- గాబ్రియెల్ గార్సియా మార్కెజ్
తొలినాళ్ళలో నేను రాసిన కథల్లో బుద్ధి బులపాటం అధికం అనిపిస్తుంది. జీవితానికి పుస్తకానికి మధ్య ఎంతో ఎడం ఉండేది. తర్వాత్తర్వాత ఆ విషయం గ్రహించాను.నేను కథనం నేర్చింది మా అవ్వ దగ్గర! మహత్తర విషయాన్ని మామూలుగా చెప్పడంలో దిట్ట ఆమె.

(గాబ్రియెల్ గార్సియా మార్కెజ్ నవల నూరేళ్ళ ఒంటరితనం ముఖచిత్రం)
ఒక నవలను రచించడం కన్నా కథా సంకలనం తేవడం కష్టం. మొదటిపేరా నా వరకు అంత తేలికగా రాదు. చాలా కష్టపడాలి. అందులోనే కథకు అవసరమైన శైలీ..గమనం వచ్చేస్తాయి,కాబట్టి, అదే కీలకం. ప్రతీ కథలో, ఈ ఇబ్బంది పడాలి; నవల ఒక్కసారి మొదలయిందా అంతే. ఆసాంతం రాసుకుపోవచ్చు. అందుకే భారీ నవల కన్నా పలు కథలను రాయడం బహు కష్టం.
వాస్తవానికి దూరం కారాదు. అలాగని చెప్పి వాస్తవాలే రాస్తే అది జర్నలిజం. జర్నలిజంలో ఒక అబద్దం నీపై ఇతరులకు గల విశ్వాసాన్ని కూలుస్తుంది. తద్భిన్నంగా నవల/కథా రచనలో ఒక వాస్తవమున్నా అది రచనకు బలాన్నిస్తుంది. జర్నలిజంలో ప్రతిపదం మీద శ్రద్ధ ఉండదు. మంచి రచన అలా కాదు. ఐనా, జర్నలిజం, నుండి రచయిత గ్రహించవలసినవి అనేకం.
విమర్శకులు సిద్ధాంతాలు పుచ్చుకొని బయల్దేరుతారు. వాటిలో రచయితలను ఇరికించడానికి అవస్థలు పడతారు. నా మట్టుకు నాకు విమర్శకుల అవసరం లేదు. పాఠకుల మనసుకెక్కేలా రాయగలను.
అనువాదం అతి కష్టం. అందరి వల్లా అయ్యే పని కాదు. మంచి రచయితకు కఠోరమైన దీక్ష, క్రమశిక్షణ అవసరం. నా వరకు, ఇతర భాషల్లో పుస్తకాలు చదవడానికి ఇబ్బంది. స్పానిష్ లో నాకు అన్ని లోతులు తెలుసు, కాబట్టి, ఎంత చెత్త అనువాదమైనా మొదట మాతృభాషలొనే, హాయిగా చదువుతాను. నేను ఆంగ్లం, ఫ్రెంచి, ఇటాలియన్ భాషలను పటిష్టంగా నేర్చినవాడినే.
వలసపాలన వల్ల స్పానిష్ రచయితలు, ఇతరులు చెప్పే దాకా తమ గొప్పతనాన్ని గ్రహించలేక పోయారు. కీర్తి చెడ్డది. అదీ ఎంతో చెరుపు చేస్తుంది. దాన్ని దూరంగా ఉంచకపోతే రచయితగా రాణించలేవు. అది సర్వాన్ని హరించి వేస్తుంది. నా మరణానంతరం నా పుస్తకాలు వచ్చి వుంటే మరీ ఆనందించేవాణ్ణి. అప్పుడు కీర్తీ ప్రతిష్ఠ ఈ గొడవలు ఉండవు కదా…
తెలిసిన విషయాలు, జీవితానుభవాలు రచనకు పునాది. బుద్ధి ఆలోచనలది పెడదోవ; చిన్న వయసులో అందరూ తొక్కినదే !
రచయిత పూర్తి ఆరోగ్యంతో, చక్కటి స్థితిలో చేసిన రచనలు నిలబడతాయి. మనసుకు పట్టిన రచనలు చదివినవే చదువుతుంటాను. కాల్పనిక సాహిత్యం మరీ ఎక్కువ చదవను. నానా పత్రికలు తిరగేస్తుంటాను. వార్తలు చదువుతుంటాను. లోకంతో సంబంధం పోగొట్టుకోరాదు. కీర్తి, అధికారం పెరిగే కొద్దీ ఏకాకితనం ఎక్కువైపోయి, చివరికి ప్రపంచంతో ఉన్న బంధం తెగిపోతుంది; రచయితకు
అది ప్రమాదకరం. నాకు కూతురు లేని లోటు తెలిసి వస్తోంది…
త్వరలో గొప్ప రచన చేయబోతానేమో అని నిరీక్షణ. అది ఫలించి, ఉత్తమ రచన నన్ను వరిస్తుందేమో…
గేబ్రియల్ గార్సియా మార్కాజ్, నోబెల్ బహుమతి పొందిన ‘One Hundred Years of Soliltude’ నవల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరు సంపాదించాడు. Living to tell a tale ను బృహత్తర రచనగా కొనియాడారందరూ. (Cancer కబళిస్తుందేమోనని తనకై తాను విధించుకొన్న ప్రవాసం , ఏకాంతంలో పూర్తి గావించిన రచన. పలు నగరాల్లో ఇది విడుదలైన రోజు… చెలరేగిన అలజడి అంతా ఇంతా కాదు!)
Paris Review లో వచ్చిన interview నుండి సంగ్రహితం. (05.06.04 )
అనువాదం : తమ్మినేని యదుకుల భూషణ్
భూషణ్ గారూ ! విమర్శకులు అవసరం లేదన్న గాబ్రియేల తో మీరు ఏకీభవిస్తారా? విమర్శలకు అతీతమైన రచయితలు ఎవరైనా ఉన్నారా?
రఘూ,
నేననుకోవడం అది రచననులోతుగా చదివి హృదయగతం చేసుకొనక
బుద్ధిబులపాటం ప్రదర్శించే అకడమిక్ విమర్శకుల గూర్చి ఆయన అభిప్రాయం .ఔచిత్యం గల ఏ కవీ /రచయిత విమర్శను ఉపేక్షించ లేడు.
భూషణ్