- జి. వెంకటకృష్ణ
అఖండమైందేమీ లేదని
స్వప్నం వొకటి కన్నాక
ఖండాలను సానబెట్టుకున్న
మనిషి కథ యిది
నీ జ్ఞాపకాల్లో నీవు
నీ వేదనల్లో నీవు
నీడలా నిలిచిన నీ ప్రతిబింబం
అద్దమై ఘనీభవించిన రూపం
శకలాలు అతుక్కున్న మాయాజాలంలో
అంగాంగాలూ అఖండమైన జ్ఞాపకం
అవనినీ ఆకలినీ యిముడ్చుకొని
రహస్య పొరలలో
స్పష్ట దృశ్యాల ఛాయలో
ఎలుగెత్తిన ఒక ధిక్కారం
అఖండమైందేమీ లేదని
కలవరింత వొకటి పలకరించాక
ఖండ ఖండాలను పుటం పెట్టుకున్న
సమిష్టి కథ యిది
భౌతిక శక్తులు ఘర్షించిన దారుల్లో
ఆత్మిక శక్తులు సంధానించిన గమ్యాల్లో
దూరం ఎన్ని తరాలైనా
కాలస్మృతి పేటికలో
పేర్చుకుంటున్న శకలాలు
చర్యల చేనేతలతో
అతికిన వృత్తాలు.
అఖండమైందేమీ లేదని
కలవొకటి కన్నాక
శకలాలను కూర్చుకునే కథ యిది
సంకెళ్ళ అడ్డుగోడల మధ్యా
సుడిగుండాల సమాధుల మధ్యా
వీచి వర్షించే రుతుగానం
అల్పపీడనాల్ని సృష్టించుకున్న వేళ
కుంభవృష్ఠుల్ని భరించే యత్నం
అసమతౌల్యం పరుచుకున్న నేల
సంఘర్షించే కథనం .
శకలాలన్నీ అఖండం
అఖండంలో యిమిడిన శకలం
నీ పిడికిట దాగిన రహస్యం .
కొన్ని గొప్ప భావ సంచలనాలు ఉన్నా పునరుక్తుల వల్ల ప్రయోజనం నాకు అంతగా కనిపించడం లేదు.