2006 సంవత్సరానికి గాను సాహిత్యం లో అత్యంత ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి ని ప్రఖ్యాత టర్కీ నవలా రచయిత ఒర్హాన్ పాముక్‌కి ప్రదానం చేస్తూ స్వీడిష్ అకాడెమి ‘తను పుట్టి పెరిగిన నగరం విషాద ఆత్మను ఆవిష్కరించేందుకు పాముక్ విభిన్న సంస్కృతుల సంఘర్షణలకూ, సమ్మేళనాలకూ సాహిత్యంలో కొత్త చిహ్నాలు కనుక్కున్నాడు’ అంటూ ప్రశంసించింది.

 
అతని నవలలో ‘నా పేరు ఎరుపు’ (My Name is Red) అంతర్జాతీయంగా బాగా  ప్రాచుర్యం లోకి వచ్చింది. యిరవై నాలుగు భాషల్లోకి అనువదించబడి అనేక బహుమతులను పొందింది. తర్వాత రాసిన ‘మంచు’ (Snow), ‘ఇస్తాంబుల్ - ఒక నగరం గ్నాపకాలు’ (Istanbul – A City of Memories) నవలలు బాగా ప్రాచుర్యం లోకి వచ్చి పాముక్ కి అంతర్జాతీయంగా మరింత పేరు ప్రఖ్యాతులు సంపాదించి పెట్టినయి.

పాముక్ 1990 లో రాసిన ‘నల్ల పుస్తకం’ (Black Book) నవల టర్కీ సాహిత్యంలో బాగ వివాదాస్పదమైన రచనగా పేరు పొందింది. దాని సంక్లిష్టతవల్ల, జీవితాన్ని చాలా బలంగా వ్యక్తీకరించిన పద్ధతి వల్లా ఆ నవల టర్కీ లో గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది. అతని ఇటీవలి నవల ‘మంచు’ ఆధునిక టర్కీ లో యిస్లాం వాదానికీ పాశ్చాత్య వాదానికీ మధ్య ఘర్షణనీ విలువల సంఘర్షణనీ అత్యంత ప్రతిభావంతంగా చిత్రీకరించింది.  ‘న్యూ యార్క్ టైంస్’ పత్రిక ‘మంచు’ ని 2004 లో పది గొప్ప పుస్తకాల్లో ఒకటిగా పేర్కొంది.

ఒర్హాన్ పాముక్ ని ఆధునికానంతర నవలా రచయితగా పేర్కొనవచ్చు. అతని నవలల్లో ఆధునికానంతర వాదానికి సంబంధించిన అనేక అంశాలు కనబడతాయి. ఐరోపా పాశ్చాత్య విలువలకూ యిస్లాం వాద విలువలకూ మధ్య ఘర్షణ వల్ల తలెత్తుతున్న గందరగోళాన్నీ , పోగొట్టుకున్న అస్తిత్వాల్నీ పాముక్ తన నవలల్లో చిత్రీకరించాడు. తీవ్రంగా చలింపజేసే అతని రచనలు ఒక నిరంతర అస్తిరత్వాన్ని చిత్రిస్తాయి. సంక్లిష్టమైన కథాకథనమూ ,  బాగా లోతైన పాత్రల చిత్రణా పాముక్ నవలలో సర్వసాధారణంగా కనబడతాయి. పాముక్ కేవలం నవలా రచయితగానే కాకుండా మానవ హక్కుల గురించీ చరిత్రలో జరిగిన సామూహిక హత్యాకాండల గురించీ పట్టించుకున్న  వొక సామాజిక రాజకీయ కార్యకర్తగా ముందుకొచ్చాడు. ఫిబ్రవరి 2005 లో ‘దాస్ మాగజీన్’ అనే స్విస్ పత్రికకు ఇచ్చిన ఇంటర్‌వ్యూలో 1915-1917 ల మధ్య జరిగిన ఆర్మేనియన్ సాముహిక హత్యాకాండకు వ్యతిరేకంగా , అనతోలియా లో జరిగిన 30,000 మంది కుర్దుల వూచకోతకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసాడు. ఆ ఇంటర్‌వ్యూ తర్వాత పాముక్ తీవ్రమయిన వేధింపులకు గురయ్యాడు. దేశాన్ని వదిలి వెళ్ళాల్సినంతగా వేధింపులకు గురయ్యాడు. జూన్ 2005 లో టర్కీ ప్రభుత్వం ‘ఏ టర్కీ పౌరుడైనా టర్కీ రిపబ్లిక్ ని గానీ, టర్కీ గ్రాండ్ నేషనల్ అసెంబ్లీ ని గానీ విమర్శిస్తూ మాట్లాడితే ఆరు నెల్ల నుండీ మూడేళ్ల వరకూ జైలు శిక్షకు గురి కాబడతారు’ అనే కొత్త చట్టం చేసింది. దాని ప్రకారం తిరిగి తన స్వదేశానికి తిరిగి వచ్చిన పాముక్ పై అభియోగాలు మోపి బోనెక్కించింది. విచారణ ప్రారంభమైన తర్వాత కూడా పాముక్ తన వ్యాఖ్యలని పునరుధ్ఘాటించాడు. ‘10 లక్షల మంది ఆర్మేనియనులూ 30,000ల మంది కుర్దులూ వూచకోతకు గురయ్యారు’ అంటూ నిర్భయంగా ప్రకటించాడు. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన నిరసనలకు టర్కీ ప్రభుత్వం పాముక్ పై మోపిన ఒక అభియోగాన్ని ఉపసంహరించుకుంది. ‘టర్కీ తత్వాన్ని అవమానించాడు’ అనే అభియోగం మాత్రం ఇంకా కొనసాగుతోంది.

సామాజిక, రాజకీయ అంశాల పట్ల , మానవ హక్కుల వుల్లంఘనలకూ, అధికార క్రూరత్వానికీ వ్యతిరేకంగా నిర్భయంగా అభిప్రాయ ప్రకటన చేసే రచయిత పాముక్ . విలువల, సంస్కృతుల సంఘర్షణనీ అత్యంత ప్రతిభావంతంగా చిత్రించిన నవలా రచయిత పాముక్. ఐరోపా వాదం ఆధిపత్యాన్నీ, యిస్లాం మత ఛాందస వాదాన్ని వ్యతిరేకించి ప్రజాస్వామిక, లౌకిక విలువల కోసం నిలబడ్డ ఆధునికానంతర నవలా రచయిత పాముక్ కు యీ యేడాది నోబెల్ రావడం ముదావహం.

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)