- వరవరరావు
నేను హన్మకొండలో ఉండగా
ఇంటి ముందు
ముందుగా మోగే సైకిల్ గంటా
కనిపించే ముందటి పయ్యా
హ్యాండిల్‌పై ‘ట్రిగర్ పై వేళ్ళతోరా…’
అని నిర్ణయాత్మకంగా రాసిన
చేతివేళ్ళూ కనిపించగానే
కవి మిత్రుణ్ణి పోల్చుకుని బయటికి వచ్చేవాణ్ణి.
ఆయన నవ్వుతూ సైకిలు దిగి
‘నన్నెప్పుడూ నిరాశ పరచని మిత్రుడు’
అని గుర్రం జూలు నిమిరినట్లు నిమురుతూ
ఎంతో గర్వంగా తన సైకిల్ వైపు చూసుకునేవాడు.
* * * * *
కొత్త ఢిల్లీలో
మిలిటరీ ఇనుప కంచె బయట
ఒక ఎర్రసైకిలూ ఇనుపముళ్ళలో
చిక్కుకుపోయిన
ప్రియురాలికివ్వడానికి తెచ్చిన గోరింటాకు
రోజులట్లా చూస్తూ ఉండే కవి
సర్వేశ్వర్ దయాల్ సక్సేనాకు యవ్వన స్వప్నాలను
ఎమర్జెన్సీ ఏం చేసిందో ఎవ్వరూ చెప్పనక్కర్లేక పోయింది
* * * * *
సంక్షేమ పథకాల పోరాటమప్పుడు
పీఠభూమిని సైబర్ వరద ముంచెత్తినప్పుడు
రజిత తన నెక్కించుకుని తిప్పిన సైకిలు
అమరులు ఆజాద్, ప్రసాదుల నుంచి
ఆమె కొచ్చిన వారసత్వం అని విన్నపుడే
నాకర్థమయింది రజిత ఎంచుకున్న మార్గం
మరి ఇపుడా సైకిలు
ఆమె ఎవరికిచ్చి పోయింది?!
(రజిత కోసం… కాశీంకు కృతజ్ఞతలతో)
” ట్రిగర్ పై వేళ్ళతోరా” ఎక్కడ చదవ వచ్చు. దయచేసి మీ పత్రికలో పోస్టుచేయండి.
జీవితాన్ని నిశితంగా చూడగలిగిన కవికి సైకిలు కూడా మంచి కవితా వస్తువే అవుతుంది. సామాన్యుల కోసం జీవితాలను ధారపోసిన అసామాన్యుల అతి సామాన్య వాహనమే సైకిలు. వరవరరావుగారు ఈ మధ్య కోర్టులూ, చర్చలూ వగైరాల వల్ల వార్తల్లో కెక్కుతున్నారు కాని ఆయన సిసలైన కవి అనడానికి ఇదొక ఉదాహరణ.
సైకిల్ పై ఇస్మాయిల్ గారు కూడా మంచి కవిత వ్రాసారు. నా వరకూ ఇవి కవితల్లా అనిపించలేదు. వివరణల్లా ఉన్నాయి.