- జి. వెంకటకృష్ణ
‘ముంపు బాధితులకిచ్చిన హామీలను నెరవేర్చండి,’ అని రాసుకొన్న ప్లకార్డ్ పట్టుకొని, ఆమె హఠాత్తుగా కనిపించింది.
కలెక్టరేట్‌లోకి వెళ్తుంటే గేటు ముందు ధర్నా చేస్తున్న ఆడవాళ్ళలో నిలబడి ఆమె అరుస్తున్నది.
ఆమెను చూస్తూ ధర్నాలు, నిరసనలూ లేని దినముంటుందా మీ గేటు ముందు, అని ఆలోచిస్తూ, సమాచారభవన్‌లోకి వెళ్ళి బైక్ స్టాండ్ వేసి, తిరిగొచ్చి ధర్నా ముందు నిలబడ్డాను.
కలెక్టరేట్‌లోని ఆఫీసుల సిబ్బంది ఒక్కొక్కరూ ధర్నాను నిరాసక్తంగా చూస్తూ దాటిపోతున్నారు. వీళ్ళంతా తమ సీట్ల కిందా, టేబుల్మీదా వేసుకొన్న వేలాది ఫైళ్లలోని అభ్యర్థనలే- గేటు ముందు ఆర్తనాదాలై, నిరసనలై, ధర్నాలై, ఆత్మహత్యా యత్నాలై, పోలీసు లాఠీఛార్జీలై వర్తమాన చరిత్ర అవుతున్నాయని వీళ్ళకు తెలుసా? తెలిసే నిరాసక్తంగా దాటిపోతుంటారు కదా!
అంతలో దూరంగా పోలీసులు ధర్నా వైపు వస్తూ కన్పించారు.
నిన్న సరిగ్గా ఈ సమయానికి, చాలామంది నిరుద్యోగ యువకులు, ముంపు గ్రామాల్లో భూమి కోల్పోయిన కుటుంబాల నుండి ఉద్యోగాన్ని హామీగా పొందినవాళ్ళు, ఏళ్ళ తరబడి హామీ నెరవేరక నిరసనలు, ధర్నాలు చేస్తున్నవాళ్ళు, అర్థనగ్నంగా ఊరేగింపు జరిపి, కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తూ, కలెక్టరేట్ కారు అడ్డుకొన్నందుకు అరెస్టయ్యారు. ఇప్పుడు ఆ కొడుకుల కోసం తల్లులు రంగంలోకి దిగినట్టున్నారు.
ఈ తల్లిని ఇంతకుమునుపు రెండు సందర్భాల్లో చూసినట్లు గుర్తు. శ్రీశైలం ప్రాజెక్ట్ ముంపు గ్రామాలను చూడాలని వెళ్ళినప్పటి జ్ఞాపకాలలో ఈ తల్లి నన్నెప్పుడూ వెంటాడుతూనే వుంటుంది.
మొదటిసారి ఆమె కన్పించిన సన్నివేశం గుర్తు చేసుకొంటే నా ఒళ్ళు జలదరిస్తుంది. అవి జులై నెల ఆఖరి దినాలు, వరుసగా వర్షాలు కురవని మూడో సీజన్. జులై చేస్తున్న జుడాస్ ద్రోహంతో, క్రీస్తు ఆచూకి దొరికినట్టు శ్రీశైలం ప్రాజెక్ట్ నీళ్ళమట్టం తగ్గీ తగ్గీ, ముంపు భూములు ఒక్కొక్కటి బయల్పడుతుంటే, అలా బయల్పడ్డ ఒక పెద్ద గుడిని చూద్దామని ఒక మిత్రుడితో పాటు ఆ బుగుజు నేలల్లోకి నడిచి వెళ్ళాను. కొన్ని సంవత్సరాలుగానీట మునిగిన నేల తేలీ, ఎండీ, మానవ పాదాలను, వాళ్ళ శ్వాసలను స్వప్నిస్తోంది. ఆ స్వప్నాలను సాకారం చేయడానికన్నట్లు మా నడక. ఆ బుగుజులో, ఆ పూడికలో కాలు పెడితే పాదాలు కూరుకుపోతున్న వదులు మట్టిలో, అట్లాంటి నిర్జన ప్రదేశంలో కొన్ని శిథిలాల మధ్య ఆమె కన్పించింది. యేదో శిథిలమైపోయిన, మట్టి పేరుకుపోయిన దిబ్బను తడుముతూ ఏడుస్తూ వుంది. ఒక్కక్షణం స్థాణువునై భయంతో ఒక అడుగు వెనక్కు వేసి, ఆ ఏడ్పు మనిషిదేనని నా మిత్రుడు నిర్ధారణ చేశాక, ‘ఎందుకమ్మా ఇక్కడున్నా’వని అడిగితే, ‘కాస్త దూరంగా కన్పిస్తున్న శిథిలాలు తమ ఊరివనీ, ఆమె నిల్చున్న ప్రదేశంలో తన భర్త సమాధి ఉండా’లనీ చెప్పింది.
దూరంగా కన్పిస్తున్న బయల్పడిన నల్లని గుడి, ఎన్నో యేళ్ళు నీళ్ళలో నానీ నానీ కూడా చెక్కుచెదరని దాని శిఖరంలా, నల్లని ఈ ఆడమనిషిలో భర్త మరణం పట్ల చెక్కుచెదరని దుఃఖం, నేలతల్లి కన్నీళ్ళతో మునిగిపోయే ఆమె నిల్చున్న నేలలా ఎంత పురాతనమైందో అర్థమైంది. మునిగిన ఊర్లూ, మునిగిన పొలాలు, మునిగిన మనుషులు, మునిగిన గుడి, సమాధులు అన్నీ తేలీ, ఎండీ ఈ నేలతో, స్వగతంలో మాట్లాడుతున్న సవ్వడి, ఆమె ఏడ్పులో విన్పించి, అంత దుఃఖాన్ని మోస్తున్న ఆమె దైన్యపు చిత్రం ఎప్పటికీ అలానే నా మనసులో నిలబడిపోయింది.
ధర్నా ముందు పోగుబడుతున్న గుంపును చెదరగొట్టడానికి, పోలీసులు ఆ ప్రాంగణంలో చొరబడ్డారు. చూస్తుండగానే ధర్నా చుట్టూ పోలీసులు, ధర్నా చేస్తున్న స్త్రీలను ఒకవైపు తోసేస్తూ. ఆ తోపులాటతో ఆ స్త్రీలు ఇస్తున్న నినాదాలతో, అరుపులతో ఆ ప్రాంతమంతా అలజడిగా మారుతోంది. అంతే అలజడిని ఆమె ముఖంలో, ఆమెను రెండోసారి వాళ్ళూరిలో చూసినప్పుడే గమనించాను.
మా డెస్క్‌కు కొత్తగా వచ్చిన బాస్‌తో పాటు, ఒకరోజు వరల్డు బ్యాంకు నిధులతో జరుగుతున్న పునరావాస కార్యక్రమాల గురించి, రిపోర్టింగ్ చేద్దామని ఆ ఊరెళ్ళాను.
ముంపులో మునిగిపోయిన ఊరును, అదే పేరుతో కొత్తగా నిర్మించుకొన్నాను. ఊర్లోకి అడుగుపెట్టినప్పటి నుండీ ఏదో తెలియని కృత్రిమత్వం ఆ పరిసరాల్లో కన్పిస్తోంది. వీధులన్నీ నల్లమట్టితో, బురదతో, చేలల్లో తిరిగినట్టుంది. ఒక వీధి మలుపులో ఒక చిన్న మిద్దె, బయటి గోడల మీద చుట్టూ ఎర్రమట్టితో పట్టీలు పూశారు. తీరా చూస్తే అది గుడి! మేం తిరుగుతుంటే ఆడా మగా నిరాసక్తంగా మావైపు చూస్తున్నారు. పిల్లలూ, అక్కడక్కడ ముసలివాళ్ళే మా గురించి అడుగుతున్నారు. ఊరంతా ఒకసారి కలియదిరిగి ఒక చెట్టు కింద అరుగు మీద కూర్చున్నాము. మా చుట్టూ చేరుతున్న వాళ్ళను, ఆ ఊరివాళ్ళు ఏ స్కీముల కింద లబ్ధిదారులయ్యారో అడుగుతుంటే, ఒకామె, “ఈ స్కీములో యేమిచ్చినా కమీషన్లు తీసుకోకుండా యేమన్నా యిస్తిరా నాయనా, యాదానికీ లంచాలే. ఆపీసర్లకీ, మధ్యన పైపైన తరిగే మధ్య మనుషులకీ. మాకొచ్చిందాంట్లో సగం కరిగిపాయనే.'’
“వీళ్ళూ, వాళ్ళు కాదంటలే, పేపరోల్లంటలే జేజీ,'’ ఒకమ్మాయి సర్దిచెప్తుంటే, “యెవురైనా వొగటేలే, యివన్నీ యినిపోయి, వాళ్ళను బెదిరిచ్చుకోని దుడ్లు గుంజనీకె వీళ్ళొచ్చిండేది,'’ అంది.
దానికి స్పందిస్తూ మా బాస్, “అది కాదవ్వా, ఈ ప్రాజెక్ట్ వొచ్చినాక, మీకేమన్నా మేలు జరిగిందా, పాత వూరు మునిగింది కదా, కొత్త వూర్లో యేమనిపిస్తుంది, యిట్లాంటివి తెలుసు కుందామని మేమొచ్చింది,'’ అన్నాడు.
“యీ ప్రాజెక్టు వొచ్చి మాకు మేలు జరిగిందంటావా, ఆ మాటనేకి నీకు నోరెట్లా వొచ్చింది సారూ. మమ్మల్ని చూస్తే, పచ్చగా బతుకుతాన్నెట్లు అగుపిస్తుందా, పచ్చనిచెట్టును వేర్లతోపాటు గుంజుకొచ్చి వేరేచోట పాతితే దానికి యెంతమాత్రం ప్రాణముంటుందో, అంతమాత్రమే ప్రాణంతో వుండామయ్యా యీ కొత్తూర్లో. యీ ప్రాజెక్టు వొచ్చి మా భూముల్ని ముంచింది, వూరిని ముంచింది, మమ్మల్నే ముంచింది సారూ…'’
ఎంతో ఆవేశంతో ఒక ఆడగొంతు మమ్మల్ని నిలదీస్తుంటే అటువైపు చూశాము. నన్ను ఆశ్చర్యపరుస్తూ, ఆమె! ఆరోజు శిథిలాల మధ్య కన్పించిన ఆడమనిషి!
అంతలో యింకో ఆయన, కాస్త చదువుకున్నవాడిలా కన్పిస్తున్న వాడు అంటున్నాడూ,
“అది కూడా కాద్సార్, భూములు పోయినవాళ్ళకీ, యిండ్లు పోయిన వాళ్ళకీ అంతో యింతో కాంపన్సేషన్ యిచ్చినారు, అయితే యేమీ లేనివాళ్ళకు ఏమిచ్చినారు. పాత వూర్లో బతకడాని కుండే వెసులుబాటుకొత్తూర్లో దొరక్క, ఎంతోమంది చెల్లాచెదురైనారు.'’
ఆయన మాటల్లో ఎంతో వాస్తవముంది.
యింతలో యింకో ముసలామె, “కాదు నాయనా మా వాయన యింటి ముందట అరుగు మీదనే కూర్చుంటండా, ఆడ్నే ప్రాణమిడిసిండా, ఆ బండ దగ్గర కూర్చుంటే మా వాయన్తో మాట్లాడినట్టే అనిపిస్తాండా, ఆ బండ యీ కొత్తూర్లో వుందా, అది కావల్లమల్లా, దాన్నిస్తుందా మీ గోర్నమెంటు.'’
“సార్, మా పాతూర్లో ఎంత మంచి గుడి వుండా, పాతకాలం గుడి దాంట్ల కుచ్చుంటే సల్లగా వుంటుండా, ఎప్పుడో మా తాతల కాలంల కట్టిండ్రంటా దాన్ని, వాళ్ళ చేతల కష్టం నీళ్ళపాలాయా,'’ అని ఒక మధ్య వయస్కుడు అంటున్నాడు.
“సార్, నాకు నా మొగుడి సమాధి కావల్ల సార్, నాకే కాద్సార్ మావూర్లో వాళ్ళందరికీ వాళ్ళ పెద్దల సమాధులు కన్పించొద్దా సార్, దాండ్లను చూస్తా వాళ్ళను తలచుకుంటా మేము బతుకుతుంటిమి గదా, అవి ల్యాకుండా జేస్తిరి గదా సార్, మాకు మా సమాధుల్ని యిప్పీమని, గోర్నమెంటుకు చెప్పండి సార్…'’
శిథిలాల మధ్య కన్పించినామెనే, అలా అడుగుతూంటే, నేను ఉక్కిరి బిక్కిరి అయిపోయాను. ఎన్నో ప్రశ్నలతో, ఊరి పేరు అదే అయినా, పాత ఊరి జ్ఞాపకాలు, అవిచ్చే అనుభూతులు కొత్తగా వెలసిన ఊర్లో దొరుకుతాయా? భౌతికంగా వూరు వెలసినా ఆత్మ ఆవిష్కరింపబడిందా? మనుషుల ఆత్మీయా నుభూతులు వాటి గుర్తులు, వాళ్ళ మనసుల్లో కొన్ని స్థలాల్లో వాళ్ళు ముద్రించు కున్న చిత్రాలు యథాతథంగా కొత్త వూర్లో దొరుకుతాయా? యిట్లాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేని పునరావాస కార్యక్రమాలు ఎంత భౌతికమైనవో, యెంత శుష్కమైనవో కదా! అన్పించింది.
“యింతకీ, నీ మొగుడెవరమ్మా…'’ ఆయనంత గొప్పవాడా అన్న ధ్వనితో అడిగాడు మా బాస్.
ఆ మాటకు వొకాయన అందుకొని, “వాదాల వెంకట్రాముడు సార్,'’ అన్నాడు.
“కలెక్టరాఫీసు ముందు ధర్నా చేస్తుంటే పోలీసాయన విసిరిన లాఠీ దెబ్బకు గాయపడి మరణించిన వెంకట్రాముడా,'’ ఆశ్చర్యంతో అడిగాను.
“అవుసా. వాడే యీ యమ్మ మొగుడు, వాడు పోయినప్పట్నుంచీ యీమె పరిస్థితి బాగాలేదు.'’
“యింతకీ యీమె కొడుక్కి వుద్యోగమివ్వలేదా…'’ అప్పట్లో గవర్నమెంట్ హామీ గుర్తొచ్చి అడిగాను.
“యాదీ యీలా సార్. యీ యమ్మ కొడుకు వొక్కనికేకాదు, యీ చుట్టుపక్కల ముంపులో భూములు పోయిన ప్రతి యింటికీ ఒక వుద్యోగ మిస్తామని చెప్పిరి. అన్నీ వుత్త మాటలే.'’
“పేదోళ్ళ కడుపులు కొట్టినోళ్ళు నాశనమైపోతారు, మన భూముల్ని ముంచినోళ్ళ కొంపలు పాములు, తేళ్ళ పాలవుతాయి…'’
నెర్రులు చీలిన రేగడి నేలలాంటి ముఖంలో అలజడితో పెదవులు అదురుతుండగా ఆ తల్లి గట్టిగా వదరడం ప్రారంభించింది, నేనూ, మా బాసు, బిత్తరపోతుండగా, గట్టిగా ఏడుస్తూ, వొదురుతూ, చరచరా వెళ్ళిపోతోంది.
“ఈమె మొగుడు సచ్చినప్పట్నుంచీ యింతే సా, అప్పుడప్పుడు యిట్లా మెంటల్దాని మాదిరిగా వొదురుతుంటుంది, ఎక్కడెక్కడో తిరుగుగాడు తుంటుంది…'’ వొకతను అంటున్నాడు.
* * *
అంతే అలజడితో వేసవి కాలంలో పగుళ్ళబారే రేగడినేల లాంటి ముఖంతో ఆ తల్లి అరుస్తోంది…
తన భర్తను బలి తీసుకున్న పోలీసుల్నీ, తన కొడుక్కు వుద్యోగమివ్వని ప్రభుత్వాన్నీ శపిస్తూ, తనను నియంత్రించాలని చూస్తున్న పోలీసు చేతుల్ని విసిరిసిరి కొడుతోంది. అంత శక్తి, అంత తెగింపు ఆమెకెక్కడిదో! వున్న వూరిని ముంచేసి గట్టు మీద యింకో వూరిని కట్టుకోమంటే, వున్న కాసింత భూమినీ మింగేసి పరిహారంగా కొడుక్కు ఉద్యోగమిస్తామని పెట్టిన ఆశ యేళ్ళ తరంబడీ శుష్కంగా మిగిలిపోతే, సర్వం కోల్పోయినా ఆమెకు, ఆమెలాంటి వాళ్ళకు అంత తెగింపు ఎక్కడ్నుంచి వస్తోందో?!
ఇద్దరు పోలీసుల్ని తోసేస్తూ, నోటికొచ్చినట్లు అరుస్తున్న ఆమెను చూసి పిచ్చి కోపం తెచ్చుకొన్న ఎస్సై, ఆమె జుట్టు పట్టి యీడ్చి డొక్కలో తన్నినాడు. విసురుగా పడ్డ ఆమె మీద లాఠీ ఝళిపించినాడు.
ఆ దెబ్బలకు ఆమె మరింత గట్టిగా అడుగుతోంది.
“… ఏమడుగుతున్నామని మమ్మల్నిట్లా సంపుతున్నారయ్యా… యింటి కొగ వుద్యోగమిస్తామంట్రి. భూములు పోయినోళ్ళకు భూములు, యిండ్లు పోయినోళ్ళకు యిండ్లు, వోయబ్బా వొకటి గాదు, వూర్లు ఖాళీ చేసే వరకూ ఎంటబడి అరచేతిలో సొర్గం చూపితిరి, వూర్లు మునిగిన తర్వాతా, మీ చుట్టూతా మేమ్ దిరుగుతున్నామ్, ఆఫీసర్లు వొగరిమింద వొగరు చెప్పుకుంటా తిప్పుతుంట్రి. ఆ దుడ్లన్నా అన్నీ వొగసారిస్తిరా, కంతులు కంతులు, కోర్ట్లు చుట్టూ తిప్పుకొని, యిప్పటికీ పూర్తీ యీలా. మమ్మల్ని బజార్ల పాలుజేస్తిరి. మీ వూర్లు ముంపులో మునిగితే తెలుస్తుందయ్యా, మీ పొలాలు పోతే తెలుస్తుందయ్యా. ముంపు పక్కన వూర్లు ఎత్తి కట్టుకుంటే, మీ కొంపల్లోకి పాములు, తేళ్ళు జొరబడితే తెలుస్తుందయ్యా. మీ బిడ్డల్నీ, మీ ముసిలోల్లనీ పాములు, తేళ్ళు పెరికితే తెలుస్తుందయ్యా. అయినా యిప్పుడు యేమడుగుతున్నామయ్యా. నా మొగుణ్ణి మింగితిరి. వాయన్ని బతికియ్యమని అడగడ్యం. వాయన సమాధి కావాలంటున్నా, అంతేనయ్యా. అదియ్యండి నాకు… గట్టిగా ఏడుస్తూ… ఏం రాజోమయ్యా మీది, దీనికి గత్తర దగలా…'’ హిస్టీరిక్‌గా అరుస్తూ, ఏడుస్తూ ఆమె స్పృహ తప్పి పడిపోయింది.
“మొగుడి సమాధి కావాల్నంటా సమాధి… పిచ్చిముండకి…'’ ఎస్సై ఆమెను చూస్తూ వెర్రిగా నవ్వుకుంటూ వెళ్తున్నాడు.
గుంపులోంచీ ఎవరో, “మంచినీళ్ళు, మంచినీళ్ళు…'’ అంటున్నారు.
ఆమె నుదుటి నుంచీ బొటబొటా కారుతున్న రక్తస్పర్శతో ఆమె వొరిగిన రేగడి నేల, ఆమె చుట్టూ నిలబడ్డ తల్లుల మనసులాగే కుతకుతమని వుడుకుతోంది. ఇరవైయేళ్ళకు పైగా ముంపులో బతుకులు మునిగి నేలకూ నీళ్ళకూ మధ్యా పడుబాట్లు పడుతున్న జనం ప్రశ్నలకు జవాబుల్లేక అందరి మనసుల్లాగే (చూస్తున్నవాళ్ళ) గాలీ బరువెక్కింది.
పులిచింతల, పోలవరం యింకా యిట్లాంటివెన్నో జలయజ్ఞాల్లో సమిధలు కాబోతున్న యిలాంటి ఎందరో తల్లుల్ని తలుచుకుంటూ నా గుండె అలజడితో నిండిపోతోంది.
ఇది తప్పని గుండెకోత. మునిగిన సమాధిని, జ్ఞాపకాలని తెచ్చివ్వడం సాద్యం కాదుగానీ, చేసిన బాసలని మరవడం క్షమించరాని నేరం. వాళ్ళను మనుషుల్లా చూడటం ప్రభుత్వ కర్తవ్యం.
–ప్రసాద్
http://blog.charasala.com