- బాబ్ డిలాన్
( మంగళ వారం నవంబర్ 7 2006, న జరిగిన మధ్యంతర యెన్నికల్లో అమెరికన్ ప్రజానీకం పెద్ద సంఖ్యలో డెమోక్రాట్లనెన్నుకుని యుద్ధోన్మాది బుష్ కు గుణపాఠం చెప్పారు. 12 యేండ్ల తర్వాత వుభయ సభల్లో డెమోక్రాట్లకు తిరిగి పట్టు దొరికింది, అయితే బాగ్దాద్ లోని ఒక సామాన్య పౌరుడు మాత్రం ‘ డెమోక్రాట్లైతేంటి, రిపబ్లికన్లైతేంటి అమెరికా సామ్రాజ్యవాద విధానం ఏమీ మారదు – అంతా వొకటే ‘ అంటూ యీసడించుకున్నాడు.
ఏమనా అమెరికా ప్రజలు తమ యుద్ధ వ్యతిరేకతనీ, యుద్ధోన్మాది బుష్ పట్ల అసహ్యాన్నీ యీ యెన్నికల్లో స్పష్టంగా ప్రకటించారు. యెన్నికల పరాభవం నుండి ముఖం చెల్లడం కోసం బుష్, ఇరాక్ దురాక్రమణ సూత్రధారి, ప్రస్తుత రక్షణ మంత్రి రమ్సుఫెల్డ్ ని తొలగించి ఆ స్థానంలో మాజీ సి.ఐ.ఏ డైరెక్టర్ గేట్స్ ని నియమించాడు. గతంలో ఇరాన్ కాంట్రా సూత్రధారి, ఇరాన్ ఇరాక్ యుద్ధ వ్యూహకర్త అయిన గేట్సు నిర్వాకాల గురించి ప్రస్తావిస్తూ 1986 లో అతనికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన మెల్ గుడ్‌మేన్ తోనూ, గేట్స్ దుర్మార్గాలను పరిశోధించి వెలికితీసిన జర్నలిస్టు బాబ్ పేరీ తోనూ ‘డెమోక్రసీ నౌ’ లో ఇంటర్‌వ్యూ చేసిన ఏమీ గుడ్‌మేన్, మధ్యలో బాబ్ డిలాన్ రాసిన యీ పాటను ప్రసారం చేసింది)
యుద్ధోన్మాద పాలకుల్లారా! బాబ్ డిలాన్
రండి ఓ యుద్ధోన్మాద పాలకుల్లారా !
తుపాకులని తయారుచేసేది మీరు -
మృత్యువిమానాలని తయారుచేసేది మీరు -
భూతాల్లాంటి బాంబులు తయారు చేసేది మీరు -
గోడలవెనుక దాక్కుంటున్నరా
అందమైన ఆఫీసు డెస్కులవెనుక దాక్కుంటున్నరా
మీకు తెలుసో లేదో
నేను మీ ముసుగులని చీల్చి చూడగలను!
మీరిప్పటిదాకా ఏంచేసారు
విధ్వంసం చేయడానికి నిర్మించడం తప్ప -
అదేదో బొమ్మ అయినట్టు
నా ప్రపంచంతో ఆడుకుంటున్నరు
నా చేతిలో తుపాకిపెట్టి
నా కళ్ళనుండి దాక్కుంటరు -
బుల్లెట్ల పెనువేగానికి జడిసి
వెనుదిరిగి దూరంగా పారిపోతరు !
జూడాస్ లా నిరంతరం
చెప్తరు యెన్నో అబద్దాల్ని
చేస్తరు పచ్చి మోసాన్ని -
గెలువగలమంటూ ప్రపంచ యుధ్ధం
నమ్మమంటరు నన్ను -
చూసినట్టు మురికికాల్వలోని నీటిలోంచి
చూడగలను మీ కళ్ళలోంచి -
చూడగలను మీ కుత్సితపు మనసుల్లోకి !!
యితరులు పేల్చడం కోసం మీరు ట్రిగ్గర్ లాగి పెడతారు –
కుప్పలు కుప్పలుగా చావులు పెరుగుతుంటే
వినోదిస్తరు మీరేమో వెనుకకు వాలి -
నవయువకుల విగత దేహాల్నుండి
నెత్తురు ప్రవహిస్తూ మట్టిలో యింకిపోతుంటే
మీరు విలాసాల మేడల్లో దాక్కుంటారు!
చిన్నారులు యీ ప్రపంచంలోకి
అడుగుపెట్టడానికి కూడా బెదిరే
దుర్మార్గమైన భయాన్న్ని
విసురుతారు గాల్లోకి మీరు -
యింకా పుట్టని నా అనామక పాపని
భయపెట్టి బతికే
మీ నరాల్లో ప్రవహించేది రక్తమేనా!
మీ బతుకులే వృధా కాదా!!
మమ్మల్ని యెదిరించేందుకు నువ్వెంత –
తీసిపారేయొచ్చు నన్నో చిన పిల్లగాన్నని
యేమీ తెలియని అజ్ఞానినని -
చిన్నోణ్ణయినా మీకన్నా
నాకో పచ్చి నిజం తెలుసు !
మీ క్రూరమయిన దుర్మార్గాల్ని మాత్రం
క్షమించడేనాడూ ఆ జీసస్ !
నేను మిమ్మల్నో ప్రశ్ననడుగనా -
మీ సంపాదన అంత గొప్పదా
పెడుతుందనుకున్నరా క్షమాభిక్ష
చేతనవుతుందా దానికి మీ రక్ష !
గుర్తుంచుకోండి ఒక్క విషయం -
అప్పు చెల్లించమని అడుగుతూ
మృత్యువు మీ దగ్గరకు వచ్చినప్పుడు
కోల్పోయిన ఆత్మలని మళ్ళీ కొనడానికి
యెంతయినా సరిపోదు మీ డబ్బు !
మీరు చచ్చిపోవాలని కోరుకుంటున్నా -
అతి తొందరగా మీకు చావు రావాలని
యెంతగానో ఆశపడుతున్నా!
పాలిపోయిన ఒక మధ్యాహ్నం పూట
శ్మశానం దాకా నడుస్తా మీ శవపేటికల వెంట!
చూస్తా మృత్యు శయ్య మీదికి
మిమ్మల్ని దించుతుంటే -
నిలబడుతా మీ సమాధివద్ద
మీరు చచ్చి పోయిండ్రని ఖరారయ్యేదాక !!!
(బాబ్ డిలాన్ రాసిన మాస్టర్స్ ఆఫ్ వార్ కు స్వేచ్ఛానుసరణ)