- ఎ. నాగరాజు
వివిధ సాహిత్య ప్రక్రియలతో పోలిస్తే కవిత్వానికి కొన్ని ప్రత్యేకతలున్నాయి. కవిత్వానికున్న ఈ ప్రత్యేకతల కారణంగానే మిగిలిన అన్ని సాహితీ ప్రక్రియల కన్నా ముందుగానే అది సామాజిక వాస్తవికతకు అనుగుణంగా ప్రతిస్పందించగలుగుతుంది. సామాజిక వాస్తవికతకు అనుగుణంగా తలెత్తే వివిధ ధోరణులు, సామాజిక ఉద్యమాలకు కవిత్వం అడుగుజాడ కాగలుగుతుంది. కవిత్వం మాత్రమే నిర్వర్తించగల ఈ విశిష్ట పాత్రను వివరించడానికి సాహిత్య చరిత్రలోని వివిధ కీలక సందర్భాల నుండి ఎన్నో ఉదాహరణలను చెప్పవచ్చును.
కవిత్వం ఈ రకమయిన పాత్రను నిర్వహించడానికి దానిలో ఉన్న సామాజికాంశే ప్రధాన కారణం. ఈ సామాజికాంశ గూడా మిగిలిన సాహితీ ప్రక్రియలలో కనిపించే సామాజికాంశం కంటే కొన్ని ప్రత్యేకతలను కలిగి ఉంటుంది. కవిత్వం మానవోద్వేగాలు, అనుభూతులు కలగలిసి నిర్మాణపరంగా ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటుంది. మనిషి తన తొలినాళ్ళలో చుట్టూ ఉన్న బాహ్య వాస్తవికతను అర్థం చేసుకొనే ప్రయత్నంలో భాగంగా కవిత్వం కూడా ఆవిర్భవించింది. సమూహంలో భాగంగా మనిషి తన చుట్టూ ఉన్న సమాజంతో, ప్రకృతితో ఏకకాలంలో నెరపిన సంబంధం కవిత్వానికి దోహదం చేసింది. రూపంలోనూ, సారంలోనూ సామూహికతను ప్రతిబింబించే లక్షణాలు కవిత్వంలోకి వచ్చాయి. కవిత్వంలోని లయ, ధ్వని ఇంకా ఇతర రూపసంబంధ అంశాలు కవిత్వంలోని సామూహికతను తెలియజేస్తాయి. కవిత్వంలో ఉపయోగించే భాష కూడా సాధారణ వాడుకలో ఉండే భాష కాదు. కవిత్వ భాష ప్రత్యేకమైన భావావేశిత స్థితిలో ‘ఉన్నతస్థాయి’కి చేరుకున్న రూపం. పైకి మార్మికతతో కనిపించే కవిత్వభాష రూపొందడం వెనుక సమాజంలోని శ్రమ విభజన, సంస్కృతి, సంప్రదాయాలు కారకాలుగా పనిచేస్తాయి. నృత్య, చిత్రలేఖనం వంటి ఆదిమ కళల మాదిరిగానే కవిత్వం కూడా తొలినాళ్ళలో భ్రమాత్మక వాస్తవికతను వెల్లడించేదే అయినప్పటికీ అది వెల్లడిచేసే ఆకాంక్షల రీత్యా అది వాస్తవికమైనది. రూపం, ద్వారానూ, సారం ద్వారానూ వెల్లడయ్యే సామూహికతే దాని వాస్తవికత.
సమాజం అభివృద్ధి చెంది వర్గాలు ఏర్పడినప్పుడు కవిత్వం కూడా ఆ ప్రభావానికి లోనయింది. వర్గ ప్రయోజనాల కనుగుణంగా కళలు, సాహిత్యం రూపొందడం మొదలయ్యాయి. సమాజం అనేక దశలుగా అభివృద్ధి చెందుతూ ఉండే కొలది కవిత్వం పాలకవర్గాల ప్రయోజనాలకు ప్రధాన పనిముట్టుగా మారింది.
అయితే కవిత్వం మనిషికీ, ప్రకృతికీ నడుమ ఉన్న వైరుధ్యం నుండి ఆవిర్భవించింది. కనుక ఎన్ని రకాల వర్గ సమాజాలు వచ్చినప్పటికీ దానిలోని సామూహిక లక్షణాలు మాత్రం కొన్నయినా కొనసాగుతూ వస్తున్నాయి. మనిషికీ ప్రకృతికీ నడుమ ఏర్పడిన ఈ వైరుధ్యం ప్రకృతిలో భాగంగా మనిషి చేసే సామూహిక కృషితోనే పరిష్కారమవుతుంది. ఈ వైరుధ్యం ప్రకృతిలో భాగంగా మనిషి చేసే సామూహిక కృషితోనే పరిష్కారమవుతుంది. ఈ వైరుధ్యం పరిష్కారమయ్యేంత వరకూ కవిత్వమూ, కవిత్వంలోని సామూహిక స్వభావమూ కొనసాగుతూనే ఉంటాయి.
కవిత్వానికుండే మరో ప్రత్యేకత హేతువుకు లొంగకపోవడం. తనకర్థం కాని ప్రాకృతిక శక్తులతో మనిషి తీవ్ర భావావేశిత స్థితిలో చేసిన సంభాషణ వల్లా, సామూహిక శ్రమలో మనుషుల కదలికలో కనిపించే లయబద్ధత వల్లా కవిత్వానికి ఈ లక్షణం సంక్రమించింది. కవిత్వంలో కనిపించే ఉద్రిక్తపూరితమయిన ఈ అహేతుకత నాధారంగా చేసుకొనే భావవాదులు కవిత్వాన్ని ఒక అతీతమయిన శక్తిగా భావించారు. తీవ్ర భావావేశిత స్థితిని ఆధారంగా కవిత్వాన్ని బాహ్య వాస్తవికతకు దూరం చేసి దానినో దైవిక విషయంగా ప్రచారం చేశారు. అయితే కవిత్వంలో కనిపించే ఈ అహేతుకత వెనుక వుండే హేతువును మార్క్సిస్టు విమర్శకులు సామాజిక సంబంధాల వెలుగులో వివరించగలిగారు. అహేతువుకు, హేతువుకు నడుమ ఉన్న గతితార్కిక సంబంధాన్ని విప్పి చెప్పగలిగారు.
బాహ్య వాస్తవికత పట్ల శాస్త్రీయమైన అవగాహనతో నిమిత్తం లేకుండానే భావావేశిత స్థితిలో ప్రతిస్పందించడం, హేతువుకు లొంగకపోవడం అనే ప్రత్యేక లక్షణాలు సామాజిక చరిత్రలో కవిత్వానికి పుట్టుకతోనే సంక్రమించాయి. ఈ ప్రత్యేకతల కారణంగానే చరిత్ర గతిలో మిగిలిన సాహితీ ప్రక్రియలకన్నా కవిత్వం ముందుగా స్పందించగలుగుతోంది. సామాజిక వాస్తవికతను వెల్లడి చేయడంలో అడుగుజాడ కాగలుతోంది. ఇది ఒక ప్రక్రియగా కవిత్వానికున్న వెసులుబాటు అనుకుంటే, ఈ వెసులుబాటు ఆధారంగా కవిత్వం సాహిత్యచరిత్రలో రెండు పనులు నిర్వర్తిస్తూ వస్తున్నది. సామాజిక వాస్తవికతకనుగుణంగా వ్యక్తమయ్యే వివిధ ధోరణులు, ఉద్యమాలకు కవిత్వం మిగిలిన ప్రక్రియల కన్నా, ముందుగానే వాహిక కాగలగడం దీనిలో ఒకటి. దీనికి మరోవైపు కూడా ఉంది. సామాజిక వాస్తవికతను వెల్లడిచేసే వివిధ ధోరణులు తిరిగి ఆ వాస్తవికతతో ప్రతిస్పందించేటప్పుడు అనేక పరిమితులకు లోనుకావడం, ఉద్యమాలలో సంక్షోభాలు ఏర్పడడం వంటి సందర్భాలలో కూడా కవిత్వమే ముందుగా ఈ స్థితిని నమోదు చేయగలుగుతుంది. ఈ రెండింటిలో మొదటిది కవిత్వానికి గొప్ప ఆకర్షణనూ, పురోగామి స్వభావాన్ని కలగజేస్తూ ఉంటే, రెండవది స్తబ్ధతనూ, కొన్నిసార్లు గతంలోకి జారుకొనే స్వభావాన్నీ కలుగజేస్తోంది. ఈ రెండు విధులను కవిత్వం నిర్వర్తిస్తూ ఉండడం వల్ల సమకాలీన సామాజిక చరిత్రలో వివిధ ధోరణులను అధ్యయనం చేసేందుకు సమకాలీన కవిత్వం దోహదం చేస్తుంది.
ఒకవైపు విప్లవ సాహిత్యోద్యమం కొనసాగుతూ ఉండగానే 80, 90 దశకాలలో సామాజిక చలనంలో వచ్చిన వివిధ మార్పులు, స్త్రీవాద దళిత ముస్లిం మైనారిటీ, ప్రాంతీయ అస్తిత్వాలతో కూడిన అవగాహనను బౌద్ధిక, సృజనాత్మక రంగాలలోకి తీసుకొని వచ్చాయి. ఫలితంగా సాహిత్యమూ వివిధ బౌద్ధిక రంగాలూ మునుపటికన్నా ప్రజాస్వామికం అయ్యాయి. అయితే 90వ దశకం చివరినాటికి వీటి ఉరవడి బాగా తగ్గిపోయింది. 80, 90 దశకాలలో ఏ సామాజికచలనాల కారణంగా ఈ విధమైన ధోరణులు వచ్చాయో, తిరిగి ఆయా సామాజిక చలనాలకున్న వస్తుగత పరిమితుల కారణంగా అవి అనేక పరిమితులకు గురయ్యాయి. 90లో దేశంలో అమలుపరచబడ్డ నూతన ఆర్థిక విధానాలు కూడా ఈ స్థితిని వేగవంతం చేయడానికి తమ వంతు పాత్ర వహించాయి. వీటిలో ఇప్పుడు ముస్లిం మైనారిటీ, ప్రాంతీయ అస్తిత్వాలు మాత్రమే ప్రభావశీల స్వభావంతో కొనసాగుతున్నాయి. హిందూ మతతత్వం, అభివృద్ధి విధానాలలోని అసమానతలను ఇవి ప్రశ్నిస్తున్నాయి.
80, 90 దశకాలలో బౌద్ధిక, సృజనాత్మక రంగాలలో బలమైన, విస్తృతమైన స్థానాలను ఆక్రమించిన స్త్రీవాద, దళితవాదాల వంటి ధోరణులలో ఏర్పడిన పరిమితులు మొత్తం సమాజం మీదనే పెద్ద ప్రభావాన్ని వేశాయి. అంతే కాకుండా ఆయా ధోరణులు పరిమితులకు గురవుతున్న కాలాన్ని పరిశీలించినా, సమాజంలోకి నూతనంగా చొచ్చుకొని వస్తున్న రాజకీయార్ధిక విధానాల కారణంగా ఆ కాలానికి సామాజిక చరిత్రలో విభజనరేఖ వంటి ప్రాధాన్యత కనిపిస్తుంది. ఈ విభజన రేఖనాధారం చేసుకొనే సామాజిక శాస్త్రవేత్తలు అనేక సమకాలీన అంశాలను వివరించగలుగుతున్నారు.
సామాజిక వాస్తవికతను అర్థం చేసుకొని దానిని మార్చడానికి దోహదపడాల్సిన వివిధ ధోరణులు పరిమితులకు లోనుకావడం, మరోవైపు సామ్రాజ్యవాద అనుకూల ఆర్థిక విధానాల దాడి- మొత్తంగా 90వ దశకం చివరినాటికి అవగాహనలోను, వ్యక్తీకరణలోనూ అనేక సంక్లిష్టతలకు లోనయింది. వ్యవసాయరంగంలోనూ, ఇతర చేతివృత్తులలోనూ పెద్ద ఎత్తున సంక్షోభం మానవ హనన రూపంలో వెల్లడికావడం మొదలయింది. మానవ సంబంధాలు తీవ్రంగా విధ్వంసం కావడం మొదలయ్యాయి. ఈ సామాజిక సంక్షోభంలో బుద్ధిజీవులు, సృజనకారులలో మనిషిని ఏకాకిగా భావించుకునే నిరాశమయ, దుఃఖపూరిత, స్వీయహనన భావజాలంతో కూడిన వ్యక్తీకరణలు ముందుకు రావడం మొదలయింది. మరొకవైపు సమాజంతో నిమిత్తంలేని వ్యక్తి వాదనలు, కెరియరిజం తిరిగి బలాన్ని సంతరించుకొనేందుకు ప్రయత్నం చేయసాగాయి.
ఈ స్థితి కవిత్వంలో 90వ దశకం చివరినాటికే చోటు చేసుకుంది. దుఃఖాన్ని, నిరాశనీ ప్రేమిస్తూ దానిలోనే పడి కొట్టుకొనే విధ్వంసకర ధోరణిని విమర్శకులు, కవులు నిర్వమర్శగా ఆహ్వానించారు. ఈ ధోరణిని కొత్త వ్యక్తీకరణలుగా పిలుస్తూ మనిషి అస్తిత్వ వేదనకు సంబంధించిన కవిత్వంగా పైకెత్తారు. మనిషి అస్తిత్వాన్ని ఒంటరితనంలోను, శిథిలమయిపోతున్న జీవితం మధ్య, నిరాశతోనూ నిస్సత్తువుగా పలవరించడంలోనూ చూడగలగడం 60ల తర్వాత కవిత్వ పరిణామంలో గొప్ప వెనుకడుగుగానే చూడాలి. దీనిని కొందరు సామాజిక వాస్తవికత పట్ల నిరసనగా సమర్థింపజూస్తున్నారు. కానీ దీనికి అంత లోతు ఉన్నట్టు కనిపించదు.
ఇదే సమయంలో మరొకవైపు అనుభూతి ప్రధాన కవిత్వం వేలంవెర్రిలాగా వ్యాపించడం ఎక్కువయింది. అప్పటివరకు ఏ కొద్దిమందికో పరిమితమై ఉన్న ఈ కవిత్వం, ‘శుద్ధమయిన కవిత్వం’ పేరుతో విమర్శకులుగా పిలువబడుతున్న వారి మన్ననలను, ఆదరణను పొంది విస్తృతిలోకి వచ్చింది. విచిత్రమేమిటంటే అప్పటివరకూ కవిత్వంలో సాహిత్య ప్రయోజనం గురించి సిద్ధాంత వ్యాసాలు రాసిన ప్రముఖ విమర్శకులు ‘ఏదయినా సరే అది కవిత్వమై ఉంటే చాలు’ అనే ప్రాతిపదిక మీద ఈ కవిత్వాన్ని పైకెత్తారు. హైకూ వంటి కవితా నిర్మాణ పద్ధతి ప్రభావంతో ప్రముఖ కవులు ఉనికిలోకి తెచ్చిన చిన్న కవితా రూపాలు, విశేషంగా అనుకరణకు గురై తామరతంపరలా కవిత్వాన్ని పేజీలకొద్దీ నింపేందుకు కారణమయ్యాయి. ఏ రకమయిన స్పృహ లేకుండా కేవలం అనుకరణ దృష్టితో ఈ రకమయిన కవిత్వాన్ని రాస్తున్నవాళ్ళను పక్కనపెట్టినా కేవలం కవిత్వమయితే చాలు అనే అవగాహనతో ఈ కవిత్వాన్ని రాస్తున్నవాళ్ళను, వారి సమర్థకులను నిర్విమర్శగా, మౌనంగా అంగీకరించడం సమాజంలో నెలకొని ఉన్న ఒక రకమయిన స్తబ్ధతకు చిహ్నంగా భావించాలి.
ఛిద్రమవుతున్న కవిత్వంలో ఈ విచ్ఛిన్నకర ధోరణులకు మరొకవైపు పరిశీలిస్తే జీవితం గురించి గొప్ప ఆర్తితో, జీవితాన్ని పోరాడి గెలుచుకోవాలనే ఆకాంక్షతో వచ్చే కవిత్వం రాశిలోను, వాసిలోను తక్కువేమీ కాదు. అయితే దీనిలో కూడా అవాంఛనీయమైన పరిహరించుకోవలసిన ధోరణులు అనేకం ఉన్నాయి. వీటిలో ప్రధానమయింది గతానికి మళ్ళే వైఖరి. గతాన్ని కీర్తిస్తూ నోస్టాల్జియాలో మునిగిపోయే వైఖరి. సామ్రాజ్యవాద అనుకూల విధానాల కారణంగా గ్రామీణ సమాజంలో వస్తున్న విధ్వంసకర మార్పుల పట్ల కవుల స్పందన మిగిలిన అంశాల కంటే చాలా ఎక్కువగా ఉంది. వెనుకబడిన సమాజాల్లో సామ్రాజ్యవాద తాకిడికి గురి కావడానికి ఎక్కువ అవకాశమూ, విస్తృతీ గ్రామీణ సమాజం, అక్కడి సంబంధాలకే ఉంటుంది కాబట్టి ఈ స్పందన వాంఛనీయమూ, సమర్థనీయమూ కూడా. కానీ ఈ సందర్భాలలో కవుల స్పందన గతమే ఘనమైంది అనే వైపుకు ప్రయాణించడం జాగ్రత్తగా గమనించాల్సిన అంశం. సామ్రాజ్యవాద వ్యతిరేకత సరైన తాత్విక అవగాహనను సంతరించుకోకపోవడం ఇక్కడి సమస్య.
సామ్రాజ్యవాద వ్యతిరేకత తాత్వికంగా సరైన రూపాన్ని సంతరించుకోకపోవడానికి సామ్రాజ్యవాదం పట్ల ఉన్న అవగాహనలోని లోపమే ప్రధాన కారణం. సామ్రాజ్యవాదం పట్ల రూపమాత్రమైన వ్యతిరేకతను మాత్రమే కలిగి ఉన్న ఆచరణ, సమాజంలో బలంగా కొనసాగుతూ ఉండడం వల్ల సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించవలసిన చోట దానికి బదులుగా గతాన్ని కీర్తించే వైఖరి ముందుకొస్తున్నది. ఈ ప్రమాదాన్ని నివారించడం కోసం సరియైన విమర్శను ఎప్పటికప్పుడు తీసుకొని రావలసిన అవసరం ఉంది.
దీనితోపాటుగా మానవ సంబంధాలలో వస్తున్న చలనశీలతను పట్టుకోవడంలో సృజనకారులలో సరయిన అవగాహన కొరవడడం కూడా కవిత్వంలో కన్పిస్తూ ఉన్నది. గత పదేళ్ళ కాలంలో మానవ సంబంధాలలో నిత్యమూ వస్తూ ఉన్న మార్పులను కేవలం ముడిగా తప్ప, వాటిని చలనశీలంగా పట్టుకోగలగడం- వాటికి గల భిన్న కోణాలను అవగాహన చేసుకోగలగడం, మొత్తం ఓ సమగ్రరూపంగా వ్యక్తీకరించగలగడం కవులలో బాగా కొరవడింది. ఈ కారణంగా సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించే కవిత్వం రూపంలోను, వస్తువులోను మూసగా మారిపోయింది. అనేకమంది కవులు ఒకే కవితను రూపంలోనూ, సారంలోనూ ఏమాత్రమూ మార్పు లేకుండా రాస్తున్నారు. సాధారణంగా సాహిత్యంలో రూపం కంటే వస్తువు ఎక్కువ చలనశీలంగా ఉంటుంది. కానీ ఇప్పుడు వస్తువులో కూడా పెద్ద మార్పులేవీ లేకపోవడం వల్ల రూపంలో ఏ మార్పులు లేకుండా అయిపోయి ఒకే కవిత మరలా మరలా పాఠకుల ముందు ప్రత్యక్షం అవుతోంది. ఈ సమస్యను తాత్వికంగా పరిష్కరించుకోవడమెట్లో తెలియని అనేకమంది కవులు ‘మానవ సంబంధాల కవిత్వం’ పేరుతో ఆత్మాశ్రయ కవిత్వం రాసుకొంటూ తమని తాము మోసం చేసుకొంటున్నారు. మానవ సంబంధాలను గురించి రాస్తున్నామనుకుంటూ తాత్వికంగా తమ బలహీనతను గడచిపోయిన స్మృతుల మాటున, బోలుబారిన మూస వ్యక్తీకరణల మాటున దాచుకునేందుకు వృథా ప్రయత్నం చేస్తున్నారు. ఏ సమస్యనైతే తప్పించుకొనేందుకు కవులు ఈ దారి ఎంచుకున్నారో తిరిగి ఈ దారి అదే మూసలోకి దారితీయడం ఇక్కడి విషాదం.
కవిత్వంలో నెలకొని ఉన్న ఈ సంక్లిష్టమయిన స్థితిని యధావిధిగా కొనసాగించడం అంటే ఉన్న స్థితిని మౌనంగా అంగీకరించడమే అవుతుంది. సమాజ చలనశీలతను దాని సమగ్ర రూపం నుండి కాకుండా ముడిగా, యాంత్రికంగా చూడడమే అవుతుంది. కవిత్వాన్ని సున్నితమయిన, లోతయిన, గాఢమయిన, తాత్విక వ్యక్తీకరణగా ప్రేమించే వారికి ఇది ఓ పరీక్షా సమయం.
కవి తన చుట్టూ గూడు కట్టుకున్న వ్యక్తిగత అనుభూతులపై కవిత్వం రాయాలా? ఒక చెట్టుపైనో పుట్టపైనో కవిత్వం కట్టాలా? లేదంటే సమాజం లోని చీకటి కోణాలను విశ్లేషిస్తూ కవిత్వం చెప్పాలా? సామాజిక ప్రయోజనం లేని కవిత్వం ఎందుకు? కవిత్వం లో మెటఫరు ను తగ్గించి సరళీకరించవచ్చా? పాట లాగా జనం భాషలో రాయవచ్చా తెలపండి?
చక్కటి ప్రశ్నలు!అయితే నా అభిప్రాయం లో కవిత్వము హృదయగతమైనది.ఇందులో విశ్లేషణ కన్నా ఓ భావానికో,అనుభూతికో,ఆవేదనకో రూపము ఇవ్వ టం జరుగుతుంది.ఆ రకమైన భావావేశం కవికి కలిగించేది ఓ చెట్టు కావచ్చు,ఓ వ్యక్తి గత అనుభూతి కావచ్చు,సమాజపు చీకటి కోణాలపై అసహనం,ఆవేదన కావచ్చు.సామాజికప్రయోజనం ప్రధానంగా కవిత్వం వ్రాసిన శ్రీశ్రీ
నే “కాదేదీ కవిత కి” అన్న పుడు చెట్టుకానీ పుట్ట కానీ ,వ్యక్తిగత అనుభూతి కానీ
ఎందుకి పనికి రాదు?కవిత్వం కేవలం సమాజం కోసమే రాయాలనో,లేదా వ్యక్తిగత అనుభూతుల గూర్చి మాత్రమే రాయాలనో అంటం నా వినమ్ర అభిప్రాయం లో అతివాదాలు గానే అనిపిస్తాయి.ఎందుకంటే అలా అంటం ద్వారామనం కవి భావనా పరిధిని నియంత్రిస్తున్నామేమో.అయినా స్పందించే హృదయానికి ఓ చక్కని ప్ర కృతి దృశ్యం ఎంత ఆనందం కలిగిస్తుందో సమాజం లోని దైన్యం అంతే ఆవేదనను కలిగిస్తుంది.లోలకం ఒక్క దిశ లోనే చలించదు కదా!అయినా సమాజం గురించి ఆక్రోశించేదీ వ్యక్తి కాదా?వ్యక్తిగత వేదనకి విలువ లేదా? సమాజం ,వ్యక్తి ఒకే
స్పెక్ట్రం కి రెండు చివరలు కాదా?
కవిత మీద చాల చక్కగా వ్యాసము రాసారు .అందుకు మీకు అభినందనలు