- ఎన్. వేణుగోపాల్
కొత్త సహస్రాబ్దిలో మొదటి దశాబ్దం సగం గడిచిపోయింది. అంతకుముందరి దశాబ్దంలో తెలుగు సాహిత్య ప్రక్రియలన్నిటినీ విపరీతంగా ప్రభావితం చేసిన వస్తువు ప్రపంచీకరణ అని అందరికీ తెలుసు. కాగా, ఈ దశాబ్దంలో ఆ వస్తువు సాహిత్యం మీద ఎటువంటి ప్రభావాన్ని వేస్తోంది, అటు ఆ వస్తువులో గాని, ఇటు దాని ప్రభావంలో గాని ఏమైనా చెప్పుకోదగిన మార్పులు వచ్చాయా అని పరిశీలించడం సమాజ -సాహిత్య సంబంధాల అధ్యయనంలో ఒక ముఖ్యమైన, ఆసక్తికరమైన అంశం.
ప్రపంచీకరణక్రమంలో ఏ కొత్త కోణాలు ఉనికిలోకి వచ్చాయి, వస్తున్నాయి, అవి మన కథా ప్రక్రియను ఏ పద్ధతిలో ప్రభావితం చేస్తున్నాయి, అందువల్ల తెలుగు సమాజానికీ సాహిత్యానికీ ఏ మేలు జరుగుతోంది, లేదా ఏ కొత్త కోణాలను మన కథా రచయితలు గుర్తించలేకపోతున్నారు, అందువల్ల తెలుగు సమాజానికిగానీ, సాహిత్యానికిగానీ జరుగుతున్న నష్టం ఏమిటి అని చర్చించడం ఇవాళ్టి ప్రసంగ (ఈ వ్యాస) లక్ష్యం.ఈ దశాబ్దంలో కథా ప్రక్రియ, అంతకుముందరి దశాబ్దంలో ఉన్నంత ఆశావహంగా లేదని, ఎంపిక చేసుకోవడం ఒకప్పుడు ఉన్నంత సులువుగా ఉండడం లేదని, మంచికథలనుకున్నవాటి సంఖ్య తగ్గిపోతున్నదని కథ సిరీస్ సంపాదకులలో ఒకరయిన నవీన్ అంటున్నారు. మొత్తంగానే కథాప్రక్రియ గురించి అటు పాఠకులనుంచి, ఇటు రచయితల నుంచి కూడ కొంత అసంతృప్తి వినబడుతున్నది. పత్రికలలో అచ్చవుతున్న కథల సంఖ్య, విడిగా వెలువడుతున్న కథాసంపుటాల, సంకలనాల సంఖ్య చాల ఆశావహంగా ఉంటున్నదిగాని కథల నాణ్యత అంత సంతృప్తిని ఇస్తున్నట్టులేదు. ఈ అసంతృప్తికి ఎన్నో తెలిసిన, తెలియని, అన్వేషించవలసిన కారణాలు, సంక్లిష్ట కోణాలు ఉండవచ్చు గాని, ఇక్కడ మొత్తంగా సమాజంలోనూ, ప్రత్యేకించి తెలుగు రచయితలలోనూ ప్రపంచీకరణ విషయంలో కొనసాగుతున్న అస్పష్టత, గందరగోళం, అసమగ్ర, పైపై, మూస అవగాహనలు కారణం కావచ్చుననిపిస్తున్నది. అందువల్ల ఈ సమస్యను కొంత లోతుగా అధ్యయనం చేయవలసిఉంది.
ఈ దశాబ్దంలో కథ ఎలా ఉంది అని ప్రశ్నించుకోవడం, అసంతృప్తి పడడం ఇవాళ చాల మామూలయిపోయింది. అటువంటి అసంతృప్తులన్నిటినీ చూస్తే, ప్రధానంగా కనబడే అభిప్రాయాలలో కొన్ని – కథలు లోలోపలినుంచి కదిలించేట్టుగా ఉండడంలేదు, కొత్త కొత్త సామాజిక అనుభవాలు కథలలోకి రావడం లేదు, కథకులు మంచి వస్తువులు తీసుకున్నప్పుడుకూడ లోతయిన అధ్యయనం, పరిశీలన, వస్తువు మీద సమగ్ర అవగాహన లేకుండానే రాసేస్తున్నారు, మన కథారచయితలందరూ వయసు రీత్యా ముప్పైలలోనూ ఆపైనా ఉన్నవారేగాని, ఇరవైఐదులోపలి రచయితలే కనబడడంలేదు, 1990లలో ఒకవైపు కథాసాహితి పూనికతో వెలువడడం ప్రారంభించిన కథ సిరీస్ , దానితోపాటే కథాప్రక్రియలో వచ్చిన ఇతర పరిణామాలు, కొత్త గాలులు సాధించిన విజయాలు కోల్పోతున్నామేమోనని అనిపిస్తోంది. ఇవేకాక మరికొన్ని విమర్శలు, అసంతృప్తులు కూడ ఉండవచ్చునుగాని, స్థూలంగా ఈ ప్రాతినిధ్య అసంతృప్తులను చూస్తే, అవి అన్ని రంగాలకూ — కథావస్తువుకూ, రూపానికీ, రచయితల శక్తికీ, రచయితల అవగాహనకూ, సామాజిక స్థితికీ – సంబంధించినట్టుగా కనబడుతున్నాయి.
బహుశా ఇంతగా అసంతృప్తి ఉండడానికి ఒక కారణం అంతకు ముందరి దశాబ్దంలో కథాప్రక్రియ సాధించిన విజయాలు, సాధించిన వస్తు విస్తృతి, వైవిధ్యం, లోతు కావచ్చు. ఈ దశాబ్దపు కథలను అంతకుముందరి దశాబ్దపు కథల ప్రాతిపదికమీద పోల్చిచూడడం జరుగుతుండవచ్చు. అందువల్ల ఇవాళ్టి అసంతృప్తి గురించి మాట్లాడుకోవాలంటే, మొదట, గత దశాబ్దంలో కథాప్రక్రియకు ఏమి జరిగిందో పరిశీలించాలి.
తెలుగుకథాప్రక్రియ 1990 దశకంలో ఒక కొత్త సందర్భాన్ని ఎదుర్కొంది. ఆ సందర్భం ప్రపంచీకరణ. ఆ సందర్భానికి తగినట్టుగా స్పందించడానికి తెలుగు కథ ప్రయత్నించింది. తెలుగు కథకులందరికీ ఆ ప్రపంచీకరణ క్రమం ఏమిటో, దానిలో ఇమిడిఉన్న అంశాలు, దాని పర్యవసానాలు ఏమిటో సంపూర్ణంగా తెలుసునని ఏమీ అనుకోనక్కరలేదు. కాని మన మార్కెట్లలోకి వస్తున్న కొత్త సరుకులు, మన డ్రాయింగ్ రూములలోని రంగులటీవీల ద్వారా మనకు అందుతూఉండిన, మనను ఆకర్షిస్తుండిన, సమ్మోహపరుస్తుండిన కొత్త జీవనశైలులు, కొత్త మానవసంబంధాలు మన కథారచయితలకు ప్రపంచీకరణ గురించి ఒక అవగాహన కలిగించాయి. తెలుగు కథకులు వెంటనే ఒక అసంకల్పితప్రతీకారచర్య లాగ, తక్షణ స్పందన లాగ ప్రపంచీకరణను వ్యతిరేకించారు, ప్రపంచీకరణ మానవసంబంధాలమీద ఎటువంటి దుష్ఫలితాలను వేయగలదో స్థూలంగానైనా గుర్తించి తమస్పందనలకు కథారూపాలు ఇచ్చారు.
ఆ స్పందన చాల సముచితమయినదీ, అవసరమయినదీ అనడంలో సందేహంలేదు గాని, ఇప్పుడు వెనక్కితిరిగి చూస్తే, ఆ స్పందన రోగసూచికలనే పట్టుకుందిగాని, లోపలికివెళ్లి రోగపు అసలు కారణాలనుగాని, ఆ రోగపు పరిష్కారాలనుగాని గుర్తించినట్టు కనబడదు. అందువల్లనే ఆ దశాబ్దంలో ప్రపంచీకరణ ఇతివృత్తంతో వెలువడిన గొప్ప కథలలో చాల భాగం రోగసూచికలమీద కథలుగా మిగిలిపోయాయి. ఈ విశ్లేషణ ఆ కథల పాత్రను తక్కువ చేయడానికి కాదు. అవన్నీ కూడ నిజంగా గొప్ప కథలు. సాలభంజిక, ఖాదర్ లేడు, తెల్ల దయ్యం, రైతుల ఆత్మహత్యల కథలు, కార్మికుల జీవనోపాధి హరించడం మీద కథలు, వాటర్, పెండెం సోడా సెంటర్, వలసపక్షి, ఆఖరికి ఐదు నక్షత్రాలు, మురళీవాళ్లమ్మ, టైటానిక్, సూపర్ మామ్ సిండ్రోమ్, చివరి పిచ్చుక వంటి కథలన్నీ నిజంగా గొప్ప కథలే. జీవనానుభవాన్నీ, అవగాహననూ ఉన్నతీకరించే కథలే. కాని వాటిలో చాలభాగం రోగకారణం దగ్గరికి, మూలానికి వెళ్లలేకపోయాయని గుర్తించడం అవసరం.
నిజానికి ప్రపంచీకరణకు చెప్పలేనన్ని ముఖాలున్నాయి, సంక్లిష్ట కోణాలున్నాయి. అనేక రంగాలలో దాని ధాతువులు, పర్యవసానాలు ఉన్నాయి. గత పదిహేనుసంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగానూ, దేశంలోనూ, తెలుగులోనూ వెలువడుతున్న ప్రపంచీకరణ అధ్యయనాలను చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. ప్రపంచీకరణకు రాజకీయార్థిక, సామాజిక, చారిత్రక, సాంస్కృతిక రంగాలన్నిటిలోనుంచీ చెప్పుకోగల అర్థాలెన్నో ఉన్నాయి. ఇవన్నీ ఒక సృజనాత్మక రచయిత తెలుసుకొని ఉండాలా, అవన్నీ రాస్తే అది కథ అవుతుందా అని ప్రశ్నిస్తే ఆ సైద్ధాంతికస్థాయి సంక్లిష్టతను ఉన్నదున్నట్టుగా రాస్తే అది కథ అవుతుందో కాదో కాని ఆ మూలాల అవగాహన కథా రచయితకు ఉండడం అవసరం అని నేననుకుంటాను.
తొలిదశాబ్దంలో ప్రపంచీకరణను ఇంత లోతుగా, తాత్వికస్థాయిలో అర్థంచేసుకోవడంలో మనం చేయవలసినంత కృషి చేయలేదేమోననిపిస్తుంది. బహుశా అందువల్లనే ఆ దశాబ్దంలో సాహిత్యప్రక్రియలన్నీ ప్రపంచీకరణపట్ల స్థూలంగా వ్యతిరేకవైఖరినే తీసుకున్నప్పటికీ, క్రమక్రమంగా ఆ వైఖరి మూసగా మారిపోయింది. ఆ తర్వాత వచ్చిన సాహిత్యరచనలన్నీ, ముఖ్యంగా కథలు పాత కథలకు అనుకరణలుగా కనిపించడం మొదలయింది. బహుశా ఇవాళ్టి అసంతృప్తికి ఒక కారణం అది కావచ్చు.
ఈ నేపథ్యంలో ఈ దశాబ్దపు అవసరం ఆ లోతులకు వెళ్లి, ప్రపంచీకరణను సమగ్రంగా, విశాల అర్థంలో గ్రహించడం. అలా గ్రహించినప్పుడు, మొదట ప్రపంచీకరణ క్రమపు తాత్విక, రాజకీయార్థిక, సాంస్కృతిక అర్థాలు ఏమిటో తెలుసుకోవాలి.
ఇదివరకు చాలసార్లు చెప్పినమాటే, ఇక్కడ కొందరయినా విని ఉన్న మాటే కాని, మరొకసారి చెప్పదలిచాను. కవి, రచయిత, బుద్ధిజీవి ఎవరయినా ఎందుకు ప్రపంచీకరణ గురించి తెలుసుకోవాలంటే, ఎందుకు ప్రపంచీకరణను వ్యతిరేకించాలంటే, ప్రపంచీకరణ అనేది తాత్వికంగానే మనిషికి వ్యతిరేకమయినదిగనుక. సాహిత్యకారులుగా మనకు మనిషే తొలి ప్రమేయం గనుక. ప్రపంచీకరణకు, దానికి మూలమయిన సామ్రాజ్యవాదానికి, పెట్టుబడిదారీ విధానానికి నిఘంటువులో మనిషి అనే మాట లేదు. ఆ నిఘంటువులో ఉన్నది అమ్మకందారు, కొనుగోలుదారు అనే మాటలు మాత్రమే. నువ్వు నీ రక్తాన్నీ చెమటనీ నాకు ఎంత చౌకగా, ఎంత ఎక్కువగా అమ్మగలవు, నీ నేలమీది వనరులను నాకు ఎంతగా అమ్మగలవు, నేను నీ నేలమీది వనరులతోనే తయారుచేసిన సరుకులను ఎంతఎక్కువగా కొనగలవు – పెట్టుబడిదారీ విధానానికి తెలిసింది ఇంతే. కాని మనకు, సాహిత్యకారులకు, సృజనకర్తలకు, బుద్ధిజీవులకు, ఆలోచనాపరులకు మనిషంటే రక్తమాంసాల మనిషి, ఉద్వేగాల మనిషి, ప్రకృతితో, సహ మానవులతో నిత్యం సంబంధాలలో ఉండే మనిషి. సాహిత్యమంతా ఈ మనిషిగురించే. మానవసంబంధాల గురించే. అందువల్ల, మౌలికంగానే తాత్వికస్థాయిలో సాహిత్యకారులకూ ప్రపంచీకరణకూ చుక్కెదురు. ఈ మౌలిక, స్వాభావిక వ్యతిరేకత అర్థమయితేగాని మన సాహిత్యరచనలలో ప్రపంచీకరణ వ్యతిరేకత లోతుగా, సమగ్రంగా ప్రతిఫలించదు.
ఇక ప్రపంచీకరణకు ఎన్నెన్ని వ్యక్తీకరణ రూపాలున్నప్పటికీ, దాని సుస్పష్టమైన ప్రయోజనం రాజకీయార్థిక రంగంలోనిదే. పెట్టుబడిదారీ విధానం పుట్టిననాటినుంచీ కూడ, దానికి మౌలిక లక్ష్యాలు తన ఉత్పత్తి యంత్రానికి చౌక ముడిసరుకులను ఇబ్బడిముబ్బడిగా, నిరంతరాయంగా సమకూర్చుకోవడం, ఆ ముడిసరుకులలో ప్రకృతి సహజమైన వ్యవసాయోత్పత్తులు, ఖనిజ వనరులు, మానవశ్రమ ఉండవచ్చు, అప్పటివరకూ సరుకులుగా గుర్తించబడని ఎన్నో వస్తువులు, సేవలు – మనిషికీ ప్రకృతికీ మధ్య ఉండేవి, మనిషికీ మనిషికీ మధ్య ఉండేవి – ఉండవచ్చు. ఈ సహజ సంబంధాలన్నిటినీ సరుకుల సంబంధాలుగా మార్చి, అన్ని సంబంధాలనూ, అన్ని వస్తువులనూ, అన్ని సేవలనూ మార్కెట్ తో అనుసంధానం చేయడం పెట్టుబడిదారీ విధాన లక్ష్యం. ఆ తర్వాత తన ఉత్పత్తి యంత్రం తయారుచేసే సరుకులను అమ్ముకోగలిగే మార్కెట్లను రూపొందించుకోవడం, వాటిని విస్తరించుకోవడం. ఈ లక్ష్యాలను మరో మాటల్లో చెప్పాలంటే సమాజంమొత్తాన్నీ మార్కెటీకరించడం దాని పరమధ్యేయం. సామ్రాజ్యవాద ప్రపంచీకరణ ఈ ధ్యేయం అమలుచేసే వ్యూహానికి పరాకాష్ట. ప్రపంచీకరణలోని ఈ రాజకీయార్థిక సారాంశాన్ని ఎంతలోతుగా అర్థం చేసుకోగలిగితే, దాని విభిన్న వ్యక్తీకరణలను గుర్తించగలిగితే, మన కథారచయితలు ఎటువంటి ఇతివృత్తం తీసుకున్నా దానిలో ప్రపంచీకరణ ప్రభావాన్ని, పర్యవసానాలను కనిపెట్టగలరు, కథారూపం ఇవ్వగలరు.
ప్రపంచీకరణ క్రమం సంస్కృతిమీద ఎటువంటి ప్రభావం వేస్తున్నదో ఇప్పటికే చాల చర్చ జరిగింది, జరుగుతోంది. ఆ విషయం మళ్లీ ఇక్కడ ప్రస్తావించబోవడంలేదు. కాని, మన సంస్కృతి అనేదాని పట్ల ఒకవైపు హిందూత్వ, బ్రాహ్మణ్యం చేస్తున్న వాదనలు, ప్రపంచీకరణ వల్ల “మన సంస్కృతి” ధ్వంసమైపోతున్నదని సంఘపరివారం చేస్తున్న వాదనలు ఒకవైపు ఉండగా, మరోవైపు స్థానిక, పరంపరాగత శ్రమజీవన సంప్రదాయాన్ని రద్దుచేసి, సరుకుగా మార్చేందుకు ప్రపంచీకరణ శక్తులు చేస్తున్న ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ సంక్లిష్ట వాస్తవికతలో ప్రపంచీకరణ సాంస్కృతిక ప్రభావాల గురించి మన కథారచయితలు శ్రద్ధగా, నిశితంగా అధ్యయనం చేయవలసిఉంది.
ఈ సంక్లిష్ట అంశాలను గుర్తించడానికి, అర్థం చేసుకోవడానికి అవసరమయినంత దృక్పథ స్పష్టత లేకపోవడం మన రచయితలలో ఒక ముఖ్యమైన లోపమని అనిపిస్తుంది. మన సమాజంలో, సాహిత్యలోకంలో అనేకదృక్పథాల కలగూరగంప అభిప్రాయాలు, తాము ఒక దృక్పథానికి చెందినవారమని చెప్పుకుని తిరుగుతున్నప్పటికీ ఆ దృక్పథపు లోతుపాతుల గురించి అవగాహన లేకపోవడం సర్వసాధారణంగా జరుగుతోంది. ప్రగాఢమైన జీవితానుభవంతో, సన్నిహిత జీవనస్పర్శతో ఒకటో రెండో మంచికథలు రాయవచ్చును గాని, జీవితాన్ని సమగ్రంగా, సునిశితంగా అవగాహన చేసుకోగలిగిన దృక్పథ స్పష్టత లేకపోవడం వల్ల కొత్తకొత్త జీవనసందర్భాలను అర్థంచేసుకోవడం కష్టమవుతుంది. అందువల్ల వాటికి కథారూపం ఇవ్వడం కష్టమవుతుంది.
ఇవాళ్టి కథారచనలోని సమస్యలకు ఒక ప్రధాన కారణం ఈ దృక్పథస్పష్టత లేకపోవడమేననిపిస్తుంది. అందువల్లనే మన నిత్యజీవితానుభవంలోకి వస్తున్న అనేక కొత్త జీవనరంగాలు, వృత్తులు, జీవనశైలులు మనం అర్థం చేసుకోలేకపోతున్నం. ప్రపంచీకరణ ఫలితంగా, అందులో భాగంగా మనచుట్టూ జీవితం చాల మారిపోతున్నది. ఆ మారిపోతున్న జీవితాన్ని ఎంతోకొంత పత్రికా వార్తలు, ఇతర ప్రచార, ప్రసార మాధ్యమాలు మన దృష్టికి తెస్తున్నాయి. కాని ఆ ఉపరితల నివేదికలతోనే కథ, నవల వంటి వచనప్రక్రియలు రాయడం సాధ్యం కాదు. ఆ వార్తా నివేదికలకు రక్తమాంసాలు, మానవసంబంధాలు, ఉద్వేగాలు, సన్నివేశాలు, సంభాషణలు వంటివెన్నో చేర్చవలసిఉంటుంది.
ఒక్కసారి మనచుట్టూ ఉన్న జీవనరంగాలను, అసలు మన జీవితాలనే పరిశీలించిచూడండి. ఒక పది సంవత్సరాలకింది జీవితంతో పోల్చిచూడండి. ఎంత మార్పు కనబడుతోంది? ఆ మార్పు కింద ఎంత పాత కొనసాగింపే కనబడుతోంది? నిజానికి సాహిత్యం చేయవలసిన పని ఇట్లా మన జీవితానుభవంలోకి వచ్చి మనకు అప్రజ్ఞాతంగా ఉన్న విషయాలను మనకు విప్పిచెప్పగలగడం. కథకూ, ఇతరవచనప్రక్రియలకూ ఆ శక్తి ఉంది. మనకథారచయితలు ఆ శక్తిని గుర్తిస్తున్నారా, వాడుకుంటున్నారా?
ఇక్కడ ఇటీవలి రెండుకథలను గురించి ప్రస్తావించాలి. ఆ కథల్లో శిల్పపరమైన లోపాలో, ఇతర లోపాలో ఉండవచ్చును గాని ఆ రెండు కథలూ కూడ తెలుగు సమాజంలోకి కొత్తగా ప్రవేశిస్తున్న జీవన రంగాలగురించి, జీవనశైలులగురించి, మానవసంబంధాల పరిణామాలగురించి వెలుగు ప్రసరించడానికి ప్రయత్నించాయి. వాటిలో మొదటిది అక్కిరాజు భట్టిప్రోలు రాసిన గేటెడ్ కమ్యూనిటీ. తెలుగు సమాజంలోకి కొత్తగా గేటెడ్ కమ్యూనిటీ అనే బృందం వచ్చి చేరుతోంది. నిజానికి ఈ బృందం ప్రవేశించి పది సంవత్సరాలు గడుస్తున్నా, ఇంతకాలం అది మన సాహిత్యంలోకి రాకుండానే ఉండిపోయింది. ఎకనమిక్ అండ్ పొలిటికల్ వీక్లీ సంపాదకులు రామమనోహర్ రెడ్డి ‘టు ఇండియాస్ ‘ పేరుతో ఈ కొత్త పరిణామాన్ని విశ్లేషిస్తూ ఒక వ్యాసం రాశారు. భారత సమాజంలోపలనే, చుట్టూ ఉన్న సమాజానికి భిన్నమైన ఒక బృందం తమ నివాసాలచుట్టూ గోడలు కట్టుకుని, సమాజంనుంచి వేరయిపోయి, అంతర్జాతీయ సంపన్నులు అనుభవించే విలాసాలన్నీ అనుభవించాలని ఉవ్విళ్లూరుతూ బతుకుతోంది. ఇటువంటి గేటెడ్ కమ్యూనిటీలు హైదరాబాదుకు, ఇతర తెలుగు నగరాలకు విస్తరించి చాలకాలమే అయినా ఎందువల్లనో అది తెలుగు కథా వస్తువు కాలేకపోయింది. అలాగే, మానవ సంబంధాలలో, ముఖ్యంగా స్త్రీ పురుష సంబంధాలలో కాజువల్ వైఖరి ఎప్పటినుంచో ఉన్నదే, పురుషులు అనుభవిస్తున్నదే కాని, ప్రపంచీకరణ తర్వాత వచ్చిన ఎంతోకొంత వెసులుబాటువల్ల మధ్యతరగతి యువతి ఆ కాజువల్ వైఖరిని తాను అమలుచేయదలచుకుంటే ఏమవుతుంది? ఇది ఒక కొత్త జీవనశైలి. దీనిగురించి తాడికొండ శివకుమారశర్మ రాసిన పెళ్లంటే కథ వచ్చింది. ఈ రెండు కథలూ ప్రపంచీకరణ తర్వాత విస్తరిస్తున్న జీవితాన్ని, లేదా విచ్ఛిన్నమవుతున్న జీవితాన్ని పట్టుకోవడానికి చేసిన ఆహ్వానించదగిన ప్రయత్నాలని నేననుకుంటున్నాను.
ఇప్పటివరకూ తెలుగుకథ ప్రపంచీకరణ గురించి రాయడమంటే మానవసంబంధాల విచ్ఛిన్నాన్ని, ముఖ్యంగా చెదిరిపోతున్న గ్రామీణ జీవన సౌందర్యాన్ని రాయడమే నని, నోస్టాల్జియా – పురాస్మృతిని – రాయడమేనని ఒక అభిప్రాయంతో ఉంది. అది కొంతవరకు నిజమేగాని, అంతకుమించి రాయవలసిన విషయాలెన్నో ఉన్నాయని గుర్తించవలసి ఉంది. కొన్ని ఉదాహరణలు చెప్పుకోవాలనుకుంటే, నేరం తీసుకోండి, ఒక మహా విషవలయంలా విస్తరిస్తున్న ప్రపంచీకరణ వలలను చూడండి. ప్రపంచీకరణలో భాగంగా పాలకవర్గాలు ప్రొత్సహిస్తున్న సమ్మతి తయారీ ని చూడండి. సంస్కృతులమధ్య ఘర్షణ పేరుతో అంతర్జాతీయంగా ముస్లిములమీద దాడి దగ్గరినుంచి అట్టడుగున అనాదృత, దళిత వర్గాలమీద దాడి దాకా సాగుతున్న బహిరంతర యుద్ధాలను చూడండి. వీటన్నిటికీ ప్రపంచీకరణకూ ఉన్న అవినాభావ సంబంధాన్ని చూడండి. ఇవన్నీ కథా ప్రక్రియలోకి తప్పకుండా రావలసినవే.
మొదట నేరం సంగతి చూద్దాం. పదిసంవత్సరాలకిందికీ ఇప్పటికీ మన సమాజంలో నేరం పాత్ర ఎంత పెరిగిపోయిందో చూడండి. ఒకప్పుడు దినపత్రికల్లో నేరం వార్తలు జిల్లాల అనుబంధాల్లో పావుపేజీ, అరపేజీకి మించేవికావు. ఇప్పుడవి హైదరాబాదులోనైతే రెండుపేజీలకు దాటిపోతున్నాయి. అంతర్జాతీయంగా, ముఖ్యంగా లాటిన్ అమెరికన్ దేశాల్లోనూ, తూర్పు ఆసియా దేశాల్లోనూ ఎంతోమంది విశ్లేషకులు ప్రపంచీకరణకూ నేరం పెరుగుదలకూ ఉన్న ప్రత్యక్ష సంబంధంగురించి నిర్ధారించిఉన్నారు. ప్రపంచీకరణ క్రమం వల్ల విచ్చలవిడిగా పెరిగిన రియల్ ఎస్టేట్, మాఫియా, లంచగొండితనం, మాదకద్రవ్యాల వాడకం, జూదం, పాలనలో అరాచకం, మీడియా పేరుమీద స్వార్థప్రయోజనాల రక్షణ వంటి పరిణామాలన్నీ మానవ జీవితాన్ని అతలాకుతలంచేస్తున్నవే. తప్పనిసరిగా సాహిత్యరూపం పొందవలసినవే. గత పది సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ మన నగరాలలోనూ, పట్టణాలలోనూ జీవితాన్ని అల్లకల్లోలం చేస్తుంటే, ఒక్క కథ కూడ రాలేదంటే విచారించవలసిన విషయమే.
ఇక ప్రపంచీకరణకు ఒక అంతర్జాతీయ స్వభావం, అన్నిటినీ కప్పేసే వల స్వభావం, వాతాపిజీర్ణం అని అన్నిటినీ మింగేయగల స్వభావం ఉన్నాయి. ఇంతగా సంక్లిష్టత, పరస్పరాశ్రయత, పొరలుపొరలుగా సంబంధాలు ఉన్నచోట ఆ ఇతివృత్తాన్ని సృజనాత్మకప్రక్రియలోకి తీసుకురావడం చాల ఆసక్తికరంగా, సవాలులాగ ఉంటుంది. రాజకీయార్థశాస్త్రవిద్యార్థిగా నా అనుభవంలో ఉన్న ఒక విషయం చెపుతాను.
ఇది గ్లోబల్ కుగ్రామం, ఇది ప్రపంచ సంగ్రామం అన్నప్పుడు శ్రీ శ్రీది అతిశయోక్తి అనిపించవచ్చు. గంగవరంలో చిందిన మత్స్యకారులనెత్తురుకూ, అమెరికన్ సామ్రాజ్యవాదానికీ సంబంధం ఉన్నదని నేనంటే బట్టతలకూ మోకాలుకూ ముడిపెట్టినట్టుందని అనిపించవచ్చు. కాని, అమెరికన్ సామ్రాజ్యవాదం, అమెరికన్ ఆర్థిక వ్యవస్థ, అమెరికన్ సైనిక-పారిశ్రామిక యంత్రాంగం తమ జలాంతర్గాముల నిర్మాణానికీ, బాంబర్ల, జెట్ ఫైటర్ల, క్షిపణి వ్యవస్థల నిర్మాణానికీ ఆధారపడే లోహాలలో ప్రధానమైనది అల్యూమినియం. ఆ అల్యూమినియం తయారు కావాలంటే బాక్సైట్ అనే ఖనిజం కావాలి. ప్రపంచంలో దొరికే బాక్సైట్ ఖనిజం మొత్తంలో తొంభై శాతం వాడుకునే అమెరికా లో బాక్సైట్ ఖనిజం లేదు. ఆ ఖనిజాన్ని తవ్వితీసే దీశాలన్నిటినీ తన గుప్పెట్లో పెట్టుకునిఉండడం అమెరికా కు అత్యవసరం. ఆ బాక్సైట్ మన విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల సరిహద్దు అడవి కింద ఉందిగాని, అక్కడ తవ్వకాలు జరపడానికి వన్ ఆఫ్ సెవెంటీ చట్టం అడ్డం వస్తుంది. ఆదివాసుల జీవనసరళి అడ్డంవస్తుంది. అక్కడినుంచి బాక్సైట్ తవ్వే పనిని సామ్రాజ్యవాదుల దళారీ సంస్థ జిందాల్ కంపనీ కి అప్పగించి, దాన్ని రవాణా చేయడానికి ప్రత్యేకంగా గంగవరం ఓడరేవు నిర్మించాలి. అక్కడ తరతరాలుగా జీవిస్తున్న మత్స్యకారులు అడ్డం వస్తే వారిమీద కాల్పులు జరిపి, నెత్తురు పారించి అయినా సరే, బాక్సైట్ తరలింపుకు మార్గం సుగమం చేయాలి. అమెరికాలో తయారయిన జలాంతర్గామి మీద గంగవరంలో పోలీసుకాల్పులకు బలిఅయిపోయిన నూకరాజు నెత్తురు అంటి ఉందనే దృశ్యం ఒక వచనరచయితకు ఎంత అవకాశం ఇవ్వగల ఇతివృత్తం?
రోడ్ల వెడల్పు కార్యక్రమం మన రాష్ట్రంలో ప్రారంభమై, అన్నిచోట్లా, రహదారులపక్కన చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుని బతుకు వెళ్లదీస్తున్న అభాగ్యుల జీవితాలలో భూకంపం సృష్టించినప్పుడు ఖాదర్ లేడు వంటి ఆర్ద్రమైన కథలతో తెలుగు కథ స్పందించింది. కాని ఒక దశాబ్దం గడవకుండానే, ఇవాళ మన పాలకవర్గాలు, ప్రపంచీకరణశక్తులు ఎంత విజయం సాధించాయంటే, రోడ్ల వెడల్పు కార్యక్రమానికి సమ్మతి తయారీ మొదలయిపోయింది. ఇవాళ అనేకానేక ఆకర్షణీయమైన పథకాలలో విపరీతంగా వాహనాలు కొనుక్కున్న మధ్యతరగతి (ఆ వాహనాల అమ్మకాల వెనుక ఉన్న చమురు పరిశ్రమ, వాహన పరిశ్రమ ప్రయోజనాలు, వాటికోసం దేశవ్యాప్తంగా వేలకోట్ల రూపాయలతో నిర్మాణమవుతున్న రోడ్లు – అదంతా మరో కథ) ఇవాళ రోడ్డు మీదికి రాగానే రద్దీని చూసి విసుక్కుని రోడ్ల వెడల్పు కార్యక్రమం ఎంత మంచిదో నని కితాబులు ఇస్తున్నారు. ఇంకా రోడ్లు వెడల్పు అయితే బాగుండునంటున్నారు. ఈ మానసికస్థితిలో మార్పు మన కథలకు ఇతివృత్తంకాదా? ఆ మార్పుకు మూలమైన సమ్మతి తయారీ, ఆ మార్పుతో లాభపడే బహుళజాతి సంస్థల కుట్రలు మన కథలకు ఇతివృత్తాలు కావా?
ఇక చివరిగా, చమురునేలలమీద జీవితాలు గడుపుతున్న ముస్లిములమీద దాడి చేయడానికి సంస్కృతులమధ్య ఘర్షణ అని అమెరికన్ సామ్రాజ్యవాదం, బహుళజాతి సంస్థలు ఒక సిద్ధాంతాన్ని తయారు చేసుకున్నాయి. ఆ సిద్ధాంతం అంతర్జాతీయస్థాయిలో మాత్రమే కాదు, అన్నిచోట్లా అమలులో ఉంది. అన్నిచోట్లా, ఏయే వర్గాలు, సమూహాలు తరతరాలుగా చేతివృత్తులకూ, వ్యవసాయానికీ, స్వతంత్ర వైద్యానికీ, సహస్రవృత్తుల శ్రమలకూ ఆలవాలమో ఆయా వర్గాలనూ సమూహాలనూ అణచివేయడానికీ, పక్కకు తోసేయడానికీ, వారి నైపుణ్యాలకు విలువలేకుండా చేయడానికీ సామ్రాజ్యవాదం, బహుళజాతిసంస్థలు ప్రయత్నిస్తున్నాయి. వారిలో చాల ఎక్కువమంది ఇంకా మార్కెటేతర సంబంధాలలో ఉన్నారు గనుక, వారిని పక్కకు తోసేయడమే ఏకైక మార్గంగా సామ్రాజ్యవాదం భావిస్తోంది. ఇవాళ రెండో దశ సంస్కరణలు అనీ, గ్రామీణ మార్కెట్లలోకి ప్రవేశం అనీ, మైక్రోఫైనాన్స్ అనీ, చేతివృత్తుల ఆధునికీకరణ అనీ వినబడుతున్న నినాదాల అసలు సారం ఇదే. ఇది ప్రపంచీకరణ కొత్త ముఖాలలో ఒకటి. ఈ ఘర్షణలో నష్టపోయే వారు ముస్లింలు, ఆదివాసులు, స్త్రీలు, దళితులు, వృత్తికులాలవారు – ఒక్క మాటలో చెప్పలంటే, మన సమాజంలోని అత్యధిక సంఖ్యాకులు. వారి జీవితాల్ని అల్లకల్లోలంచేయబోతున్న ఈ ప్రపంచీకరణముఖం గురించి రాయడంకన్న మన సాహిత్యం సాధించగలిగిన ప్రయోజనం మరేమన్నా ఉన్నదా?
ప్రపంచీకరణ అనివార్యమని, దాన్ని ఆపలేమని, కేవలం దానికి మానవీయ ముఖం కలపడం తప్ప మరొక దారి లేదని చాలమంది మేధావులు భావిస్తున్నారు, ప్రకటిస్తున్నారు. కాని ప్రపంచీకరణను అడ్డుకోవడం పరిమిత అర్థంలోనైనా సాధ్యమేనని లాటిన్ అమెరికన్ ప్రజా ఉద్యమాలు అనుభవాలు చూపుతున్నాయి. ప్రపంచీకరణను అంతిమంగా అడ్డుకోవడం, రద్దుచేయడం ఒక రాజకీయ చర్య అని, రాజకీయర్థిక క్రమం అని అందరికీ తెలుసు. ఆ చర్యలనూ, క్రమాలనూ బలపరచడం రచయితల బాధ్యత. ఒకవేళ ఆ రాజకీయకార్యక్రమంలో భాగం పంచుకోదలచుకోకపోయినా, ప్రపంచీకరణ్ ప్రోత్సహించదలచిన మార్కెటీకరణ క్రమానికి వ్యతిరేకంగా, మనసమాజంలో ఉన్న మార్కెటేతర సంబంధాలను ఎత్తిపట్టే పని చేయవచ్చు. అంటే ఒక ప్రత్యామ్నాయ సంస్కృతికి మనం సాహిత్య వ్యక్తీకరణ ఇవ్వవచ్చు.
ఈ పని చేయకుండా మనను అడ్డుకుంటున్నవి ఏమిటి? ఎందువల్ల మన బుద్ధిజీవులు, కథారచయితలు ఈ కొత్త కోణాలవైపు తమ దృష్టి సారించడంలేదు?
ఇందుకు కారణాలు మన సమాజంలోనూ, మన సాహిత్య సంప్రదాయాలలోనూ, మన బుద్ధిజీవులు రూపొందే పద్ధతిలోనూ ఉన్నాయనుకుంటాను. మన సమాజంలో కొంత సాధించగానే ఆగిపోయే తత్వం ఎక్కువ. జ్ఞానం అపారమనీ, ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవలసింది ఉంటుందనీ మనకు తెలుసు గాని, దాన్ని అమలులోకి తేవడానికి మనలో మధ్యతరగతికి సహజమైన బద్దకం, నిర్లిప్తత, అలక్ష్యం వంటి ఆటంకాలెన్నో ఉన్నాయి. మన సమాజంలోనే, మన సాహిత్య సంప్రదాయంలోనే అసమగ్రతను ఆమోదించే, చూసీ చూడనట్టుపోయే గుణం ఏదో ఉన్నట్టుంది. నిజానికి ఎంత జ్ఞానికైనా, ఎంతటి అనుభవజ్ఞుడికైనా అసమగ్రత ఉంటుంది. ఆ అసమగ్రతను ఎవరైనా అధ్యయనం ద్వారా, పరిశీలనద్వారా తగ్గించుకోగలరు. సమగ్రత వైపు ప్రయాణించగలరు. మరొక సందర్భంలో, తత్వశాస్త్ర చర్చలో భాగంగా లెనిన్ అన్నట్టు, పరమసత్యం అనేదేమీ లేదు, ఏ ఒక్కరూ పరమ సత్యాన్ని చేరుకోలేరు, ప్రతిఒక్కరూ చేసేది ఆ పరమసత్యంవైపు ప్రయాణం మాత్రమే. ఆలోచనాపరులందరూ చేసే అధ్యయనం ద్వారా, జీవిత పరిశీలనద్వారా చేసే ఆ ప్రయాణానికి అదనంగా ఒక కథారచయిత వస్తువైవిధ్యం కొరకు, కొత్త శిల్ప పద్ధతుల కొరకు అన్వేషణ సాగించవలసి ఉంటుంది. కొత్త ప్రయోగాలు చేయవలసిఉంటుంది. ఇదంతా కథారచయితలమీద మోయలేని బరువులు మోపడంకాదు. కథారచయితలు పండితులుగా మారిపోవాలని సూచించడం కాదు. మనకాలపు కథారచయితలముందర కాలం ప్రపంచీకరణ అనే ఒక సవాలును పెట్టింది. ఆ సవాలును అర్థంచేసుకుని, ఇతరులకు అర్థంచేయించే కథలు అల్లి, సామాజిక జీవితాన్ని ఉన్నతీకరించగల ఒక అద్భుతమైన అవకాశం ఇది. చరిత్ర తెలుగు సాహిత్యకారులముందు ఎన్నోసార్లు అటువంటి అవకాశాల్ని పెట్టింది. గతకాలపు సాహిత్యకారులందరూ ఆ అవకాశాల్ని వాడుకుని తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నంచేశారు. తెలుగు జీవితాన్ని ఉన్నతీకరించారు. తమ రచనలకూ తమకూ సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఇవాళ్టి కథారచయితలు కూడ అటువంటి కృషి చేస్తారనడంలో సందేహంలేదు.
(వాసిరెడ్డి నవీన్ , పాపినేని శివశంకర్ ల సంపాదకత్వంలో ‘కథాసాహితి’ ప్రచురణగా పదహారు సంవత్సరాలుగా క్రమం తప్పకుండా వెలువడుతున్న కథాసంకలనాల సిరీస్ లో తాజా సంకలనం కథ 2005 ఆవిష్కరణ సభలో కర్నూలులో సెప్టెంబర్ 10, 2006 న చేసిన ప్రసంగం ఈ వ్యాసానికి తొలిరూపం)
కొ.కు గారి సాహిత్య ప్రయోజనం వ్యాసాల స్థాయిని మించి ఈనాటి అవసరాలకు అనుగుణంగా ఉన్న గొప్ప వ్యాసం.
వేణు గోపాల్ గారిని వారి మెయిల్ ఐడి పంప వలసిందిగా విన్నపం.
rpchimata@yahoo.com