- కాళోజీ

గుమ్మడిపూలు పూయగ బ్రతుకు
తంగెడి పసిడి చిందగ బ్రతుకు
గునుగు తురాయి కులుకగ బ్రతుకు
కట్ల నీలిమలు చిమ్మగ బ్రతుకు            || బతకమ్మా! బ్రతుకు … || 
అమ్మను మరవని సంతానము కని     || బతకమ్మా! బ్రతుకు … ||

పచ్చని పసరిక బయళ్ళ బ్రతుకు
పల్లెపట్టుల పంటల బ్రతుకు
పసుపుతోట మరియాదగ బ్రతుకు
పున్నమ వెన్నెల మాదిరి బ్రతుకు       || బతకమ్మా! బ్రతుకు … ||
 
మూడుముళ్ళ బిగియింతల పద్దుల
జంట బ్రతుకు తాహత్తుల హద్దుల
మమతల, మమతల పెంచెడి సుద్దుల
తీరుతీరు చవులూరెడి చద్దుల              || బతకమ్మా! బ్రతుకు … ||
 
పసుపు కుంకుమల వసతుల తేలుచు
పారాణిలో మారాణిగ పారుచు
ఆలమంద గొంతుల ‘అంబా’డుచు
దాంపత్యపు దివ్వెల వెలయించుచు       || బతకమ్మా! బ్రతుకు … ||
 
తండ్రుల తాతల జేయుచు మురియుచు
కొడుకుల తండ్రుల జేయుచు వెలయుచు
అమ్మల అవ్వల జేయుచు కాయుచు
బిడ్డల తల్లుల జేయుచు సాకుచు            || బతకమ్మా! బ్రతుకు … ||
 
నొసటి కుంకుమల తళుకుల నీనుచు
మంగళసూత్రము వలపుల పేనుచు
గాజుల గలగల నవ్వుల తేలుచు
కాలిమట్టియల పలుకుల కులకుచు        || బతకమ్మా! బ్రతుకు … ||
మక్కలరాసుల పసిడిగ బ్రతుకు
గేగుల కండల జవగా బ్రతుకు
‘సీతాఫల’ కనుగ్రుడ్డుగ బ్రతుకు
పాలుపట్టి గింజూరగ బ్రతుకు                     || బతకమ్మా! బ్రతుకు … ||
 
నల్లపూసల నడుమనె బ్రతుకు
పాలతిన్నియల దాపునె బ్రతుకు
నొసటి మధ్య మందారమ! బ్రతుకు
కాళ్ళపసుపు పారాణీ! బ్రతుకు                   || బతకమ్మా! బ్రతుకు … ||
 
పాటపాడి పాటల పాడిస్తూ
ఆటలాడి ఆటల ఆడిస్తూ
జంటగూడి జంటల కూరుస్తూ
బతుకు బ్రతికి బతుకుల బ్రతికిస్తూ             || బతకమ్మా! బ్రతుకు … ||

చెలిమి చెలమలు ఊరేదాకా
చెలిమి కలుములు నిలిచేదాకా
చెలిమి వెన్నెలలు కాసేదాకా
చెలిమి రాగములు ఒలికేదాకా                    || బతకమ్మా! బ్రతుకు … ||
 
మన్నూమిన్నూ ఉండే దాకా
సూర్యుడు చంద్రుడు వెలిసే దాకా
చుక్కలు మింటిలో కులికే దాకా
కాలచక్రము తిరిగేదాకా                              || బతకమ్మా! బ్రతుకు … ||
 
అమ్మను మరవని సంతానము కని            || బతకమ్మా! బ్రతుకు … ||

 

కాళోజి నా గొడవ కవితలు, 2001 సెప్టెంబర్‌లో నుండి
కాళోజీ ఫౌండేషన్, వరంగల్, హైదరాబాద్

Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)