స్త్రీల సమస్యల పట్ల స్పందించడం ఇంకా అరుదైన మన ప్రవాస సమాజంలో, వారి పట్ల సానుభూతితో రచనలు చేసే ఆరి సీతారామయ్యది ప్రత్యేక ముద్ర. ‘ స్త్రీ పురుషులు సమానులుగా, పరస్పర గౌరవంతో బతగ్గలగటమే ప్రత్యామ్నాయం’ మనేది ఆయన శైలి. జ్ఞాపకాలూ, సాంప్రదాయప్రీతి, తెలుగుతనం దాటి జనజీవనానికి అద్దం పట్టే సాహిత్యం రావాలి అనే సీతారామయ్య గారితో ‘ప్రజాకళ’ ఇంటర్‌వ్యూ.
మీ బాల్యం, నేపథ్యం, కుటుంబం, జీవనయాత్రల గురించి చెప్పండి?
పుట్టి పెరిగింది ప్రకాశం జిల్లాలో తిమ్మనపాలెం అనే చిన్న గ్రామంలో. మాది వ్యవసాయ కుటుంబం. ఒంగోలూ చీరాలల్లో కాలేజీ చదువు, లక్నోలో ఎమ్.ఎస్.సీ, పి.హెచ్.డీ లూ, తర్వాత జర్మనీ ఫ్రాన్సుల్లో పోస్ట్ డాక్టరల్ ఫెలోగా పనిచెయ్యటం. 76లో అమెరికా వచ్చాను. 79లో తిరిగి ఇండియా వెళ్ళి ఉస్మానియా యూనివర్సిటీలో ఒక సంవత్సరం పనిచేశాను. 1980లో మళ్ళా అమెరికా వచ్చాను. అప్పటినుంచీ ఇక్కడే ఉన్నాను. ప్రస్తుతం మిషిగన్‌లో ఓక్లాండ్ యూనివర్సిటీ eye research institute లో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాను. మా కుటుంబంలో నేనూ, ఉషా గారూ, ఇద్దరు అమ్మాయిలూ. ఒకమ్మాయి కాలిఫోర్నియాలో ఉంటుంది, ఒకమ్మాయి వర్జినియాలో.
మీ రచనలకి స్ఫూర్తినిచ్చిన, మిమ్మల్ని ప్రభావితం చేసిన అంశాలు ఏమిటి? భారతదేశంలో కంటే కూడా,అమెరికాలోనే ఎక్కువ రచనలు చేశారు. అంటే, ఇక్కడి జీవితం మిమ్మల్ని రచయితగా మార్చిందా ? ఇంత వరకు చేసిన రచనల వివరాలు?
ఇండియాలో ఉండగా నేను రాయలేదు. 74లో ఇండియా నుంచి జర్మనీ పోవటంతో తెలుగు సాహిత్యం చదవటం కూడా వీలుకాలేదు. అమెరికా తిరిగొచ్చి ఫిలడెల్ఫియాలో ఉంటున్న రోజుల్లో ఆ ప్రాంతం తెలుగు సంఘం తరఫున ఒక చిన్న news letter వీలైనంత వరకూ తెలుగులో ప్రచురించేవాళ్ళం. తెలుగులో రాయటం దాంతోనే మొదలయింది.
కథలు రాయటం మొదలుపెట్టింది 1997లో. మేము ఫిలడెల్ఫియా లో ఉంటున్న రోజుల్లో (1980-1992) ఉషా గారూ ఆమె మిత్రులు కొందరూ కలిసి ‘సేవా’ (Service and Education for Women Against Abuse) పేరుతో ఒక సంస్థను ప్రారంభించారు. దాని ద్వారా ఇండియా, పాకిస్థాన్, బంగ్లాదేశ్ ల నుంచి వచ్చి,ఇక్కడ ఉంటూ, కుటుంబ హింసకు గురి అయిన స్త్రీలకెంతో మందికి సహాయం చేశారు. అలాగే డిట్రాయట్ వచ్చింతర్వాత కూడా ఉషా గారూ నేనూ ఇక్కడి సంస్థల్తో కలిసి పనిచేశాము. అందువల్ల నాకు చాలామంది స్త్రీల కథలూ, వాళ్ళు పడిన కష్టాలూ, వాటినుండి బయట పడటానికి వారు చేసిన ప్రయత్నాలూ, తర్వాత వాళ్ళ జీవితాల్లో వచ్చిన మార్పులూ - వీటి గురించి తెలుసుకోవటం వీలయ్యింది. వీళ్ళలో చాలా మందికి తమ అనుభవాల గురించి ఇతరులకు తెలియజెయ్యాలనే కోరిక బలంగా ఉండేది.వీరే కథలు రాయటానికి నాకు స్ఫూర్తినిచ్చిన వ్యక్తులు. అయితే వ్యక్తుల పేర్లూ, ఊళ్ళూ, సంఘటనలూ మార్చుతూ ఎవ్వరి confidentiality కీ లోపం రాకుండా కథలు రాశాను. 2005వ సంవత్సరంలో డెట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ వాళ్ళు “గట్టు తెగిన చెరువు” పేరుతో నా కధాసంకలనాన్ని ప్రచురించారు.
రచనలు చేయడం మీ అభిరుచా , జీవన విధానమా, లేక భావోద్వేగమా? ఈ ప్రక్రియతో సంబంధం లేకుండా ఉండగలరా?
ఏదో ఒక సంఘటన జరిగినప్పుడో (మళ్ళా నాలుగేళ్ళకి), ఒక వ్యక్తిగురించి తెలిసినప్పుడో (కొత్త ఊపిరి), ఓ వ్యక్తి పరిచయం అయినప్పుడో (సుచిత్రాచంద్ర) ఒక కథ రాయాలనే బలమైన కాంక్ష కలుగుతుంది. కానీ ఒక్కొకసారి రాయాలని ఉన్నా సరైన కథనం చెయ్యలేక పోవటం వల్లో, పాత్ర చిత్రణ సరిగ్గా కుదరక పోవటం వల్లో కథ రాయటం మానేసిన సందర్భాలు ఉన్నాయి. కథలు రాయకుండా ఉండగలను, కానీ, ఒక కథ రాయాలని మొదలుపెట్టింతర్వాత దాన్ని రాయలేకపోయినప్పుడు ఓ వెలితి మిగిలిపోతుంది.
మీ కథావస్తువు, శిల్పాలవెనుక ఉండే ఆలోచనా స్రవంతిని వివరిస్తారా?
నా కథల్లో వస్తువులు ముఖ్యంగా రెండు రకాలు - స్వతంత్రులుగా బతకటానికి ప్రయత్నిస్తున్న స్త్రీల జీవితానుభవాలు; రాజకీయంగా నా అనుభవాలూ, పరిశీలనలూ. శిల్పం గురించి నేను పెద్దగా ఆలోచించను. వీలైనంతవరకు పాత్రలను సహజంగా చిత్రించటానికి ప్రయత్నిస్తాను.
మీ రచనల ద్వారా ఏదైనా ప్రయోజనం ఉందనుకుంటున్నారా? రచయితగా ఏం ఆశిస్తున్నారు?
ప్రతి రచనకూ ఏదో ప్రయోజనం ఉంటుందని నా నమ్మకం. నా కథలు చదివినవారిని కొంచెం ఆలోచించేట్లు చెయ్యగలిగితే సంతోషిస్తాను. ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకు నా కథలు కొంచెం ధైర్యం ఇవ్వగలిగితే చాలు.
‘’గట్టు తెగిన చెరువు” లో ఒక యధార్దగాధను చిత్రించారు. ఈ కధలోని శారద సమస్య ఒక వ్యక్తిది కాదు ఒక వ్యవస్థది మరి ఇలాంటి సమస్యలకు పరిష్కారం ఏమిటి, ప్రత్యామ్నాయం ఏమిటి?
సమస్యలకు పరిష్కారాలు చూపించటం రచయితల బాధ్యత కాదని నా అభిప్రాయం. అసలు సమస్య ఏంటో, దాని మూలకారణాలేంటో ఆలోచించగలిగితే ఎవరి సమస్యలను వారు పరిష్కరించుకోగలరని అనుకుంటాను. గట్టు తెగిన చెరువు కథలో వస్తువు కుటుంబ హింస. నూటికి దాదాపు 25 మంది స్త్రీలు ఏదోవిధమైన కుటుంబ హింసకు గురౌతున్నారు. కారణాలు రకరకాలు. కానీ, భార్యను కొట్టో, తిట్టో, బలవంతం చేసో తన మార్గాన నడిపించే హక్కు తనకుందని భర్తా, అతను భర్త కాబట్టీ, తను అతనిమీద అధారపడి ఉంది కాబట్టీ, కొట్టే అధికారం అతనికి ఉందని అనుకునే భార్యా - వీళ్ళున్నంతకాలం అక్కడక్కడా చెరువు గట్లు తెగుతూనే ఉంటాయి. “భార్యా భర్తలు” లేకుండా పోయి, స్త్రీ పురుషులు సమానులుగా, పరస్పర గౌరవంతో బతగ్గలగటమే ప్రత్యామ్నాయం.
మీ రచనల్లో స్త్రీ ఎందుకు ముఖ్య భూమిక అవుతోంది? ఈమె, తెలుగుదేశ స్త్రీ వాద కథలోని స్త్రీకి ఏ విధంగా భిన్నం?
చదువుకోవాలని ఆశగా ఉన్న అమ్మాయిలకు పెళ్ళిళ్ళు చెయ్యటం, ఇంటికి వచ్చిన కోడలిని తల్లిదండ్రుల దగ్గర నుంచి డబ్బు తీసుకురమ్మని వేధించటం నేను ప్రత్యక్షంగా చూశాను. ఇలాంటి సమస్యలకు ముఖ్య కారణం పెళ్ళి. ఆడవాళ్ళకు మన సమాజంలో పెళ్ళికి మించిన గమ్యం లేదు. ఇది మారాలి. పురుషుడి మీద ఆధార పడకుండా, ఆర్థికంగా స్వతంత్రురాలైన స్త్రీ తనకు నచ్చిన పురుషుడితో కలిసి బతికితే ప్రస్తుతం ఉన్న జాడ్యాలు చాలా వరకు పోతాయని నా నమ్మకం. అలాంటి స్త్రీ పాత్రలతో కథలు రాయటం నాకిష్టం. కథల్లో నేపథ్యం వేరు కావచ్చుగాని, నా కథలకూ తెలుగు దేశ స్త్రీవాద కథలకూ పాత్రల్లో పెద్ద తేడా లేదేమో.
అమెరికాలోని తెలుగు సమాజంలో కుటుంబహింస ప్రధాన సమస్యే అయినప్పటికీ, చెప్పుకోతగ్గ స్థాయిలో స్త్రీ వాద రచనలు ఇక్కడి నుంచి రాలేదు. దీనికి కారణాలేమంటారు?
కల్పనా రెంటాల గారు కూడా ఈ విషయం గురించి ఒక సారి మాట్లాడారు. కారణాలు చెప్పటం కష్టం. స్త్రీవాదులైనా కాకపోయినా ప్రస్తుతం ఇక్కడ తెలుగులో కథలు రాస్తున్న స్త్రీలు చాలా తక్కువ మంది. వారి సంఖ్య పెరిగితేగాని వస్తువైవిధ్యం పెరగదేమో. అదీగాక హింసకు గురౌతున్న స్త్రీలకు తమ సమస్యల గురించి రాయటం సులభం కాదు. రాసేదంతా తమ గురించే అని పాఠకులు అనుకుంటారేమోననే భయం ఉంటుంది. అమెరికా రావటం అంటే తల్లిదండ్రులు ఎంతో ఖర్చుపెట్టి పెళ్ళి చేసి పంపించి ఉంటారు. వాళ్ళు నిరాశ పడకుండా ఉండాలంటే తను సమస్యలను దాచి ఉంచాలి. తన సమస్యలకు కారణం తనేనేమో అన్న అనుమానం కుటుంబ హింసకు గురౌతున్న ప్రతి స్త్రీకీ ఉంటుంది. బయటికి ఎవ్వరికైనా చెప్పటానికి సిగ్గుపడుతుంది. ఇలాంటి నేపథ్యం లో ఇక్కడ స్త్రీవాద కథలు రావటం అంత సులభం కాదు.
“డయస్పోర” సాహిత్యం పట్ల మీ అభిప్రాయం? తెలుగులో ఈ సాహిత్యపు గమనం ఎటు వైపు మళ్లితే ఇంకా మంచి రచనలు వొచ్చే అవకాశం ఉంది? ఏ ఏ కథా వస్తువులను స్వీకరించవచ్చు?
దాదాపు పది సంవత్సరాలుగా ఇక్కడి వారు రాస్తున్న కథలు చదువుతున్నాను. చాలామంది మంచి కథలు రాస్తున్నారు. అయితే ఇక్కడి వారి కథల్లో జ్ఞాపకాలూ, సాంప్రదాయప్రీతి, ఇక్కడి జీవన విధానానికి వ్యతిరేకతా ముఖ్య వస్తువులుగా కనబడతాయి. ఇంకా కొన్నాళ్ళు పోతేగానివస్తువైవిధ్యం పెరగదేమో.
ఆఫీసులో ఉన్నంతసేపూ అమెరికాలో ఉంటూ, సాయంత్రం వారాంతాల్లో ఇండియాలో ఉంటారు మనవాళ్ళు అన్నారెవరో. అది చాలా వరకు నిజం. ఇక్కడ ఎన్ని సంవత్సరాలనుంచి ఉంటున్నా బయటి ప్రపంచంతో సంబంధం లేని వారు చాలా మంది ఉన్నారు. ఇక్కడి వారితో స్నేహసంబంధాలు ఏర్పరుచుకున్నవారూ, వారి జీవన విధానాన్నీ పైపైన కాకుండా లోతుగా పరిశీలించిన వారూ కథలు రాస్తే బాగుంటుంది.
“డయస్పోరిక్” కోణంలో తెలుగు కథ, దాని గమనం, సమకాలీన తెలుగు సాహిత్యంతో పోల్చినపుడు అగుపించే తేడాలను చెప్పండి?
సమకాలీన తెలుగు కథలు ఎక్కువగా చదివే అవకాశం నాకు లేదు. చదివినంతలో ఈ కథల్లో, గ్రామాల్లో వస్తున్న మార్పులూ, మధ్యతరగతి జీవితాలూ ఎక్కువగా కనిపిస్తాయి. ఇక్కడి వారు రాస్తున్న కథల్లో జ్ఞాపకాలూ, తెలుగుదేశంలో ఉన్న బంధువులతో ఇక్కడివారి సంబంధాలూ, ఇక్కడకొచ్చినవారి జీవితాల్లో మార్పులూ - ఇవీ ముఖ్యంగా కథా వస్తువులు. ఇండియా నుంచి వచ్చిన మొదటితరం వారికి జ్ఞాపకాలు ముఖ్యం కావటంలో విశేషం లేదు. కానీ, ముందు ముందు మంచి కథలు రావాలంటే జ్ఞాపకాల వలయం నుంచి బయటపడాలి. తెలుగుతనాన్నీ, సాంప్రదాయ ప్రీతినీ దాటి రావాలి.
‘ఉద్యమ’ నేపధ్యాలతో సాగే సాహిత్యానికి అమెరికాలో బలమైన ‘వాయిస్’ ఏర్పడే ఆస్కారం ఉందా? లేదా ఇటువంటి వాతావరణం తెలుగు నేలకే సరిపడుతుందా?
అమెరికా సాహిత్యం వ్యాపార సాహిత్యం. ప్రచురణ సంస్థలు పాము చావకుండా కర్ర విరక్కుండా ఉండేకథలను మాత్రమే ప్రచురించటానికి ఇష్టపడతారని అనిపిస్తుంది. Best American Short Stories 2005 సంకలనం చదివాను. దాంట్లో కథలకీ ఇక్కడి జన జీవనానికీ ఏంటీ సంబంధం అనిపించింది. దేశం అంతా మూడు సంవత్సరాలుగా ఇరాక్ యుద్ధం గురించి చర్చిస్తుంటే, దాని మీద ఒక్క కథ కూడా లేదు ఈ సంకలనంలో. అంటే ఎవ్వరూ అలాంటి కథలు రాయటం లేదా? లేక వాటిని ఎవ్వరూ ప్రచురించరా? రెండు మూడు సంవత్సరాల క్రితం ప్రెసిడెంట్ గారి శ్రీమతి వైట్ హౌస్ లో ఒక poetry reading ఏర్పాటు చెయ్యాలని నిర్ణయించింది. కానీ, దానికి ఆహ్వానించిన కవుల్లో చాలా మంది యుద్ధవ్యతిరేక కవితలు చదువుతారని తెలిసింతర్వాత ఆ ప్రోగ్రాం రద్దు చేసిందామె. దీన్నిబట్టి నాకనిపిస్తుందేమిటంటే ప్రస్తుత సమస్యల గురించి కథలు రాసే వారు ఉండేవుంటారు. వారి కథలు బయటకు రావటం లేదు. అంతే. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ దేశంలో మట్టి మనిషి, అంటరాని వసంతం లాంటి రచనలు వచ్చే అవకాశమే లేదు. ఇక్కడి సాహిత్యం కంటే సమకాలీన తెలుగు సాహిత్యమే ఆరోగ్యంగా ఉందని నా అభిప్రాయం. అంటే అక్కడ ఇబ్బందులు లేవని కాదు. కథనం, పాత్రచిత్రణలకంటే ఏదో చెప్పాలనే తాపత్రయం ఎక్కువ సమకాలీన తెలుగు కథలో. కథ రాసింతర్వాత దాన్ని నలుగురు మిత్రులకిచ్చి, వారి అభిప్రాయలను సేకరించి, వాటికనుగుణంగా కథలో మార్పులు చేర్పులు చేసి ఆ తర్వాతే ఏదో పత్రికకు పంపించే అలవాటు మన రచయితలకు ఇంకా అలవడలేదు. ఇది నా గొడవ గాని మీ ప్రశ్నకు సమాధానం కాదు.
తెలుగు సాహిత్యాన్ని అంతర్జాతీయంగా తీసుకువెళ్లే ప్రక్రియ ప్రారంభం అయింది కదా! ఈ ప్రక్రియని ఎలా తీసుకుపోగలిగితే బాగుంటుంది. ముఖ్యంగా అనువాదాలకి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి ?
నేను శరత్ సాహిత్యం చదివాను చిన్నప్పుడు. కానీ, కాలేజీకెళ్ళిందాకా శరత్ తెలుగువాడుకాదని నాకు తెలియదు. దానికి ముఖ్య కారణం నేను చదివిన శరత్ నవలలు తెలుగు నవలల్లా ఉండటం. తెలుగు సాహిత్యానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావాలంటే అలాంటి మంచి అనువాదాలు రావాలి. ఇంగ్లీషు మాతృభాష అయిన వారు అనువాదాలు చేస్తే బాగుంటుంది. అమెరికాలో ఉంటున్న రెండవ తరం తెలుగువారుగనక అనువాదాలు చేసేటట్లయితే మంచి అనువాదాలు వచ్చే అవకాశం ఉంది. వీరు ఇంగ్లీషు సులభంగా రాయగలరు. భాష మెళుకువలు వీరికి బాగా తెలుస్తాయి. ఇక రెండవతరం వారిని ఎలా ప్రోత్సహించాలో, ప్రస్తుత వాతావరణంలో అది సాధ్యమో కాదో నేను చెప్పలేను.
డయాస్పోరా సాహిత్యం అనగానే కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అమెరికాయే కాదు. నాలాంటి వాళ్ళు మూడు దశాబ్దాలకు పైగా బొంబాయిలో ఉంటున్నారు. ఉద్యోగ, వృత్తి రీత్యా ఎక్కడున్నప్పటికీ అక్కడి సిస్టంలో మెలుగుతూ మెళుకువలు నేర్చుకోవడం వరకే చాలామంది తెలుగువారు పరిమితం అవుతున్నారు. ఇక్కడైనా అంతే. అందుకే జ్ఞాపకాలూ, సంప్రదాయాలంటే మోజు పెరుగుతుందేమో. ఉద్యోగాలు చెయ్యడానికీ, కార్లు నడపడానికీ తెలుగుతనం అవసరం లేదు. కుటుంబ సభ్యులతో మాట్లాడ్డం, టీవీలో తెలుగు చానల్స్ చూడ్డం, తెలుగు పుస్తకాలు చదవడం మినహా తక్కినవన్నీ ప్రవాస జీవితాలు గడుపుతున్నవారందరికీ ఒకటే కదా. స్వదేశపు సంస్కారం గురించి కలలు కనే రుమేనియన్లూ, మెక్సికన్లూ అమెరికాలో కనబడుతున్నారు.
బొంబాయిలో హిందీ ప్రోగ్రాములు చూసే హిందీ భాషేతరులూ, అమెరికాలో ఇంగ్లీషు ప్రోగ్రాములు చూసే విదేశీయులూ ఒకే రకంగా అనిపిస్తారు.
స్థానిక ప్రభావం ప్రజల సంస్కారం మీద ఎలా పడుతుందో వర్ణించాలంటే కథల్లో కొంత నోస్టాల్జియా తప్పదేమో. ఎటొచ్చీ అమెరికాలో ఉంటూ తెలుగు మహిళలు పడుతున్న బాధలవంటివి మంచి కథావస్తువులే అవుతాయి. ఇంగ్లండ్ వంటి దేశాల్లో పంజాబీ, ముస్లిం స్త్రీలు వివాహం తరవాత పడుతున్న బాధలు వార్తల్లో కెక్కుతున్నాయి. అలాగే ఉద్యోగరంగంలో మనవాళ్ళకు జాతి వివక్షవంటిది ఎదురైతే అది కూడా కథా వస్తువే కాగలదు. దీని గురించి రచయిత అభిప్రాయం చెపితే బావుంటుంది.
ఆరి సీతారామయ్య గారి సుచిత్రచంద్ర చదివి చాలా సంతోషించా.అలాంటి పరిస్థితులలో ఉన్న ఓజంట కు పంపిస్తే చాలా ఇన్ స్ప యిర్ అయ్యారు.ప్రజాకళ ద్వారా వారి పరిచయం కావడం ఆనందం గా ఉంది.‘’గట్టు తెగిన చెరువు” ఎక్కడ దొరుకుతుంది?
ప్రజాకళ విజయవంతంగా పదికాలాలు నడవాలని మనసారా కోరుకొంటున్నాను
రోహిణీప్రసాద్ గారూ, మీరన్నది నిజమే. జాతి వివక్షానుభవాల ఆధారంగా కూడా కథలు రావాలి.
రాజేంద్ర ప్రసాద్ గారూ, “గట్టు తెగిన చెరువు” ఇండియాలో నవోదయా వారి దగ్గర దొరుకుతుంది.
ప్రజాకళ ఎడిటరు గారికి
నమస్కారము.ప్రజాకల పత్రిక చాల బావుంటొంది. మీరు ప్రచురించిన ఆరి సీతారామయ్య గారి ఇంటర్వ్యూ బావుంది. సీతారామయ్య గారు చాల మంచి కధలు రాసారు.చక్కటి ఇంటర్వ్యూ ప్రచురించిన మీకు ధన్యవాదాలు.
సత్యవతి కొండవీటి.
అమెరికా తెలుగు రచయితలు కథలకే పరిమితం ఎందుకు కావాలి? అమెరికా, లేదా వెరే దెశాల యాత్రాస్మృతులు ద్వారా అక్కడి సామాజిక జీవనం గురించి చక్కటి విశ్లేషణ చేసే అవకాశం ఉంది. కథాశిల్పంలో ఇమడలేని విషయాలను ఎంతో సౌకర్యంగా travelogues లో చెప్పవచ్చు.
ఆరి సీతారామయ్య గారి ఇంటర్వ్యూలో చాలా విప్లవాత్మ భావాలున్నాయి. వాటిలో ముఖ్యంగా స్త్రీ జీవితం పట్ల వారు వ్యక్తం చేసిన అభిప్రాయాలు. ఇక, ఇతరదేశాల్లో జీవిస్తూ కూడా అక్కడి జీవితాలను చాలా మంది తమ రచనల్లో చెప్పలేకపోవడం, దాని వెనుకున్న రాజ్యాధికార నియంత్రణ ప్రభావం వంటివాటిని వివరించగలిగారు. బహుశా … ఇతర దేశాల్లో జీవించే వారు తరువాత, అంటే ఆ యా దే్శాల నుండి వచ్చేసిన తరువాతనే మంచి రచనలు చేయగలరేమో అనిపిస్తుంది. అయితే, అందరూ అలాగే ఉండరనీ కొంతమంది కథలను బట్టి చెప్పవచ్చు. మంచి ఇంటర్వ్యూని అందించారు.
దెఅర సీతరామయ్య గారు,
నెను గుంతురు జిల
మఒంచి బావాలు కల వ్యక్తి రచఇత వాసవిక వాది హిపొక్రసి లెకుందా స్పష్త్తతతొ విషయాలని విష్లెషిఒచారు.అవగాహన,లొతు,బాష,అని ఉనాఇ.