- హిమబిందు

కల్పన రెంటాలతనను ‘కనిపించే పదం’గా ప్రకటించుకున్న కల్పన రెంటాల, నిజానికి ‘వినిపించే బలమైన స్వరం’ కూడా. అచ్చం ఆమె కవితలలాగే… ఆమె మాట, భావాలు, వాటిని ప్రకటించే తీరు చాలా ‘ఇంటెన్సివ్’గా…నిలదీయటాకి ఏ మాత్రం భయపడని విధంగా వుంటాయి. అజంతా అవార్డు గ్రహీత అయిన కల్పన, స్త్రీ వాద కథ, సాహిత్య విమర్శలే కాకుండా పలు అంశాలపై విశ్లేషణాత్మక వ్యాసాలు రాసి, ఇప్పుడున్న కొద్ది మంది సాహిత్య విమర్శకులలో ఒకరిగా మంచి గుర్తింపు పొందారు. ఇండియా-పాకిస్తాన్ కవయిత్రుల కవితల్ని ‘ఆమె పాట’ కాలమ్ కింద అనువాదం చేశారు. స్త్రీల స్వరాలు ఏ స్థాయిలో ఉన్నా ఆలకించాలని, గొంతు దాటి రాని ఆలాపనలను సైతం పసిగట్టి వినిపించాలని తపన పడే ఆమెతో చిన్న సంభాషణ…

 ప్ర :- సాహిత్యంపై మీ ఆసక్తి ఎలా మొదలయ్యింది. ముఖ్యంగా స్త్రీవాద సాహిత్య ప్రభావం గురించి చెప్పండి.?

జ :- చిన్నప్పటి నుంచీ మా ఇంట్లో ఉండి ఉన్న సాహిత్య వాతావరణం వల్ల నాకు సాహిత్యం పట్ల ఆసక్తి, అనురక్తి ఏర్పడ్డాయి. మా నాన్నగారు రెంటాల గోపాలకృష్ణ స్వయంగా కవి, నాటక రచయిత, అనువాదకుడు, జర్నలిస్టు. మా పెద్దన్నయ్య సత్యనారాయణ కలం పేరు జూనియర్ రెంటాల. ఆయన కూడా కవి, శేషేంద్ర వీరాభిమాని. మా నాన్నగారు రామాయణ, మహాభారత ఇతిహాసాలను ఎంతగా ప్రేమించేవారో, రష్యన్, యూరోపియన్ ఆంగ్ల సాహిత్యాలను అంతగా ఆదరించేవారు. మా నాన్నగారి ఈ సుగుణం మా ఇంట్లో పిల్లలందరి మీదా ప్రభావం చూపింది. మా నాన్నగారికి ఇంట్లో సొంత లైబ్రరీ ఉండేది. ఆయనే దానికి లైబ్రేరియన్. తెలుగు చదవటం, రాయటం వచ్చేటప్పటికి మాకు ఏడెనిమిదేళ్లు ఉండేవేమో. ముందు మా అందరి చేత వచన రామాయణ, మహాభారత, భాగవతాలను చదివింప చేసేవారు. ఆ తరువాత యుద్ధ సాహిత్యాన్ని చదివించారు. అటు సాహిత్యం గురించే కాకుండా, తన జర్నలిజం వృత్తి గురించి, బయట సమాజంలో తీవ్రంగా జరుగుతున్న ఉద్యమాల గురించి కూడా కథలు కథలుగా చెప్పేవారు. నా చిన్నప్పుడు జై ఆంధ్రా మూవ్‌మెంట్ ఎంత ఉధృతికి వెళ్లిందో, అప్పుడు జరుగుతున్న గొడవల గురించి ఓ జర్నలిస్టుగా మాకు అర్ధమయ్యే రీతిలో చెప్పేందుకు ప్రయత్నించేవారు. అయితే మా పెద్దన్నయ్య శేషేంద్ర వారిదే అసలు సిసలైన కవిత్వ బాట అనేవాడు. తన కిష్టమైన తిలక్, క్రిష్ణశాస్త్రి కవిత్వాల గురించి మాకు చెప్పేవాడు. నయాగరా కవులు, నాన్నగారికి ఆప్తమిత్రులు అయిన ఏల్చూరి సుబ్రహ్మణ్యం, అనిశెట్టి సుబ్బారావు, కుందుర్తి, గంగినేని వెంకటేశ్వరరావు లాంటి వాళ్లు మా ఇంటి రావడం, వాళ్లందరి సాహిత్య చర్చలు మా ఇంట్లో నా చిన్ననాటి వాతావరణం.

ఈ వాతావరణమే నన్ను కూడా జర్నలిస్టు, కవయిత్రి, రచయిత్రి చేసింది. అయితే ఇక్కడ మీకో మాట చెప్పాలి. స్త్రీవాద సాహిత్య ప్రభావం గురించి అడిగారు మీరు, జర్నలిజంలో నా కెరీర్ ఇరవై ఏళ్లకే మొదలయ్యింది. నా డిగ్రీ పూర్తయిన వెంటనే 1986లో, అప్పట్లో నంబర్ వన్ వారపత్రికగా ఉన్న ఆంధ్రజ్యోతి వీక్లీలో అప్పుడు వొస్తున్న టీ.వి ప్రోగ్రాములపై ‘టీ.వి సమీక్ష’ పేరుతో ప్రతి వారం కాలమ్ నిర్వహించమని అడిగారు ఎడిటర్ పురాణం సుబ్రహ్మణ్య శర్మ. దాదాపు మూడేళ్ల పాటు ఈ కాలమ్ నిరాటంకంగా సాగి, పాఠకుల మన్ననలను పొందింది. అప్పట్లోనే స్వాతి వీక్లీకి, మంత్లీకి కూడా ఇంటర్‌వ్యూలు, ట్రాన్స్‌లేషన్లు చేసేదాన్ని. తరువాత ఓ రెండేళ్లకే ఆల్ ఇండియా రేడియో విజయవాడ కేంద్రంలో క్యాజువల్ న్యూస్ రీడర్‌గా జాయిన్ అయ్యాను. 1989లో ఆంధ్రభూమి విజయవాడ ఎడిషన్‌లో సబ్ ఎడిటర్‌గా ఫుల్ టైమ్ ఉద్యోగం ప్రారంభించాను. అప్పటి వరకు నాకు తెలిసిన ప్రపంచం వేరు. ఇల్లు, పుస్తకాలు, కాలేజీ, చదువు.

కానీ ఎప్పుడైతే బయటకి వొచ్చి ఈ ఉద్యోగాలు చెయ్యడం మొదలుపెట్టానో, నాకు అప్పటి వరకు తెలియని ఒక సరికొత్త ప్రపంచం కనిపించింది. అదే సమయంలో తీవ్ర ఉధృతితో స్త్రీ వాద సాహిత్యం ముందుకు వొచ్చింది. కమలాదాస్ ‘మై స్టోరీ’, ఓల్గా ‘మూడు తరాలు’ ఇవన్నీ చర్చకు గురయ్యాయి. ‘నీలిమేఘాలు’ సంకలనం ఆవిష్కరణ సభ విజయవాడలో జరిగే నాటికి నేను కవితలు రాసినా, సాహిత్య మిత్రులైనటువంటి ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ, ఘంటసాల నిర్మల లాంటి వాళ్లకు తప్ప, ఓ రకమైన బెరుకుతో ఎవరికీ చూపించేదాన్ని కాదు. 95 వరకు నేను రాసుకున్నవి నా వ్యక్తిగత కవితలే.

95లో మా నాన్నగారి మరణంతో రాసినదే అచ్చయిన నా మొదటి కవిత. ఆ తరువాత కవిత్వం నాకొక ఓదార్పయింది. విజయవాడలో, అప్పట్లో మా ఫ్రెండ్స్… రచయిత్రులు, కవయిత్రులు అయిన సి. సుజాత, పి. సత్యవతి, ఘంటసాల నిర్మల, స్వాతి, ఇంద్రగంటి జానకీ బాల, డి. సుజాతా దేవి, ఆహ్వానం లక్ష్మి మొదలైన వాళ్లంతా కలిసి ‘చేతన’ అనే సంస్థను ఏర్పాటు చేసుకున్నాం. అందులో భాగంగా సాహిత్య చర్చలతో పాటు, సామాజిక అంశాలపై కూడా దృష్టి సారించాం. ఇవన్నీ కూడా నేను రచయితని కావటాకి దోహదం చేశాయి.

ప్ర :- ఇంత వరకు మీరు రాసిన కవితలు లేదా కథల వెనుక బలమైన స్ఫూర్తి ఏదైనా ఉందా? మీ శైలి స్వభావాన్ని తెలియచేస్తారా?

జ :- 94-95 సంవత్సరాలలో, నా వ్యక్తిగత జీవితంలోని తీవ్ర సంఘర్షణకు కవిత్వం నాకొక అవుట్‌లెట్ అయింది. నా కవిత్వం అంతా ఒక తీవ్ర భావావేశం నుంచి పుట్టుకొచ్చిందే. నన్ను బాధపెట్టిన సంఘటనలు, నేను స్పందించిన సందర్భాలు అన్నీ కవితల రూపంలో బయటకు వొచ్చాయి. అవి మా నాన్న మరణం కావచ్చు, గుజరాత్ భూకంపం కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్‌లో బుద్ధుడి విగ్రహం ధ్వంసం కావచ్చు. చుట్టూ ఉన్న సమాజంలో స్త్రీల పట్ల జరుగుతున్న అత్యాచారాలు, అన్యాయాలు, వారి వేదనలు నా వేదనగా మారింది. వారి దుఃఖం నా కన్నీరైంది. అదొక దుఃఖ లిపి. నా కవితలలో బానిస స్త్రీలందరూ కలిసి నేనుగా మారాను. అందుకే నా పుస్తకాకి ‘నేను కనిపించే పదం’ అనే శీర్షిక పెట్టాను. ఆ నేను కేవలం నేను కాదు. అన్యాయాలకు, అణచివేతకు గురయ్యే ఏ స్త్రీ అయినా కావచ్చు.

ఇక కథల విషయానికి వొస్తే, నేను రాసింది చాలా తక్కువ. ఓ ఆరేడు కథల దాకా ఉంటాయి. అందులో సగం కథలు అమెరికా వొచ్చాక రాసినవే. అక్కడి జీవిత విధానానికి సంబంధించి నా పరిధిలో నేను చర్చించాను. ఒక్కో సారి కవిత్వంలో సరిగా చెప్పలేదన్న అసంతృప్తి వెన్నాడుతుంది. మనం చర్చించాలనుకున్న విషయాలు కథలో బాగా ఒదుగుతాయి అనిపిస్తుంది. నేను కథల వైపు మళ్లటానికి అదే కారణం. అయితే కవిత్వం పూర్తిగా భావావేశ ప్రక్రియ. కథ ఆలోచనాత్మకమైనది. మనం చెప్పాలనుకున్న విషయం గురించి లోతుగా ఆలోచించి, అధ్యయనం చేయగలిగినప్పుడే మంచి కథ రూపుదిద్దుకుంటుంది. మంచి కథల్ని చదివి ఆనందించడం వేరు, రాయడం వేరు. మంచి కథ అంటే ఇలా ఉండాలని చెప్పడం వేరు, రాసి చూపించడం వేరు. నేనింకా కథా ప్రక్రియలో ఆరంభ దశలోనే ఉన్నానని అనుకుంటున్నాను.

ప్ర :- ఇటీవలి కాలంలో, స్త్రీవాద సాహిత్యాకి సంబంధించి కొంత వరకు స్థబ్దత చోటుచేసుకుందనే విమర్శ ఉంది. కొత్త ఆలోచనలు కరవవుతుండటమా…?మునుపటి ఉత్సాహం తగ్గిందా…?

జ :-స్త్రీ వాద సాహిత్యంలో స్థబ్దత అనేది నా అభిప్రాయం ప్రకారం రాంగ్ స్టేట్‌మెంట్. మొదట్లో స్త్రీవాదం ఓ ఉధృతిగా వొచ్చింది. ఓ వేగంతో ముందుకొచ్చింది. తరువాత ఆ ఉధృతి స్థానంలో ఆలోచన చోటు చేసుకుంది. నిజానికి స్త్రీవాద సాహిత్యంలో తొలి దశలో ఎక్కువగా వొచ్చింది కవిత్వమే. ఆ తరువాత దశలో కథలు, విమర్శ వొచ్చాయి. నేనింతకు ముందే చెప్పినట్టు, సాధారణంగా కవిత్వం ఎవరికైనా ఓ భావావేశమే. కథలో ఆవేశం పనికి రాదు. ఆలోచనాత్మకంగా సాగాలి. ఇప్పుడు స్త్రీవాద కవిత్వం రావడం లేదా అంటే వొస్తోంది. కావీ మొదట్లో వొచ్చిన స్త్రీవాద కవిత్వం ప్రధానంగా స్త్రీల శరీరాలకు సంబంధించినదయితే, తరువాత వొచ్చిన స్త్రీవాద కవిత్వం చుట్టూ ఉన్న సమాజాకి సంబంధించింది. ముఖ్యంగా గ్లోబలైజేషన్ స్త్రీల మీద, స్త్రీల జీవితాల మీద చూపిస్తున్న ప్రభావం గురించి మలితరం స్త్రీ వాదులు కథ, కవితల ద్వారా చర్చించారు. అంతర్జాతీయంగా చర్చకు వొస్తున్న యుద్ధం, పర్యావరణం మొదలైన వాటిపై స్త్రీవాదులు బలంగా రాస్తున్నారు. గ్లోబలైజేషన్ గురించి మాట్లాడడంతో పాటు, ప్రాంతీయ దృక్పథంతో రాయటం కూడా అంతే ముఖ్యమని స్త్రీలు గుర్తించారు. దీనికి ఉదాహరణ ఇటీవలి కాలంలో తెలంగాణా రాయలసీమ నుండి కథా రచయిత్రులు ఎక్కువ కావడం. ఇది స్త్రీవాదంలో పరిణతి సాధించిన దశగా చెప్పుకోవచ్చు. స్త్రీవాద నవలలు, సాహిత్య విమర్శలు ఇంకా రావాలి. అవి వొస్తే ఇప్పుడున్న దశకు ఓ సాధికారత వొస్తుంది. మొదట వొచ్చిన స్త్రీవాద సాహిత్యం గురించి మాట్లాడిన విమర్శకులు, మలితరం సాహిత్యం గురించి పెద్దగా చర్చించలేదు. స్త్రీవాద సాహిత్య విమర్శ జరగాల్సిన స్థాయిలో జరగకపోవడం వల్ల, స్త్రీవాద సాహిత్యంలో స్థబ్దత ఏర్పడిందని, స్త్రీవాదుల్లో కొత్త ఆలోచనలు, కొత్త చూపు కరవవయ్యాయనే  కామెంట్స్ వినిపిస్తున్నాయి. చాపకింద నీరులా ముంచుకొస్తున్న గ్లోబలైజేషన్ గురించి ఇవాళ ఎవరైనా, ముఖ్యంగా స్త్రీవాదులు మాట్లాడటం ఓ అనివార్య సందర్భం అయింది. ఈ సందర్భాన్ని ఫెమినిస్టు రైటర్స్ సరిగ్గానే పట్టుకున్నారన్నది నా పరిశీలన.

ప్ర :- ఆంధ్రా నుంచి అమెరికా వొచ్చిన తరువాత మీ ధృక్పథంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి? అమెరికా జీవితం… మీ మీద, మీ రచనల మీద ఎలాంటి ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా మీరు ఇండియాలో చేసిన రచనలకీ, ఇక్కడ చేస్తున్న రచనలకి ఏమైనా తేడా గమనించారా?

జ :- ఆంధ్రాలో ఉన్నా, అమెరికాలో ఉన్నా ఒక రచయిత బేసిక్ ధృక్పథం ఏదయితే ఉందో అది మారాల్సిన పని లేదు. అయితే అమెరికా దేశం పట్ల, ఆ దేశంలో జీవన ధానం పట్ల మనలో మొదట్నుంచీ పేరుకుపోయిన అభిప్రాయాలు మారవచ్చు లేదా ఇండియాలో వొస్తున్నమార్పులు అర్ధం కావడాకి దోహదం చేయవచ్చు. ఇండియాలో ఉన్నప్పుడు రాసినదానికి, అమెరికాలో ఉన్నప్పుడు చేసిన రచనలకి తేడా ఉంది. ఆ తేడా ఇతివృత్తానికి సంబంధించినది. ఏ రచయితైనా తను ఏ సమాజంలో నివశిస్తున్నాడో, అందులో నుంచి ఇతివృత్తాలను ఎన్నుకుంటాడు. నేను చేసిన పని కూడా అదే. ఆంధ్రాలో ఉన్నప్పుడు నేను ‘అమ్మకో ఉత్తరం’ కథ రాయాల్సిన అవసరం కలగదు. ‘ఎండమావులు’, ‘టింకూ ఇన్ టెక్సాస్’ లాంటి కథలు నా ఆలోచనల్లోకి వొచ్చే అవకాశం తక్కువగా వుండొచ్చు. తప్పని సరిగా అవి ప్రవాసంలో ఉండటం వల్ల వొచ్చిన కథల నేను నమ్ముతున్నాను. ఇండియాలో నేను గడిపిన జీవితాకి, లేదా నా చుట్టూ ఉన్న వాతావరణాకి, అమెరికాలో నేను గడిపిన జీవితాకి చాలా తేడా ఉంది. ఇండియాలో నిరంతరం బిజీగా ఉండే ఉద్యోగం, ఇతర వ్యాపకాలు. అమెరికాలో గడిపిన మూడేళ్లు అందుకు భిన్నమయింది. అక్కడ దొరికిన ఖాళీ సమయంలో నా జీవితాన్ని తరచి చూసుకునే అవకాశం కలిగింది. ప్రపంచ దేశాల సాహిత్యాన్ని చదవడం, వివిధ భాషల్లో సినిమాలు చూడటం, స్త్రీలకి సంబంధించి, మీడియాకి సంబంధించి వర్క్ షాపులలో పాల్గొనడం నా ఆలోచనల మార్చాయి. నా అవగాహనకు తోడ్పడ్డాయి. ముఖ్యంగా అమెరికాలో ప్రవాస స్త్రీలకి సంబంధించిన అనేక అంశాలు, నిజాలు తెలుసుకోగలిగే అవకాశం కలిగింది. అవన్నీ కూడా అమెరికాలో ఉండి నేను రాసిన కథల్లోను, కాలమ్స్‌లోను, వ్యాసాల్లోను ప్రతిఫలించాయి.
 
ప్ర :- పాఠకుల స్పందనలను బట్టి, సాహిత్యానికి ఉండే వేదిక లేదా డయాస్ కూడా రచయితలపై కొన్ని సార్లు ప్రభావం చూపిస్తుందంటారు…మరి ఇక్కడి సాహిత్య వాతావరణం, ప్రవాస పాఠకుల అభిరుచులు, అభిప్రాయాల పట్ల మీ పరిశీలన చెప్పండి ?

జ :-అది నిజమే, మన డయాస్ ఏమిటి? మనం ఎవరి కోసం రాస్తున్నాం, మన రచన చదివే పాఠకులు ఎవరు అనేది మనం రచన చేస్తున్నప్పుడు తప్పని సరిగా తలెత్తుతాయి. కళ కళ కోసమే అనేది సరి కాదని నా భావన. అందరికీ నచ్చే, అందరినీ మెప్పించే, అందరికీ ఆమోద యోగ్యమైన రచన చెయ్యాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. నేను రాసేటప్పుడు నా పాఠకులెవరో నాకు తెలుసు. అలాగే, ఫలానా రచయిత ఏం రాస్తుందో, అమె ధృక్పథం ఏమిటో పాఠకులకు కూడా తెలుసు కాబట్టి పాఠకులకి సంబంధించిన అవగాహన రచయిత మీద పని చేస్తుంది. అది తప్పని సరిగా నా మీద కూడా ఉండొచ్చు.

అమెరికాలో సాహిత్య వాతావరణం ఓ చోట ఆగిపోయిందా ?! ఆంధ్రాలో సాహిత్య వాతావరణానికి, వాదవివాదాలకి దూరంగా ఉందా ? అది కచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే, ఏ సాహిత్యమైనా ఆ సమాజం నుంచే పుడుతుంది. తెలుగు సమాజంలో ఉద్యమాలు, వాదాలు అనివార్యమయ్యాయి. వీటి అవసరం అమెరికాలో లేకపోవచ్చు. అమెరికాలో ఎక్కువ మందికి నన్నయో, తిక్కనో, విశ్వనాధో ఆరాధ్య రచయిత కావచ్చు. అది వారి వెనకబాటుతనంగా కాకుండా వారి వారి వ్యక్తిగత అభిరుచిగానే మనం గుర్తించాలి. స్త్రీవాద సాహిత్య అవసరం అక్కడి తెలుగు సమాజంలో లేకపోవచ్చు. అంత మాత్రాన స్త్రీ, దళిత, మైనారిటీ వాదాలను వాళ్లు చిన్న చూపుతో చూసి విమర్శించాల్సిన పని లేదు. చదివి అర్ధం చేసుకోగల సంస్కారం ఉంటే చాలు. ‘అసలు స్త్రీవాదంతో పనేంటి ? ఇద్దరూ సమానమైనప్పుడు…’, అని వాదించే రచయితలు, రచయిత్రులు కూడా కొందరక్కడ ఉన్నారు. తెలుగు గడ్డ మీద నిలబడ్డ వాళ్లకు అవసరమేమిటో అర్ధమవుతుంది కానీ, ఆ సమాజానికీ, అక్కడి సమస్యలకు దూరంగా బతికే వాళ్లకు, ఆ అణచివేత, ఆ వివక్ష అర్ధం కావాల్సిన రీతిలో అర్ధం కాకపోవచ్చు. నేను రాసే శైలి, ఎంచుకునే ఇతివృత్తాలు ఇండియాలో వాళ్లకి కామన్‌గానే కపించవచ్చు. కానీ అమెరికన్ తెలుగు సాహిత్య వాతావరణంలో అదొక తీవ్రంగా కనిపిస్తుంది. ఇంత తీవ్రత ఇక్కడ పనికి రాదంటూ సన్నాయి నొక్కులు నొక్కేవారుండొచ్చు. ఆడవాళ్లు నిండుగా పట్టుచీర కట్టుకు, స్వయానా వండి అతిథి అభ్యాగతులకు వొడ్డించడమే సాంప్రదాయంగా భావించే చోట, అమెరికా పెళ్లిళ్లు విఫలమవుతున్న విషయమో, అమెరికాలో సగం మంది ఆడవాళ్లు డిప్రెషన్‌తో బాధపడుతున్న విషయం మీద చర్చిస్తే దాన్ని అవగాహన చేసుకునే పరిణతి వాళ్లకి ఉండక పోవచ్చు. ఇండియా నుంచి అమ్మాయిలు తెలివి మీరి పోయి, అమెరికా రావడం కోసం గ్రీన్ కార్డు ఉన్న అబ్బాయిల్ని పెళ్లి చేసుకుని, ఎయిర్ పోర్టులలోనే ఒదిలేసి వెళ్లిపోతున్నారన్న కామెంట్స్ కూడా నేను విన్నాను. వారికున్న అవగాహన ఇంతేలే అని సరిపెట్టుకోవడం తప్ప, అలాంటి సందర్భాల్లో మనం చేయగలిగిందేమీ ఉండదు. మన చుట్టూ ఉన్న సాహిత్య పాఠకుల స్థాయిని బట్టి మనం మాట్లాడాల్సి ఉంటుంది. అలాంటప్పుడు చాలా సార్లు రచయిత తన అభిప్రాయ్నా నిష్కర్షగా చెప్పడం ద్వారా అందరి దృష్టిలో వివాదాస్పదం కావచ్చు. లేదా అసలా రచయిత మాట్లాడకుండా ఉండటం ద్వారా తనను తానే నియంత్రించుకోవచ్చు…అంటే సెల్ఫ్ సెన్సార్‌షిప్ లాంటిదన్న మాట.

ఇటీవల బుకర్ ప్రయిజ్ గెలుచుకున్న కిరణ్ దేశాయ్ సంగతే చూడండి, ‘ది ఇన్‌హరిటెన్స్ ఆఫ్ లాస్’ పుస్తకం ఆమె పదిహేను వందల పేజీల్లో రాసింది. రచయిత ఏ విషయాన్నీ అనవసరంగా రాయడు. కానీ ఆ పుస్తకాన్ని పబ్లిషర్లు మూడు వందల పేజీలకు కుదించారు. ఆ ఎడిట్ చేసిన భాగాల్లో చాలా ముఖ్యమైన అంశాలు పోయాయని, కొన్ని చోట్ల గ్యాప్స్ కూడా కనిపించాయని స్వయంగా రచయిత్రి కిరణ్ దేశాయ్ తల్లి, అనితా దేశాయ్ కుఉడ ఒప్పుకున్నారు. రచయిత మీద మార్కెట్ శక్తులు కూడా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎలాంటి సెన్సార్‌షిప్‌ని విధిస్తాయో ఇదొక ఉదాహరణ మాత్రమే.

ప్ర :- ప్రవాసజీవితం గురించి వొస్తున్న అనేక రచనల్లో, ముఖ్యంగా భారతదేశం నుంచి వొచ్చి ఇక్కడ జీవితాల్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్న రచనల్లో వాస్తవికత కొంత వరకు లోపిస్తోందనే ఒక ఆసక్తికరమైన పరిశీలనను ఈ మధ్య మీరు రాసిన ఒక వ్యాసంలో చదివాను…దీపై మరింత విశ్లేషణ…

జ :- చాలా మంది అమెరికన్‌లు ఇండియా వెళ్లి వొస్తారు. మూడు నెలలో, ఆరు నెలలో హైదరాబాద్‌లో గడిపి వొచ్చి ఇండియా గురించి గొప్పగా చెపుతుంటారు. వాళ్లకి తెలిసిన ఇండియా వేరు, అక్కడ పుట్టి పెరిగిన మనకి తెలిసిన ఇండియా వేరు. వాళ్లు ఇండియాలో ఉన్న కొద్ది కాలం హైదరాబాద్‌లోనో, చెన్నైలోనో ఫైవ్‌స్టార్ హోటల్‌లో ఉండి, పర్యాటక ప్రదేశాల్ని చూసి వెళ్లిపోతారు. వాళ్లకి ఇండియా ఓ అందమైన స్వప్నంలా కనిపించవొచ్చు. మన దేశం నుండి అమెరికా చూడటానికి వెళ్లి వొచ్చే రచయిత పరిస్థితి కూడా అంతేనని నా అభిప్రాయం. వాళ్లా కొద్ది కాలం ఎవరింట్లోనో గెస్టులుగా ఉంటారు. ఎవరైనా రైడ్ ఇస్తేనో, ఎయిర్ ఫేర్ ఇస్తేనో నాలుగు ఊళ్లలో సాహిత్య సభల్లో మాట్లాడి వెళ్లిపోయి, నా అమెరికా యాత్రా విశేషాలు పేరిట కవితలో, వ్యాసాలో రాస్తుంటారు. వాళ్లకా కొద్ది రోజుల్లో కనిపించేది అమెరికాలో పైపై జీవన విధానం మాత్రమే. నాలుగు రుతువుల్లోను ఇక్కడ గడిపేవారికి, నిత్య జీవితంలో ఎదురయ్యే అనుభవాలు, అనుభూతుల లోతైన పరిశీలన వేరు. ఈ తేడా మనం స్పష్టంగా వారి వారి రచనల్లో చూడొచ్చు. ఇక్కడి సభల్లో చాలా మంది లేవనత్తే మరో అంశం కూడా నేను ఆ వ్యాసంలో చర్చించాను. అసలు అమెరికా రాకుండానే , అమెరికాలో జీవితం గురించి రచయితలు తమ రచనల్లో చేసే వ్యాఖ్యల గురించి, చాలా మందికి అభ్యంతరాలున్నట్టు నేను గమనించాను. నా పరిధి కేవలం రచయిత్రులకు పరిమితం చేసి ఆ అంశాన్ని కూడా నేను నా వ్యాసంలో చర్చించాను.
 
ప్ర :- తెలుగులో వొస్తున్న ‘డయస్పోరిక్’ రచనలపై మీ అభిప్రాయం ?

జ :- డయాస్పోరా అనే పదాన్ని నిర్వచించుకోవడంలోనే మన వాళ్లకు ఇంకా రకరకాల అభిప్రాయాలున్నాయి. మిగతా భాషల్తో పోలిస్తే, తెలుగులో నిజంగా ప్రవాసాంధ్ర జీవితాన్ని లోతుపాతులు చూసిన రచనలు చాలా తక్కువనే చెప్పొచ్చు. డయస్పొరా రచనలు రావడానికి కావాల్సిన వాతావరణం ఇక్కడ ఇప్పుడిప్పుడే నెలకొంటోంది. డయస్పోరా రచనల్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ‘ఈమాట’ పూర్తి స్థాయిలో కృషి చేస్తోంది. వెబ్ మ్యాగజైన్లు, ఇంటర్నెట్ చర్చా వేదికలు ఇవన్నీ కూడా డయస్పొరా రచనలు చేయడాకి అవసరమైన వాతావరణాన్ని ఏర్పరుస్తున్నాయి. వీటి ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడిప్పుడే చెప్పలేం.

ప్ర :- అమెరికాలో సాహిత్య, సాంస్కృతిక రంగాలలో ‘జెండర్ సెన్సిటివిటీ’ ఎంత వరకు ఉంటోందంటారు?

జ :- పైకి కపించకుండా అంతర్లీనంగా ఉంది. స్త్రీల రచనల్ని గుర్తించనట్లు మౌనంగా ఉంటారన్న విషయాన్ని నేను గమనించాను. పేర్లు చెప్పక్కర్లేదు కానీ, ఓ నవలా రచయితకి అవార్డు వొస్తే ప్రశంసలతో ముంచెత్తిన సాహితీ వేత్తలు, ఓ ప్రముఖ రచయిత్రికి అవార్డు వొస్తే మౌనంగా మిన్నకున్నారు. చికాగోలో జరిగిన ఆటా సభల్లో నా అనుభవం ఒకటి చెపుతాను. దివ్య హత్య జరిగిన కొత్తల్లో ఆ సభలు జరిగాయి. మీడియా మీద ఓ చిన్న మీటింగ్. దివ్యను భర్త రంపంతో ముక్కలు ముక్కలుగా కోసి గార్బెజ్ దగ్గర పడేసిన వార్త అమెరికాలో, ఇండియన్ న్యూస్ పేపర్లలో, ఫస్ట్ పేజ్‌లో ప్రచురించడం వల్ల మన పరువు పోయిందంటూ కొందరు వక్తలు మాట్లాడారు. అసలలాంటి కిరాతకపు పనులు మానవ సమాజంలో జరగటం సిగ్గు చేటా ? ఆ వార్త రావడం సిగ్గు చేటా?
 
ప్ర :- తూర్పూ పడమరల మధ్య నిలబడి, ఒక రచయిత్రిగా, కవయిత్రిగా ప్రస్తుతం ఏం మాట్లాడాలనిపిస్తోంది?

జ :-  వలసలనేవి ఇవాళ సహజము, అనివార్యమూ అయివుండొచ్చు. కానీ అందులో వేదన గురించి మాట్లాడుకోవాలి. మనం మన మూలాలకు దూరమవుతున్న వాస్తవికతనుంచి ప్రపంచాన్ని చూసినపుడు సొంత ఇల్లు, సొంత ఊరు అనేవి చెదిరిపోతూ కపిస్తున్నాయి. వలస జీవులదిప్పుడు అనేక సంస్కృతులు కలగలిపిన అస్థిత్వమైంది. అన్ని సంస్కృతులు మనవే. కానీ ఏ ఒక్కటీ మనది కాదు. అన్ని ప్రదేశాలూ మనవే. కానీ మన కంటూ ఓ సొంత ఊరు లేదు. అన్ని చోట్లా మనుషులుంటారు. కానీ మన కోసం ఆలోచించే, మనల్ని ప్రేమించే మనుషులుండకపోవచ్చు. తూర్పు, పడమర రెండిట్లో కూడా నాకు నేనే అవుట్ సైడర్‌గా కపిస్తున్నాను. అమెరికాలో ఉన్నంత కాలం.. ఇది నా ఊరు కాదు, ఇది నా భాష కాదు, ఇది నా సంస్కృతి కాదు అన్న భావన. ఎప్పుడెప్పుడు వెళ్లిపోదామా అన్న ఆరాటం. ఇప్పుడు హైదరాబాద్ వస్తే, మూడేళ్లలో ఎంత మార్పో చెప్పలేం. అంతా మారిపోయింది. బంగారం, బట్టలు, కంప్యూటర్లు, కర్రీపాయింట్‌లు, మొబైల్ ఫోన్‌లు, ఎఫ్ఎమ్ ధ్వని తరంగాలు ఇది ఇప్పటి హైదరాబాద్. నేను చూస్తూ ఉండగానే  ఈ హైదరాబాద్ మారిపోయింది. కానీ ఏ మార్పు ఎప్పుడు వొచ్చిందో, ఎందుకు వొచ్చిందో నేను చెప్పలేను. ఆ మార్పు జరిగిన ప్రాసెస్‌లో నేను లేను కాబట్టి. ఇప్పుడు నా దేశంలో వాళ్లకి కేవలం నేనొక అవుట్ సైడర్… నేనొక ప్రవాసిని … ఇక్కడ, అక్కడ రెండు చోట్లా నేను అవుట్ సైడర్ అనే వాస్తవికత అస్థిమితంలోకి నెట్టేస్తోంది.

***

అమెరికాలో ఉన్నా, ఆంధ్రాలో ఉన్నా మన జీవితాలు మనకి కూడా పరాయిగా అనిపించే దశలో ఉన్నాయని ఆమె చెప్పడం మనందరి ‘కల్పన’లో కఠోర సత్యంగా అపించడం లేదూ…

8 అభిప్రాయాలు

  1. ప్రసాద్ 17 అక్టోబర్ 2006 , 10:51 am

    కల్పన గారు చెప్పింది అక్షరాలా సత్యం.
    ఇండీయాలో వున్నంత వరకూ ఇండియాను ప్రత్యేకంగానూ, మనల్ని మనం ఇండీయాతో విడిగానూ పోల్చి చూసుకునే అవసరం రాదు. తీరా అమెరికాకు వచ్చాక అప్పుడు ఏదో పోగొట్టుకున్న ఫీలింగ్ వస్తుంది. ఇండియా నుంచి విడివడి ఒంటరిగా బ్రతుకుతూ ఆ విరహంలో మాళ్ళీ ఎప్పుడు చేరుకుందామా అనిపిస్తుంది. కానీ ఎన్నో ఆశలతో ఇండియాలో అడుగుపెట్టిన వెంటనే ఏమీ ఎరగనట్టు ఎంతో మారిపోయి తన ఉనికినే గమనించని ఇండియాని చూసి ప్రాణం ఉసూరుమంటుంది. దేనికీ కాకుండాపోయిన ఒంటరినయిన బాధ ఒళ్ళంతా వ్యాపిస్తుంది.
    నారాయణ స్వామి(http://sanduka.wordpress.com/) సందుకలో ఇలా చెప్తారు.


    నాకోసం నిద్రమాని
    ‘ఇణ్ణేళ్ళుగా ఏమైపోయావ్’ అంటూ
    కోపంతో అలకతో ప్రేమతో
    నీరు పొర్లుతున్న చెరువుల కళ్ళతో
    నన్నలుముకుంటుందనుకున్నా.

    తెగిపోయిన నా రెక్కల్ని
    సుతిమెత్తని చేతులతో నిమిరి
    నా భుజాలకు అతికిస్తుందనుకున్నా.

    నేను మోసుకొచ్చినవన్నీ
    తనివితీరా తడిమి
    అతి జాగ్రత్తగా
    చీరకొంగులో పొదుపుకుంటుందనుకున్నా.

    ఏడేళ్ళ నవ్వుల్నీ
    పచ్చి నెత్తుటి కన్నీరు మరకలనీ
    కాళ్ళ కింద నలిగిపోయిన పసిరెక్కలనీ
    వాడిపోయిన కళ్ళనీ వేలాదిగా రాలిపోయిన పూలరెమ్మలనీ
    ఏకబిగిన ఏకరువు పెట్టి ఊపిరాడనీయదనుకున్నా!

    నేలకు దిగిన విమానంలా
    వంటరిగా దిగాలుగా
    నేను

    నా ప్రేయసి
    నా ముందు నుంచే హడవుడిగా
    అటు ఇటూ నడిచిపోయింది.

    ఊరుకులతో పరుగులతో
    నాకు అతి కొత్తయిన భాషల చప్పుళ్ళతో
    నేను పోల్చుకోలేని మూఖాల మెరుపులతో
    సరసరా జారిపోయింది.

    నావైపు చూసే తీరికలేదు
    చూసినా గుర్తుపట్టలేదు.
    అర్ధరాత్రి వర్షపు చీకట్లో పారేసుకున్న
    ఉంగరంలా
    జరజరా దొర్లిపోయింది.

    యుగాలుగా
    తన ఎడతెరిపి లేని దుఃఖ బీభత్స ప్రేమ ప్రవాహంలో
    మునిగిన నన్ను
    ఏడేళ్ళ ఎదబాటుతోనే పూర్తిగా మర్చిపోయింది.

    నా ఊపిరి తేమలోని వెచ్చదనాన్నీ
    నా పెదవుల ముద్దులోని ఉప్పదనాన్నీ
    నా కౌగిలింతలోని చెమటవాసననీ

    తానెన్నడూ ఎరగనట్టే
    ఎడమొఖమై అంజాన్ కొట్టింది

    నేనే మనసుండబట్టలేక
    గ్యాపకాల సుడిగాలులతో పిలిచినా
    రెండు చేతులూ విరగబూసి చాచినా
    ఎవరు నువ్వు అన్నట్లుగా
    ఎకసెక్కెపు చూపుల్ని విసిరి పారేసింది.

    –ప్రసాద్

  2. Suresh Palle 10 ఫిబ్రవరి 2007 , 9:50 am

    నిజంగా కల్పన గారు చెప్పిన విషయాలు కఠోర వాస్తవాలని అంగీకరించక తప్పదు.”మనుషులు అన్ని చోట్లా ఉంటారు,కాని మనల్ని ప్రేమించే మనుషులు ఉండకపోవచ్చు,ఇప్పుదు రెండు చోట్లా నేను అవుట్సయిడరు” అని కల్పన గారు చెబుతుంతే మానవ సంబంధాలు ముందు ముందు ఎట్లా ఉంటాయేమోనని భయంగా ఉంది.

  3. Gurram seetaramulu 10 అక్టోబర్ 2007 , 9:19 am

    నెను అంగీకరిస్తాను

  4. […] ‘కనిపించే పదం’ - కల్పన రెంటాల తో ముఖాముఖి […]

  5. […] # Gurram seetaramulu 10 అక్టోబర్ 2007 , 9:19 am […]

  6. […] # ప్రసాద్ 17 అక్టోబర్ 2006 , 10:51 am […]

  7. […] # Suresh Palle 10 ఫిబ్రవరి 2007 , 9:50 am […]

  8. […] జనవరి 15, 2008 ద్వారా kalpanarentala ‘కనిపించే పదం’ - కల్పన రెంటాల తో ముఖాముఖి […]

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)