- నగ్నముని

నవంబరు 13, మధ్యాహ్నం. ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి చెన్నయ్‌లో ఉన్నాను. రిమోట్‌తో స్పృశించగానే టి.వి. తెరమీద హఠాత్తుగా విస్ఫోటనంలా ప్రసారమైన వార్త. మన కాళోజీ భౌతికంగా మనను వీడి వెళిపోయారనే వార్త. ఆయన వయసెంతో తెలుసు. ఆయన అస్వస్థత గురించి తెలుసు, ఆసుపత్రిలో వున్నారని తెలుసు. త్వరలోనే యింటికి వస్తారని అనుకుంటుండగా, ఆయన మరోలా అనుకుని, యీ జీవితం తలుపులు బార్లా తీసుకుని వెళిపోయారనేది మాత్రం నమ్మలేని నిజం.

నమ్మడానికి యిష్టంలేని నిజం. చాలాసేపు చుట్టే ఆవరించిన శూన్యం, లోపల శూన్యం, ఘనీభవించిన మహా శూన్యం అనుభవిం చాను. బహుశా, యిది నా ఒక్కడి అనుభవమే కాదు. కాళోజీని తెలిసిన తెలుగుజాతి అనుభవం.

సూర్యుడు ఒక్కడే, ఒక్కొక్కరికీ ఒక్కొక్కడుగా భాసించినట్లు, కాళోజీ కూడా ఒక్కడే. ఒక్కొక్కరికి ఒక్కొక్కనిగా, కాలంతో సమానంగా నడుస్తూ, కార్యశీలిగా గమిస్తూ అనేక ఉద్యమాలలో మమేకమై, తన మాటతో, చేతతో, కవితతో కరుకుగా, కనికరంగా అందరి హృదయాల్లో గాఢంగా చోటు చేసుకున్న వాడు. మానవత్వాన్ని నిండా నింపుకున్నవాడు. మానవ విలువల్ని సర్వత్రా వెదజల్లినవాడు.
 
ఆయన చేసిన ప్రయాణం సుదీర్ఘమైంది. ఎక్కడా ఆగిపోలేదు. అలసి పోలేదు. మాసిపోలేదు. మడం తిప్పలేదు. నాటి నైజాం నిరంకుశ రాచరికం దురాగతాల నుండి నేటి హై హైటెక్ స్లో పాయిజన్ ఆధిపత్య అన్యాయాల వరకు దేనికీ కాల్మొక్కనివాడు. ప్రజల్ని బానిసలుగా మార్చి కాలికింద తొక్కిపట్టిన రాజరిక, భూస్వామ్య వ్యవస్థల్నీ, వాటి విలువలనే సరికొత్త రూపంలో కొనసాగిస్తూ పౌరహక్కుల్ని కాలరాచే, ‘సర్కార్ సంస్కృతి’కి - ప్రభుత్వ సంస్కృతికీ కాల్మొక్కనివాడు. అంతేకాదు, ఈ అమానవీయ విలువలకి కాల్మొక్క వద్దని, ఎదురించమని ప్రబోధించినవాడు. వివక్షను ఎండగట్టినవాడు. ప్రజా స్వామ్యానికీ, ప్రశాంతికీ, స్వేచ్ఛకీ, సమానత్వానికీ, సహృదయతకీ, సామాజిక న్యాయానికీ తప్ప దేనికీ కాల్మొక్కవద్దని కోరినవాడు, శాసించినవాడు, శ్వాసించిన వాడు కాళోజీ. సామాన్యుల కోసం అసామాన్యంగా నిలబడినవాడు కాళోజీ. అందుకే అతనంటే అంత గౌరవం, ప్రేమ, అభిమానం.
 
అతని ఊహల్లో వ్యూహాలు లేవు, వ్యామోహాలు లేవు. అతని మాటల మీద ముసుగులు లేవు. పలుకుల మధ్య పరదాలు లేవు. నడకలో నడతలో తారట్లాడే నీడల్లేవు, క్రీనీడల్లేవు. చేతల్లో, రాతల్లో పదవులకై, పురస్కారాలకై మెట్లెక్కడానికై నేడు పదుగురు చేసే చిత్రవిచిత్ర విన్యాసాలు లేవు. ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకునే లక్షణాలు లేవు. అతని నిజాయితీకి వెలలేదు. అట్టడుగు జనం కోసం, వారికి చెందవలసిన న్యాయం కోసం తుదికంటా నిలకడగా నిలిచినవాడు. సూటిగా మాట్లాడినవాడు. అతనిది అక్రమాలపై గురిపెట్టిన ధిక్కార స్వరం. అధిక్షేపణా రచనతో ఈ విలోమ విలువల లోకంలో అనులోమ క్రమం కోసం అవిశ్రాంతంగా సమరం సాగించినవాడు మన కాళోజీ.
 
ఒక్కసారిగా కళ్ళముందు గతం నిలబడింది.
 
కాళోజీతో నా సాన్నిహిత్యం నాలుగు దశాబ్దాలపై మాటే. చిన్నప్పట్నుంచీ నాకు పత్రికలుచదివే అలవాటుంది. అట్లా కాళోజీ పేరుతో పరిచయముంది.

1956 నవంబరు ఒకటిన, భాషా ప్రాతిపదికపై విశాలాంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. అదే నెల 2వ తేదీన నేను బందరు నుండి హైదరాబాద్‌కు వచ్చాను. తెలుగు అన్నదమ్ముల ఏకీకరణ సంఘటనలో ఉద్భవించే కాంతులు గమనించడానికి, ‘ఢిల్లీకి వచ్చి ఉద్యోగంలో చేరమని’ పిలుపు అప్పటికే నాకు వచ్చి వుంది. తెలుగువారి కలయిక పులకరింతతో చూసి పోదామని హైదరాబాద్‌కు వచ్చాను. నా ప్రయత్నం లేకుండానే, చిత్రంగా నవంబరు నెలలోనే, 26వ తేదీన శాసనసభలో తాత్కాలిక ఉద్యోగిగా నియమించబడ్డాను. తర్వాత పబ్లిక్ సర్వీస్ కమీషన్ వారు ప్రకటన ద్వారా నిర్వహించిన ప్రత్యేక పరీక్షలో ఎంపికచేసి నన్ను శాశ్వత ప్రాతిపదికపై శాసనసభలో వెర్బాటిమ్ రిపోర్టరుగా నియమించడం జరిగింది. దీనికీ, పత్రికా విలేఖరి ఉద్యోగానికీ సంబంధం లేదు. ఆ విధంగా తెలుగు ప్రేమతో, తెలుగు రాజధానిలో స్థిరపడ్డాను.

1958లో శాసనమండలి (లెజిస్లేటివ్ కౌన్సిల్) ఏర్పడింది. అటు శాసనసభకు స్పీకర్‌గా అయ్యదేవర కాళేశ్వరరావుగారు ఉన్నారు. ఇటు శాసనమండలికి ఛైర్మన్‌గా మాడపాటి హనుమంతరావుగారు ఉన్నారు. ఇద్దరూ స్వాతంత్య్ర సమరయోధులే. అదే సంవత్సరం ఉపాధ్యాయుల నియోజకవర్గం నుండి కాళోజీ ఎన్నికై ఎం.ఎల్.సి. అయినారు? 1960 వరకూ కొనసాగారు. ఆనాటి, రాష్ట్రారంభ ప్రారంభ సంవత్సరాలు మేరువులతో నిండిన సభల సన్నివేశాల సమావేశాలు చూసి తీరవలె. ఆ అదృష్టం నాకు కలిగింది. బయట నుండి చూడడం కాదు, అంతర్భాగంగా ఉండి వీక్షించే అవకాశం కలగడం మామూలు విషయం కాదు.

శాసనసభ, శాసనమండలి సమావేశాలు జరుగుతున్నప్పుడు వెర్బాటిమ్ రిపోర్టర్లు హాజరై, సభల కార్యక్రమంలో భాగంగా, సభ్యుల ఉపన్యాసాలు యథాతథంగా కవర్ చేస్తారు. అంతకుముందు పత్రికల ద్వారా కాళోజీ గురించి విని ఉన్నాను. శాసనమండలి ప్రాంగణంలో సన్నిహితం కావడం జరిగింది. ఆయన ఉపన్యాసాలు వినడం, యథాతథంగా రికార్డు చేయడం జరిగింది. అప్పుడు నా వయస్సు 19 సంవత్సరాలు. వయసులో మామధ్య చాలా తేడా ఉంది. మేం కలిసినప్పుడు అది ఎన్నడూ అడ్డు రాలేదు. దానికి ఆయనే కారణం. ఆయనలోని సహృదయ సాదర దృక్పథమే ఇందుకు కారణం.
 
ఆయన స్థల, కాల, ప్రాంతీయ విభేదాల్లేకుండా నిత్యం వర్తమానంలో జీవించే వ్యక్తి. ఆయన కళ్ళ వెనుక కన్నీటి జలపాతాలున్నాయి. దురాగతాలపై కన్నీటి కాండవ జ్వాలలున్నాయి. అన్నింటినీ తనలోనే ఇముడ్చుకొని, ‘నా గొడవ’గా చెప్పుకున్నాడు. ఎన్నిసార్లు, ఎంతగా చెప్పినా అది ‘అతని గొడవ’ కాదని, ‘లోకం గొడవ’ని అందరికీ తెలుసు. అదే ఆయన సృష్టించిన సరికొత్త కవితా సమయం.
 
కొన్నేళ్ళ తర్వాత, ఉద్యోగక్రమంలో నేను జాయింట్ సెక్రటరీ అయ్యాను. అప్పటికి కొంతకాలం క్రితం ప్రభుత్వం వారు మాజీ శాసనసభ్యులకు పెన్షన్ పద్ధతి ప్రవేశపెట్టారు. నా విధుల్లో భాగంగా, మాజీ సభ్యుడిగా కాళోజీకి నా సంతకంతో పెన్షన్ చెక్కులు పంపేవాడిని. ఆయన ఉన్నది రెండేళ్ళ కావడం వల్ల, పంపేది పెద్ద మొత్తమేమీ కాదు. అయినా, ఆ మాత్రమైనా, నా సంతకంతో వెంట వెంటనే పంపుతున్నందుకు సంతోషించేవాణ్ణి. కాళోజీ, నేనూ ఎక్కడ కలుసుకున్నా మా కుశల ప్రశ్నల్లో భాగంగా అడిగేవాన్ని, ‘పెన్షన్ చెక్ సక్రమంగా అందుతున్నదా?’ అని. ‘అందుతున్నది నగ్నమునీ,’ అనేవాడాయన నవ్వుతూ.
 
1957 నవంబరు నెలలో, నా మొదటి కవిత, గోరాశాస్త్రి గారి సంపాదకత్వాన వెలువడిన ‘తెలుగు స్వతంత్ర’ వారపత్రికలో అచ్చయింది. తర్వాత గోలకొండ పత్రిక, భారతి, కృష్ణాపత్రిక, ఆంధ్రప్రభ మొదలైన పత్రికలలో అచ్చయ్యాయి. దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు ప్రొడ్యూసర్‌గా ఉండగా,

‘ఆకాశవాణి’లో ప్రసారమయ్యాయి. ఏ కవికయినా ఇవి సంతోషం కలిగించేవే. అయితే, అంతకంటే ముఖ్యమైన విషయం మరొకటి ఉంది. ఆ రోజుల్లో హైదరాబాద్‌లో కవి సమ్మేళనాలు ముమ్మరంగా జరిగేవి. ప్రతిష్టాత్మకంగా జరిగేవి. వచన కవిత్వ ప్రాచుర్యం కోసం, శ్రోతకు నా ప్రయోగ పరిచయం కోసం రెండు ఉద్దేశాలూ మనసులో పెట్టుకుని నేను ఈ కవి సమ్మేళనాల్లో విరివిగా పాల్గొనేవాడిని.
 
ఇందులోనూ రెండు విధాలైన కవి సమ్మేళనాలు జరిగేవి. మొదటిది- పద్యం, గేయం. ఇవిగాక, అప్పుడప్పుడే పూతకిస్తున్న ఆధునిక వచన కవిత్వం. ఈ ప్రక్రియలన్నింటిలోనూ రాసే కవులు పాల్గొనేవారు. రెండవది, అరుదైనది- ద్విభాషా కవి సమ్మేళనాలు. ఇవి తెలుగు, ఉర్దూ రెండు భాషలకు చెందిన కవులు పాల్గొనే సమ్మేళనాలు. అంటే, ఏ భాషకు చెందిన కవులు, ఆ భాషలో తమ కవితలు చదివి వెళ్ళిపోవడం కాదు. ఇందులోని విశిష్టత ఏమిటంటే- ఈ రెండు భాషలూ, వాటి సంప్రదాయాలు, సాహితీ చరిత్రలు క్షుణ్ణంగా తెలిసినవారు దీనికి అధ్యక్షులుగా ఉంటారు. తెలుగు కవి తన కవిత చదవగానే, లేక వినిపించ గానే, అధ్యక్షుల వారు అప్పటికప్పుడు దీనిని ఉర్దూలోకి, మూలానికి అతి దగ్గరగా ఉండేట్లు అనువదిస్తారు. అలాగే ఉర్దూకవి తన కవిత వినిపించగానే, లేక గానం చెయ్యగానే దీని వెనువెంటనే తెలుగులోకి అనువదిస్తారు అధ్యక్షుల వారు. ఈ విధంగా తక్షణం అనువాదం చెయ్యడం అంత సులభమైన పని కాదు. ఈ పద్ధతి వల్ల కవి సమ్మేళనానికి హాజరైన వారంతా ప్రతి కవితనూ ఆస్వాదిస్తారు. అంతకంటే ముఖ్యంగా- రెండు భాషల కవులూ నేరుగా పరిచయమవుతారు. ఏ భాషలో కవితా ప్రయాణం ఏ విధంగా సాగుతున్నదో అర్థం చేసుకోవడానికి అవకాశమేర్పడుతుంది. దీనివల్ల ఆయా భాషల మధ్య ఉండే అడ్డుగోడ ఆ కాసేపయినా అదృశ్యమవుతుంది. అధ్యక్షులవారు భాషల మధ్య వంతెన వేస్తారు. ప్రజలను సన్నిహితం చేసే సాంస్కృతిక రాయబారి అవుతారు. ఇది అతి క్లిష్టమైన పని. ఇటువంటి ఒక ద్విభాషా కవి సమ్మేళనంలో నేను పాల్గొన్నాను. దీనికి కాళోజీ అధ్యక్షుడు. ఆయన అత్యంత జయప్రదంగా నిర్వహించాడు. అదొక ఉత్సాహభరితమైన కవుల పండుగ. ఆద్యంతం ఆలింగనల హేల. కారణం కాళోజీ నిర్వహణ.
 
ఎమర్జెన్సీకి ముందు రోజుల్లో, నేనింకా ప్రభుత్వ సర్వీసు నుండి డిస్మిస్ కాకముందు రోజుల్లో, మేం హైదరాబాదులోని మలక్‌పేట కాలనీలోని ప్రభుత్వ క్వార్టరు ఎం.ఎస్. 88లో ఉండేవాళ్ళం. అది మేడమీది భాగం. మా పక్క క్వార్టరు పై భాగంలో- ఎం.ఎస్. 90లో రాఘవేంద్రరావు కుటుంబం ఉండేది. మా కుటుంబానికి సన్నిహితులు, కాళోజీకి దగ్గరి బంధువులు. మా క్వార్టర్ల కిటికీలు ఎదురుబొదురుగా ఉండేవి. అంతకు క్రితంరోజు రాత్రి కాళోజీ వాళ్ళింట్లో దిగి ఉంటే, తెల్లవారిక ముందే, కోడి కూయకముందే, ‘నగ్నమునీ’ అని గట్టిగా పిలుపు వినిపించేది. ‘ఎవరబ్బా, ఇంత పొద్దున్నే,’ అని లేచి చూస్తే ఎదురుగా కిటికీ దగ్గర కాళోజీ, కాసేపు కిటీకీల దగ్గరే ఉండి సాహిత్యం, రాజకీయాలు అనేకం ముచ్చట్లు చెప్పుకునేవాళ్ళం. ముఖాలు కడుక్కున్నాక అక్కడనో, ఇక్కడనో టీ చప్పరిస్తూ సంభాషణ సాగించేటోళ్ళం. ఆయనక్కడికొచ్చి నప్పుడల్లా ఆ పిలుపు వినపడుతూనే ఉండేది. ఇందులో ఏముంది గుర్తు పెట్టుకోడానికి అని ఎవరికైనా అనిపించవచ్చు. ఇదింత ముఖ్యంగా చెప్పుకోవాల్నా అని కూడా మరికొంతమందికి అనిపించవచ్చు. ఆయన పిలుపులోని ఆత్మీయత, స్నేహంలోని స్వచ్ఛత చవిచూసిన వారికి ఇవి అపురూపాలే.
 
అటు ఆంధ్రలోగాని, ఇటు తెలంగాణలో కాని మొత్తం దేశంలోనే స్వాతంత్య్రం కోసం పోరాడిన యోధులనేకమంది ఉన్నారు. వారు త్యాగమూర్తులు. ధనమాన ప్రాణాలను తృణప్రాయంగా చూసినవారు. తమ కోసం, తమ కుటుంబాల కోసం, పదవుల కోసం, సంపద కోసం, భద్రజీవనం కోసం కలలో కూడా ఆలోచించనివారు. అది దేశప్రజల కోసం పరితపించిన త్యాగమయ సంస్కృతిలో విలసిల్లిన కాలం. ఈ మహోజ్వల కాలానికి చెందినవాడే కాళోజీ.
 
ఒకవైపు నైజాం రాచరిక నిరంకుశత్వానికి వ్యతిరేకంగాను, స్వాతంత్య్రం కోసం సత్యాగ్రహం, వందేమాతరం, ఆర్యసమాజ్, స్టేట్ కాంగ్రెస్ (తెలంగాణ) ఉద్యమాలు ఒక ఎత్తు, మరొక ముఖ్యమైనది- రజాకార్ల ఊచకోతకు వ్యతిరేకంగా నడిపిన ఉద్యమం. వీటిలో పాల్గనడం ఎంత కష్టమో- ఇవాళ ఊహకు అందని విషయాలు. ఆయన అంతటితో ఆగలేదు. తదనంతర కాలాన వీటిని పెట్టుబడిగా పెట్టుకుని రాజకీయ పదవుల కోసం వెంపర్లాడలేదు. పైనున్న వారంతా తనకు దగ్గరగా తెలిసినవారియినప్పటికీ ఎవరినీ, ‘ఇది నాకు ఇప్పించమని’ యాచించలేదు. పైగా- పౌరహక్కుల కోసం రాజకీయ, సామాజిక న్యాయం కోసం, శాంతి కోసం కృషి చేస్తూ ప్రయాణం సాగించిన ఘనుడు మన కాళోజీ.
 
స్వాతంత్య్రానంతరం మొదటితరం పాలకుల వరకు ప్రభుత్వం, యంత్రాంగంతో పట్టాల మీద సక్రమంగానే నడిచింది. ఆ తర్వాతి తరం నుండే పట్టాలు తప్పింది. అవినీతి ఇసుకలో కూరుకుపోవడం ప్రారంభమైంది. ఇది కూడా పట్టాల మీద ప్రయాణమేనని నమ్మించడానికి అనేక సంక్షేమ జేబు స్కీములు ప్రవేశపెట్టారు. పెడుతున్నారు. సహజంగానే అవి స్కాములుగా బయటపడుతున్నాయి. తమ కోసం, తమ పిల్లల, మనవల, మునిమనవల కోసం దేశసంపదను దోచెయ్యడం కోసం అధికార పదవుల్లో కదురుకుని ప్రభుత్వాన్ని, అన్ని వ్యవస్థల్నీ తమ సొంత ఆస్తులుగా మలుచుకోవడంలో ప్రావీణ్యత సంపాదించారు. పెద్దలు సాధించి అప్పగించిన స్వాతంత్య్రాన్ని పణంగా పెట్టి, అందమైన లేబుల్స్ అతికించి, అప్పుల కోసం పాశ్చాత్య దేశాల చుట్టూ తిరుగుతూ, ఆత్మ గౌరవాన్ని మంటగలిపి, సామాన్యుడి నుండి మేధావుల వరకు అందర్నీ తరిమేసి, వలసలు పోయే స్థితి తీసుకురావడం జరిగింది. పాలనలో దేనినైనా ప్రజల వైపు నుండి గాక, అధికారం, ఎన్నికల వైపు నుండి చూసే ఒక ఆధిపత్య ‘సర్కారు సంస్కృతి’ తీసుకువచ్చి, ఈ నేలలో నాటి, అవినీతి నీళ్ళు పోసి పెంచడం జరుగుతోంది. అధికారంతో, ప్రచారంతో ఈ భువిలో దేనినైనా సాధించవచ్చు. తిమ్మిని బమ్మిని చేయవచ్చుననే గోబెల్స్ మంత్రం పఠిస్తూ పుట్టించినదే ఈ ‘సర్కారు సంస్కృతి.’ దీనికీ ప్రజలకీ ఏమి సంబంధం లేదు. దీనికీ దేశం పునరుజ్జీవనానికీ ఏమీ సంబంధం లేదు. ఇదొక ఆక్టోపస్. ముందుగా మూలాల్ని కొడుతుంది. దేశ దేహంలోని సున్నితమైన భాగాల్ని ఆక్రమిస్తుంది. తన అధీనంలో ఉంచుకుంటుంది. సాహిత్యం నుండి మానవత్వం వరకు అన్ని రంగాల్నీ చెనక్కుండా పట్టుకుని మొత్తం సమాజ జీవితాన్ని ఆవహించింది ఈ ఆధిపత్య విష సంస్కృతి. ప్రస్తుతం చాలామంది ఈ పడగనీడలో ఉన్నారు. ఈ ప్రజా వ్యతిరేక ‘సర్కారు సంస్కృతి’కి కాళోజీ లోబడలేదు. అక్కడే ఉంది అతని బలం. ఈ నల్ల ప్రభుత్వ నల్ల సంస్కృతి అతన్ని కాటువేయలేకపోయింది. అక్కడే ఉంది అతని నిబద్ధత, నిజాయితీ. పోరాట పటిమ.
 
కొందరికి ఆయన వరంగల్లువాడు. మరికొందరికి తెలంగాణ ప్రాంతీయవాది. నాకు మాత్రం వాడిగల తెలుగువాడు. మమతల పూసే మనసున్న మానవుడు.
 
నిజాయితీని కాలమేగః కాసేపు దాయగలదేమోగాని ఎన్నటికీ జయించలేదు.

కాళోజీకి జేజేలు.

కాళోజీ యాదిలో‘ నుండి, ప్రచురణ 2002
కాళోజీ ఫౌండేషన్, వరంగల్, హైదరాబాద్

ఒక్క అభిప్రాయం

  1. ravindra aitham 25 డిసంబర్ 2006 , 5:38 am

    కాళోజీ గారి గురించి చక్కగా వ్రాసారు.

Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)