- డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్
మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనం పంచేంద్రియాల ద్వారా పరికిస్తాం. దానివల్ల జ్ఞానం పొందుతాం. మనం పుట్టినప్పటి నుంచీ బుద్ధి క్రమంగా వికసిస్తుంది. అనుభవాలు మనకు ఎన్నో విషయాలు నేర్పుతాయి. ముఖ్యం అనిపించినవి పెద్దవారి నుంచి నేర్చుకుని, చిన్నవారికి నేర్పుతాం. కనీసం 50 వేల సంవత్సరాలనుంచి మనకు అలవాటయిన సామాజిక జీవితం ఈ సంప్రదాయన్ని బలపరుస్తూ వస్తోంది. దీనికి తిరుగులేదు.
ప్రకృతి సహజంగా మనకు ప్రత్యక్షంగా నేర్పేది తక్కువే. అయితే పుట్టినప్పుడు మనకు సంక్రమించేదల్లా “అన్నీ” నేర్వగలిగిన మెదడు. అది కూడా మన ఆయుర్దాయంలో నాలుగోవంతు గడిచేదాకా ఎదుగుతూనే ఉంటుంది. మనిషి మనుగడకు అపారమైన తెలివితేటలూ, అనుభవమూ తప్పనిసరి కనక ప్రకృతిలో ఈ ఏర్పాటు కలిగింది. ఏ జంతువైనా పుట్టినప్పుడు నిస్సహాయంగానే ఉంటుంది కాని మనుష్యులు అపరిపక్వదశలో గడిపినంత కాలం మరే జంతువూ గడపదు.
మన ఇంద్రియాల్లో ముఖ్యమైనవి కళ్ళు. కేమెరాలాగా మన కన్ను కనబడే మూడు కొలతల ప్రపంచాన్ని రెండు కొలతల “తెర”పై చూపుతుంది. మనకు కనబడే వస్తువులు అన్నీ ఒకే దూరంలో లేవని శిశుప్రాయంలోనే మనకు తెలుస్తుంది. ఉయ్యాలలో ఉన్న పిల్లలు అదేపనిగా తమ చేతి వేళ్ళకేసి చూసుకుంటూ ఉంటారు. లేచి నడవలేకపోయినా వస్తువుల మధ్య దూరాన్ని పసికట్టడం క్రమంగా వారికి తెలుస్తుంది. “నేను”, నా శరీరం” అనే భావనకూడా చాలా నెమ్మదిగా ఏర్పడుతుంది. ఈ “అహం” భావనే తరవాత “ఆత్మ” వగైరా అయోమయానికి దారితీస్తుంది. ఆటవిక దశలో సమష్టి జీవితం తప్పనిసరిగా ఉన్నప్పుడు మనిషుల భాషలో నేను అనే మాట ఉండేదికాదనీ, మేము, మనం అనే పదాలు మాత్రమే ఉండేవనీ పరిశోధకులు అంటారు.
వయసు పెరిగేకొద్దీ ఆలోచనలు రానురాను సంక్లిష్టమౌతాయి. ఊహా ప్రపంచానికీ యదార్థానికీ తేడా లేదేమో అన్నంతగా భావాలు “ఎదుగుతాయి”. వీటివల్ల కొన్ని “ఆధ్యాత్మిక” భావనలు కలుగుతాయి. (ప్రకృతి మాయ. పురుషుడే యదార్థం). సామాజిక పరిణామంలో మార్పులు జరిగి, శరీరశ్రమ చెయ్యడానికి ఇతరులు దొరికినప్పుడు, ప్రకృతికి దూరంగా చేతికి మట్టి అంటకుండా బతకగలిగిన ఒక వర్గం ఏర్పడింది. రోజువారీ శ్రమ తప్పిన ఈ వర్గం ఆలోచనలనూ, మేధస్సునూ పెంపొందించుకుని, తాత్వికచింతనలో పడింది. దీనివల్ల గొప్ప వేదాంత తత్వాలూ, సాంఘిక దురన్యాయాలూ కూడా జంటగా మొదలయాయి. పరిపక్వత చెందిన మెదడు ఒక ఆదర్శం. దాన్ని మించిన యదార్థం లేదు. మనుగడ ఎంత ముఖ్యమో అవగాహనా అంతే ముఖ్యం.
ఈ నాటి విజ్ఞానం మరేదో చెపుతుంది. ఈ చైతన్యమూ, అవగాహనా నాడీమండలం ఉన్న కొన్ని ప్రాణులకే పరిమితం. ఇటువంటి గొడవలేవీ లేకుండా హాయిగా బతికేస్తున్న జీవాలు కొల్లలుగా కనిపిస్తాయి. “బుద్ధిలేని” ఈ ప్రాణులన్నీ మనకన్నా హీనమైనవి అనుకోవడానికి ఆస్కారం లేదు. అసలు బుద్ధి అవసరమా?
మన ప్రగతికే కాక అయోమయానికి కూడా ముఖ్యకారణం మన బుద్ధీ, నాడీవ్యవస్థా అనడంలో సందేహం లేదు. డార్విన్ సిద్ధాంతం చెప్పినట్టుగా సాగిన జీవపరిణామంలోని కొన్ని దశల్లో బుద్ధి వికాసం “తలవనితలంపుగా” జరిగింది. ఆలోచనల ప్రపంచంలో లేనివే లేవు. దీనికి మన జీవితానుభవం నేర్పే కొన్ని విషయాలు తోడవుతాయి. మొదటిది కార్యకారణ సంబంధం. కుమ్మరి ప్రమేయం లేకుండా కుండలు వాతంటత అవే తయారవవు. ప్రపంచాన్ని “ఆడించి, శాసించే శక్తి” లేకుండా ఏదైనా ఎలా జరుగుతుంది?
తక్కిన ప్రాణులతో పోలిస్తే మనిషికి గల ప్రత్యేక లక్షణం తనను గురించిన స్పృహ, వివేకమూ. మతి భ్రమించినవారిని వదిలేస్తే తక్కినవారందరికీ అవగాహనా, మానసిక చైతన్యమూ సహజంగానే ఉంటాయి. మనకు కనబడి, వినబడుతున్నదంతా ఈ అవగాహనకు లోనవుతూ ఉంటుంది. ఎటొచ్చీ ఈ బుద్ధి అనేది మనుష్యులవంటి జీవరాశికే పరిమితమైనదా, లేక విశ్వంలో దీనికొకస్థానం ఉందా అనేది మాత్రం తేలని విషయమే. విశ్వాంతరాళంలో జరుగున్న సంఘటనలకు “ప్రేక్షకులు” ఉండవలసిన “అవసరమేమీ” కనబడదు. బుద్ధీ, అవగాహనా అనేవాటి అగత్యమేమీ లేదనిపిస్తుంది.
రిచర్డ్ ఫేన్‌మన్ చెప్పినట్టు ఎవరూ లేని అడవిలో ఒక చెట్టు కూలినప్పుడు చప్పుడయిందా లేదా? వినేవాడే లేనప్పుడు శబ్దానికి అసలు అర్థం ఉందా? ఉందంటాడు ఫేన్‌మన్. ఆ అదురు ఫలితంగా ఒకానొక ముల్లు మీద ఆనుకుని ఉన్న ఒకానొక ఆకు మీద గీతలు పడే అవకాశం ఉంది. ఆ క్షణంలో చప్పుడు విననివారు కూడా తరవాత ఆ ఆకు మీద పడిన గీతలను చూసి అక్కడేదో కంపించి ఉంటుందని ఊహించవచ్చు. మరీ బాగా పరిశీలిస్తే దానికి కారణం చెట్టు కూలడమే అని కూడా నిర్ధారించవచ్చు. భౌతిక సంఘటనలకు భౌతికమైన ఫలితాలు ఉంటాయి. తమ “అవసరం” కొద్దీ వాటిని పసిగట్టగలిగిన జీవాలు ఏవైనా ఉంటే అది యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన మాత్రమే. అవి పసిగట్టడం అంటూ జరిగితే అది వాటి అవసరం వల్లనే. అలా పసిగట్టకపోయినా ప్రకృతికి కలిగే నష్టం ఏమీలేదు.
ఈ వ్యాసాల ఉద్దేశం మన కళ్ళెదుట జరిగిన, జరుగుతున్న పరిణామాలన్నీ యాంత్రిక, భౌతిక కారణాల వల్ల జరిగినవేనని గుర్తు చెయ్యటానికే. అద్భుతం అనిపించే విషయాలన్నీ కూడా చెట్టు నుంచి పండు రాలినంత స్వాభావికంగా జరిగినవేనని మనకు వెంటనే తట్టకపోవచ్చు. “అస్వాభావికంగా”, “అసాధారణంగా” జరిగినట్టు నమ్మకంగా తెలిసిన విషయాలేవీ లేవు. మనం కనే అద్భుతమైన కలలూ, వినే “అతీంద్రియ” ధ్వనులూ, “మనో నేత్రాలకు” కనబడే దృశ్యాలూ కేవలం మెదడు కలిగిస్తున్న గందరగోళం మూలంగా ఏర్పడినవి కావనేందుకు రుజువేమీ లేదు.
ఆధునిక విజ్ఞానం మిస్టరీలను విడగొట్టి పారేస్తోంది. తెలియనివాటి గురించి మిథ్యావాదులలాగా సిద్ధాంతాలను ప్రచారం చెయ్యదు. ఇటీవలి దాకా మన ఆత్మ శరీరం నుంచి వేరయి తన శరీరాన్ని తానే చూసిన సంఘటనల గురించి తర్జన భర్జన జరిగింది. ఔట్ ఆఫ్ బాడీ అనుభవాలనేవాటికి అర్థంలేదనీ, మెదడులోని ఒక భాగాన్ని స్పృశించినప్పుడు అటువంటి భావనలు కలుగుతాయనీ సర్జరీలో వెల్లడయింది. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మన మెదడు నేర్చుకున్న విషయాలే మరొక రూపంలో అప్రయత్నంగా మన అనుభవంలోకి వచ్చినప్పుడు ఏదో అద్భుతం జరిగిందన్న భావన కలగడంలో ఆశ్చర్యం లేదు. “పూనకం” వచ్చినవారికి ఒకరకమైన మూర్ఛరోగం ఉందని వైద్యులు చెపుతారు. సకాలంలో చికిత్స పొందకపోతే అలాటివారు రోగగ్రస్తులైపోతారు.
ఇప్పటి పరిస్థితులు ఎలా ఏర్పడ్డాయో వెనక్కు వెళ్ళి తెలుసుకోవడం ఈ వ్యాసాల ఉద్దేశం. ఉదాహరణకు మనిషికి మెదడే ప్రత్యేకం. ఇది ఎలా రూపుదిద్దుకుందో తెలియాలంటే ఇతర వానరాల, క్షీరదాల, జంతువుల గురించీ వాటి పరిణామం జరిగిన పద్ధతి గురించీ తెలుసుకోవాలి. ఇంకా వెనక్కు వెళ్ళి, మొదటి జలచరాలూ, బహుకణ ఏకకణ జీవులూ ఎలా పుట్టాయో అన్వేషించాలి. చివరకు భూమీ, సూర్యుడూ, నక్షత్రాలూ ఎలా ఏర్పడ్డాయో తెలుసుకోవాలి. మనకు తెలిసిన భౌతిక సూత్రాలేవీ అతిక్రమణకు లోనవకుండా జరిగిన ఈ పరిణామదశలన్నీ చూసినప్పుడు ఈ విశ్వం గురించిన “ఉద్దేశం” ఏదీ లేదనీ, ఇది ఎవరి “లీలా” కాదనీ అనిపించకమానదు. “పచ్చి” భౌతికవాదానికి తగిన ప్రత్యామ్నాయం లభించేదాకా హేతువాదులకు అది తప్ప మరో దారిలేదు.
మనకు తెలియనిదాన్ని తెలుసుకుందాం, పరిశోదించి దాని వెనకున్న హేతువు కనుక్కుందాం అనిగాక, తెలియని ప్రతిదాన్నీ దేవుడితో ముడిపెట్టి, ప్రశ్నించరాని విధంగా బలమైన వాదాలను సృష్టించి మనుష్యులను నిర్వీర్యులను చేశారు.
వుదాహరణకు కర్మ సిద్దాంతాన్నె తీసుకుంటే, దానివల్ల పీడితులూ, పీడింపబడే వాళ్ళూ కూడా అదే సత్యమని మనసా, వాచా, కర్మణా ఏళ్ళతరబడి నమ్ముతున్నారు.
–ప్రసాద్
http://blog.charasala.com
పీడితుల గురించి పాలకవర్గాలకు ఉండిన దృక్పథం ఈనాటిది కాదని ఈ కింది వివరణ చూస్తే తెలుస్తుంది. బానిసలూ, ఇతర “వెనకబడ్డ వర్గాలూ” ఉన్న సమాజంలో బుద్ధిపూర్వకంగా గుడ్డినమ్మకాలను ప్రోత్సహించడం తమకు లాభిస్తుందని రోమన్లు క్రీస్తుకు పూర్వమే ప్రకటించారు. ఇది ఆనాటికే ఒక పురాతన పద్ధతి అయిపోయిందని కూడా గమనించాలి. ప్రకృతిని గురించి పామరుల్లో సహజంగా ఉన్న అయోమయానికి ఇటువంటిది తోడయితే ఎటువంటి “సంప్రదాయం” బలపడుతుందో అర్థమవుతుంది. దీనివల్ల అప్పటి సమాజంలో శాంతి భద్రతలు తప్పక నెలకొనే ఉంటాయి. చరిత్రను వెనక్కు తిప్పలేం కాని ఇవి చదవడానికి ఆసక్తికరంగా అనిపిస్తాయి.
“But among all the useful institutions, that demonstrate the superior excellence of the Roman government, the most considerable perhaps is the opinion which the people are taught to hold concerning the gods: and that, which other men regard as an object of disgrace, appears in my judgment to be the very thing by which this republic chiefly is sustained. I mean, superstition: which is impressed with all it terrors; and influences both the private actions of the citizens, and the public administration also of the state, in a degree that can scarcely be exceeded. This may appear astonishing to many. To me it is evident, that this contrivance was at first adopted for the sake of the multitude. For if it were possible that a state could be composed of wise men only, there would be no need, perhaps, of any such invention. But as the people universally are fickle and inconstant, filled with irregular desires, too precipitate in their passions, and prone to violence; there is no way left to restrain them, but by the dread of things unseen, and by the pageantry of terrifying fiction. The ancients, therefore, acted not absurdedly, nor without good reason, when they inculcated the notions concerning the gods, and the belief of infernal punishments; but much more those of the present age are to be charged with rashness and absurdity, in endeavoring to extirpate these opinions.” - Polybius (c.200-after 118 BCE)
http://www.fordham.edu/HALSALL/ANCIENT/polybius6.html
Rohini prasad garu,
keep going.
Expecting very poignant essays from u.
by the way, ee sitelo telugu lo elaa type cheyaalanDi? ee sitelo edannaa help menu pedite baavuntundi kadnaDee?
Interesting article.
రోమనుల కాలం నాడే సత్యం తెలిసీ ఎక్కడి వాళ్ళను అక్కడే వుంచాలనే వుద్దేశ్యంతో మూఢనమ్మకాలను ఖండించకుండా వుండనిచ్చారంటే…. మనిషిని మనిషే అణగదొక్కడం ఆదినుంచే వుందన్నమాట!
మీ వ్యాసాలు ముందు ముందు ఇంకెంతో విజ్ఞానాన్ని పంచాలని ఆశిస్తాను.
–ప్రసాద్
http://blog.charasala.com
మనిషికి జంతువుకు మధ్యవున్న తేడా ఏమిటి? ఆలోచనా శక్తి. ఈ ప్రపంచంలో మనం కళ్ళతో చూసే, అనుభవించే సమస్త సంపదలకు మూలకారణం ఏమిటి? మానవ మేధస్సు మరియు మానవ శ్రమ.
కారల్ మార్క్స్ ఒక సందర్భంలో ఇలా అంటాడు. “మానవచరిత్ర ఇంకా ప్రారంభం కాలేదు. ఇదంతా ముందు చరిత్ర ( prehistory) మాత్రమే. ఇది మనిషికి మనిషికి మధ్య జరిగిన సంఘర్షణ తో నిండిపోయింది. ఎప్పుడయితే మనిషికి ప్రకృతికి మధ్య పోరాటం మొదలౌతుందో, ఎప్పుడైతే మనిషి ప్రకృతిని తన మేధస్సుతో అన్వేషిస్తాడో, అప్పుడే నిజమైన చరిత్ర మొదలౌతుంది”.
మానవ మేధస్సు లేదా బుద్ధీని నిర్వచించడం క్లిష్టమైనది. దీనిలో రెండు రకాలుంటాయి. గుర్తుంచుకోవటం ( ability to remember) మరియు ఉహ్యాత్మకంగా ఆలోచించటం ( ability to think). మన చదువుకున్న చదువులు చాలా మటుకు మొదటి రకాన్ని నేర్పుతాయి. రెండవ రకాన్ని జీవితంలోను, అనుభవాలలోను నేర్చుకుంటాం. పట్టణాలలో మధ్యతరగతి వాళ్ళు పుస్తకాలు చదువుతారు, పల్లెలలో రైతుకూలీలు జీవితాన్ని చదువుతారు.
రోహిణీప్రసాద్ గారు! మార్క్స్ కు డార్విన్ మధ్య వున్న సంబంధం ఏమిటి? జీవపరిణామ శాస్త్రానికి (theory of Evolution) వర్గపోరాట శాస్త్రానికి ( theory of class struggle) మధ్యవున్న సంబంధం ఏమిటి? దీనిపైన కొంత పరిశోధనాత్మక రచనలు రావలసిన అవసరమున్నది. వీలైతే ఒక వ్యాసం రాయండి.
డార్విన్ పరిణామవాదం ప్రధానంగా జన్యుపరమైన శారీరక మార్పులను పరిగణిస్తుంది. దీనికీ మార్క్స్ చెప్పిన సామాజిక పరిణామాలకూ చాలా తేడా ఉంది. జీవపరిణామం జరగడానికి వేల సంవత్సరాలు పడుతుంది. సామాజిక పరిణామాలన్నీ అంతకంటే చాలా వేగంగా జరుగుతాయి. మన జీవితాల మీదా, దృక్పథం మీదా వీటి ప్రభావమే హెచ్చుగా ఉంటుంది. క్రీ.పూ.8500 ప్రాంతాల నుంచీ మెసపొటేమియా తదితర ప్రాంతాల్లో ప్రాథమిక స్థాయిలో మొదలైన మానవ నాగరికత క్రమంగా ప్రస్తుత పరిస్థితికి చేరుకుంది. ఈ చారిత్రక పరిణామాలను మార్క్స్ సంపూర్ణంగా వివరించాడు. ఆధునిక మానవజాతి ఆవిర్భవించి ఒకటి రెండు లక్షల ఏళ్ళయింది. మన జన్యువుల మీద ప్రకృతి కలిగించే ప్రభావం కన్నా సామాజిక మార్పులే తీవ్రమైన వ్యత్యాసాలు కలిగిస్తాయి. ఎటొచ్చీ పరిసరాలు కూడా జన్యువులను ప్రభావితం చేస్తాయనీ వాటిని బట్టి మన ప్రవర్తన కొద్దిగా మారుతుందనీ ఆధునిక పరిశోధనలు తెలుపుతున్నాయి.