- జిలుకర శ్రీనివాస్

2000 లో ‘కక్క’ నవల వచ్చింది. ఆ ఏడు ఒక సహస్రాబ్దికీ ఒక శతాబ్దానికీ ముగింపు. ఈ నవల, ఆ వెయ్యేళ్ల జీవన పోరాటాల మీద ఒక తెలంగాణా తీర్పు. రానున్న శతాబ్దపు భవిష్యత్తుకు ఒక రాజకీయ కార్యక్రమం (పోలిటికల్ ప్రోగ్రామ్). మనకి రాజకీయ కార్యక్రమాల వంటి నవలలు ఉన్నాయి. కాల్పనికమైన రాజకీయ కార్యక్రమాలు ఉన్నాయి. మొదటి రకంలో జీవితం ఉండదు. రెండో రకంలో జీవం ఉండదు. ఈ రెండూ ఉన్న దమ్మున్న నవల కక్క.

అది దళిత సాహిత్యం ఆగిపోయినట్టుగా కనిపిస్తున్నదన్న ఆరోపణ ఊపు అందుకుంటున్న తరుణం. సరిగ్గా ఆ సమయంలోనే ‘కక్క’ , ‘అంటరానివసంతం’ వెలువడినాయి. ఇవి రెండూ వందేళ్ల దళిత సాహిత్యానికి వెయ్యేళ్ళ తెలుగు సాహిత్యానికి పరిపక్వ ఫలాలు. గడిచిన శతాబ్దం న్యాయంగానే శ్రీశ్రీది. కాకపోతే అది జరిగిపోయిన కథ కాదు. ఇంకా జరగాల్సిన కథ! అయితే, ఈసారి ఈ శతాబ్దం ఏ ఒక్కరికో చెందదు. అందులో అందరికీ జాగా ఉంటుంది. శ్రీశ్రీ మహదానందంగా అదే కరెక్టు అంటూ నేను సైతం అంటూ వంతపాడతాడు. ఆ అనామక శతాబ్దాన్ని చాటే మాదిగ డప్పు – కక్క నవల.

2

‘గుర్తింపు’ ఒక వ్యక్తికి గానీ సమూహానికి గానీ ‘ఉండే’ ఒక ధర్మం కాదు. గుర్తింపు ఒక సంబంధం. అందువల్లనే, అది వ్యక్తిగత లేదా ఆ బృందపు సొంత ఇష్టాయిష్టాలకి లోబడే విషయం కాదు. వ్యక్తులూ బృందాలూ తమని తాము ఫలానా అని నిర్వచించుకున్నంత మాత్రాన అది వారి గుర్తింపు అయిపోదు. సంబంధిత వ్యక్తులనో సమూహాలనో సంప్రదించకుండా అంటగట్టే లేబిళ్ళు కూడా గుర్తింపులు కాబోవు. అలాగని గుర్తింపులు స్వాభావికమైనవి కావు. స్థిరమైనవి అసలే కావు. అవి, సంబంధాల ఫలితాలు. కాబట్టే, సంఘర్షణల పోరాటాల వేదికలు కూడా. ‘గుర్తింపు’ కి నిర్దిష్టతని ప్రత్యేక లక్షణంగా ప్రధాన లక్షణంగా చూపడం మనకు బాగా అలవాటు అయిపోయింది. కానీ, భారీ గుర్తింపులని ( అంటే ఎక్కువమందినీ ఎక్కువ రకాలనీ ఇముడ్చుకోగలిగిన ) ‘ఐక్యత’ అనీ చిన్నవాటినీ బలహీనమైన వాటినీ గుర్తింపులనీ సూచించడం ప్రబలంగా ఉంది. గుర్తింపులు నిశ్చలమైనవి కావనే విషయం చాలామంది గుర్తించిన విషయమే. ఒకే వ్యక్తికి ఏకకాలంలో అనేక గుర్తింపులు ఉంటాయన్నది కూడా అందరికీ అనుభవమే. కాకపోతే, గుర్తింపు రాజకీయల తరుఫున గానీ వ్యతిరేకంగా కానీ చేసే చాలా వాదనలు కుదింపువాదాలు. అవి, జీవితాచరణలో ఒక బృందం మరొక బృందంతో వ్యవహరించేటప్పుడు ఏర్పడే బహుముఖ అల్లికల సంక్లిష్టతలని అర్థం చేసుకోలేవు. వేముల ఎల్లయ్య నవలలో కనిపించే బహుళత్వం, వైవిధ్యం, అనేకత వంటివి ఇంద్రధనుస్సులాంటి అందం కాదు. తీవ్ర వ్యక్తివాదపు ‘పరస్వర పట్టనితనం’ కూడా కాదు. ఆయనది సమాంతర సహజీవనాల స్వప్నం కాదు. జీవిత అనివార్య మనుగడ మార్గం.

3

తెలంగాణ జాతీయ ఉద్యమాన్ని ‘ప్రాంతీయ’ చైతన్యమని పిలిచే అహంకారులూ దానిని బాంచెన్ అని నిర్విమర్శగా స్వీకరించే మందబుద్ధులూ మనకి చాలామందే ఉన్నారు. దేశమంటే మనుషులే గానీ తెలంగాణా అంటే మాత్రం మట్టేనని వీరిభావం. వేముల ఎల్లయ్యకి మాత్రం తెలంగాణా అంటే నిరంతర చలనంలో ఉండే మనుషులు. వారి మధ్య మారుతూ ఉండే సంబంధాలు, వాటికి రూపాన్ని యిచ్చే సంస్థల, సంప్రదాయాల, చైతన్యాల, ఆస్తి సంబంధాల, పోరాటాల మూసలు. అంతేకాదు, ఎల్లయ్యకి తెలంగాణ అంటే మట్టి కూడా. కాకపోతే అది అనిర్దిష్టమైన ‘ప్రాంతం’ కాదు. అల్పమైన మట్టి కాదు. భూమి.

స్థిరత్వానికి, సంప్రదాయానికి, కరుడుగట్టుకుపోవడానికి, మార్పులేనితనానికి, గిరిగీసిన తనానికి పేరుమోసిన ‘గ్రామం’ లో నిరంతరప్రాయమైన చలనాలని ఈ నవల చూపిస్తుంది. గతం గమ్మున నిలుచుండిపోదనీ దానిని అలా నిలబెట్టుకోవడానికి ఎంతో శక్తివెచ్చించాల్సి వస్తుందనీ ఎల్లయ్యకి బాగా తెలుసు. కథలని నేలయే ఈ సమస్త సంచలనాలకి కుదుపులకీ కేంద్రంగా సాధనంగా ఆఖరుకి లక్ష్యంగా కూడా వేముల ఎల్లయ్య చూపెడతాడు.

4

మనకి విప్లవ సాహిత్యం పేరిట చాలా సైనిక సాహిత్యం వచ్చింది. కానీ విప్లవం అంటే అన్నిటికన్నా ముఖ్యంగా ఉత్పత్తి సాధనాలకీ అధికారానికీ సంబంధించిన విషయం. ఆ రకంగా కక్క నవలని తొలి విప్లవ నవలగా చెప్పుకోవచ్చు. కథాంతంలో బాధితపాత్రల చేతుల్లో ఆయుధాలని చొప్పించడమే విప్లవమనే విరసవాద పరిమితిని అధిగమించడం కక్క నవల పరిణితి.

5

గతంలో కూడా ఒకటి రెండు దఫాలు తెలంగాణా ఉద్యమం వచ్చింది. ఇప్పటి ఉద్యమంలో ఆనాటి స్థాయి ఉద్వేగం లేదు. ఇంతకుముందు వేరుతెలంగాణా అవసరమా అనవసరమా అనేవి మాత్రమే ప్రశ్నలు. కానీ ఇప్పుడు అది అపాయకరమా కాదా అనే ప్రశ్న కూడా వేసుకోవాల్సిన అవసరం దాపురించింది.

తెలంగాణా గుర్తింపుని నిజాం వ్యతిరేక గుర్తింపుగా ఏకపక్షంగా నిర్వచిస్తున్నారు. దీని వలనాది ముస్లిం వ్యతిరేక గుర్తింపుగా దిగజారేందుకు అనువుగా మారుతున్నది. జీవితాచరణకి అర్థాన్ని వ్యాఖ్యానాన్ని కల్పించుకునే సహ-ఆచరణే సంస్కృతి అనుకుంటే తెలంగాణా ప్రాతినిధ్యంలో అనేక ప్రమాదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

పేదరికం, వెనకబాటుతనం, భూస్వామ్య విధేయత, కౄరత్వం, సెంటిమెంట్ వంటి అంశాలని పరిహరించుకొనే వనరులు, స్వయం ప్రతిపత్తి, సాధనాలు, సమయం, సంస్కరణోద్యమాలు, ప్రయోగాలకి వీలు వంటివేవీ తెలంగాణా జాతీయ వాదానికి సమకూరలేదు. కానీ ఆంధ్రాదిపత్యానికీ నిరంకుశ ఐక్యతావాదానికీ వ్యతిరేకంగా సొంతగుర్తింపుని అసెర్ట్ చేసుకోవాల్సిన స్థితిలోకి నెట్టబడింది. ఇంకా నిర్మించుకోవాల్సిన ఎన్నిటినో ఇప్పటికే తయారుగా ఉన్నాయని వాదించాల్సిన చిక్కుస్థితిలో తెలంగాణ ఉద్యమ సాంస్కృతిక విభాగం చిక్కుకున్నది.

6

ఈ ఇరుకైన పరిస్థితిలో తెలంగాణా జాతీయ నవల కక్క పుట్టింది. కక్క నవల తెలంగాణా జీవితానుభవ బహుళత్వాన్ని సంఘటిత పరిచే నిర్మాణాత్మక నవల. అంతేకాదు, తెలంగాణా గాయాలకి పట్టిన సెప్టిక్ ని నయం చేసే ముందుకూడా. ప్రపంచమంతటా జాతీయవాద సాహిత్యమంతా ఘనమైన గతాల ప్రశంసలే. లేదా విలాపగీతాలే. ప్రపంచ జాతీయ వాద సాహిత్యంలో వేముల ఎల్లయ్య కక్క అనన్యత ఏమంటే తన జాతీయవాదాన్ని గతకీర్తి మీద కాక భవిష్యత్తు మీద లగ్నపరచడం. అలాగని కక్క ఉటోపియా కాదు. సాహిత్యంలో ఊహాస్వర్గాలు కొత్తకాదు. కానీ అవి వాస్తవాఅ వర్ణనలు కావు. ఆకాంక్షల దృశ్యీకరణలు. ఈ నవలలో జీవిత వాస్తవాలని త్యజించని ఉటోపియా ఉన్నది.దీనికి తోడు గతాన్ని పట్టుకువేళ్లాడని జాతీయవాదం ఉంది.

ఇవిరెండూ కలసి రావడంతో పాటు ఎక్కడా మార్మికతకి సందు ఇవ్వకపోవడమనే విశేషం కూడా అమిరింది. ఈ లక్షణాలు అన్నీకలపి కక్క నవలని ప్రపంచ మహా సాహిత్య శ్రేణిలో సగర్వంగా నిలుపుతాయి.

సామాజిక ఉద్యమాలని నిర్వహించే సంస్థలూ కదిలించే ఉద్వేగాలూ వాటి లక్ష్యసాధనకి సాధనాలూ వాటిని అణిచివేసే యంత్రాంగాలూ వక్రీకరించే ప్రచారాలూ ఎప్పుడూ ఉంటాయి. కానీ ‘కొలిచే’ పరికరాలు సమకాలంలో దొరకవు. దశాబ్దాలూ కొన్ని సార్లు శతాబ్దాలూ ఆగాలి. ఈ విషయంలో తెలంగాణా ఉద్యమానిది అదృష్టమే. దానికి ఒకకొలమానం, గీటురాయి దొరికింది. అన్ని గొంతులకీ స్థానం ఉన్న అన్ని స్థానాలకీ చలనం ఉన్న సమగ్ర సిలబస్ ఈ నవల. దీనిని ఇప్పటికీ తెలంగాణా ఉద్యమం తన జాతీయ నవలగా ప్రకటించకపోవడం అనుమానించదగ్గ విషయం.

7

‘నవల’ భౌతిక స్వరూప స్వభావాలు సైతం ప్రజాస్వామికమైనవి. నవలని కొద్దిమందికోసం (వార్తాకథనంలో వలె) బతుకులోని బహుళ స్వరాలని ఏకసూత్రంలోకి ఇరికించే అవసరమూ అవకాశమూ నవలా ప్రక్రియ స్వభావంలోనే లేదని మార్క్సిస్టు సాహిత్య సిద్ధాంతవేత్త మిహయిల్ భక్తిన్ చెప్పాడు. ఆ ప్రక్రియా ప్రత్యేకతని సందర్భోచితంగా సద్వినియోగం చేసుకున్న నవల కక్క.

8

దళితవాదంలోని రెండు ప్రధాన స్రవంతుల పరిమితులని కక్క అధిగమిస్తుంది. ఒకటి: బిఎస్పీ ప్రేరిత స్వల్పకాలిక అధికార భాగస్వామ్యవాదం. రెండోది: వాస్తవ వైరుధ్యాల స్పృహలేని (ఒకరకం) అంబేద్కరీయ ఆదర్శవాదం. మొదటిది మైనారిటీలని గాలికి వదిలి బిసిలకి అధిపత్య శూద్రకులాలకి వ్యతిరేకంగా బ్రాహ్మణబనియా వర్గాలతో జంటకట్టాలని అంటుంది. రెండోది విద్యావంతుల, మేధావుల, ప్రధాన స్రవంతి రాజకీయాలలో లేని దలిత కార్యకర్తల కార్యక్రమరహిత కులనిర్మూలనావాదం. ఈ రెండు స్రవంతులలోనూ ఉమ్మడిగా ఉన్న మరొక పెడధోరణి ఉంది. దానికి విరుగుడు కక్క నవలలో దొరుకుతుంది. ఆ ధోరణి దలితులకి ఎదురయ్యే అవమానాల అణిచివేతల సూటిరూపాలని మాత్రమే పట్టించుకుంటూ వాటి చుట్టూరా మాత్రమే దళిత గుర్తింపుని నిర్మించే బాధితవాదం. ఈ వాదాలలో లోపించిన దీర్ఘకాలిక సానుకూల కార్యక్రమాత్మక స్వభావం కక్కలో పుష్కలంగా ఉంది. కక్క నవల అనుభవంలో కూరుకుపోదు. ఆకాంక్షలలోనూ తేలిపోదు. జీవితంలోనే జీవిత సమస్యలకి సమాధానం వెతుకుతుంది. పరిష్కారాలని “కల్పించదు”. అలాగని యథాస్థితివాద నిష్కృయలోకి  నిష్క్రమించదు.

9

చుండూరులో రెడ్లూ కారంచేడులో కమ్మలూ దళితమేధాలకి పాల్పడితే బ్రహ్మణిజాన్ని విమర్శించి లాభంలేదని గుర్తించిన దళిత శ్రేణుల్లో ఒక భాగం బియస్పీ విజయాలతో చాలా స్పూర్తి పొందింది. ఇప్పుడు అధిపత్య శూద్రకులాలూ వెనుకబడిన కులాలవారే తమని ప్రత్యక్షంగా అడుగడుగునా అణిచివేస్తున్నారనే నిష్ఠురనిజాన్ని అది నిష్కర్షగా ముందుపెట్టింది. అందువల్ల కమ్యూనిస్టులనీ మైనారిటీలనీ బీసీలనీ వదిలేసి ‘అగ్ర’వర్ణాలతో చేతులు కలుపుదామని అన్నది. మరి కులనిర్మూలన గురించీ బ్రాహ్మణీయ విలువల వ్యతిరేకపోరాటం సంగతీ ఏమిటని అడిగితే, దానికి అధికారం కావాలి ముందు అని జవాబిచ్చింది. దళిత బహుజన ఐక్యతకు పునాది లేదని తెగేసి చెప్పింది. మరో దళితవాదానికి విద్యే సర్వస్వం. అధికారం గురించి వనరులగురించి కార్యక్రమం కాదు కదా కనీస ధ్యాసయినా ఉండదు. ఈ విద్యార్జనా వాదం నుంచి దళితవాదాన్ని ఎల్లయ్య భూమ్మీదకు దించుతాడు. విద్యాధిక దళిత శ్రేణుల నుంచి దళారీలు తప్ప పోరాటయోధులు పుట్టడం లేదనే చేదుని చూసే కాబోలు ఎల్లయ్య నవలలో చదువుకున్న దళితులకి స్థానమే లేదు. ఈ రెండు రకాల శత్రువులు మరో సందర్భంలో కలిసిరావడానికి ఆస్కారమే లేదు. వేముల ఎల్లయ్య చూపిన జీవితం ఈ రెండు అతి(పరిమిత) వాదాలలో ఉన్న ఉమ్మడి లోపాన్ని బయట పెడుతుంది. ఒక అంటరానితనం, అవమానం వంటి దళితజీవితపు నిత్యవాస్తవాలను కూడా పక్కకుపెట్టి అధికారపోరాటం, వనరుల కోసం ఆరాటాలని ముందుకు తీసుకువచ్చాడు. రాసిన విషయాలలోనే కాదు వదిలేసిన విషయాలలో సైతం ఎల్లయ్య వివేచన స్పష్టంగా కనబడుతుంది. ఇది అన్నలు లేని తెలంగాణా నవల. బ్రాహ్మణులు లేని దళిత నవల. కానీ ఈ ‘ప్రాంతీయ’నవలలో ఆంధ్ర వలసవాదులు మాత్రం ప్రముఖ పాత్రనే పోషిస్తారు.

10

వేముల ఎల్లయ్యది రిలేషనల్ దృష్టి. ఆయన జీవితాన్ని చూసే తీరు దళిత మార్క్సిజానికి సన్నిహితమైనది. మిగతావాదాలలోని లోపాలని ఎల్లయ్య అధిగమించాడంటేనూ వాటిలో లేని సుగుణాలనీ లోచూపునీ ప్రదర్శించాడంటేనూ ఆయనేదో ‘సరైన’సమాజానికి బ్లూప్రింట్‌ని ఏదో రూపోందిచాడని వాదిస్తున్నట్టుగా ఎవరైనా పొరపడవచ్చు. జీవిత వాస్తవాల నుంచి దానికి అనుగుణమైన లక్ష్యాలని ఏర్పరచుకోకుండా ఆదర్శాల ఆధారంగా వాస్తవాలని మానిప్యులేట్ చేసేవారిని మార్క్స్ ఒకసారి స్కౌండ్రల్స్ అని అన్నడు. పూర్తిగా జీవితం ఆధారంగానే లక్ష్యాలని రూపొందిస్తాడు ఎల్లయ్య. అయినా ఆ లక్శ్యాలు నిరాశాజనకంగా గానీ అత్యాశలుగా గానీ కనిపించకపోవడం ఆయన ప్రతిభ కాదు. పరిస్థితులలో ఎదురుచూస్తున్న ఆశాజనక వనరుల సుభిక్షత.

(కక్క నవలను ఆంధ్రామాండలికంలోకి అనువాదం చేస్తున్నందుకు సహచరుడు చిట్టిబాబుకి ఈ థీసిస్ అంకితం)

3 అభిప్రాయాలు

  1. Dr.Darla VenkaeswaraRao 18 నవంబర్ 2006 , 7:29 am

    జిలుకర శ్రీనివాస్ గారు కక్క నవల పై రాసిన వ్యాసం ఆలోచనాత్మకంగా ఉంది.
    తెలంగాణది ప్రాంతీయవాదమా? తెలంగాణ జాతీయోద్యమ మా? అనేది ఒక కొత్త ఆలోచన.

  2. t sundara vardhan 18 నవంబర్ 2006 , 11:52 am

    This is a much-awaited proclamation of Dalit Marxism. At a time when the Indian mainstream academia is finding it ‘well neigh impossible’ to come out of its ‘veil of ignorance’to recognize the reality of caste conflict in Indian society, I hope Dalit Marxism would be a revelation to conduct the analysis in a meaningful direction. It does not simply limit itself to Dalit emancipation but also provides a worldview for emancipation in general. I very much welcome the initiative taken by Jilukara Srinivas.

  3. pasunoori ravinder 04 డిసంబర్ 2006 , 10:25 am

    జిలుకర గారి వ్యాసము బాగుంది.కక్క నవలను సరిగ్గా అర్థము చేసుకోవడానికి అవసరమైన చూపును అందించారు.

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)