ద్వేషం చట్టుబండలు గాను. ఇదేం కావరంరా చచ్చినా ఈ మతపిచ్చి ఈ వర్ణభేద శతృత్వం పోలేదేం? యమపురిలో తీర్పుచెప్పిన తరువాత తెలుస్తుందిలే సంగతి.”
 
           “ఇంకా అలోచిస్తున్నావేమి నేను పాశంలో వేసుకొని నడవటానికి సిద్ధంగా వుంటే?”

           “సరే నడువు నేనూ ఇదే బంధిస్తున్నాను ఈ బాపనయ్యను…”

           “తొందరగా నడవాలి టైము ఎంతో లేదు మనకు.”

           “నీవు కదిల్తేగా మాటలతోనే సరిపోయె?”

           “సరే నడువవోయి. “

                                                   ***
           “ఏమి ఇతడు ఆ అమాయకులైన హరిజనులు దేవాలయ ప్రవేశం చేస్తామంటే అడ్డుపడడమే కాకుండా ఒక హరిజనుని కర్రతో బాది చంపినాడా ?”

           “అవును మహాప్రభో”

           “ఏమోయి, మావాడు నీ విషయమై చెప్పేది నిజమేనా?”

           “అయ్యా నిజమే కాని ధర్మసంరక్షణ”

           “ నోరుమూయి ధర్మాధర్మములు ధర్మరాజునైన నాకా నీవు చెప్పేది? ఒరే ఇతనిని పదిరోజులూ అగ్నిగుండంలో పడవేసి తరువాత ఒక పరయా(మాదిగ) కుటుంబంలో పడెయ్యి సుఖపడతాడు. ధర్మం తెలుస్తుంది కూడాను.”

           “చిత్తం మహాప్రభో.”

           “అయ్యో అగ్నిగుండమా? మాదిగజన్మమా? అన్యాయం! ఘోరం…”

           “……………….”

           “వీడెవరురా?”

           “దేవాలయ ప్రవేశానికి లాఠీతో పోయి ఇప్పటి బాపనయ్యతో చంపబడ్డ హరిజనుడు.”

           “అట్లాగా… ఒరే నీవు మహాత్ముడు చెప్పిన అహింసావిధానం మాని లాఠీ సహాయమెందుకపేక్షించావు దేవాలయ ప్రవేశానికి?”

           “ఎన్నిరోజులు ఊరికే ప్రయత్నించినా ఆ బాపనయ్యలకు దయరాలేదు. విసికి వేసారి జబర్దస్తీకి దిగాం మహరాజా.”

           “అది తప్పే… ఒరే వీడిని రెండురోజులు ఆ మంచులో పడవెయ్యి. కోపం అంతాపోయి శాంతమలవడుతుంది. మూడోరోజు తిరువాన్ కూరులో హరిజన కుటుంబంలోకి పంపించు.”

           “తెనుగుదేశంలో కాక మలయాళదేశంలో ఎందుకు తండ్రీ జన్మం?”

           “మళ్ళీ దేవాలయ ప్రవేశపు చిక్కులేకుండా. లేకపోతే ఏ బ్రాహ్మణిచేతనో తలపగులకొట్టించుకొని చేరుకుంటావు నావద్దకు.”

ఒక్క అభిప్రాయం

  1. ప్రసాద్ 14 నవంబర్ 2006 , 3:06 pm

    బాగుంది. బాపనున్ని మాదిగ జన్మ ఎత్తమన్నాడు కదా, మాదిగను బ్రాహ్మణ జన్మ ఎత్తమంటాడేమొ అని చూశా, హమ్మయ్య ఎత్తమనలేదు. సరైన శిక్షే వేశాడు.

    –ప్రసాద్
    http://blog.charasala.com

Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)