- వట్టికోట ఆళ్వార్‌స్వామి
తెల్లవారుజామున మొదలై అప్పుడే వర్షం వెలిసింది. ప్రజలు ఇండ్లలో నుండి బయటికి వచ్చి తమ దైనందిన కార్యకలాపాల్లో లీనమయ్యారు. రైతులు తమ పశువులను దొడ్లో నుండి బయటికి వదిలి ఎత్తయిన ప్రదేశంలో నీరు నిలువని చోట ఎండుగడ్డి వేశారు. బాటనబోయే ఒక ఆవు గడ్డిలో మూతి పెట్టబోయింది. తన హక్కును హరించబోతున్నదనే కోపంతో గడ్డి తింటున్న ఎద్దు ఆవును కుమ్మపోయింది.
చేతికర్రతో ఎండుగడ్డిని కిందు మీదు చేస్తున్న కోటయ్య పరీక్షగా తన ఎద్దును చూచాడు. అందరికీ సంబంధించినదిగా తలచబడే వస్తువును ఇతరులు హరించబోతుంటే అడ్డుపడి రక్షించుకొనే ఆలోచన తన ఎద్దుకు కలిగి నందుకు, మానవుని ప్రవృత్తి తన ఎద్దుకు అలవడినందుకు ఆనందిస్తూ కోటయ్య కొట్టములోకి వెళ్ళాడు.
కొట్టములో గుంజకు కట్టివేసి యున్న ఆవును దీనంగా చూస్తూ కోటయ్య కొడుకు కొమరయ్య నిలబడ్డాడు. ఆ ఆవు తొక్కుతున్న కాళ్ళ వద్ద పేడ తీయటానికి అతనికి మనసొప్పటం లేదు. ఆవుదూడ అంబే అని అరిచింది. కోటయ్య కండ్ల వెంట నీరు కారింది. తండ్రిని చూడగానే కండ్లలో నీరును ప్రయత్నపూర్వకంగా ఇంకించుకొన ప్రయత్నం చేస్తూ, “దీనికి చొప్ప వేయల్నా అయ్యా?'’ అన్నాడు. తండ్రి అనంగీకారసూచకంగా కొమరయ్యను చూచి కొట్టంలో ఈతనార కట్టను పరీక్షిస్తున్నాడు.
“ఇక రోజూ మేపంగద అయ్యా! ఇయాల ఒక రోజేగద! కడుపునిండ మేపుదాం,'’ కొమరయ్య సందిగ్ధ ధోరణిలో అన్నాడు.
“ఇయ్యాళ్ళంతా అది ఉండబోతుందా? ఇప్పుడో ఇంకాసేపటికో సుంకరి పుల్లయ్య రానేవస్తాడు,'’ అంటూ కోటయ్య విసుగుతో ఇంట్లోకి వెళ్ళాడు.
ఆవును రక్షించుకునే ఆలోచనేమన్నా ఉందేమో అడుగుదామని తండ్రి వెంబడే పోయాడు కొమరయ్య.
“ఇక మనకు ఆవు దక్కదా అయ్యా?'’ కొమరయ్య గంభీరంగా అడిగాడు.
“నీకెందుకురా ఈ తిప్పలంతా? కన్నబిడ్డనే ఇంకో అయ్యకిచ్చి రోజులు గడపటంలేదు? ఇక గొడ్డుకొచ్చింది,'’ అన్నాడు కోటయ్య.
“అంబే,'’ అని కొట్టంలో నుండి ఆవుదూడ అరుపు వినవచ్చింది. కొమరయ్య పెరట్లోకి వెళ్ళి, గోడ మీద నుంచి కొట్టంలో ఉన్న ఆవును, దూడను దీనంగా చూస్తూ నిలుచున్నాడు.
చేదబావి వద్ద పాచిపని చేసుకుంటున్న తల్లి వద్దకు వెళ్ళాడు. “ఆవును దొరకు ఇయ్యొద్దని నీవైనా చెప్పరాదే.'’
“నేనివ్వమంటేగా వద్దనటానికి?'’
“అదికాదే. ఆవును దొర తోలుకపోతాడన్నప్పటి నుంచి నాకేమీ తోచడంలేదు. దాని కింద కుర్రదున్నను ఇస్తే తీసికోడా దొర?'’
“అదంతా నాకేల తెలుసు నాయన. ఆ ఆవునే కావాల్నన్నాడట దొర. మీ అయ్యకు మాత్రం ఇయ్యాల్నని ఉందా? దొర ఆవును అడిగిన్నాడు మీ అయ్య సరిగా బువ్వ కూడా తినలే,'’ అంటూ పెరుగుకుండ గీకిన గోకును కొమరయ్య చేతిలో వేసింది తల్లి అన్నమ్మ.
“చూడు! బాయికాడికిపోయి వంగపిందెలు, ఆనగప్పిందెలు, మిరప కాయలు ఏమైనా ఎళ్తయేమో చూడు. నేను ఆవును దొరకాడ ఒప్పజెప్పి అటేవస్తా,'’ అంటూ కోటయ్య నెత్తిరుమాలు చుట్టాడు.
కొమరయ్య గొంగడి భుజాన వేసుకొని కర్రను అడ్డంగా మధ్యగా పట్టుకొని కొట్టంలోకి పొయ్యాడు. ఆవు ముఖాన్ని దిద్దాడు. గంగడోలును దువ్వాడు. వెన్ను మీది నుండి రెండువైపుల రెండు చేతులు వేసి కౌగలించుకున్నాడు. ఆవు ఆప్యాయంగా కొమరయ్య వైపు తలతిప్పి నాకాలని నాలుక నాడించింది. కొమరయ్య ఆవు వెన్నుపై తలవాల్చాడు. ఉబికి వచ్చిన కంటినీరు తుడుచుకొన్నాడు. ఆవుదూడ వద్దకు వెళ్ళాడు. దూడ చిన్న అరుపు పెట్టి, కుప్పిగంతులు వేయ సన్నద్ధమవుతున్నది. పలుపువల్ల ఏర్పడిన ప్రతిబంధకాన్ని కండ్ల ద్వారా కొమరయ్యకు చెప్తున్నట్టు తల ఎత్తి చూచింది. తిరిగి చిన్న అరుపు అరిచింది. కొమరయ్య దూడ పలుపు విప్పాడు. దూడ కుప్పిగంతులేస్తూ తల్లిని చేరి పాలు చీకసాగింది. దూలం మీద ఉన్న గడ్డి మోపును చేతికర్రతో కిందపడేశాడు కొమరయ్య. మోపును ఈడ్చుకపోయి ఆవు ముందర వేశాడు. ఆనందంతో ఉబ్బిపోయాడు. బొటబొట కన్నీటిచుక్కలు రాలాయి.
‘కడుపునిండా తాగు. అక్కడ నీ కడుపునిండ పాలు వదుల్తారో లేదో,’ మనసులో అనుకుంటూ బావి దోవ పట్టాడు. వెనుకకు తిరిగి తిరిగి చూసుకుంటూ కష్టంగా ఒక్కొక్క అడుగూ వేస్తున్నాడు.
పెద్దవాన పడినప్పుడల్లా ఊరి పక్క కాలువ నిండుగా పారుతుంది. దాన్ని దాటిపోవాల్సిన పిల్లవాండ్రకు ఇబ్బందిగా ఉంటుంది. కొమరయ్య కూడా ఎన్నోసార్లు భయంతో కాలువ దాటలేక ఇంటికి తిరిగి వచ్చాడు. కాని ఆరోజు కొమరయ్య ఒళ్ళు మరచి కాలువ దాటిపోతున్నాడు. కాలువ లోతుగాని, అతనికి ఎల్లప్పుడూ కలిగే భయంగాని స్ఫురించలేదు. ఆలోచనలోనే కాలువ దాటి కొంత దూరం పోయాక వెనుకకు తిరిగి కాలువ ప్రవాహాన్ని తీక్షణంగా చూశాడు. మొలబట్ట, గొంగడి చివర భాగం తడిసి నీళ్ళు కారుతున్నాయి. అంత లోతు ఇంత తొందరగా, సులభంగా ఎట్లా దాటాడో ఆలోచిస్తూ నిలబడిపోయాడు. పక్క చెలకలో గొడుక కింద మూయబడియున్న గొర్రెపిల్లల అరుపులతో తెప్పరిల్లి తిరిగి బావి దోవ బట్టాడు. బావిగడ్డ మీద గుడిసెలో కూర్చొని ఎక్కి ఎక్కి ఏడ్చాడు. ‘ఆవు బాగా పాలిచ్చేది. మంచి ఆవును వదులుకోవడానికి అయ్య ఎందుకు ఒప్పుకున్నాడో,’ అర్థంకాని తండ్రి అసహాయస్థితిపై కొమరయ్య ఆలోచించసాగాడు.
దూరం నుండి తండ్రి పిలుపు వినవచ్చింది. గుడిసెలో నుండి బయటికి వచ్చాడు. కోటయ్య వస్తూనే వంగతోటలో చెట్లను పరిశీలించాడు. “ఆనగపు తీగెను మళ్ళేసి చూడు. ఏమైన పిందెలు పడ్డయేమొ!'’ కొమరయ్య నుద్దేశించి అన్నాడు కోటయ్య.
కొమరయ్య తీగెలను మళ్ళేస్తూ, “ఎన్ని తెంపమంటవు,'’ బిగ్గరగా తండ్రిని అడిగాడు.
“తెంపకు. నేను వచ్చి చూస్తా,'’ అంటూ కోటయ్య తీగెవైపు వెళ్ళాడు. తీగెలకు అక్కడక్కడ ఉన్న పిందెలను చూస్తున్నాడు.
‘ఆవును ఎందుకిస్తున్నావయ్య,'’ బరువైన ధ్వనితో కొమరయ్య అడిగాడు.
కోటయ్య చకితుడై గంభీరంగా కొడుకును చూస్తూ- “కండ్లు ఉబ్బినయేం? ఏడ్చినావు? ఎందుకురా?'’ జాలిగా అడిగాడు.
“ఆవును ఇయ్యకయ్య,'’ కొమరయ్య బ్రతిమిలాడినట్లు అన్నాడు.
“వద్దంటే ఆగుతదా, పిచ్చోడా. నాకు మాత్రం ఇయ్యాలని ఉంది? దొర అడిగిండు, ఇస్తున్న అంతే.'’
“ఇవ్వనంటే దొర ఊరుకోడా?'’
“ఇయ్యన్ని నీకెందుకులే ఇప్పట్నుంచి. ఇంకో మంచి ఆవును తెచ్చుకుందాం.'’
“ఆ తెచ్చే ఆవును దొరకియ్యరాదే.'’
“ఇయ్యాల దొర అల్లుడొస్తున్నాడట. రేపు అల్లుడిని బిడ్డను సాగనంపుతారు. వాండ్లతో మన ఆవు కూడా పోతది. బిడ్డకు ఇస్తాడట, మన ఆవును,'’ అంటూ కోటయ్య ఆనగపు తీగెలకున్న పిందెలను కొడుక్కు చూపాడు. “ఆ పిందెలు తెంపి, మిరపతోట్లో ఇన్ని మిరపకాయలు తెంపుతుండు. బిరాన దొరకు పంపాలె. పొద్దెక్కుతున్నది,'’ అంటూ కోటయ్య వంగతోట వైపు వెళ్ళాడు.
కొమరయ్యకు గాయం మీద కారం చల్లినట్లయింది. ‘మా అయ్యకు పిచ్చి లేశినట్టుంది. అన్నీ దొరకే కావాల్నట,’ అన్నట్లు వింతగా తండ్రిని కొద్దిసేపు చూచాడు. ఆనగపు పిందెలు చేతపట్టుకొని మిరపతోట వైపు వెళ్ళాడు. కోటయ్య కూరగాయలు తీసికొని వెళ్ళిపోయాడు.
కొమరయ్య తిరిగి ఆలోచించ మొదలుపెట్టాడు. పక్కనే ఉన్న కంచె వైపు దిగాలుపడి చూస్తున్నాడు. ప్రతిరోజు ఆవును కంచెలో తోలి బావిగడ్డ మీద చూస్తూ నిలుచునే కొమరయ్యకు, ఆరోజు ఆవు లేకుండా కనబడ్తున్న కంచె జాలిగొలిపింది. ‘ఇక ఆవు ఈ కంచెకు రాదు. ఈ ఊళ్ళోనే ఉండదాయె,’ ఒక నిట్టూర్పు విడిచాడు. కంచెను దిగాలుపడి చూస్తున్నాడు.
కంచెలోని చెట్లలో ఎవరో పిల్లవాడు తిరుగుతున్నాడు. ఎవరా అని చూస్తున్నాడు కొమరయ్య. ఆ పిల్లవాడు మోదుగుచెట్లలో అటు యిటు తిరుగుతున్నాడు. చేతిలోని గై కత్తిని అటూ ఇటూ తిప్పుతున్నాడు. కొమరయ్య కంచెదోవ పట్టాడు. కంచెలోని పిల్లవాడు కొమరయ్య రాకను కనిపెట్టాడు. అంగీతో కండ్లు తుడుచుకున్నాడు. కొమరయ్య వస్తున్నవైపు చూస్తూ నిలుచున్నాడు.
కొమరయ్య దగ్గరికి వెళ్ళి, “ఓ నువ్వా? ఎన్నడులేంది ఇయ్యాల ఇదేంపని? ఇయ్యాల బడికిపోలే? పంతులు నిన్నొదిలిండా?'’ ప్రశ్నలు కురిపించాడు.
ఆ పిల్లవాడు నిరుత్తరుడై దిగాలుపడి కొమరయ్యను చూస్తున్నాడు.
“ఆకులు తెంపుత,'’ కొమరయ్య గై కత్తితో మండలు కోయసాగాడు. ఆ పిల్లవాడు ఉబికి వస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక బావురుమని ఏడ్చాడు. కొమరయ్య దిగాలుపడి గై కత్తి కింద పడవేసి, ఆదరంతో, “ఎందుకు ఏడుస్తున్నావ్,'’ అన్నాడు.
“మా అమ్మ నన్ను బళ్ళోంచి బలవంతంగా తీసికొచ్చి ఇక్కడికి పంపింది,'’ గద్గద స్వరంతో అన్నాడు ఆ పిల్లవాడు.
ఆ పిల్లవాడు వైష్ణవుడు. అతని పేరు కంఠీరవం. అతని గురించి బడిపిల్లల తల్లిదండ్రులంతా వింతగా చెప్పుకున్నారు. అక్షర స్వీకారం జరుగకుండానే అతని చదువు మొదలైంది. బడిపంతులు అతనంటే ప్రాణాల్ని వదిలేవాడు. కంఠీరవం బడిలో ఉన్నంతసేపు పంతులు ఒళ్ళోనో, కుర్చీ మీదనో, బడి లేనప్పుడు పంతులు ప్రక్కమీదనో, పంతులమ్మ ఒళ్ళోనో గడిపేవాడు. పంతులు కులానికి మహమ్మదీయుడైనా కంఠీరవం గ్రామ అగ్రజాతివాడైనా వారి పరస్పర ప్రేమ, వాత్సల్యాలు ఆ గ్రామంలో ఒక విశేషంగా చెప్పుకొనేవారు. ఇంట్లో తల్లిదండ్రులు కోప్పడినా, ఇష్టంకాని పని చెప్పినా చెప్పకుండా కంఠీరవం పంతులు వద్దకు చేరేవాడు.
ఆనాడు కంఠీరవం మామూలుగా బడికి వెళ్ళాడు. కాని పంతులు పరగ్రామం వెళ్ళినందున పిల్లలంతా ఆడుకొంటున్నారు.
కంఠీరవం తల్లి ఆండాళమ్మ బడికి వచ్చి, కంఠీరవానుద్దేశించి, “ఇటురా తండ్రి,'’ అని పిలిచింది. బడి కడపలో నిలుచుండి, “ఎందుకే?'’ ప్రశ్నించాడు కంఠీరవం. “ఏమీలేదు నాయనా! ఇన్ని మోదుగు ఆకులు తెచ్చిపెట్టాలె కొడుక,'’ ఆండాళమ్మ బ్రతిమిలాడింది.
“నేను రాను,'’ అని కంఠీరవం, గిదగిద ఉరికి, పొయ్యివద్ద వంట చేసుకుంటున్న పంతులమ్మ వీపుపై పడ్డాడు. గట్టిగా కౌగలించుకున్నాడు.
మహమ్మదీయుల ఇంట్లో అడుగుపెట్టడమే ఆండాళమ్మకు కష్టంగా ఉంది. కాని ఏం చేస్తుంది? ఇరవై ఇస్తళ్ళు కుట్టి రామభూపాలరావు దొర ఇంటికి పంపాలె. దొర ఇంటికి చుట్టాలు వస్తున్నారు. అవసరమున్నపుడల్లా ఆ విధంగా కుట్టి ఇవ్వడం మామూలు. తోరణం ఆకుల్తో కుట్టి ఇస్తామంటే, పచ్చి ఆకులు దొరకుతున్నప్పుడు, తోరణం ఆకుల్తో వద్దని ఇస్తళ్ళు కావాల్నని చెప్పవచ్చిన ఆడబాపవాడు అన్నాడు.
ఆండాళమ్మ భర్త రఘునాథాచార్యులు, పెద్దకొడుకు వెంకటాచార్యులతో దేశ సంచారానికి వెళ్ళాడు. అందువల్ల ఆండాళమ్మ విధిలేక ఆరాటంతో బడికి వచ్చింది. కంఠీరవం రానంటున్నాడు. మహమ్మదీయుల ఇంట్లో, పైగా పొయ్యి వద్ద చేరాడు. ఆండాళమ్మ బహుకష్టంగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ పెరట్లో నుండి వంట ఇంటి కడప వద్దకు వెళ్ళింది. పంతులమ్మ కోడిగుడ్లు పగులకొడ్తున్నది. ఆండాళమ్మ ముఖం తిప్పుకుని, మూతికి కొంగు అడ్డుపెట్టుకుని, “మా పిల్లవాడిని బయటికి పంపమ్మ కాస్త. ఇంట్లో ఎవరు లేరు,'’ అన్నది.
“నీ కొడుకును నేను పట్టుకున్నానా!'’ నవ్వుకుంటూ పంతులమ్మ అన్నది.
“నేను పోవాలె తల్లి, చాలా పొద్దెక్కిపోయింది,'’ అంటూ, “వస్తావా రావా?'’ గద్దించింది కొడుకును.
కంఠీరవం పంతులమ్మకు దూరంగా మంచం మీద చేరి, “నేను రాను,'’ అన్నాడు. బోర్ల పడుకొని కొంటెగా తల్లిని చూచాడు.
“ఏం చెయ్యను వీడితో? పదిహేను, ఇరవై ఇస్తళ్ళు కుట్టివ్వాలె. ఎక్కడి పని అక్కడే ఉంది. ఇంట్లో ఒక్క ఆకు చింపు కూడా లేదు. వీడేమో మంకు చేస్తున్నాడు,'’ ఆండాళమ్మ ఆరాటపడింది.
“పోరాదు నాయన, పంతులు పగటికి వస్తాడు. అందాకా ఇంటికి పొయ్యి అమ్మ చెప్పిన పని చెయ్యి,'’ అంటూ పంతులమ్మ కంఠీరవాన్ని సమీపించ బోతుండగా, “కొంచెం చేయి కడుక్కొని పట్టుకరా అమ్మ,'’ ఆండాళమ్మ పంతులమ్మకు ఆచారవిధిని తెలిపింది.
పంతులమ్మ ముసిముసిగా నవ్వింది. ఆండాళమ్మను ఓరకంటితో చూచింది. చెయ్యి కడుగుకొని కంఠీరవాన్ని అమాంతంగా ఎత్తుకొని, “పోయిరా పో నాయనా,'’ అని ముద్దు పెట్టుకొన్నది.
“బాగుంది గారాబం. దున్నపోతున్నట్టున్నాడు. ఎందుకెత్తుకున్నవు? కడుపు నొప్పి లేస్తుంది,'’ అని పైకి మాత్రం అన్నది. కాని తన కొడుకుపై పంతులమ్మ చూపే ప్రేమకు లోలోన ఆనందించింది ఆండాళమ్మ.
“ఎందుకమ్మ దున్నపోతంటారు? బంగారంలాంటి కొడుకును? మాకిచ్చేయండి మేము సాదుకుంటాం,'’ అని పంతులమ్మ కంఠీరవాన్ని కిందికి దింపింది. “అన్నం తినగానే పంపండి. వస్తావు కదు,'’ పంతులమ్మ గారాబంగా కంఠీరవాన్ని చూచింది.
కంఠీరవం ముఖం మాడ్చుకొని, తల్లి చేయి పట్టుకొని ఇంటికి వెళ్ళాడు. ఆండాళమ్మ బస్తా సంచి పైకెత్తి ఇచ్చి విస్తరాకులకు పంపింది. పిల్లల సాయంతో, దున్నపోతు మీద ఎక్కించి, కాల్వ దాటిందాకా ఇవతలి ఒడ్డున నిలుచున్నది ఆండాళమ్మ. కంచెకు వెళ్ళే వరకు అక్కడ కొమరయ్య సాహచర్యం దొరికింది. కొమరయ్య మండలు కోస్తున్నాడు. కంఠీరవం మండలు ఏరి ఒకచోట కుప్ప చేస్తున్నాడు. తర్వాత ఇద్దరూ కూర్చొని మండ నుంచి ఆకులు తుంచ మొదలుపెట్టారు.
“మా అయ్య మా ఆవును దొరకిచ్చిండు,'’ కొమరయ్య అన్నాడు.
“మీకు మరి?'’ కంఠీరవం వెంటనే ఆవేదనతో అడిగాడు.
“మా అయ్య ఇంకోటి తెస్తానన్నాడు. కాని ఎన్నడులేంది నువ్వు ఇయ్యాల ఇస్తరాకుల కొచ్చినవెందుకు?'’
“మా నాయనగారు, అన్నయ్య సంచారం పోయిన్రు.”
“ఇవ్వాళ దొర యింటికి చుట్టాలొస్తున్నారట. మా అయ్య మిరపకాయలు, ఆనగపు పిందెలు, వంకాయలు తీస్కపోయిండు.'’
ఆలోచనాధోరణిలో- “ఊఁ మీరు కూరగాయలు, ఆవును ఇస్తున్నారు. ఇస్తళ్ళు మా అమ్మ కుట్టిస్తున్నది. వాండ్లింటికి చుట్టాలొస్తే అంతా మనకే వచ్చిందే!'’ అన్నాడు కంఠీరవం.
“అదే నిన్నడుగుదామనుకుంటున్న. దొరకు గతిలేదా యేం? ఆ చుట్టాల తోటి మా ఆవును పంపుతాడట.'’
“ఎందుకు?'’
“మా ఆవును దొర తన బిడ్డకు ఇస్తాడట.'’
“మీ ఆవును దొర బిడ్డకు ఇవ్వడమేమిటి?'’
“అవన్నీ అడుగొద్దంటాడు మా అయ్య.'’
“మనం ఏమీ అడుగొద్దంటే, మనతో ఆ దొరకు పని చేయించడమెందుకో! మరి అయితే ఇస్తళ్ళు కుట్టడానికి మా అమ్మను కూడా దొరబిడ్డ వెంట తోల్తారేమో!'’
“ఏమో! మీ అమ్మను అడుగు.'’
“అడుగుత. మా నాయనగారు, మా అన్నయ్య కూడా ఊళ్ళోలేరు. మా అమ్మ కూడా లేకుండాపోతే నాకు అన్నం ఎట్ల?'’
“బడిపంతులు ఉన్నాడుగా?'’ కొమరయ్య నవ్వుతూ అన్నాడు.
“ఛా! అతడు తురకనాయె. వాండ్లు గుడ్లు, చేపలు తింటారు. నేను తినకూడదాయె.'’
“వేరే వాండ్లతో వేరే ఏమన్న వండించి పెడ్తడు పంతులు.'’
“అవును. అది కూడా అమ్మను అడుగుత.'’
మాటల్లో మొత్తం ఆకులు తుంచారు. తర్వాత ఇద్దరు ఆకులను సంచిలో నింపారు. కంఠీరవం కాసేపు, కొమరయ్య కాసేపు కొంతదూరం సంచిని మోసుకుంటూ వచ్చారు. ఇద్దరూ అలసిపోయారు. ఆ సంచిని గైకత్తికి మధ్యన కట్టారు. కావడిగా చేసి ఇద్దరూ చెరొకవైపున భుజాన పెట్టుకొని కాల్వవరకు వచ్చారు. దున్నపోతుల సాయంతో కాల్వ దాటారు. మళ్ళా కావడిగా చేసుకొని కంఠీరవం ఇంటికి చేరారు.
ఇంటికి వచ్చేవరకు ఆండాళమ్మ విస్తరి పుల్లలు చీరుకు కూర్చున్నది. విస్తళ్ళు కుట్టడానికి సహాయానికై పిలిపించుకున్న సాతాని మంగమ్మ కూడా పుల్లలు చీరుతున్నది.
ఆండాళమ్మ లేచి, “తెచ్చినావు కొడుక,'’ అన్నది. సంచి తెచ్చి మంగమ్మ కూర్చున్నచోట విప్పి ఆకులు కుమ్మరించింది. “నీకెవరో జంట దొరికిన్రే?'’ కొమరయ్యను చూస్తూ, “ఎవరి కొడుకువు పిల్లగా,'’ అడిగింది.
“మొదట బళ్ళో నాతోటే చదివిండే. ఇప్పుడు బడికి రావటం లేదు. బాయి దగ్గరికి పోతున్నడు,'’ కంఠీరవం సమాధానమిచ్చాడు.
“మీ నాయన పేరేంది పిల్లగా?'’ సాతాని మంగమ్మ అడిగింది.
“గొట్టం కోటయ్య.'’
“మీ ఆవునేనా దొర తోలకపోయింది?'’ మంగమ్మ ఆతురతతో అడిగింది.
బిక్క ముఖంతో, “అవును,'’ అన్నాడు.
కొమరయ్య, కంఠీరవం ఆకుల తొడిమలు తీస్తూ కూర్చున్నారు.
“నేను చెప్పలేదా? ఇదే సంగతి. పాపము! బిడ్డడు కడుపునిండా పాలు తాగిండో లేదో!! మొన్న మొన్ననే ఈనిందట. ఎవడి కంట్లో మన్ను పోసుకున్నడో, పాలు బాగా యిస్తుందని దొరకు తెలిసింది. ఇంకేముంది? కావాలన్నాడు,'’ మంగమ్మ మూతి విరిచింది. తొడిమెలు తీసిన ఆకులు కిందు మీదు చేస్తూ పెద్ద ఆకులు ఏరింది.
“అమ్మా! దొర బిడ్డ ఊళ్ళో ఇస్తళ్ళు కుట్టివ్వడానికి దొర నిన్ను పొమ్మంటే పోతావా? నాకు అన్నం ఎవరు పెడ్తారు? పంతులు తురకనాయె. ఆయనింట్లో తినకూడదాయె,'’ కంఠీరవం అడిగాడు.
“మా ఆవును దొరబిడ్డతో పంపుతారట,'’ కొమరయ్య అన్నాడు.
“అదా సంగతి? చూచావమ్మా? పోరడు గింత వున్నడో లేదో అన్నీ తెలుసుకున్నడు. బిడ్డకు అరణం ఇస్తున్నాడు గామాలు ఆవును,'’ మంగమ్మ ఆశ్చర్యంగా అన్నది. విస్తళ్ళు కుట్టసాగింది.
“మరి నిన్ను గూడ రమ్మంటారా అమ్మ,'’ తిరిగి కంఠీరవం అడిగాడు.
“పిచ్చితండ్రి! ఆ ఊళ్ళో ఇస్తళ్ళు కుట్టేవాండ్లున్నారు. నేనేం పోను,'’ అని ఆండాళమ్మ తల నిమిరింది. “నీకు అన్నీ ఆదుకోవడానికి పంతులు, పంతులమ్మ లేరు? అక్కడే తిను,'’ ముసిముసిగా నవ్వుతూ ఆండాళమ్మ అన్నది.
“అయితే, ప్రతి ఊళ్ళో ఇట్లా కుట్టేవాళ్ళుంటారా అమ్మ?'’
“ఉంటారు, ఎందుకుండరు? మీ తాత కాలంలో ఈ దొర తండ్రిని ఆశ్రయించుకొనే ఇక్కడికి వస్తిమి. ఆ దొర చచ్చి స్వర్గంలో ఉన్నాడు. మహారాజు చెరువు కింద నిక్షేపంలాంటి పొలమిచ్చిండె. ఓ అయ్యను ఆశ్రయించకుండా గుట్టుగా కాలం వెళ్ళేది. ఆ దొర చచ్చిండు. పొలం పోయింది. కాని మంగమ్మా! చాకిరి మాత్రం తప్పటంలేదు. అక్షరజ్ఞానం లేని పెద్దవాడిని వెంటేసుకొని పెద్దమనిషి ఇల్లనక, వాకిలనక, ఒళ్ళనక దేశాలు తిరిగితేగాని ఈమాత్రం సంసారం నడవటం లేదు. నీకు తెలియదా మంగమ్మ? ఆ దొర చచ్చిం తర్వాత ఒకటికొకటి విపరీతాలు పుట్టుకొస్తున్నాయి కాని,'’ ఆండాళమ్మ అంటుండగా గుడ్లలో నీళ్ళు తిరిగాయి.
“నీకు ఎరికే ఉండొచ్చు. మొన్న కిస్తులో మా ఇంటాయనను ఫజీతా చేసి వసూలు చేసిన సంగతి,'’ మంగమ్మ తన ఇబ్బందిని తెలుపుకొంది.
“చచ్చిన దొర రోజులలో గడీలో ఏది జరిగినా ఊరంతా పెండ్లి వోలె ఉండేది. ఆ మామూళ్ళు, మర్యాదలు ఇప్పుడు లేకపోయినా సాగించుకోవడం మాత్రం తప్పడం లేదు,'’ ఆండాళమ్మ అన్నది.
“అవును. అంతే. ఇంగువ కట్టిన గుడ్డ,'’ మంగమ్మ తోడు పలికింది.
“చిన్న, పెద్ద విచక్షణ లేకుండా కూడా పోతున్నది మంగమ్మ. నీవేమన్నా అను, ఆ దొర లేమంటారో ఏమోకాని మధ్య ముండాకొడుకులున్నారే, ఒక్కొక్కడు మిడిసిపడిపోతున్నారు. ఇస్తళ్ళు కావాలని చెప్పవచ్చిన ఆడబాప రంగడు కూడా మాట్లాడే పద్ధతి చూస్తే నాకు ఒళ్ళు మండిపోయింది,'’ ఆండాళమ్మ అన్నది.
మంగమ్మ, ఆండాళమ్మ సంభాషణ శ్రద్ధగా వింటూ కొమరయ్య, కంఠీరవం అప్పుడప్పుడు ఒకరి ముఖాలు ఒకరు చూచుకొంటున్నారు.
“వాండ్లనంటే ఏం లాభం? సాగే అవకాశముంటే సాగుతుంటుంది. పై వాండ్ల ఆసరా ఉంటేనే కింది వాండ్లు ఎగురుతుంటారు. ఇంతకు ఎన్ని అయినట్లు విస్తళ్ళు? మావాడు పొద్దున ఏమీ తినకుండానే పొయిండమ్మ బడికి. రోజు ఏం పెడ్తాం? ఎక్కడ నుంచొస్తాయ్. నోటిలో తడిలేని పుటకలు. ఇంకా అయిదు విస్తళ్ళు కుట్టి పోతానమ్మ,'’ మంగమ్మ విస్తళ్ళు లెక్కపెడ్తూ అన్నది.
ఆకుల తొడిమెలు తీస్తున్న కంఠీరవం, “మడి ఎప్పుడే కట్టుకునేది,'’ తల్లి నడిగాడు.
“ఇవి కావొద్ద కొడుక. కొడుకు ఎన్నడు లేంది ఆకులకు పోయిండమ్మ. కొడుకు ఎంత కష్టపడ్డడో,'’ కంఠీరవం నెత్తిని నిమురుతూ తల్లి అన్నది.
“అయితే నేను పంతులు దగ్గరికి పోతా, పంతులు వచ్చుండొచ్చు. లే కొమరయ్య పోదాం రా,'’ అని కంఠీరవం లేచి నిలుచున్నాడు.
“నేను బడికి రాను, పంతులు కోప్పడతాడు. మా అయ్య నన్ను బళ్లోంచి తీసినప్పుడు మా అయ్యతో పంచాయితి పెట్టుకుండు.
“సరే అయితే, ఇంటికి పో,'’ అని కంఠీరవం బడిదోవ పట్టాడు.
కొంతసేపట్లో ఆడబాప రంగడు విస్తళ్ళ కొరకు వచ్చాడు. గదిలోకి కావలసిన మొత్తం విస్తళ్ళు ఇరవై అయినా కుట్టి ఉన్న ఇరవై మూడు విస్తళ్ళు కూడా అవసరముందని తీసికెళ్లాడు. ఒక విస్తరి చేత బట్టుకపోదామనుకున్న మంగమ్మ నిరుత్సాహంతో ఏదో గొణుగుకుంటూ ఇంటికి పోయింది. “ఏదో వైపరీత్యానికే వచ్చింది,'’ ఆండాళమ్మ తనకు తానే అనుకుంటూ ఇంటిలోకి వెళ్ళిపోయింది.
కంఠీరవం తండ్రి రఘునాథాచార్యులు తండ్రితోపాటు ఆ గ్రామం చేరుకొని ఎంతోకాలం అయింది. రామభూపాల్‌రావు తండ్రి భుజంగరావు బ్రతికి ఉన్నప్పుడు, రఘునాథాచార్యులు చాలా మన్ననలు పొందాడు. రఘునాథాచార్యులు యొక్క పాండిత్య ప్రతిభను మిక్కిలి కొనియాడేవారు. భుజంగరావు మరణించిన తర్వాత రామభూపాల్‌రావు వ్యవహారం, పద్ధతి రఘునాథాచార్యులకు నచ్చలేదు. రఘునాథాచార్యుల అసంతృప్తికి ప్రబలమైన ఏ కారణం లేకపోయినా రామ భూపాల్‌రావు మాటల వైఖరి, ప్రజలతో వ్యవహరించే విధానం, వ్యక్తిగత జీవితం మొదలైన అతని దైనందిన జీవిత విధానమే రఘునాథాచార్యులకు ఏవగింపుగా తోచింది. ముఖ్యంగా భుజంగరావులో కనిపించిన విశాలభావము, ఠీవి, మర్యాద, మన్నన, విచక్షణా జ్ఞానము రామభూపాల్‌రావులో లేవని రఘునాథాచార్యులు తెలుసుకున్నాడు. దానితో రామభూపాల్‌రావు అంటే రఘునాథాచార్యులకు ఒక విధమైన నిర్లక్ష్యము, నిరసన భావం ఏర్పడింది. రఘునాథాచార్యులకు చదువు కొన్నాననే ధీమా, గర్వము ఎక్కువ ఉందని రామభూపాల్‌రావుకు ఒక అభిప్రాయ మేర్పడింది. ఈ విధంగా పరస్పరం సుముఖత లేకుండా కొన్నాళ్ళు గడిచాయి. ఇట్టి వాతావరణానికి తోడు రామభూపాల్‌రావు బిడ్డ పెండ్లి సందర్భమున జరిగిన ఒక సంఘటనలో రామభూపాల్‌రావుకు, రఘునాథాచార్యులకు ఇంకా బెడిసి పోయింది.
పెండ్లి ఆడంబరం, అట్టహాసంతో ఊరి ప్రజలంతా ఉబ్బితబ్బిబ్బైపోయారు. పనిపాటలవాండ్లకు ఊపిరి మెసలకుండా అయిపోయింది. పెండ్లి అయిదు రోజులకు కావల్సిన కూరగాయలు అందించే బాధ్యత రైతులకు ఒప్పజెప్పబడింది. ప్రజలు తమ ఇండ్లలోని పాల నుండి వెన్నను భద్రపరచి నెయ్యి సిద్ధం చేయించి వీలున్న ప్రతిచోట మంచి నెయ్యి సేకరించి అందించే బాధ్యత, పెండ్లి రోజుల్లో సామానుగది నిర్వహించి తినుపదార్థాలను అందించే బాధ్యత గ్రామవైశ్యుల నెత్తిన బడ్డది. గ్రామంలో ఉన్న బల్లెపీటలు, మంచాలు అతిథుల అవసరాలకై ప్రత్యేకించ బడ్డవి. అతిథుల పశువులకు మేత కొరత రాకుండా చూచే బాధ్యత కొందరి రైతులకు అప్పగించబడ్డది. వీధుల పరిశుభ్రత, గుర్రాలను అరుచుకొనే భారం బేగారివాండ్లపై బడ్డది. ముఖ్యంగా ఆ పెండ్లి దిగ్విజయంగా జరిగి, రామభూపాల్‌రావు ఘనతకు ఏలాటి లోటు రాకుండా చూచే బాధ్యత గ్రామ ప్రజల కర్తవ్యంగా నిర్ణయించబడ్డది. ఆ పెండ్లిని గురించి, అందుకై చేస్తున్న సన్నాహాలను గురించి, జరుగబోయే వినోదాలను గురించి, చుట్టుపట్ల పది గ్రామాల వరకు ప్రజలు వింతగా చెప్పుకున్నారు. మంగళగిరి నుండి సన్నాయిమేళాన్ని, బెజవాడ నుంచి ప్రవీణులైన సంగీత పాటకులను, కూచిపూడి భాగవతుల వాండ్లను, హైద్రాబాదు నుండి బ్యాండువాండ్లను, నౌబత్‌వాండ్లను భోగం మేళాన్ని పిలిపించాడు. తోటలో ఉన్న బంగళా అధికారులకు అతిథిగృహంగా ఏర్పాటు చేయబడ్డది. విశాలమైన ధర్మశాల భోగంవాండ్లకు నివాస స్థలంగా మార్చబడ్డది. రఘునాథాచార్యుల యింటి ముందర, పెరట్లో పందిళ్ళు వేయించి వైష్ణవులకు, గడి వెనుకనున్న తోటలో శైవులకు వసతి, భోజన ఏర్పాట్లు చేయబడ్డవి. రామభూపాల్‌రావు ఇంటి నుండి తోట వరకు వెళ్ళే మార్గంలో ఇండ్ల వాండ్లందరూ వారివారి ఇండ్లకు అలుకులు, సున్నాలు, తోరణాలతో అలంకరించాలని రామభూపాల్‌రావు ఆజ్ఞాపించాడు. ఇండ్లలో నుండి బయటికి నీరు రాకుండా జాలార్లు మూసివేయబడ్డవి. రామభూపాల్‌రావు స్నానము నీటివరద ఆ ఊరివారికి గడియారంవలె పనిచేస్తుంది. రామభూపాల్‌రావు స్నానముచేస్తే ఇండ్ల ముందర నుండి ప్రవహించే నీటివరద వడినిబట్టి ఆయా ఇండ్ల వాండ్లు ప్రొద్దు యొక్క గమనాన్ని అర్థము చేసుకుంటారు. ఇంచుమించు అరఫర్లాంగు వరకు ఆ విధంగా ప్రవహించే ఆ కాల్వ తోటమార్గాన్నే ఉండడంబట్టి, ఆ ప్రవాహాన్ని తాత్కాలికంగా వేరే సందులోకి మలిపివేసినారు.
పెండ్లినాడు పెండ్లికొడుకును ఎదుర్కొని వచ్చేటప్పుడు ఊరంతా పిల్లజల్ల, అడమగ కదిలిపోయారు. చుట్టుపట్ల గ్రామాల నుండి కూడా వందలకొద్ది ప్రజలు వచ్చారు. మొదట వరుసలో డప్పులవాండ్లు, కొమ్ములవాండ్లు, తర్వాత చుట్టుప్రక్కల గ్రామాలకు చెందిన సన్నాయివాండ్లు, పిమ్మట ప్రత్యేకంగా పిలిపించబడిన సన్నాయివాండ్లు, ఆ తర్వాత బ్యాండువాండ్లు చుట్టూ రామభూపాల్‌రావు బంధువులైన యువకులు తమ గుర్రాలను బ్యాండు చప్పుడుకు అనుగుణంగా, నాట్యం చేస్తూ వలయాకారంగా తిరుగుతూ మెల్లమెల్లగా ముందుకు సాగుతున్నారు. వారి వెనుక నౌబత్ వాయిద్యము, దాని తర్వాత భోగం వారి పాటలు, కూచిపూడి భాగవతుల కీర్తనలు, ఆ తర్వాత బంధువులు, పరివారం, ప్రత్యేకా హ్వానితులు, వారి ననుసరిస్తూ వైష్ణవులు, శైవులు, సాతానివాండ్లు, భట్రాజులు- ఈ విధంగా ఊరేగింపు బయలుదేరింది. ఊరేగింపుకు రెండువైపుల ప్రజలు క్రిక్కిరిసి నిలబడి చూస్తున్నారు. అక్కడక్కడ అప్పుడప్పుడు రకరకాల మందులు కాల్చబడుతున్నాయి. ఆ ఊరేగింపు వల్ల ఒకవైపు ప్రజలకు ఆనందం కలుగుతున్నది. రెండోవైపు అంతమంది దొరల హడావుడిని చూచి భయం కూడా కలుగుతున్నది. ఆరోజు రాత్రి వివాహం చాలా వైభవంగా జరిగింది.
ప్రత్యేకంగా ఆహ్వానించబడిన మోహనాచార్యులు ఫిడేలుతో బెజవాడ నుండి లగ్నం అయిన మరునాడు మధ్యాహ్నం వరకు చేరుకున్నాడు. భోజనాల వేళైంది. ఇతర వైష్ణవులతోపాటు మోహనాచార్యులకు రఘునాథాచార్యుల ఇంటిలోనే బస ఏర్పాటు జరిగింది. మోహనాచార్యులు కనీకనబడనట్టు తిరుమణి చూర్ణముతో బొట్టు పెట్టుకున్నాడు. ఆయనా, అతని వేషం, ఆ క్రాపింగు ఆ మొత్తం వైష్ణవుల్లో వేరేసినట్టు కనుపించింది. భోజనానికై ఆయత్తపడుతున్న ఇతర వైష్ణవులు వింతగా మోహనాచార్యులను చూచారు. కొందరు గుసగుసలు సాగించారు. కొందరు కోపానికి వస్తున్నారు. వారిలో ఒకడు వస్తున్న కోపాన్ని పట్టలేక, “ఆ అప్రాచ్యుడితో పంక్తి భోజనానికి నేను ఒప్పుకోను. నేను కాదు, మీరెవ్వరూ కూడా ఒప్పుకోవద్దని నా అభిప్రాయం,'’ అధికార ధ్వనిలో శాసించాడు. వడ్డన పనులలో లీనమైయున్న రఘునాథాచార్యులు ఆ నిర్ణయం సక్రమమైందేనని ఒప్పుకొన్నాడు.
“ఒక్కని గురించి అందరం మాదుగుల్లో కలవాల్నా?'’ ఇంకొకడు చేయూత నిచ్చాడు.
“సరే! బాగానే ఉంది, కాని మరి ముందు కర్తవ్యం ఏమిటో తేల్చివేయండి,'’ ఇంకొకడు అందుకొన్నాడు.
ఒక్కొక్కరు ఇంటి వెనుక భోజనం పందిరి కింద తలా ఓ తీరు మాట్లాడుతున్నారు.
“దొరవారు పిలిపిస్తే వచ్చినవాడు కదా! మన వైఖరితో దొరవారికి కోపం రాదా?'’ ఒకడు ఆలోచనలో పడ్డాడు.
“అయితే? ఇందులో తిండి లేక పొట్టచేతబట్టుకొని వచ్చిందెవరూ లేరు. ఎవరి ఆచారాలు, గౌరవమర్యాదలు వాండ్లకున్నవి. మన కట్టుబాట్లు, సంప్రదాయాలు మంట కలిసింతర్వాత బ్రతికినా ఒక్కటే, చచ్చినా ఒక్కటే,'’ రామభూపాల్ రావు ఆచార్యులైన తిరువేంగడాచార్యులు గట్టిగా అన్నాడు.
అతని ధోరణితో అందరికీ ఆత్మవిశ్వాసం కలిగింది.
“తిరువేంగడాచార్యులవారు సాయించింది చాలా బాగుంది. భ్రష్టులు కావడానికి ఎవడు ఒప్పుకుంటాడు?'’ గుంపులో నుండి ఒకడన్నాడు.
“నేనిప్పుడే దొరవారిని పిలుపించుతాను. ఇందులో మనం చేస్తున్న తప్పేమీ లేదు. మంచిని మంచిగా చెడ్డను చెడ్డగా హితవు చెప్పుతూ, వర్ణాశ్రమ ధర్మాలు కాపాడబడేట్టు చూడాల్సింది మనం. రఘునాథాచార్యులవారు! మీరే వెళ్ళి దొరవారిని పిలుచుకు వస్తే బాగుంటుంది,'’ తిరువేంగడాచార్యులు అన్నాడు.
రఘునాథాచార్యులు ఆతురతతో బయలుదేరాడు. యింటి ముందర పందిట్లో కూర్చుని ఉన్న మోహనాచార్యులను అసహ్యంగా చూస్తూ గడీ వైపు వెళ్ళాడు.
కొద్దిదూరాన ఉన్న ధర్మశాలలో భోగంవాండ్లు పాడుతున్న పాటలకు తన ఫిడేలుకు స్వరాన్ని తన మనస్సులో కలుపుకుంటూ మోహనాచార్యులు పగలు జరుగాల్సియున్న పాట కచ్చేరిలో ప్రదర్శించాల్సిన ప్రావీణ్యతకై పథకం వేసుకుంటున్నాడు.
రఘునాథాచార్యులు గడీలోకి వెళ్ళేవరకు దొరలంతా విస్తళ్ళ మీద కూర్చుని ఉన్నారు. వడ్డన జరుగుతూ వుంది. మెల్లగా రామభూపాల్‌రావును సమీపించి, “మిమ్ములను తిరువేంగడాచార్యులుగారు అందాక రమ్మంటున్నారు,'’ అన్నాడు.
“ఇంకా మీరు ఇక్కడే ఉన్నారే. ఇంకా సాపాట్లు కాలేదన్నమాట. అప్పటి నుంచి ఏం చేస్తున్నారు?'’ అని రామభూపాల్‌రావు బయలుదేరాడు.
“ఆ సాపాట్ల విషయమే మిమ్ములను రమ్మనడం,'’ రఘునాథాచార్యులు నడుస్తూనే సమాధానమిచ్చాడు.
మోహనాచార్యులు ఒక్కడే పందిట్లో కూర్చుని కూనిరాగాలు తీయడం రామభూపాల్‌రావుకు వింతగా తోచింది.
“మీకు సాపాటుకు చాలా పొద్దుపోయింది. చాలా దూరం నుండి వచ్చినారు. అలసి వుంటారు. వంట ఎప్పుడో అయింది కదా! ఇంకా ఆలస్యం ఎందుకవుతున్నదో అర్థం కావడంలేదు,'’ మోహనాచార్యులతో అన్నాడు ఆరాటంతో. రఘునాథాచార్యులను అనుసరిస్తూ పెరట్లోకి వెళ్ళాడు. మోహనాచార్యులు కూడా వెంట వెళ్ళాడు.
రామభూపాల్‌రావు సమీపించగానే తిరువేంగడాచార్యులు ఆచార్య పురుషుని ధీమాతో- “అయ్యా! నా కండ్ల ముందరే ఇట్టి భ్రష్టత్వం సంభవిస్తే చూచి వూరుకోలేను. అనుకోకుండా ఒకటి మా నెత్తి మీద తెచ్చిపెట్టి మమ్ములను పరీక్షిస్తున్నారా? పరీక్షించడానికి సమయం ఇప్పుడే దొరికిందా? (మోహనాచార్యులను చూపుతూ) వారు గొప్ప ప్రవీణులు కావచ్చును. వారి కళాకౌశలం మెచ్చుకో తగ్గది. కాని వారు జుట్టు పెంచడం, వారితో సహపంక్తి భోజనం చేయడం మాత్రం మేము ఒప్పుకోం. ఇందులో మీరు బాధపడాల్సిందేమీ లేదు. నేను మీకు ఆచార్యుణ్ణి. దైవసమానుణ్ణి. ఆచార్య పురుషుడుగా మీకు హితవు చేయడం నా విధి. ఆ ప్రకారం మీరు నడవడం, శిరసావహించడం మీ కర్తవ్యం. ఇదీ సంగతి,'’ గుక్క తిరగకుండా రౌద్రముతో ఏకరువు పెట్టాడు.
మోహనాచార్యులకు తల కొట్టినంత బాధ కలిగింది. ముఖం వెలవెల బోయింది. అతని జీవితంలో అలాంటి సంఘటన ఎన్నడూ జరగలేదు. వెంటనే ఊరు విడిచి వెళ్ళిపోదామన్నంత బాధపడ్డాడు. కాని రామభూపాల్‌రావు అధికార బలాన్ని ఆసరా చేసుకొని నిలుచున్నాడు. ఫలిత మేమవుతుందో తెల్సుకుందామని నిర్ణయించుకుని ఓపిక పట్టాడు.
రామభూపాల్‌రావు మొత్తం వైష్ణవులను, మోహనాచార్యులను గంభీరంగా ఒకసారి చూచి, తల నేలకు వేశాడు. కండ్లలో నుండి నిప్పులు కురుస్తున్నాయి. కోపంతో వణికిపోతున్నాడు. “అయితే ఇప్పుడేమంటారు?'’ అధికార ధ్వనిలో అన్నాడు.
“ఇంకేమనమంటారు? జరుగవలసిన శుభకార్యం జరిగిపోయింది. సంతోషం. ఇక భోజనాల సంగతే కదా! ఈ ఒక్కపూట తినకపోయినంత మాత్రాన ప్రాణాలు పోతాయా? ఎవరి ఇండ్లకు వాండ్లు చేరుకుంటారు. సిద్ధం చేసిన వంట పనివాండ్లకో, కుక్కలకో వేయించండి,'’ రఘునాథాచార్యులు అన్నాడు.
రామభూపాల్‌రావు కోపము మించిపోయింది. “ఆలోచించకుండ, ఆవేశంలో మాట్లాడుతున్నారా? శుభకార్యాలలో మీరన్నట్టు జరగడం మంచిదంటారా?'’ గుడ్లు మిటకరించి రఘునాథాచార్యులను ఉరిమి చూచాడు.
“మీ శుభానికేమి లోటు జరిగింది. మా ఖర్మ కాలింది కాని,'’ రఘునాథాచార్యులు వెంటనే అందుకున్నాడు.
“నా శుభం మీ శుభంగా తలవని మీ మాటలు, నాకేమీ నచ్చటంలేదు,'’ రామభూపాల్‌రావు గొంతు చించుకుని అరిచాడు.
“తనవాడిని పరాయివాడుగా తలచే ఈ వైష్ణవులతో తినడం కంటె మర్యాదగా మీ పంక్తిలో భోజనం చేయడమే ఉత్తమమనుకొంటాను,'’ మోహనాచార్యులు రామభూపాల్‌రావు నుద్దేశించి అంటూ గిరుక్కున అక్కడి నుండి బయలుదేరాడు. రామభూపాల్‌రావు దెబ్బతిన్న పాము వలె బుసకొట్టుకొంటూ గడికి చేరుకొని మోహనాచార్యులకు ప్రత్యేకంగా ఒక గదిలో వడ్డన చేయించాడు. వైష్ణవుల పట్టుదల, మోహనాచార్యుల నిర్ణయం ఎంతవరకు సవ్యంగా ఉందో దొరలెవరూ వెంటనే నిర్ణయించలేక ఆలోచనలో పడ్డారు. వైష్ణవులంతా విజయోత్సాహంతో అయిదు రోజులు హాయిగా కాలం గడిపారు.
నాటి సంఘటన రామభూపాల్‌రావు అధికార గర్వానికి గొడ్డలిపెట్టుగాను, తన ఆచార్యత్వానికి అమోఘ విజయంగాను తలచి రాఘునాథాచార్యులు ఉబ్బిపోయాడు.
పెండ్లి సందడి ముగిసిన తర్వాత, రామభూపాల్‌రావు రఘునాథాచార్యులను పిలిపించాడు. “మేమిచ్చిన భూమి మీద ఇక మీదట మీకేమీ జోక్యం ఉండబోదు. ఆ విషయం చెప్పుదామనే పిలిపించింది. ఇక వెళ్ళవచ్చు,'’ అన్నాడు.
(మిగతా వచ్చే సంచికలో)
అంపశయ్య నవీన్ నవల తర్వాత మళ్ళీ ఇక్కడ ఆడబాప ప్రసక్తి చూశాను.
ఈ ఆచారవ్యవహారాలు, వర్ణాశ్రమ ధర్మాలు మనుషులను ఎన్ని విధాలుగా చీల్చాయో ఈ కథనం స్పష్టంగా చెబుతోంది. ప్రతి ఒక్కరికీ పైనున్న వాడు తనను అధర్మంగా చూస్తున్నాడు అనుకుంటూనే తన కిందవున్నవాన్ని అధర్మంగా చూస్తున్నాడు. అదే దర్మమనుకుంటున్నాడు.
–ప్రసాద్
http://blog.charasala.com
[…] < < మొదటి భాగం | (మిగతా వచ్చే సంచికలో) […]