- మమత

“తెల్లవాడు మాకు ఎన్నో వాగ్దానాలు చేశాడు. ఇచ్చిన మాట ఏదీ నిలబెట్టుకోలేదు, మా భూమిని ఆక్రమించుకుంటానన్నది తప్ప.” -మక్‌పియ లుత (Makhpyia–Luta: Red Cloud).

అమెరికాకు వచ్చిన కొత్తలో పబ్లిక్ లైబ్రరీలో ఒక పెద్దాయన నన్ను చూసి “నేను కూడా ఇండియన్నే “ అని అన్నాడు. అతని తెల్లటి ముఖంవైపు విచిత్రంగా చూశాను. అతను గట్టిగా నవ్వి “నువ్వు ఈస్ట్ ఇండియనువి, నేను వెస్ట్ ఇండియన్ని .. మీరనే రెడ్ ఇండియన్ని”. అమెరికన్ ఆదివాసుల గురించి పుస్తకాల్లో చదవడం తప్ప ఎప్పుడు ఇలా ఎదురుపడలేదు.

నాకు సంతోషంగానూ , విచిత్రంగానూ అనిపించింది. అతను పుస్తకాల్లోని బొమ్మల్లో, సినిమాల్లో చూపించే రెడ్ ఇండియనులా పొడవాటి నల్లటి జుట్టులో ఏ పక్షి ఈకలు పెట్టుకునో, జింక చర్మంతో చేసిన దుస్తులువేసుకునో లేడు. అదే అన్నాను అతనితో. గట్టిగా నవ్వి “మీ దేశ సంస్కృతిని, మా దేశ సంస్కృతిని కలుషితం చేసిన మహానుభావుడు ఒకడే… తెల్లవాడు… తెల్లవాడు వెళ్ళిపోయిన తరువాత మీరు మీ ఇష్టప్రకారంగా మీ వేషభాషల్ని మార్చుకున్నారు. మేము గత్యంతరంలేక మమ్మల్ని మేము మార్చుకున్నాము” చెరగని చిరునవ్వుతో అన్నాడతను. మక్‌పియ లుత అన్న పై వాక్యం నాకు అప్పుడు గుర్తుకువచ్చింది. నా స్నేహితులతో అమెరికా చరిత్ర గురించి ఎప్పుడు మాట్లాడుకున్నా “అమెరికాకేం చరిత్ర? అంతా కలిపి కొలంబస్ కాలం నుంచి ఇప్పటిదాక ఉన్న ఐదు వందల ఏళ్ళ చరిత్ర తప్ప.” అని అనుకునేవాళ్ళమేగానీ ఎప్పటినుండో ఈ ప్రదేశంలో నివసిస్తున్న ఆదివాసీ ప్రజల గురించి ఎప్పుడూ తలుచుకోలేదు. ఈ ఐదు వందల ఏళ్ళ చరిత్రనిండా తెల్లవాడి ప్రసక్తే. ఏ డచ్ దేశస్తుడు ఏ ప్రదేశాన్ని కనుక్కున్నాడు? ఏ స్పానిష్ జనరల్ ఏ కోట ఎక్కడ కట్టాడు? ఏ ఫ్రెంచి ఆర్మీ ఏ ఇంగ్లండు ఆర్మీపై గెలించింది? అమెరికా సంయుక్త రాష్త్రాలకు స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చింది? అనే చరిత్రపాఠాలేగాని ఇక్కడ ఎన్నో వేల ఏళ్ళనుంచీ ఉంటున్న ఆదివాసీల గురించి ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువ.

ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాల్లో ఎన్నో వేల సంవత్సరాలనుంచే జన జీవనం ఉంది. వీరి మూలాల గురించి ఎన్నో సిద్దాంతాలు ఉన్నాయి. మంచుయుగంలో ప్రకృతి సహజంగా ఏర్పడిన మంచు వంతెన (Bering Strait) మీదుగా ఆసియా నుంచి అమెరికా ఖండంలోకి వచ్చారన్న వాదం ప్రాచుర్యంలో ఉంది. ఈ వాదాన్ని బలపరిచే సైంటిఫిక్ ఆధారాలు కూడా ఉన్నాయి.

ఏమైనప్పటికి 1498లో కొలంబస్ దారితప్పి అమెరికా ఖంఢాల్లో అడుగుపెట్టేనాటికి ప్రకృతిలో మమేకమై వెయ్యికిపైగా ఆదివాసీ తెగలు ఇక్కడ ఉండేవి.

అన్ని తెగలవారు ఇంచుమించు ఒకేలాంటి ఆచారాలు పాటించేవారు. కొన్ని తెగలు సంచార జీవులయితే మరికొన్ని తెగలు స్టిరనివాసాలు ఏర్పరుచుకున్నాయి. కొన్ని తెగలు కొద్దిపాటి వ్యవసాయం చేసినా దాదాపు అన్ని తెగలూ వేటమీదే ఆధారపడేవి. ఆదివాసులు ఏ జీవినీ అనవసరంగా చంపేవారుకాదు. తాము చంపిన జంతువులోని ఏ భాగాన్నీ వృధా చెయ్యకుండా ఆహారంగానో, దుస్తులుగానో, పనిముట్లుగానో ఉపయోగించేవారు. తమకు తిండిగా, దుస్తులుగా, ఇళ్ళులుగా ఉపయోగపడే జంతువులను, పక్షులను, చెట్లను పవిత్రమైనవిగా భావించేవారు. నదులకు, సముద్రాలకు దగ్గరగా నివసించిన ఆదివాసీ తెగలు చేపలను, తిమింగిలాలు మొదలగు సముద్రపు జంతువులను వేటాడేవారు. ఇందుకు అవసరమైన పడవలుకూడా తయారుచేసుకునేవారు. ఈ పడవలు దాదాపు వారికి అప్పటికి తెలియని బయటి ప్రపంచపు పడవలలాగానే ఉండడం గమనించదగిన విషయం. జంతువులను, పక్షులను వేటాడడానికి విల్లంబులను, వడిసెలలను ఉపయోగించేవారు. ఉత్తరంవైపు తెగలు జింక, అడవిదున్న చర్మాలను దుస్తులుగా, దుప్పట్లుగా, గుడిసెలు కట్టుకోవడానికి ఉపయోగించేవారు. దక్షిణంవైపు తెగలు కాటనుతో చేసిన దుస్తులను ధరించేవారు, గుడిసెలను గడ్డితో, చెట్టు బెరడుతో వేసుకునేవారు. కొన్ని తెగలు సుద్దతో చేసిన ఇళ్ళను కూడా కట్టుకునేవారు.

దాదాపు అన్ని తెగలవారు తమజుట్టును పొడవుగా పెంచుకుని జడలుగా కట్టుకునేవారు. కొన్ని తెగలవారు జుట్టులో గద్ద ఈకలను అలంకరించుకునేవారు. ఇతరులకు నిస్వార్ధంగా సహాయం చెయ్యడంవల్లనో, యుద్ధంలో ఏదైనా సాహసకృత్యం చేయడంవల్లనో గద్ద ఈకలు బిరుదుగుర్తులు లభించేవి. వీటిని ధరించినవారిని గౌరవనీయులైనవారిగా భావించేవారు. గద్ద ఈకల్ని సంపాదించుకున్నట్లే వీరు తమ పేర్లను కూడా ఆర్జించుకునేవారు. పుట్టినప్పుడు ఏ పేరు ఉన్నా, వారు చేసిన కొన్ని పనులవల్ల వారికి “పేరు” వస్తుంది. ఉదాహరణకు, లకోట తెగకు చెందిన వీరుడు తాషుంక వీట్కొ పుట్టినపేరు ఏమైనప్పటికి, గుర్రాలంటే అతనికి ఉన్న ఇష్టం వల్లనేకాక, అరాపహో తెగపై వీరోచితంగా పోరాడి, వారి గుర్రాలను గెలుచుకొచ్చిన సందర్భంలో అతనికి తాషుంక వీట్కొ (Crazy Horse) అని పేరు వచ్చింది. దీన్నిబట్టి వీరి పేర్లలో నిగూఢమైన అర్ధం ఉందని తెలుస్తోంది. కొన్నిసార్లు తెగల మధ్య పోరాటాలుకూడా జరిగేవి. యుద్ధాల్లో గెలిచినప్పుడు, మంచివేట దొరికినపుడు, పెళ్ళిళ్ళ సందర్భాల్లో తెగలోని అందరూ కలసి ఉత్సవాలు చేసుకునేవారు. వేటను అందరూ కలిసి తిని, చలిమంటల చుట్టూ నృత్యాలు చేసేవారు. సంచారజీవనం చేసే కొన్ని తెగలు ఏదైనా ఒక ప్రదేశంలో విడిది చేసినపుడు తాత్కాలికంగా గుడిసెలు కట్టుకునేవారు. గడ్డిని అణగదొక్కి, నేలను చదును చెయ్యడంకోసం గడ్డిపై నాట్యం (Grass Dance) చేసేవారు. తెగలోని యువకులందరూ డప్పు శబ్దానికి అనుగుణంగా నృత్యం చేసి నేలను చదును చేసిన తరువాత తెగలోని పెద్దవాళ్ళ సలహాలమేరకు గుడిసెలు కట్టేవారు. వారు ఉన్న ప్రదేశాన్ని బట్టి గుడిసెవెయ్యడానికి కావలసిన సరంజామాను సమకూర్చుకునేవారు. మొక్కలగురించి కూడా వీరికి మంచి అవగాహన ఉండేది. కొన్ని మొక్కల ఆకులనుంచి, పువ్వులనుంచి రంగులు తయారు చేసుకుని డప్పులకు, దుస్తులకు, గుడిసెలపై అందమైన బొమ్మలు వేసుకునేవారు. యుద్దానికి వెళ్ళినప్పుడు, పెళ్ళిళ్ళ సమయాల్లో ముఖానికి కూడా సందర్భాన్ని బట్టి రంగులు పులుముకునేవారు. ఎన్నో మొక్కలను ఔషధాలుగా వాడేవారు. పొగాకు, సేజ్ (ఒక సుగంధపు ఆకు పత్రి) వంటి మొక్కలను పవిత్రమైనవిగా భావించేవారు. వీరు ప్రకృతినే దేవుడిగా, పరమాత్మగా భావించేవారు. ఈ పరమాత్మకు ఎలాంటి రూపం లేదు. పరమాత్మను పూజించేటప్పుడు పొగాకు లేదా సేజ్ మొక్కలకు నిప్పు అంటించి ఆ పొగను నలుదిక్కులకు సమర్పించుకునేవారు. తెగలోని పెద్దవారిని కలవడానికి వెళ్ళినపుడు ఈ పవిత్రమైన మొక్కలను కానుకగా తీసుకెళ్ళేవారు. ఆలోచన సభలను పొగాకు ధూపం వేసి, ఆ పొగ అందరూ తాగినతరువాతే ప్రారంభించేవారు. పొగ తాగడంద్వారా అందరూ నిస్వార్ధంగా, మనసులో ఎలాంటి దురుద్దేశాలు లేకుండా, ఆలోచన సభల్లో పాల్గొంటున్నారని నమ్మేవారు. తెగలోని ప్రతిఒక్కరూ తెగ మంచికోసం ఏదోవిధంగా తమవంతు సహాయం చేసేవారు. చిన్నప్పటినుండే వీరికి పెద్దలనుంచి యుద్దవిద్యలు, గుడిసెలు కట్టడం, దుస్తులు తయారు చెయ్యడం లాంటి విషయాలను నేర్చుకునేవారు. తెగలోని వయసుమళ్ళినవారు చిన్నపిల్లలను చూసుకోవడంతోపాటు వారికి విద్యాబుద్దులు నేర్పేవారు. తెగలోని పిల్లలనందరిని చుట్టూ కూర్చోబెట్టుకుని కథలరూపంలో వారికి బోధనలు చేసేవారు. కథ చెప్పటం అనేది ఒక వినోదం లాగానేకాక పెద్దలనుంచి వారి అనుభవాలను పాఠాలుగా నేర్చుకునే సాధనంగా భావించేవారు.

తెల్లవాడు అమెరికాల్లో అడుగుపెట్టేనాటికి అక్కడ ఎన్నో తెగలు నాగరికంగా అభివృద్ది చెంది ఉన్నాయి. కొన్ని తెగలవారు సమిష్టి వ్యవసాయం చేసుకోవడమేకాక సామూహిక గృహాల్లో నివసించేవారు. దాదాపు అన్ని తెగలూ వారి వారి తెగలకు సంబంధించిన శాసనాలకు కట్టుబడి ఉండేవారు. తెగకు సంబంధించిన విషయాలపై తెగ నాయకుడు ఒక్కడే నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచన సభలలో చర్చించుకునేవారు. తెగ ముఖ్య నాయకుడిని ఎన్నుకోవడంలో కూడా ప్రజాస్వామిక విలువలను పాటించేవారు. ఇరక్వా (Iroquois) తెగది మాతృస్వామిక సంఘం. పాలనలో మహిళలే ముఖ్య పాత్ర నిర్వహించేవారు. ఈ తెగకు చెందిన పాలనాసూత్రాలను కొన్నిటిని, ప్రస్తుత అమెరికా సంయుక్త రాష్ట్రాల (USA) రాజ్యాంగంలో పొందుపరిచారు.

కొలంబస్ దారితప్పి అమెరికా ఖండంలో అడుగు పెట్టి కొత్త ప్రదేశాన్ని కనుగొన్నాడని చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. కాని అతడి రాక మునుపే ఎంతో అభివృద్ధి చెందివుండిన ఈ తెగలన్నీఇప్పుడు ఏమయ్యాయి? వారి సంస్కృతి ఏది? ఎప్పడో, ఏ షాపింగు కాంప్లెక్సులో ఏమూలో తమ చేతికళలను అమ్ముకునే ఆదివాసులు మాత్రమే కనిపిస్తారు. వీరిలో చాలవరకు ఆదివాసి వస్తువులు అమ్ముతున్న తెల్లవాళ్ళే ఎక్కువగా ఉంటారు. వీళ్ళు అమ్మే వస్తువులు కూడా ఎక్కువగా చైనాలో తయరై వస్తాయి. మరి ఐదు వందల ఏళ్ళ క్రితం లక్షలసంఖల్లో ఉండిన ఆదివాసులంతా ఏమయ్యారు?

కొత్తగా వొచ్చిన వారికి తమ ప్రపంచంలో చోటు ఇవ్వడానికి ముందుకు వచ్చిన ఆదివాసులను చూసి తెల్లవాడు నవ్వుకున్నాడు. వేల ఏళ్ళ నుంచి ప్రకృతిలో మమేకమై జీవిస్తూ తమను ఆప్యాయంగా ఆహ్వనించిన వారిని సంస్కారహీనులకింద జమకట్టి, వారిని, వారి సంస్కృతిని నాశనం చెయ్యడమేకాక వారి ఉనికినే సమూలంగా నిర్మూలించడానికి సమకట్టాడు. కొలంబస్ కాలంనాటి నుండి ఇప్పటి వరకు, అంటే ఈ ఐదు వందల ఏళ్ళల్లో ఎన్నో తెగలు అంతరించిపోయాయి. ఎన్నో తెగలు తెల్లవాడు తన వెంట తెచ్చిన మశూచి (Small Pox) వంటి రోగాల బారిన పడి సమూలంగా నాశనం చేయబడ్డాయి. వందల వేల సంఖ్యల్లో ఆదివాసులు, తెల్లవాడు నిర్ధాక్షిణ్యంగా జరిపిన నరమేధానికి బలయ్యారు.

ఆదివాసులు ఏ పోరాటాలూ చెయ్యకుండానే తెల్లవాడికి దాసోహమనలేదు. ఎన్నో తెగలు తెల్లవాడి దురాశకు అడ్డుకట్ట వెయ్యడానికి ఏన్నో ప్రయత్నాలు చేశాయి. అట్లాంటిక్ నుండి పసిఫిక్ దాకా అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఏర్పడిన క్రమంలో తెగల పెద్దలకు రెండే రెండు మార్గాలు కనిపించాయి. మొదటి మార్గం: తాము, తమ పూర్వీకులు తిరిగిన భూములపై తమకున్న ప్రకృతి సహజమైన హక్కులన్నీ వదిలేసి నిర్బంధ రిజర్వేషన్లలో చేరడం. రిజర్వేషన్లంటే తెల్లవాడు, ఆదివాసులకు ఎంత స్థలం అవసరమవుతుందో తానే నిర్ధారించి తెగలకు వాటాలుగా ఇచ్చిన కొద్దిపాటి ప్రదేశం. భూమి, ఆకాశం, చెట్లు , పుట్టలూ అన్నీ అందరికీ చెందినవని ఆదివాసుల విశ్వాసం. భూమి మీద హక్కులు అనేది వీరికి కొత్త విషయం. రెండవ మార్గం: స్వేచ్చగా తిరుగాడే హక్కును గెలుచుకోవడం. కొన్ని తెగలు తెల్లవాళ్ళకు ఎదురు నిలువలేమని యోచించి, తమ తెగల ఉమ్మడి మేలును దృష్టిలో ఉంచుకొని త్వరలోనే రిజర్వేషన్లలో చేరిపొయ్యాయి. దాదాపు అన్ని తెగలూ, ముఖ్యంగా ఉత్తర కోస్తాకు (East Coast, Atlantic Ocean) దూరంగా ఉన్నవారు, పోరాట మార్గాన్నే ఎంచుకున్నారు. తెల్లవాడు తమదాకా రాడని, వచ్చినా తమను ఎదిరించే బలగం వుండదని అనుకున్నారు. కానీ ఇసుక వెల్లువలా అట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటి వచ్చిపడుతున్న తెల్లవాడిది ఎల్లలు లేని దురాశ అని ఊహించలేకపొయ్యారు. 1860ల నుంచి 1890ల దాకా ఆదివాసులు చేసిన ఈ పోరాటాలను “ఆదివాసుల ఆఖరి పోరాటాలు”గా పరిగణిస్తారు. అంతరించిపోకుండా మిగిలిన అన్ని తెగలూ చివరకు తెల్లవాడి కుటిల యుద్ధనీతి ముందు నిలువలేక మొదటి మార్గాన్నే ఎంచుకున్నారు . అటుతరువాత వారి ఆచారవ్యవహారాలను నాశనం చెయ్యడానికి తెల్లవాడు బోర్డింగు పాఠశాలలు ఏర్పరచాడు. తెగలోని పిల్లలను బలవంతంగా ఈ పాఠశాలల్లో చేర్చుకుని, మొదట వారి వేషాలను మార్చేవారు. పిల్లల పొడవాటిజుట్టును కత్తిరించేవారు. వారి సాంప్రదాయదుస్తుల బదులు కోటు, ప్యాంట్లు, బూట్లు వేసేవారు. ఆ పిల్లలు తమ మాతృభాష మట్లాడకుండా ఇంగ్లీషు మాత్రమే మాట్లాడాలని కట్టడి చేసేవారు. ఎపుడైన ఎవరైన వారి మాతృభాష మాట్లాడితే వారి నోళ్ళను సబ్బుతో కడిగేవారు. ఇంతాచేసి ఆ పిల్లలు పెద్దయినతరువాత వాళ్ళని మళ్ళీ రిజర్వేషన్లలోనే వదిలేవారు. తెల్లవాడి జాత్యాహంకారంవల్ల తెల్లవాడి ప్రపంచంలో వీరికి ఉద్యోగాలు దొరికేవి కావు. పనిలేక, తెల్లవాడు రిజర్వేషన్లకు విరివిగా సరఫరా చేసే ఆల్కహాలుకు అలవాటుపడేవారు. అటు తమ పూర్వీకుల ఆచారాల్లో కలువలేక, ఇటు తెల్లవాడి ప్రపంచంలో నిలువలేక చాలవరకు కొట్లాటల్లో దిగి, దొంగతనాలు చేసి జైళ్ళపాలయ్యేవారు. రిజర్వేషన్లలో సరైన సౌకర్యాలుకూడా వుండవు. తాగేందుకు నీళ్ళు ఎన్నో మైళ్ళనుంచి తెచ్చికోవలసిన దుస్థితిలో, కరెంటు లేని, సరైన రోడ్లులేని రిజర్వేషన్లు ఇప్పటికీ ఉన్నాయి. ఎంతోమంది ఆదివాసులు ఈ రిజర్వేషన్లనుండి బయటపడి ఇప్పుడిప్పుడే తెల్లవాడి ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు. అలా బయటికి వచ్చినవారిలో కొంతమందికి మాత్రమే తమ ఆచారవ్యవహారాలపై అవగాహన ఉంది. 1970వ దశకందాకా ఆదివాసులు తమ మాతృభాష మాట్లాడడానికి, తమ ఆచారాలను పాటించడానికి సంకోచించేవారు. వీరిలో చాలామందికి బోర్డింగు స్కూలులో బోధనలవల్ల తమజాతిపై తమకే చిన్నచూపు ఏర్పడింది. ఇదంతా చూసి సహించలేని కొంతమంది యువకులు 1970వ దశకంలో ‘అమెరికన్ ఇండియన్ మూవ్‌మెంట్‘ (AIM – American Indian Movement) అనే సంస్థను స్థాపించారు. ఈ సంస్థను యువకులు ప్రారంభిస్తే, తమ జాతి గౌరవాన్ని మరువలేని పెద్దలు ఎంతోమంది వీరికి బాసటగా నిలిచారు. ఈ సంస్థ తమ జాతి ప్రజల్లో పోయిన ధైర్యాన్ని, ఆత్మగౌరవాన్ని తిరిగి సంపాదించుకునేందుకు ఎంతో కృషి చేసింది. తొందరలోనే ఎంతోమంది ఆదివాసులు తమ ఆచారాలను బహిరంగంగా పాటించడం మొదలుపెట్టారు. ఇప్పుడు ప్రతిసంవత్సరం, మార్చినెల నుంచి నవంబరు దాకా దేశంలోని ఎన్నో ప్రదేశాల్లో జాతరలను జరుపుకుంటున్నారు. దీనిద్వారా తమ ఆచారాలను, సంస్కృతిని పాటించేందుకు, తమ ముందుతరాల వారికి చేరేందుకు కృషి చేస్తున్నారు. అమెరికన్ ఇండియన్ మూవ్‌మెంట్ తమ ప్రజలు పడుతున్న పాట్లను గవర్నమెంటుకు తెలియజెయ్యడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. కొన్ని హక్కులను సాధించుకుంది కూడా. ఎన్నోసార్లు దేశరాజధాని అయిన వాషింగ్టను డి.సి లో ఎన్నో పాదయాత్రలను, బహిరంగ సభలను నిర్వహించింది. అమెరికన్ గవర్నమెంటు అమెరికన్ ఇండియన్ మూవ్‌మెంట్ నాయకులను ఎంతోమందిని ఎన్నోసార్లు జైళ్ళో పెట్టింది. ఈ నాయకులలో ముఖ్యుడైన లియొనార్డ్ పెల్టియరు ఎఫ్.బి.ఐ పెట్టిన తప్పుడు హత్యకేసులో ఇరుక్కుని దాదాపు ముప్పై ఏళ్ళనుంచి జైల్లో మగ్గుతున్నాడు.

ఇంతాచేసి అమెరికను ఆదివాసుల గురించి బయట ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువ. ఇవాళ్టి గందరగోళ పరిస్థితులలో ఆదివాసులనుంచి ఎన్నో విషయాలు నేర్చుకునే అవసరం ఉంది. వీరు ఆచరించే సూత్రాలలో ముఖ్యమైనది: “ఈ భూమిని మనం మన పూర్వీకులనుంచి వారసత్వంగా పొందలేదు. మన పిల్లలనుంచి, వారి పిల్లలనుంచి అప్పుగా తీసుకున్నామంతే”.

కొంతమంది ఆదివాసుల నుంచి, వారి చరిత్ర గురించి, ఆచారాలగురించి యదార్థంగా రాసిన పుస్తకాలనుంచి నేను తెలుసుకున్న, నేర్చుకున్న విషయాలను మీతో పంచుకోవాలని నా ప్రయత్నం. ఒక్కొక్క నేటివ్ అమెరికను తెగ ఆచారాలు, కళలు, సాహిత్యాల గురించి, వారి బ్రతుకు పోరాటాల గురించి వచ్చే ప్రజాకళ సంచికలలో ధారావాహికంగా మీకు అందిస్తాను.

 

* *  అమెరికను ఆదివాసులను ఒక్కొక్క చోట ఆదివాసులని, నేటివ్ అమెరికనులని రాశాను. మన ప్రపంచంలో అన్ని దేశాల్లో ఆదివాసీ తెగలు ఉన్నాయి. కాని ఈ వ్యాసాల్లో అమెరికా సంయుక్త రాష్ట్రాలకు చెందిన తెగల గురించి మాత్రమే తెలియజేస్తున్నాను కనుక ఇకపై వీరిని నేటివ్ అమెరికనులనే అంటాను.

ఒక్క అభిప్రాయం

  1. ప్రసాద్ 14 నవంబర్ 2006 , 4:55 pm

    మంచి విషయము. నేను పని చేస్తున్న చోటికి కూతవేటు దూరంలో “నేటివ్ అమెరికన్ మ్యూజియం” వుంది. కానీ అందులో ఇప్పటి నేటివ్ అమెరికన్లు ఎలా బతుకుతున్నారనే గానీ పూర్వపు అమెరికన్ల అచూకీ లేదు. అలాగే తెల్లవాళ్ళు ఎంత క్రూరంగా వాళ్ళను హింసించి చంపారో లేదు. నాకు చాలా అసంతృప్తిని మిగిల్చింది.
    ఇపుడు మీ ధారావాహిక ద్వారానైనా వారి గురించి తెలుసుకోవచ్చని ఆశగా వుంది.
    –ప్రసాద్
    http://blog.charasala.com

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)