- ఏరియల్ డార్ఫ్‌మేన్

నా కొడుకు
పోయినేడాది
మే 8 నుండీ
కనబడుత లేడు.

యిదిగో
యిప్పుడే పంపిస్తం
యేవో రొటీన్ ప్రశ్నలడిగి …
అంటూ తీసుకపోయిన్రు

లైసెన్సు ప్లేటు లేని
ఆ కారు వెళ్ళిపోయినంక
మాకు మల్ల వాడి గురించేమి తెల్వలేదు.

కానీ యిప్పుడు
పరిస్థితి మారిపోయింది.
ఐదు నెల్ల తర్వాత
బయటికొచ్చిన
ఒక కామ్రేడు తోటి తెలిసింది
వాడిని విల్లా గ్రిమాల్డి లో
చిత్రహింసలు పెడుతుండ్రని,

సెప్టెంబర్ చివర్లో
గ్రిమాల్డిల ఎర్ర యింట్లో
వాడిని ప్రశ్నిస్తుండ్రని.

 

వాడి గొంతునీ ,
బాధతో వాడు పెట్టిన కేకల్నీ
గుర్తు పట్టినమని
చెప్పిన్రు.

యెవరైనా నాకు
 నిజంగ  చెప్పుండ్రి …
యేమి  రోజులివి
యేమి ప్రపంచమిది
యేమి దేశమిది?

నేనొక్కటే అడుగుతున్న …
వాళ్ళ కొడుకుని
చిత్రహింసలు
పెడుతుండ్రు
అని తెల్సి
యే అమ్మయినా
యే నాయనైనా
యెట్లా సంతోషంగ
వుంటరు ?

ఐదు నెల్లయినంక
వాడు యింక బతికే వున్నడు,
వాడు వచ్చే యేడాది కూడ
బతికే వుంటడనే ఆశ !
ఎనిమిది నెల్లయినంక
అట్లే చిత్రహింసలు
పెడుతున్రు కొడుకును ….
వాడు బహుశ  …
యేమో ….
బతుక గలుగుతడేమో?
బతికి వుంటడేమో?

(మూలం : ఏరియల్ డార్ఫ్ మేన్ – చీలీ దేశపు కవి)

ఒక్క అభిప్రాయం

  1. bollojubaba 16 మే 2008 , 1:22 pm

    రూపాలు వేరైనా, ప్రాంతాలు వేరైనా ప్రపంచమంతటా ఒకటే బాధ.

    బొల్లొజు బాబా

Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)