అవ్వ చెప్తే నమ్మలేదు గాని ఒకసారి నిజంగానే కలలోకొచ్చేడు చంద్రుడు. ఏడ్చి పడుకునే పిల్లలనాడించడానికి చంద్రుడు వస్తాడని, అసలు చంద్రుడి పనే అదని అవ్వ చెప్పేది. చంద్రుడు అందంగా కనిపిస్తూ హాయిగా అనిపించే వాడు. కానీ పిల్లలనాడిస్తాడనీ అతడికదే ప్రపంచమనీ అవ్వ చెప్తే ఆశ్చర్యమనిపించేది. చంద్రుడి గురించి రోజుకో కథ చెప్పేది. అసలు చంద్రుడు ఒక్కడు కాదనీ ఆకాశానికి పద్నాలుగుమంది చంద్రుళ్లు సంతానమనీ చెప్పింది. పిల్లలనాడించే పని రోజుకొకరు చేస్తారనీ, అమావాస్య తర్వాత రోజు మొదలుపెడితే పున్నమివరకూ రోజుకొకరు వంతులేసుకుంటారనీ చెప్పింది. ఒక్క అమావాస్యరోజు మాత్రం రెస్టు తీసుకుంటారట. ఆరోజు వాళ్ల ఫ్రెండ్స్ అయిన చుక్కలు లక్షలకొద్దీ పొడుచుకొచ్చి చంద్రుడు లేని లోటు తీరుస్తాయట.
ఇంకోరోజు చెప్పిందీ, సూర్యుడు, చంద్రుడు అన్నదమ్ములని. పిల్లలు పగటిపూట ఆడుకోడానికి సూర్యుడు వెలుతురునిస్తే, చంద్రుడు రాత్రిపూట పిల్లలతో చేరి ఆడుకుంటాడని. ఈ కథలు వింటూ వింటూ చంద్రున్ని చూస్తుంటే వింతగా అనిపించేది. కొత్తగా అనిపించేది. అవ్వచెప్పిన సంగతులేవో చెప్పని విషయాలేవో తోచేవి.
ఒకరోజు చెప్పిందీ, అసలు కురిసే వెన్నెలంతా పిల్లల కోసమేనని. పిట్టలకోసమేనని. ఎగిరే దూడలకోసమని. విచ్చుకునే మొగ్గల కోసమని. తను జలపాతంలా కురిపిస్తున్న వెన్నెలలో పిల్లలు తడిసి ముద్దయితే చంద్రుడికి చాల యిష్టమని చెప్పేది. విప్పారిన కళ్లతో పిల్లలు తనవైపు చూస్తుంటే చంద్రుడికి చాల యిష్టమట. అలా చూసే పిల్లలలు ఒక్కొక్కళ్లకు ఒకోరకంగా కనిపించేవాడు. ఒకరికి వెండి బంతి లాగా, మరొకరికి ఆకాశానికి పెట్టిన బొట్టులాగా, తియ్యటి పాల కోవా లాగా, అందమైన ఆల్చిప్పలాగా, బుడగ లాగా కనిపించేవాడు. పున్నమిరోజుల్లో అయితే అలాగ. మిగతా రోజుల్లో అయితే మంచుజారుడు బండ లాగా, అద్దం ముక్కలాగా, పక్షి ఈకలాగా, వెన్నెల ఊయల లాగా, మెరుపు ముక్కలాగా అనిపించేది.
ఈ కథలు వినడానికి అన్నం తిన్నవెంటనే యింటి ఎదురుగా వున్న అవ్వ గుడిసెలోకి చేరేవాడ్ని. అప్పటికే అన్నం తిని గుడిసె బయట నులకమంచం మీద కూచుని చుట్ట కాలుస్తుండేది. నేను పక్కనే చేరేవాడ్ని. నేనెందుకోసం వస్తానో తెలుసు తనకు. చెప్పిన కథ చెప్పకుండా చెప్పేది. ఎన్ని కథలు చెప్పినా చంద్రుడి గురించిన కథలు బాగా అనిపించేవి. ఎందుకంటే ఆ కథలు చెప్తున్నప్పుడు ఎదురుగా చంద్రుడుండేవాడు కాబట్టి.
‘పీల్చుకున్న నీటిని అరాయించుకోడానికి మొక్కలకు సూర్యుడెలా తోడుంటాడో, మంచి మంచి కలలతో హాయిగా పెరగడానికి చంద్రుడలా తోడుంటాడు’ అని అవ్వ చెప్పేది.
అవ్వ చెప్పేది నిజమో కాదో తెలుసుకోవాలనిపించేది. ఒకరోజు అవకాశం రానేవచ్చింది. ఇంట్లో చెప్పకుండా ఏటికి స్నానానికి వెళ్లేనని నన్న ఒకరోజు బాగా కొట్టేడు. ఎప్పుడూ నన్ను వెనకోసుకొచ్చే నాన్నమ్మ కూడా నాన్నను అడ్డుకునే ప్రయత్నం చెయ్యలేదు. నాకేమైనా అయి వుండేదన్న భయంతో కావచ్చు. కొడితే మరోసారి అలా చెయ్యకుండా వుంటానని కావచ్చు. నాన్న కొట్టినందుకు కంటె నాన్నమ్మ మౌనమే ఎక్కువ బాధపెట్టింది నన్ను. దుఃఖం సుళ్లు పెడుతుంటే ఏడుస్తూ పడుకున్నాను, అన్నం తినకుండానే. నిద్రపట్టినా ఉక్రోషం తగ్గలేదు.
ఎంతసేపయిందో తెలీదు గాని నేను సాయంత్రం ఆడుకున్న ఏటివార ఇసుకతిన్నెల మీద ఒక ఉయ్యాల లాగా నెలవంక దిగింది. రమ్మంటున్నట్టు ఊగితే మెల్లగా నడుచుకుంటూ వెళ్ళేను దాని దగ్గరికి. ఇంకో నలుగురైదుగురు పిల్లలు అప్పటికే దానిమీద ఎక్కి కూచున్నారు. నన్నూ ఎక్కమన్నారు. నేను ఎక్కేక మెల్లగా ఉయ్యాలలాగా ఊగుతూ గాలిలోకి లేచింది. రాత్రి సముద్రంలో పడవలాగా కదులుతూ పోతోంది. నాచుట్టూ వున్న పిల్లలు కేరింతలు కొడుతున్నారు. నేను కూడా వారితో జతకలిసేను. నాల్గురోజుల వయసు నెలవంక విడుస్తున్న లేత వెన్నెలలో ఏరు, ఏటిపక్కన కొండలు, మామిడి తోటా, మా ఊరూ ఒక పెయింటింగ్ లాగా అనిపిస్తోంది. ఇంకా కొన్నిచోట్ల దిగి మరి కొందరు పిల్లల్ని ఎక్కించుకున్నాక మళ్ళీ మా పడవ ఆకాశంలోకి ఎగిరింది. చాల ఎత్తుగా. ఎంత ఎత్తుగా అంటే ఇప్పుడు కింది కొండలూ ఊళ్ళూ నదులూ దాదాపు కనిపించడమే లేదు.
మేఘాలలోంచి పడవ దోబూచులాడుతూ వెళుతూ వుంటే పిల్లలందరూ ఒకటే అరుస్తున్నారు. చేతులు బయటకు పెట్టి మేఘాలను పట్టుకోజూస్తున్నారు. నేను కూడా చెయ్యి బయటకు పెట్టేను. చల్లటి నీటి గాలి చేతికి తాకింది. ఒక మేఘపు గుంపును దాటి బయటకొచ్చేమో లేదో దూరంగా మరొకటి కనిపించింది. పిల్లలందరూ ఆనందంతో ఓ ఓ అరుస్తున్నారు. మా పడవ మరో మేఘపు గుంపు దగ్గరకు వెళ్తుండగా హఠాత్తుగా దాంట్లోంచి చాలా పెద్ద మనుష్యాకారం బయటకొచ్చింది. పిల్లలందరూ దాన్ని చూసి భయపడి ‘ఓవ్’ అని అరిచేరు. మా అరుపులకు బ్రేక్ వేసినట్టు పడవ ఒక్క కుదుపుతో ఆగిపోయింది. మేఘాలమధ్యలోంచి బయటకొచ్చిన ఆ ఆకారం మావైపే వస్తోంది. పిల్లలందరూ భయంతో మళ్ళీ గట్టిగా అరిచేరు. కనిపించీ కనిపించని వెలుతుర్లో చూస్తే ఎక్కడో చూసినట్టే అనిపించింది. నాన్ననా? అవును నాన్నే! నేనింకా ఆశ్చర్యంలోంచి తేరుకోక ముందే కోపంగా చూస్తూ “చెప్పకుండా ఎందుకెళ్ళేవు ఏటికి?” అనడిగేడు. భయంతో పడవ అంచుల్ని గట్టిగా పట్టుకున్నాను. భయపడ్డారో లేకపోతే వాళ్ళకూ ఏమైనా భయాలు గుర్తొచ్చేయో తెలీదు గాని వాళ్ళు కూడా పడవను కరుచుకు కూచున్నారు. ఎత్తులూ లోతులూ దూరాలూ లేకుండా అనంతంగా వున్న ఆకాశంలో హాయిగా సాగుతున్న మా విహారయాత్ర అర్థాంతరంగా నా వల్ల ఆగిపోయినందుకు బాధవేసింది. మిగితా పిల్లల ముందు చిన్నతనం అనిపించింది. నాన్న యింకా కోపంగానే చూస్తున్నాడు. ఈ విపత్తు ఎలా తప్పుతుందో అర్థం కాలేదు. లేకపోతే ఈ యిబ్బందికరమైన పరిస్థితిలో అనంతంగా చిక్కుకుపోయానో?
ఈ యిబ్బందిని గమనించిందో ఏమో నెలవంక తనే మెల్లగా కదలడం మొదలెట్టింది. మెల్లమెల్లగా వేగం అందుకుంది. నాన్న ఉనికిని లెక్కచెయ్యనట్టు పట్టించుకోనట్టు పైకి, పైపైకి ఎగిరింది. ఇదివరకటి భయం తాలూకు ఛాయలను క్రమక్రమంగా అక్కడే వదిలేసి మళ్ళీ అందరం మేఘాల గుంపుల్లోంచి విహరించేం. ఏనుగుల మందల వలె, చెట్ల వలె, మంచునదుల వలె, వెన్నముద్దల వలె, వెండి పరుపులవలె వున్న మబ్బులను దాటుకుంటూ నక్షత్రాల దాపులకు వెళ్లేం.
అవును అవ్వ చెప్పింది నిజమే చుక్కలు చంద్రుడికి ఫ్రెండ్సే. పడవనక్కడ ఆపించి మమ్మల్ని దింపి ఏవేవో ఆటలు ఆడించేయవి. ఒక పాపయితే చుక్కలన్నింటినీ దగ్గరకు చేర్చి పాదం మీద పోసి చుట్టూ చేతులతో మెల్లగా ఒత్తు చుక్కలగూడు కట్టి మెల్లగా కాలు తీసేసింది. అట్లా ఆ చుక్కల లోకంలో ఎంతసేపు ఆడుకున్నామో తెలీదు. నిద్ర బాగా పట్టిందో, కలే ముగిసిపోయిందో లేకపోతే దుఃఖాన్ని మాన్పిన స్వాంతన దొరికిందో తెలీదు గాని ఆ తర్వాత ఏమైందో గుర్తులేదు.
ఇది జరిగి ఎన్నో ఏళ్ళయింది. చంద్రుడితో ఆనాటి చెలిమి ఎప్పుడు తెగిపోయిందో గుర్తేలేదు. అవ్వ చెప్పేది బాల్యం గడిచిపోతే ఇక పిల్లలకు చంద్రుడిలోకంతో సంబంధం వుండదని. బాల్యం గడిచేక చంద్రుడి సావాసం తెగిందో, చంద్రుడి సావాసం పోయేకనే బాల్యం పోయిందో తెలీకుండానే రోజులు గడిచిపోయేయి. నిండుపున్నమి వెన్నెల్లో బీచ్ లో కూచుని చూస్తూ వుంటే సముద్రాన్ని వెండినీళ్ళల్లా మార్చే చంద్రుడు ఇప్పటికీ వింతగానే అనిపిస్తాడు. కానీ చిన్నప్పటి చెలిమే వేరు.
ఏమాటకామాటే చెప్పుకోవాలి. ఒకరోజు చంద్రుడితో అదివరకెన్నడూ లేని అనుభవం కలిగింది. ఎప్పుడూ ఫ్రెండ్ లాగా చాలా ఆత్మీయంగా కనిపించే చంద్రుడు నావైపు ఎన్నడూ లేనంత తిరస్కారంగా చూసేడు. కోపంతో తలతిప్పుకు వెళ్ళిపోయేడు. అదెప్పుడో చెప్తాను.
ఒకరోజు ఆఫీసునుంచి వస్తూనే సబ్బు కొరుకుతూ కనిపించేడు నా మూడేళ్ళ కొడుకు. అంతే కోపం పట్టలేకపోయేను. ఒక్క ఉదుటున వెళ్ళి రెండు వేసేను. దెబ్బల నెప్పికంటె నేను కొట్టేనన్న విషయం వాడిని ఎక్కువ బాధ పెట్టినట్టుంది. ఐదారు సెకన్లు దుఃఖం అదిమిపెట్టుకుని పెద్దపెట్టున ఏడవడం మొదలుపెట్టేడు. ఒక రెక్క పట్టుకు లాక్కెళ్ళి నల్లా దగ్గర మూతి శుభ్రంగా కడిగేను. వాడు ఏడవడం ఆపలేదు. వాళ్ళమ్మ కూడా వాడిని సపోర్టు చెయ్యకపోవడంతో వాడికి యింకా ఉక్రోషం కలిగింది. నేను బట్టలు మార్చుకుని స్నానం చేసి వచ్చే సరికి వాడు ఒక్కడే మంచం మీద చేరి పక్కకు తిరిగి పడుకుని ఎటో చూస్తూ ఆలోచిస్తున్నాడు.
వాడు సబ్బుతింటే ఏం జరిగి వుండేదన్న భయంతోనో, వాడిని కొట్టేనన్న బాధతోనో అన్నం తినబుద్ధి కాలేదు. కాస్త తిని వాడిపక్కనే పడుకున్నాను. దగ్గరకెళ్ళి బొజ్జమీద చెయ్యివేసి సబ్బుతింటే ఎంత ప్రమాదమో చెప్దామనుకున్నాను. నేను చెయ్యి వెయ్యగానే విసురుగా తోసేసాడు. రోజంతా నేనొస్తానని ఎదురుచూసి ఎదురుచూసి తీరా నేనొచ్చాక జరిగినదాంతో కోపంతో వున్నట్టున్నాడు. కాసేపటికి నిద్రపోయేడు-నన్ను కథ చెప్పమని అడగకుండానే. నాకూ నిద్రపట్టేసింది. ఎంత రాత్రయిందో ఏమో గానీ కలతనిద్రలో అటూ యిటూ దొర్లుతున్నాను. ఏదో కల వస్తూ వస్తూ కలతనిద్ర వల్ల సరిగ్గా కొనసాగడంలేదు. ఆ కలలో నేను పదులూ వందల రెట్లు పెద్దగా కనిపిస్తున్నాను. చూస్తూ చూస్తూ యింకా పెరిగిపోతూ వున్నాను. నేను పెరుగుతున్నానో లేకపోతే గాలిలో ఎగురుతున్ననో స్పష్టంగా తెలియడంలేదు గాని క్రమంగా మేడలూ చెట్లూ, కొండలూ యిప్పుడు నాకు చాల చిన్నవిగా కనిపిస్తున్నాయి. నా చేతికి ఏదో చల్లగా అనిపిస్తే ఏమిటా అని చూసేను. నీటితో చెమ్మగిల్లిన మేఘమొకటి చేతిని తాకుతూ పోతోంది. చుట్టూ చూస్తే సబ్బునురగల్లా కనిపిస్తున్నాయి మేఘాలు. సబ్బు బుడగల మేఘాల్లో దూరంగా పడవలాగా కదులుతూ చంద్రవంక కనిపించింది. దగ్గరకెళ్ళి చూసేను. చంద్రవంక మీద చాలామంది పిల్లలు కనిపించేరు. వాళ్ళ కేరింతలతో అక్కడంతా చాలా సందడిగా వుంది. నీటి ఆవిర్లతో కూడుకున్న మేఘాల గాలులలో వాళ్ళు సరిగ్గా కనిపించకపోతే మరింత దగ్గరగా వెళ్ళేను. ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నారు వాళ్ళంతా. సబ్బు నురగల్లో చేతులూపుతూ ఒకరిపై మరొకరు జల్లుకుంటున్నారు.
మబ్బుల చాటునుంచి హఠాత్తుగ ప్రత్యక్షమైన నన్ను చూసేరు వాళ్ళు. కేరింతలు కొడుతున్న వాళ్ళంతా ఒక్కసారి అవాక్కయిపోయారు. భయంతో వణుకుతూ చంద్రవంకను గట్టిగా పట్టుకున్నారు. అప్పటిదాకా కదులుతున్న పడవ బ్రేక్ వేసినట్టు ఆగిపోయింది. అప్పుడు చూసేను ఆ పిల్లల్లో మా బాబును. వాడి ముఖమ్మీద చేతులమీద మేఘాల నురగ కనిపించింది. వాడు నావైపు భయం భయంగా చూస్తున్నాడు. నాకు వెంటనే సబ్బుతిన్న సంగతి గుర్తొచ్చింది.
“చెప్పు, సబ్బెందుకు నోట్లో పెట్టుకున్నావ”ని గట్టిగా గదమాయించేను. వాడు బిక్క చచ్చిపోయేడు. మిగితా పిల్లలు కూడ వణుకుతున్నారు ఏం చెయ్యాలో తెలియక. ”చెప్పూ”అన్నాను మళ్ళీ గట్టిగా. జవాబుగా ఎడమచెయ్యి ఎత్తి గాల్లో తిప్పుతూ “నువ్ పో” అన్నాడు. చంద్రవంక నావైపు చాల కోపంగా చూసింది. తల తిప్పుకుంది. మరుక్షణంలోనే కదిలింది. మెల్లగా పైకి ఎగిరి వేగం అందుకుంది. అప్పటిదాక పెరుగుతూ వున్న నేను అంతకంటె యిక పెరగలేకపోయేను. చూస్తుండగానే వాళ్ళు మేఘాల్ని దాటి చుక్కల దగ్గర కెళ్ళిపోయేరు.
ఒక్క సారి నా కల చెదిరిపోయింది. పక్కకు తిరిగి చూసేను. నిద్రలో నవ్వుతూ కదులుతున్నాడు వాడు. బహుశ చుక్కల లోకంలో దిగినట్టున్నారు పిల్లలు అనుకున్నాను.
(ఎప్పటెప్పటి ఊహలకు ఒక రూపాన్ని సూచించిన శ్రీకాంత్‌కు కృతజ్ఞతలతో)
అద్భుతంగా వుంది. మనసు మళ్ళీ బాల్యానికి పరుగులు తీసింది.
–ప్రసాద్
http://charasala.com/blog/
చాలా బాగుంది.
చంద్రుడు నక్షత్రాలు మేఘాలు పడవలు వెన్నెలవిహారాలు…సుందరస్వప్నాలు…!
తప్పిపోయిన బాల్యం..తరుముతున్న జీవితం..కళ్ళ ముందు కదిలాయి….కవితాత్మక కధ..బాగుంది.
చాలా మంచి కధ. రచయిత ఎన్నుకున్న వస్తువు, శిల్పం అద్భుతంగా ఉన్నాయి. కధ ఫ్రేము చక్కగా కుదిరింది. కూర్మనాధ్ గారు ఇలాంటి మరిన్ని మంచి కధలు రాస్తారని ఆశిస్తాను.